Previous Page Next Page 
సంపూర్ణ ప్రేమాయణం పేజి 14


    "థాంక్యూ."

    "ఇక మనం కూర్చుని ప్లాన్ వెయ్యాలి. కాస్త టీ తాగుదామా?"

    "నేను టీగానీ- కాఫీగానీ తాగను."

    "వెంటనే నేర్చుకో! చాలామంది అనుకుంటారు- కాఫీ, సిగరెట్లు తాగని మంచి బాలురనే అమ్మాయిలు ప్రేమిస్తారని- అది తప్పు."

    "ఇదే నవలలో చదివారు?"

    "ఎవరో రచయిత."

    "మనం ఇక ఈ థియరిటికల్ ఆలోచనలు మానేసి ప్రాక్టికల్ గా ఆలోచిద్దామా?"

    "నువ్వు చెప్పు-ముందు అమ్మాయి వైపు నుంచి వెళితే బావుంటుందా? తండ్రి వైపు నుంచా?"

    "తండ్రిని ముందు మంచి చేసుకుంటే బావుంటుందేమోనని నా ఉద్దేశ్యం...."

    "ఇంకొంచెం జాగ్రత్తగా ఆలోచించి, తండ్రి ద్వారా ఇంట్లో ప్రవేశించటమే ఆధారిటేటివ్ గా వుంటుందనుకో!"

    "అవును. మరీ కూతురు తీసుకెళ్ళి, 'ఇతడు నాకు నచ్చాడు నాన్నా! నీ సెక్రటరీగా పెట్టుకో' అంటే బావోదు. ఆయన దురభిప్రాయపడే ప్రమాదం కూడా ఉన్నది. తండ్రిద్వారా వెళ్ళటమే మంచిది. ఏ మాత్రం తెలివితేటలున్న వారైనా అలాగే చేస్తారు."    

    "కాని మన వ్యూహంలో మామూలు తెలివితేటలు పనికిరావు. అసాధారణమైన తెలివితేటలు కావాలి. నువ్వు ఆలోచించి చూడు. తండ్రి నిన్ను ఇంట్లోకి తీసుకెళ్ళి అమ్మాయికి పరిచయం చెయ్యబోయాడనుకో- ఆ అమ్మాయి మామూలుగా నిన్ను చూస్తుంది. అదే విచిత్రమైన పరిస్థితుల్లో ఆ అమ్మాయికి నువ్వు అంతకుముందే ఒకసారి కనపడ్డావనుకో. నిన్ను కాస్త ఆసక్తితో చూస్తుంది. ప్రేమకు మొదటి స్టెప్పు ఆసక్తే! అటువంటి ఆసక్తి మనం కలుగచెయ్యాలి. కానీ ఆ అమ్మాయికి నువ్వెవరో తెలియకూడదు. కేవలం చిత్రమైన పరిస్థితులలో ఓ హీరోగా ప్రవర్తించడం ప్రేక్షకురాలిగా చూడాలంతే!"

    "ఏమిటా పరిస్థితులు?"

    "మనం సృష్టిస్తాం."

    "అదే- ఎలా అడుగుతున్నాను."

    "అలా కంగారు పెట్టెయ్యకు. ఆలోచించనీ!" అంటూ ఆ వృద్ధుడు కళ్ళు మూసుకున్నాడు. రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరచి, "ఐడియా" అన్నాడు.

    "ఏమిటి?"

    "పది రోజుల్లో ప్రేమ ఏదో వూరు వెళుతోంది."

    "మీకెలా తెలుసు?"

    "నాల్గు రోజుల క్రితం షాపింగ్ కి వెళుతుంటే ఫాలో అయ్యాను. నువ్వడిగావుగా- 'ప్రతి క్షణమూ, బైనాక్యులర్స్ తో చూస్తూ వుంటే ఏం ప్రయోజనం?' అని. ఇదిగో ఇలాంటి సమయాల్లోనే ఉపయోగపడుతుంది. ఆ అమ్మాయి షాపులో ఎయిర్ పిల్లో (ప్రయాణాల్లో వాడే తలదిండు) కొన్నది."

    "అది కొన్నంత మాత్రాన ప్రయాణం చేస్తుందన్న నిర్ణయానికి ఎలా రావటం?"

    ప్రసాదరావు ఏదో చెప్పబోయి ఆగి, "అవును. నాకు తెలీదు నిజమే. అయినా అన్నీ నేనే ఎందుకు ఆలోచించాలి. ఈ ప్లాన్ లో నువ్వూ భాగస్వామివే కదా! ఏదయినా ఐడియావేసి ప్రేమ ఊరు వెళుతుందో లేదో కనుక్కో" అన్నాడు.

