Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 13

   

      చదువుకునే రోజుల్లోనే పెళ్ళయిన ఫలితంగా కుమార్ ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. అతని వివాహం అతనికిష్టమో, అయిష్టమో తెలుసుకోలేని పరిస్థితుల్లో జరిగింది. సాధారణంగా వివాహాలు అలాగే జరుగుతుంటాయి. చేసుకోవాలని పెద్ద ఇచ్చా వుండదు. చేసుకోకూడదని తీర్మానమూ వుండదు. చాలామంది ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో వుంటారు. మనుషుల్లో వున్న విచిత్రమేమిటంటే ఎంతో ముఖ్యమైన సందర్భాలలో తటస్థంగా వుంటారు. అతి స్వల్పమైన విషయాలలో ఖచ్చితంగా, కవ్వింపుగా వుంటారు.
   
    పెళ్ళయ్యాక, చదువు పూర్తయ్యేవరకూ పెళ్ళాన్ని కాపరానికి తీసుకురాకూడదనుకున్నాడు. ఊరికినే అప్పుడప్పుడూ అత్తారింటికి వెళ్ళటం, ఎప్పుడయినా ఆ అమ్మాయిని పండక్కి తమఇంటికి తీసుకురావటం, వీటితోనే సరిపుచ్చాలనుకున్నాడు.
   
    ఓసారి అత్తారింటికి వెళ్ళాడు పెళ్ళయిన నెలరోజులకు. వాళ్ళకు పదిమంది ఆడపిల్లలు, ఇద్దరు కొడుకులు. తన భార్య ఆరవ అమ్మాయి. ఇల్లంతా పెళ్ళి వారిల్లులా కళకళలాడుతోంది. ఆ వాతావరణం చూసి ముగ్దుడయిపోయాడు కుమార్. అతనక్కదున్న నాలుగురోజుల్లోనే అతని పుట్టినరోజుకూడా వచ్చింది. అతని అత్తగారు కూతుర్ని పిలిచి అల్లుడికి తలంటు పోయమంది. అప్పటికి మొగుడూపెళ్ళాలు నాలుగయిదుసార్లకంటే ఎక్కువ మాట్లాడుకోలేదు. ప్రభావతి సిగ్గుపడిపోయింది. ఆమె అక్కలు ఆమెను బలవంతం చేశారు. ప్రభావతికి తప్పలేదు. బాత్ రూమ్ లో అతను తువ్వాలు కట్టుకుని చక్కని తెల్లని ఛాతీ నిగనిగ మెరుస్తుండగా స్టూల్ మీద కూర్చుంటే ప్రభావతి తలంటు పోయసాగింది. ఆమె చేతులు, ఆమె శరీరం, ఆమె స్పర్శ అతని తడిఒంటిని పులకరించిపారేశాయి. కాలితో తలుపు మూతపడేటట్లుగా అలా తోశాడు. 'అయ్యో! తలుపు' అంది ప్రభావతి. "తెరచివుంటే అందరూ చూస్తారని సిగ్గు. అందుకనే...." అన్నాడు కుమార్. కుంకుడుకాయ రసం అంటుకున్న అతని వణికే చేతులు ఆమె వీపుమీద పడ్డాయి. "ఇందుకనా?..." అంది ప్రభావతి నవ్వు దాచుకుంటూ. 'మరి ఎందుకని....?' అంటూ ఆమెను గభాలున ఒళ్ళోకి లాక్కున్నాడు. తడిసిన అతని వంటిమీద పొడిగా వున్న ప్రభావతి. ఆమె కూడా తడిసిపోయింది. 'ఛీ! ఏమిటి బాబూ ఇది?' అని ఆమె లేచి నిలబడేలోపునే ఆమె రెండు బుగ్గలమీదా హడావుడిగా ముద్దులు పెట్టేసుకున్నాడు. పెదవులమీద పెట్టుకునేందుకు ధైర్యం చాల్లేదు.
   
    ఆ మధ్యాహ్నం కాఫీ తీసుకొచ్చినప్పుడు "మా ఇంట్లోవాళ్ళకు తెలిసింది" అంది ప్రభావతి నవ్వును దాచిపెట్టుకుంటూ.
   
