"దేనికి?"
"ఇలా నేనీ పని చెయ్యాలీ అనీ, దానికి మీరు నాకు లక్ష ఇవ్వాలనీ."
"అటువంటి అగ్రిమెంటు రేపు కోర్టులో చెల్లదు."
"మరేం చేద్దాం? మీకు నా మీద నమ్మకం వుందా?"
"బిజినెస్ లో ఎంత స్నేహితులైనా ఒకరిమీద ఒకరు నమ్మకం పెట్టుకోవడం అంత మంచిపని కాదు."
"అయితే ఏం చేద్దామో చెప్పండి!"
"నేన్నీకు పాతికవేలు అడ్వాన్సుగా ఇస్తాను. ఈ కార్యం పూర్తయ్యేవరకూ నీ ఖర్చులన్నీ నేనే భరిస్తాను. నీ పేర్న డెబ్భై అయిదువేలు బ్యాంకులో డిపాజిట్ చేస్తాను. ఈ గేమ్ లో నువ్వు గెలవని పక్షంలో వెనక్కి ఆ డబ్బంతా నాకే చెందుతుంది. ముందు ఇచ్చిన పాతికవేలు మాత్రం ఈ ఆర్నెల్లు నువ్వు పడిన కష్టానికి ప్రతిఫలంగా నువ్వే వుంచుకోవచ్చు. మనం స్నేహితుల్లా విడిపోతాం. కానీ అలా జరగదనీ, నువ్వు లక్షా సంపాదిస్తావనే ఆశిద్దాం. ఏం, ఈ ఏర్పాటు నీ కిష్టమేనా?"
"నా మీద మీరుంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. కానీ నా తరపు నుంచి మీకు నమ్మకం కలిగించటానికి ఏం చెయ్యాలి?"
"ఈ క్షణం నుంచీ నేనేం చెప్తే అది చెయ్యాలి. ఎప్పుడూ నిజమే చెప్తాను అనే నీ ప్రిన్సిపుల్ ని అప్పుడప్పుడు వదిలిపెట్టాల్సి వస్తుంది అది కూడా చెయ్యాలి."
"నా కిష్టమే...."
"ఇంకో గంటలో ఒకమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయి పేరు బంగారి. ఆమెతో నీ పెళ్ళి అయినట్టు కొన్ని ఫోటోలు తీస్తాను. అవి నా దగ్గిర వుంచుకుంటాను. రేప్రొద్దున్న నువ్వు ఆ ప్రేమనే పెళ్ళి చేసుకొంటానూ- అంటే నీకు ముందే పెళ్ళి అయిపోయిందన్న విషయాన్ని నిరూపిస్తూ, ఆ ఫోటోలు బైట పెడ్తాను. అప్పుడు భార్య వుండీ రెండో పెళ్ళికి మోసం చేసినందుకు నువ్వు జైలుకి వెళ్తావు...."
వేణు మొహం ఎర్రబడింది. "నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా?" అన్నాడు రోషంగా.
ప్రసాదరావు మొహంలో ఏ భావమూ లేదు. "నా జాగ్రత్తలు నావి. రేపు పరిస్థితులు ఎలా మారతాయో ఎవరికీ తెలియదు కదా! నీ మీద లక్ష ఖర్చు పెడుతున్నప్పుడు నేనా మాత్రం జాగ్రత్త తీసుకోవటంలో తప్పులేదనుకొంటాను. అదీగాక క్షణం క్రితమే నేనేం చెప్తే అది చేస్తానని ప్రామిస్ చేశావు...."
వేణు ఒక క్షణం మౌనంగా వుండి, "సరే" అన్నాడు. ప్రసాదరావు వెళ్ళి ఫోన్ చేసి వచ్చాడు. ఇంతలో ఇంట్లోంచి ప్రేమ తోటలోకి వచ్చింది.
వేణుకి బైనాక్యులర్స్ అందిస్తూ, "అదిగో చూడు" అన్నాడు.
"అక్కరలేదు, నాకా అమ్మాయి తెలుసు" అన్నాడు వేణు.