    తన తెలివితేటలు నిరూపించుకోవలసిన సమయం ఆసన్నమైందని గ్రహించాడు వేణు. లేచి, "రండి-వెళ్దాం" అన్నాడు. ఎక్కడికి అని అడక్కుండానే లేచాడు వృద్ధుడు. గది తలుపు తాళంవేసి బయలుదేరారు ఇద్దరూ.

    ఒక ఫర్లాంగు నడిచి చిన్న హోటల్ లో ప్రవేసించి ఫోన్ అడిగి తీసుకున్నాడు వేణు. డయల్ చేశాడు.

    "హల్లో జగపతిరావుగారున్నారా?"

    "లేరండీ! ఫ్యాక్టరీకెళ్ళారు" అట్నుంచి నౌఖరు అన్నాడు.

    వేణు పెట్టేసి మళ్ళీ డయల్ చేశాడు.

    "హల్లో! ప్రేమగారున్నారా?"

    "ఉన్నారండీ! పిలుస్తాను."

    రెండు నిమిషాల తర్వాత తియ్యటిగొంతు వినిపించింది. "హల్లో!"

    "నేను ఇక్కడ ఫ్యాక్టరీ అసిస్టెంట్ మానేజర్ ని మాడమ్! మీరు పదిరోజుల్లో ఊరు వెళుతున్నారట కదా! సారు చెప్పారు."

    ఆమె చెప్పే జవాబుకోసం వేణు గుండె వేగంగా కొట్టుకోసాగింది.

    ఆమె అవుననగానే అది కుదుటపడింది.

    "అక్కడ స్టేషన్ కి కారు పంపమని చెప్పారు మాడమ్!"

    "శిల్పా ఏజన్సీవాళ్ళకీ, సుషయిన్ కంపెనీవారికి చెప్పానన్నారే ఎన్ని కార్లు వస్తాయి స్టేషన్ కి? నాన్న కసలు బుద్ధిలేదు."

    "అవును మేడమ్!" అనబోయి తమాయించుకుని, "పంపకపోతే మమ్మల్ని తిడతారు మేడమ్! కొంచెం డిటైల్స్ చెప్తారా?" అని రెండు నిమిషాలు ఆమె చెప్పేది విని ఫోన్ పెట్టేస్తూ గర్వంగా ప్రసాదరావువైపు తిరిగి,

    "ఆమె వెళుతూంది అనకాపల్లి. పదోతారీఖు గోదావరి ఎక్స్ ప్రెస్ కి.... ఆమె వెళుతున్నది స్నేహితురాలి పెళ్ళికి...." అన్నాడు.

    వృద్ధుడు వేణువైపు అభినందనపూర్వకంగా చూసి, "గుడ్! నేను అనుకున్నదానికన్నా ఎక్కువ తెలివితేటలున్నాయ్ నీకు" అన్నాడు.

    "కనుక్కోమన్నది కనుక్కున్నాను. ఇక నెక్ట్స్ ప్లాన్ మీరు చెప్పాలి."

    "ప్రేమ ప్రయాణం చేసే కంపార్టుమెంట్ లోనే నువ్వూ వెళతావు. నీ దగ్గర సెకండ్ క్లాస్ టిక్కెట్టు మాత్రమే ఉంటుంది. ఆ రిజర్వేషన్ సీట్లో ఇంకెవరో కూర్చుని వుంటారు. రైల్వే డిపార్టుమెంట్ వారు చేసిన తప్పుకి వాళ్ళకి దబాయిస్తావు. వీలైతే చైను లాగుతావు. జనమ అంతా నిన్ను సపోర్టు చేస్తారు. ఆ విధంగా నువ్వు 'హీరో'వి అవుతావు. ఎలా వుంది ప్లాను?"

    "నా మొహంలా వుంది. సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో నేను ఫస్ట్ క్లాస్ లో ఎక్కడం ఏమిటి? రిజర్వేషన్లు చేసేవాడు ఒకే సీటుని ఇద్దరికీ ఇవ్వటమేమిటి? దానికి నేను దబాయిస్తే జనం నన్ను సపోర్ట్ చెయ్యటం ఏమిటి? చైన్ లాగితే గార్డు ఫైన్ వెయ్యకుండా వదిలెయ్యడని నమ్మకం ఏమిటి? అసలిదంతా ఎలా సాధ్యమవుతుంది?"

    "మనకి అవసరపడే వాళ్ళందరికీ డబ్బు వెదజల్లటం ద్వారా అవుతుంది" అంటూ దగ్గరికి వచ్చాడు. "నీకు తెలీదు వేణూ! డబ్బు ఎంతటి పనినయినా శాసిస్తుంది. అనుభవంవల్ల తెలుసుకున్నానది? రైల్వేగార్డుకీ, బుకింగ్ క్లర్కుకీ, చేక్కిమ్గ్ ఇన్స్ పెక్టరుకీ బాగా చెయ్యి తడుపుదాం. మొత్తం ఆ డ్రామా అంతా ఎలా ఆడాలో నాకు వదిలిపెట్టు. అంతకన్నా పెద్ద రిస్కు మనం ఇంకొకటి తీసుకోవాలి."

