రెండో అధ్యాయం
సర్ జగపతిరావ్ బహద్దూర్ కి డయాబిటీస్ వచ్చిన తర్వాత దినచర్య కొంత నియమబద్ధం చేసుకున్నాడు. ఎన్ని పనులున్నా ప్రొద్దున్నే అయిదున్నరకే లేచి ప్లే గ్రౌండ్ వరకూ నడిచి వెళ్ళటం_ అక్కడ అరగంట తిరగటం_ వెనక్కి రావటం.... దాదాపు అయిదు సంవత్సరాల నుంచీ సాగుతుంది. అతడికోసమే అన్నట్టూ ఆ ఆటస్థలం పక్కన ఒక చిన్న కిళ్ళీబడ్డీ ప్రొద్దున్న ఆరింటికే తెరుస్తాడు. గాంధీ సెంటర్ నుంచి ప్రతిరోజూ సాయంత్రం పది సోడాలు తెచ్చుకుని బడ్డీలో పెట్టుకోవటం అనాదినుంచీ వస్తున్న చర్య. ముసలాడే వెళ్ళి తెచ్చుకుంటూ వుంటాడు ప్రతిరోజూ. ఆ కొట్టు దగ్గిర పది సోడాలు అమ్ముడుపోవటం గగనం. ఒక్క సోడా మాత్రం ఆరు మూడయినా మూడు ఆరయినా అమ్ముడుపోతుంది.
ఆ రోజు ఆ కిళ్ళీకొట్టు ముసలోడి దగ్గరకి ఇంకో ముసిలోడు వచ్చాడు. "నువ్వు సోడాలు ఎలా తెచ్చుకొంటావోయ్?" అనడిగాడు.
"గాంధీ సెంటర్ నుంచి బాబయ్యా."
"ఎలా? మోసుకొస్తావా?"
"అవును బాబూ!"
"ఎందుక్యా అంత కష్టం? మేం కొత్తగా మిషన్ పెట్టాం. మా సోడాలు కొన్నవారికి మేమే సప్లయ్ చేస్తున్నాం. మా కుర్రాడే సైకిల్ రిక్షామీద తెచ్చి ఇస్తాడు. ఏం_ నీ కిష్టమేనా?"
ముసలాడు మాట్లాడలేదు.
"నీకు అక్కడెంత కమీషన్ గిడుతుందో- అంతా మేమూ ఇస్తామయ్యా! పోతే నీకు లాభం ఏమిటంటే, అంత దూరం నువ్వు వెళ్ళి తెచ్చుకో అఖ్కరలేదు. పైగా డబ్బులు కూడా అమ్మిన తర్వాతే ఇవ్వొచ్చు!"
ముసలాడు ఆనందంతో తబ్బిబ్బై వెంటనే వప్పేసుకున్నాడు.
ఆ సాయంత్రమే ఒక కుర్రాడు సోడాలు దింపి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ప్రసాదరావు పొటాషియం-డి సల్ఫైడ్ కలిసున్న సోడాల్ని ఆ షాపులోకి చేర్చగలిగాడు.
ఆ రాత్రి ఎనిమిదింటికి ఒక స్టూడెంట్ కుర్రాడు వచ్చి పది రూపాయల నోటు అందిస్తూ, "ఏం తాతా! సోడాలున్నాయా?" అని అడిగాడు.
"ఎన్ని కావాలి బాబూ?"
"కుర్రాళ్ళం ఆ గదిలో దిగాం. చలి రాత్రి... ఓ పదీ ఇవ్వు. ఇక నుంచీ నీ అమ్మకాలు_ సిగరెట్లకీ, సోడాలకీ రోజుకి ఓ పది పెరిగినట్టే అనుకో!"
"ఈ రోజుకి ఓ తొమ్మిది తీసుకెళ్ళండి బాబయ్యా! రేపట్నుంచీ మీరెన్ని కావాలంటే అన్ని వుంచుతాను."
కుర్రాడు డబ్బు అందిస్తూ. "తొమ్మిది లెక్క ఏమిటోయ్?" అనడిగాడు.
"ప్రతిరోజూ ప్రొద్దున్నే వో రెగ్యులర్ కష్టమరొస్తారు బాబూ! ఆయనకో సోడా వుండాలి."
"సర్లే_ సర్లే."