    "ఏమిటి?"
   
    "మీ బాత్ రూమ్ ప్రణయకలాపం."
   
    అతనికి చచ్చేంత సిగ్గు వేసింది. "ఎలా తెలిసింది?" అన్నాడు అదేదో అద్భుతమైన విషయమన్నట్లు.
   
    "తెలియదేమిటీ? నా బట్టలూ, నా అవతారమూ చూస్తుంటే....?"
   
    "ఇప్పుడెలా?"
   
    ప్రభావతి ఫక్కుమని నవ్వింది. "ఏదో మీరే ఆలోచించండి."
   
    కాఫీ కప్పు తీసుకెళ్ళిపోతూ "వాళ్ళంతా కలిసి నాకో ఉపద్రవం తెచ్చిపెట్టారు" అంది వినీ వినిపించనట్లు.
   
    "ఏమిటది? ఈవేళ అన్నీ ఉపద్రవాలే జరిగేటట్లున్నాయి."
   
    "నన్ను గదిలోకి తోస్తారట."
   
    కుమార్ కి గుండె గబగబా కొట్టుకుంది. బిక్కమొహం పెట్టి "ఇప్పుడంత అర్జంటు ఏమొచ్చింది? వద్దని చెప్పు" అన్నాడు.
   
    "వాళ్ళు నామాట వినేటట్లు లేరు. అతనికి చాలా తొందరగా వున్నట్లుంది. పోనీ పాపం అంటున్నారు."
   
    "అయ్యో! మా అమ్మకూ, నాన్నగారికీ చెప్పకుండా ఎలా?"
   
    ఈసారి ప్రభావతి కోపంగా మొహంపెట్టి "మీ అమ్మకూ, నాన్నకూ చెబుతారా? ఏమని చెబుతారు?" అంది.
   
    "అదే, వాళ్ళ పర్మిషన్....."
   
    "పర్మిషనా? దేనికి?"
   
    "అబ్బ! ఏంలేదులే. అసలు ప్రొద్దున బాత్ రూమ్ లో అలా చేయకుండా వున్నాబాగుండేది."
   
    "ఇప్పుడనుకొని ఏం లాభం?" అని ప్రభావతి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
   
    ఆ రాత్రి పదిగంటలవరకూ మరదళ్ళు అతన్తో తియ్యంగా కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు. ప్రభావతి కనిపించలేదు. "హమ్మయ్య! మధ్యాహ్నం ఊరికినే బెదరగొట్టేసింది, నన్ను ఉడికించింది, ఆడించేసింది" అనుకున్నాడు.
   
    కానీ అతని ఆలోచన అతనికే రుచించలేదు. హఠాత్తుగా ఎప్పుడూ తెలియని ఒంటరితనం అతన్ని వేధించింది. ఆమె నిజంగానే పరిహాసమాడిందేమో, రాదేమోనన్న దిగులు పట్టుకుంది.
   
    పదకొండుగంటలకు ఇక హతాశుడై ప్రక్కమీద వాలబోతున్నాడు.
   
    గుమ్మందగ్గర గాజుల చప్పుడయింది. అదిరిపడి చూశాడు. అందం, అలంకరణ, మల్లెపువ్వుల వాసన - ఇవన్నీ కలసివున్న ప్రభావతి అతన్ని క్షణంపాటు దిగ్బ్రాంతిలో ముంచేసింది.
   
    దిగ్బ్రాంతినుంచి తేరుకుని చూసేసరికి ఆమె తలుపు గడియ పెడుతోంది.
   
    అతను గబగబ మంచందిగి వెళ్ళాడు. "మరి....మిఠాయిలూ, పాలూ వగైరాలన్నీ ఏవి?" అన్నాడు కోపంగా.
   
    ప్రభావతి నవ్వింది. "మా వాళ్ళకు అలాంటి చాదస్తాలు లేవు" అంది.
   