    "ఏమిటి?"

    "ప్రేమ వెళుతూన్న స్నేహితురాలు పెళ్ళి ఆగిపోతుంది."

    "ఎందుకూ?"

    "కట్నం సమస్య మూలంగా. అది కూడా మనమే అరేంజి చేస్తాం. నువ్వు ఆఖరి క్షణంలో వెళ్ళి దాన్ని నిర్విఘ్నంగా జరిగేలా చేస్తావు. ఆ విషయం కేవలం ప్రేమ కొక్కదానికే తెలుస్తుంది."

    "ఎలా?"

    "తోటి పెళ్ళికొడుకుని చంపుతానని బెదిరించడం ద్వారా."

    "నన్నో రౌడీ అనుకుంటుందేమో?"

    "చెప్పాగా_ ఈ కాలం ఆడపిల్లలు ఆ మాత్రం రౌడీయిజం వున్న వాళ్ళనే లవ్ చేస్తారని."

    "ఇదంతా బెడిసికొడ్తుందేమో అని నాకు అనుమానంగా వుంది."

    "అనుమానం ఏమీ అక్కర్లేదయ్యా! ప్రేమ దృష్టి ఒక్కసారి నీ మీద పడితే చాలు. దానికే ఇదంతా.... ఈ మొదటి ఎత్తుకి మన బడ్జెట్ ఖర్చు పదివేలు వేణూ! ఈ క్షణంనుంచీ మనం రంగంలోకి దూకబోతున్నాం. ఏ మాత్రం పొరపాటు జరగకూడదు సుమా! ప్రేమకి ఆరో నెల రావాలి. కూతురు కడుపుతో తిరుగుతూ వుంటే ఆ జగపతిరావు కుళ్ళి కుళ్ళి చావాలి!"

    'అదే సమయానికి దయానందం బికారి అవ్వాలి. చెయ్యని నేరానికి జైల్లో కృంగి కృశించాలి' అనుకున్నాడు వేణు.

    "నేను రైల్వేస్టేషన్ కి వెళతాను. నువ్వు ప్రేమ స్నేహితురాలి తండ్రిని కలుసుకొని మిగతా ప్లాన్ పూర్తిచెయ్యి."

    ఇద్దరూ గది బైటకొచ్చి, మరోసారి షేక్ హాండ్ తీసుకొని చెరో వైపూ విడిపోయారు.


                     *     *     *

    "అద్భుతం! గుడ్! వెరీగుడ్!" అన్నాడు ప్రసాదరావు ఆనందంతో పొంగిపోతూ. "అంతా అనుకున్నట్టే జరిగింది."

    రైల్వే టిక్కెట్ ఎగ్జామినరు చేతిలో డబ్బువంక ఆహ్లాదంగా చూసుకున్నాడు. పెళ్ళికొడుకు తండ్రి మాత్రం కొద్దిగా నసిగాడు. "నా కొడుకు నా గురించి ఏమనుకున్నాడో ఏమో! నాక్కాబోయే కోడలికి ముందే నామీద చెడు అభిప్రాయం ఏర్పడిపోయింది."

    ప్రసాదరావు బిగ్గరగా నవ్వుతూ, "అందుకేకదయ్యా నీకు నాలుగు వేలిచ్చింది. నువ్వాడిన నాటకానికి అది చాల్లే! ఇప్పుడు నీ కోడలూ కొడుకూ హాయిగానే వున్నారు కదా!" అన్నాడు.

    "హాయిగానే వున్నారనుకోండి!"

    అన్నట్టు ఆ కత్తి పట్టుకున్న కుర్రాడివంక ప్రేమ ఏమన్నా ప్రేమగా చూసిందా?"

    "తెలీదండీ!"

    "ఏడ్చినట్టుంది" అని టిక్కెట్ కలెక్టరువైపు తిరిగి, "చైను లాగినప్పుడన్నా ఆరాధనా పూర్వకంగా చూసిందా!" అని అడిగాడు.

    "నేను అప్పుడు అక్కడ లేనండీ!"

    "ఏడ్వలేకపోయారు. సరే- వెళ్ళండి!" అన్నాడు ప్రసాదరావు. వాళ్ళు వెళ్ళిపోయారు.

    ఆ విధంగా ప్రేమ అనబడే ఓ కోటీశ్వరుడి కూతురిచుట్టూ అల్లబడుతున్న వలలో మొదటి అధ్యాయం సమాప్తమైంది.

                       *    *    *

 Previous Page Next Page