ఆ విధంగా మరుసటి రోజు సర్ జగపతిరావ్ బహద్దూర్ గారి కోసం మందు కలిపిన సోడా మాత్రమే వుంచబడింది. మామూలు కష్టమర్లెవరికీ కడుపునొప్పి రాకుండా వేణూ మిగతావన్నీ కొనేశాడు.
2
ప్రతిరోజులాగే ఆ రోజుకూడా జగపతిరావు ప్రొద్దున్నే వాకింగ్ కి వెళ్ళాడు. అతడు రాత్రంతా సరిగా నిద్రపోలేదు. కడుపులో అదోలా వుండి పక్కమీద చాలాసేపు అటూ ఇటూ పొర్లాడు. రాత్రి ఎప్పటికో నిద్ర పట్టింది. అలవాటు ప్రకారమే తెల్లవారుఝామున మెలకువ వచ్చేసింది. ఈ రోజు వాకింగ్ మానేద్దామా_ అనుకుని, మళ్ళీ మనసు మార్చుకుని బయలుదేరాడు.
ఆరింటికల్లా నడక కార్యక్రమం పూర్తయింది.
వస్తూ వస్తూ కిళ్ళీకొట్టు దగ్గిర ఆగబోయి, మళ్ళీ ముందుకు సాగేడు.
"అదేమిటి బాబూ! ఈ రోజు సోడా తాగరా?"
"వద్దులేవయ్యా! ఈవాళ కడుపులో బావోలేదు."
"అదేమిటి బాబూ! అయిదేళ్ళనుంచి క్రమం తప్పకుండా తాగుతున్నారు. ఈవేళ మానేస్తామంటారు? తాగకపోతే పారబోసెయ్యండి బాబూ! అంతేకానీ మానేస్తాననకండి. అందులోనూ ఈవేళే కొత్త కంపెనీ సోడా తెప్పించాను."
"సరే ఇవ్వు."
బడ్డీ తాత సోడా కొట్టి ఇచ్చాడు. అది తాగి, జగపతిరావు అతడికి డబ్బులిచ్చేసి బయలుదేరాడు. సరిగ్గా వంద అడుగులు వేసేక కడుపులో నొప్పి ఉధృతమైంది. అటూ ఇటూ చూసేడు. ఇంకా తెల్లవారకపోవటం వల్ల జనం లేరు. దూరంగా తన ఇల్లు కనిపిస్తూంది. ప్లే గ్రౌండ్ ఇంటిదగ్గిరే కదా అని తనతో పాటూ ఎవర్నీ తీసుకురాడు. ఇప్పుడదే ప్రాణాలమీదకు తెచ్చేట్టు వుంది. ఏదన్నా ఇంటి అరుగుమీద కూర్చుందామని చూసేడు. ఖరీదయిన లొకాలిటీ అవటంవల్ల అన్నీ ప్రహరీ గోడలే కానీ, రోడ్డుమీదకి ఇళ్ళు లేవు.
అతి కష్టంమీద రెండడుగులు వేసేడు. నొప్పి భరించలేనంతగా పెరిగిపోయింది. క్షణక్షణానికీ అది ఎక్కువయింది. ఎవర్నన్నా పిలుద్దామని గొంతు ఎత్తబోయేడు. నోట మాటరాలేదు. నొప్పి మరింత ఉధృతమయింది. కడుపు పట్టుకుని ముందుకు వంగి అలాగే మోకాళ్ళమీద కూలిపోయాడు.
రెండు క్షణాలపాటు అంతా నిశ్శబ్దంగా వుంది. ఆ తరువాత వీధి మొదట్నుంచి ఒకతనెవరో సైకిలుమీద వస్తూ, రోడ్డుమధ్య పడివున్న ఆకారాన్ని చూసి 'అరె' అనుకుంటూ క్రిందికి దిగాడు. ఈ లోపులో ఈ ఇంటి గూర్ఖా, ఆ ఇంటి తోటమాలి.... ఇలా చిన్న గుంపు తయారైంది. ప్రతీవాడూ మాట్లాడేవాడేగానీ ఏం చెయ్యాలో చెప్పటంలేదు. గూర్ఖా మాత్రం- "ఈ సాబ్ ని ఎక్కడో చూసినట్టుందే" అన్నాడు హిందీలో. ఇంకో వ్యక్తి "అవును, ఈయన జగపతిరావు బహద్దూర్" అన్నాడే తప్ప తాను వెళ్ళి వాళ్ళింట్లో చెప్పొస్తానన్లేదు.