    "మరి ఇలాంటి చాదస్తాలు వున్నాయా?" అన్నాడు ఆమె జబ్బ పట్టుకుని అద్దం ముందుకు తీసుకువెళ్ళి, అందులో ఆమె ప్రతిబింబం చూపుతూ.
   
    "ఉన్నట్లున్నాయి" అంది ఒప్పుకున్నట్లుగా.
   
    "నా బాధ నీకర్ధంకాదు" అన్నాడు.
   
    "ఏమిటో చెప్పండి మీ బాధ?"
   
    "నాకింకా రెండున్నర సంవత్సరాలకి పైగా చదువుంది. మనం ఇప్పట్నుంచీ కాపురం మొదలుపెడితే మనకి పిల్లలు పుడతారు. నా చదవుకు ఆటంకం, పైగా తండ్రి సంపాదించే డబ్బుతో పెళ్ళాన్ని, పిల్లల్నికూడా పోషించటం..."
   
    "ఇవన్నీ ఆలోచించగలిగినవారు - మరి పెళ్ళెందుకు చేసుకున్నారు?"
   
    "ఎందుకో తెలుసా?" అన్నాడు గంభీరంగా.
   
    అతని గాంభీర్యానికి ప్రభావతి కూడా ఆశ్చర్యపడింది.
   
    "నేను-ఈ దేశంలో పుట్టాను కాబట్టి" అన్నాడు.
   
    ఆమె అర్ధంకానట్లు చూసింది.
   
    "ఈ దేశంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారో చాలామందికి తెలియదు. చదువు పూర్తి అయినా కాకపోయినా, సంపాదనాపరుడయినా కాకపోయినా లేకపోతే తల్లిదండ్రుల అభీష్టాన్ని నెరవేర్చటంకోసం, లేకపోతే ఏమీతోచక పెళ్ళిళ్ళు చేస్తారు" అన్నాడు ఉపన్యాసం ఇస్తున్నట్లు.
   
    ప్రభావతి భర్తవంక అభినందిస్తున్నట్లుగా చూసింది. "మీకు చాలా ఉత్తమ అభిరుచులున్నట్లున్నాయి. మీ ఆశయాలకు నా జోహార్లు. మీ ఆదర్శాలకు నేనెప్పుడూ భంగం కలిగించను. గడియవేసిన గది తలుపుల లోపల వుంటేనేం? మీ చదువు పూర్తయేవరకూ మీ దీక్షకు భంగం కలిగించను" అంటూ మంచంమీద కాళ్ళవైపు మడిచిపెట్టివున్న దుప్పటి తీస్తోంది.
   
    "అదెందుకు?" అన్నాడు కుమార్.
   
    "నేలమీద పరుచుకుని పడుకునేందుకు."
   
    "మంచం వుండగా మనమిద్దరం నేలమీద పడుకోవడమెందుకు? శోభనం నాడు అదో వేడుకా ఏమిటి?"
   
    "శోభనం వాళ్ళ దృష్టిలో. మనకీనాడు నేలమీద దుప్పటి నాకు, మంచం మీకు" అంటూ దుప్పటి మడతవిప్పి నేలమీద పరచబోతున్నది.
   
    పరచబోతున్న తెరచి వున్న దుప్పటిని అతను అటువైపునుంచి పట్టుకున్నాడు.
   
    దుప్పటికి ఒకరటూ, ఒకరిటూ వున్నారు.
   
    ప్రభావతికి ఏదో గుర్తుకువచ్చినట్లు ఫక్కుమని నవ్వింది.
   
    "ఎందుకు నవ్వావో చెప్పు?" అన్నాడు కుమార్ తెలుసుకోవాలన్న ఉత్కంఠతతో.
   
    "నెలరోజులక్రితం పెళ్ళినాడు తెరకి అటూఇటూ వున్నాం. ఇప్పుడు....ఇప్పుడు..." అంటూ సిగ్గుతో ముఖం ఎర్రబడిపోగా చెప్పలేక ఆగిపోయింది.
   
    "చెప్పు చెప్పు?"
   
    "ఇప్పుడు.....అబ్బ! చెప్పను బాబూ!"

 Previous Page Next Page