ఈ లోపులో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు. అతడు వేణు.
"ఒక పెద్దమనిషి నిస్సహాయంగా ఇలా రోడ్డుమధ్య పడిపోతే చుట్టూచేరి కబుర్లు చెప్తారా? ఇంతకీ మీరు చేసే సాయం ఏదయినా వుందా?" అని తిట్టాడు.
ఎవరూ మాట్లాడలేదు.
అంతలో ఒక మారిన్ మైనరు కారు అటు వచ్చింది. దాన్ని ఆపు చేసేరు. దాన్ని డ్రైవ్ చేస్తున్నది ఓ వృద్ధుడు. "ఏం కావాలి?" అన్నాడు విసుగ్గా.
"ఈయన్ని వెంటనే ఆప్సత్రికి చేర్చాలి."
"నాకేం పన్లేదా? నా కారున్నది రోడ్డుమీద పడిన వాళ్ళందర్నీ ఆస్పత్రుల్లో చేర్చటానికి కాదు."
"కానీ ఒక మనిషి చావుబ్రతుకుల మధ్య వున్నాడు."
"చావుబ్రతుకుల మధ్యవున్న ప్రతీ మనిషినీ ఎక్కించుకోవటానికి కాదు నా కారున్నది."
వేణు ఆ వృద్దుడి కాలరు పట్టుకున్నాడు. "నీలాంటి బూర్జువాలు వుండబట్టే మన దేశం ఇలా తగలడ్తూంది? చెప్పు! ఇతడిని మర్యాదగా ఆస్పత్రికి తీసుకొస్తావా_ఇక్కడే ఈ జనం ఆవేశాన్ని పరీక్షిస్తావా? అలా పరీక్షించే పక్షంలో నీ కారు ఈ షేప్ లో వుండదు."
వృద్ధుడు అందరివైపు చూసేడు. వేణు 'ఊ' అంటే అతడిమీద పడేట్టు వున్నారు వాళ్ళు. నిస్సహాయంగా తలూపి, "సరే- ఎక్కించండి" అన్నాడు. వేణు మరిద్దరి సాయంతో జగపతిరావుని సాయంపట్టి కారు ఎక్కించాడు. జగపతిరావు స్పృహలో లేడు.
వేణు కూడా కారు ఎక్కి, "ఇంకెవరైనా వస్తారా ఆస్పత్రికి?" అని అడిగాడు. ఎవరూ ముందుకు రాలేదు. రారని తెలుసు. గొడవ పెద్దదయితే సమ సమాజం పేరు చెప్పి సరదాగా కారు అద్దాలు బ్రద్దలు కొడదామనుకున్న వాళ్ళెవరూ, ఆస్పత్రికి వచ్చి రోగి బాగోగులు చూడరు.
వాళ్ళని వదిలేసి కారు కదిలింది.
కారు డ్రైవ్ చేస్తున్నంతసేపూ ఇద్దరూ మాట్లాడుకోలేదు. కారు వెళ్ళి చిన్న నర్సింగ్ హోం ముందు ఆగింది, ఇద్దరూ సాయంపట్టి లోపలికి తీసుకెళ్ళి ముందే వుంచిన మంచంమీద పడుకోబెట్టారు.
"ఎన్నాళ్ళు ఈయన్ని మనం ఇలా స్పృహ లేకుండా వుంచాలి?" అని అడిగాడు వేణు.
"నాలుగు రోజులు."
"ఈయనకి స్పృహ పోయేముందు కడుపునొప్పి వచ్చి వుంటుందా?"
"ఆఁ సోడా తాగగానే కడుపునొప్పి వచ్చి వుంటుంది. వెంటనే స్పృహ పోయి వుంటుంది. అంటే ఆయనకి సంబంధించినంతవరకూ ఆయన దారుణమైన కడుపునొప్పితో పడి వీధిలో పడిపోతే నువ్వు రక్షించి నర్సింగ్ హోమ్ లో చేర్పించావు. అక్కడ ఆయన నాలుగురోజులు అలాగే పడివుంటే నువ్వు నిద్రాహారాలు మాని సేవ చేసేవు. ఆయన కళ్ళు విప్పేసరికి పెరిగిన గెడ్డంతో ఎదురుగా నువ్వు వుంటావు. నీ కళ్ళు లోపలికి పీక్కుపోయివుంటాయి. డాక్టర్ వచ్చి, ఈ 'కుర్రవాడేగానీ మీ స్వంత కొడుకులా ఈ నాలుగురోజులూ మిమ్మల్ని చూసుకొనకపోయి వుంటే మీరు దక్కేవారు కాదు' అంటాడు."
"అలా అన్నందుకు డాక్టరుకి వెయ్యిరూపాయలు...."
"ఇలాంటి డాక్టర్ మనకిదొరికినందుకు సంతోషించాలి."
"వీడు డాక్టరా కాదా అన్నది అనుమానమే. నా ఉద్దేశ్యం ఈ నర్సింగ్ హోం పేరుతో వ్యభిచార గృహం నడుపుతున్నాడు! ఆ ఎం.బి.బి.యస్. కూడా బోగస్ డిగ్రీయే అని నా అనుమానం."
"ఏదయితే మనకెందుకు? నాల్రోజులపాటు గది ఇచ్చి మనం చెప్పమన్నట్లు చెప్తున్నాడు. వెయ్యిరూపాయలు పోయినా ఫర్లేదు."
"నీకేం- నువ్వైన్నైనా చెప్తావు నీ డబ్బు కాదు కాబట్టి. ఇలా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఆ ప్రేమక్కాదు కదా నాకొస్తుంది ప్రెగ్నెన్సీ." అంటూ బల్లమీద బ్లేడు తీసుకున్నాడు.
"ఏం చెయ్యబోతున్నారు మీరు?" కంగారుగా అడిగాడు వేణు.
"కడుపుమీద కోస్తాను. నాల్రోజుల తర్వాత ఈయనకి మెలుకువ వచ్చిన తరువాత, ఆపరేషన్ అయినట్టు గీత చూసుకోవద్దూ?"
"మీకు మతిపోయింది."
"ఏం?"
"బ్లేడుతో కోసి అది అపెండిసైటిస్ ఆపరేషన్ అంటారా?"
"మరి ఈ నవలలో ఇలాగే వుంది."
"రేప్రొద్దున ఈయన ఇక్కడ్నుంచి డిశ్చార్జి అయి, ఇంటికి వెళ్ళిపోయాక వాళ్ళ ఫామిలీ డాక్టర్ చెకప్ చేసి, ఈ గీత ఆ ఆపరేషన్ తాలూకది కాదు-బోగస్ దీ- అంటే?"
"అంత పరీక్షగా చూస్తాడనుకోను."
"మన ప్లాన్ సక్సెస్ అవుతుందని నేనూ అనుకోను."
"ఆదర్ సైడ్ ఆఫ్ మిడ్ నైట్ లోలా వాళ్ళు ప్లాన్ వేసి నన్ను జైలుకి పంపేరు. జాఫ్రీ ఆర్చర్ వ్రాసిన ప్లాన్ ప్రకారం వాళ్ళని నేను బుట్టలో వేస్తున్నాను."
"పాతిక సంవత్సరాల క్రితం మిమ్మల్ని జైల్లో వేసే సమయానికి ఈ రచయితలందరూ ఈ నవల్లన్నీ ఎక్కడ వ్రాసివుంటారండీ? అయినా మనం కాస్త మన స్వంత తెలివితేటలు ఉపయోగించి ఎత్తులు వేస్తే బాగుంటుందేమో_ మరీ మన సాహిత్యం మీద ఆధారపడకుండా...."
"వేణూ! మన ఎగ్రిమెంటు ప్రకారం నేను చెప్పింది నువ్వు చెయ్యాలే తప్ప నాకు ఎదురు చెప్పకూడదు. నిన్ను ప్రేమ దగ్గరికి చేర్చటానికి కొన్ని ప్లాన్ లు సిద్ధం చేసుకున్నాను. ఒక్కొక్కదానికీ ఎంత ఖర్చవుతోందో బడ్జెట్ వేసుకున్నాను. ఆ లెక్కప్రకారం ప్రొసీడ్ అవుతున్నాను. ఇంక నువ్వేం అడ్డు చెప్పకు."