"నీకు తెలీదనీ, నువ్వా అమ్మాయిని ముందు చూడలేదనీ కాదు. ఈ క్షణంనుంచే మనం పని ప్రారంభించాలి. ఆమె అభిరుచులు గమనించు. ఆ తోటలో తెల్ల గులాబీలు ఎక్కువున్నాయి. ఆమె కారు రంగు కూడా తెలుపే. ఆ అమ్మాయి తెలుపుని ఎక్కువ ఇష్టపడుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలన్నిటినీ ఇక నుంచి నువ్వే గమనించాలి. అందుకే బైనాక్యులర్స్ లోంచి చూడమంటున్నాను. ఏం కనబడుతుందని కాదు_ అలా చూస్తూ వుంటే ఏదో ఎప్పుడో ప్లాష్ లాగా కనబడుతుంది. దానికోసం ఇరవై గంటలు_ ముప్పై గంటలు అలా తదేకంగా చూడటమే. నేనలా కొన్ని నెలల్నుంచీ చూస్తూనే వున్నాను."
వేణూ ఆ వృద్ధుడివైపు కన్నార్పకుండా చూసేడు. అతడి పట్టుదలా, లక్ష్యం చూస్తూంటే ముచ్చటేసింది. ఉట్టి పట్టుదలేకాదు, దానికి సరిపోయే తెలివితేటలు వుండటం కూడా అదృష్టం.
అతడు బైనాక్యులర్స్ తో ఎదుటి బంగ్లావైపు చూడసాగేడు. అంతలో లోపల్నుంచి ఒక యువకుడు వచ్చి ప్రేమ తోటలో వుండటం గమనించి ఆమె దగ్గరికి నడిచాడు. బైనాక్యులర్ లెన్స్ అడ్జెస్టు చేసి వేణు ఆ యువకుడ్ని చూసి అదిరిపడ్డాడు. కిటికీ దగ్గిర అతడి పక్కనే నిలబడి రన్నింగ్ కామెంటరీలాగా ప్రసాదరావు చెప్పుకుపోతున్నాడు. "ఆ వచ్చినతను నీకు తెలిసే వుంటుంది. అతడి పేరు వరప్రసాద్. నీ జన్మశత్రువైన దయానందం కొడుకు. ప్రేమని పెళ్ళి చేసుకోవాలనుకొంటున్నాడు. ప్రస్తుతం ప్రేమ కూడా అతనంటే అభిమానం చూపిస్తూంది."
వేణు అదిరిపడి అతడివైపు అయోమయంగా చూసేడు. వృద్ధుడు నవ్వేడు. "నిజానికి ఆ ప్రేమికుల మధ్యకి నువ్వు విలన్ లాగా వెళ్ళాలి. కానీ అందుకు నువ్వేం భయపడనక్కరలేదు. ఇదిగో, ఇట్రా!" అటూ పక్కగదిలోకి తీసుకెళ్ళాడు. అక్కడ రెండు అరల్నిండా తెలుగు, ఇంగ్లీషు పుస్తకాలున్నాయి. అందులోంచి ఒక పుస్తకం తీసి, "ఇదిగో ఈ పుస్తకాలు ఓ ఇరవై దాకా వున్నాయి. తెలుగు ప్రజలు అమితంగా అభిమానించే నవలివి. ఇవన్నీ ముందు చదువు. వీటి స్పెషాలిటీ ఏమిటంటే_ హీరోయిన్ ముందొకరి ప్రేమలోపడి వుంటుంది. హీరో ప్రవేశించగానే కొన్ని అవాస్తవిక పరిస్థితులు ఏర్పడతాయి. హీరోయిన్ తను ముందు ప్రేమించిన ఆ సామాన్యుణ్ణి వదిలేసి, హీరో భ్రమలో పడుతుంది. అయినా కూడా అదేమీ ఎబ్బెట్టుగా కనపడదు."
"నాకిదంతా ఎటు దారితీస్తుందో ఏమో అని అనుమానంగా ఉంది."
"నీకేమీ భయం అక్కరలేదు. ఆ ప్రసాద్ గాడి ప్రేమలోంచి ప్రేమ బైటపడి నిన్ను ప్రేమించటం ఎలా సంభవిస్తుందో నేను చెప్తాను. ఆ మాత్రం అవాస్తవిక పరిస్థితులు మనం సృష్టించలేమటయ్యా?"
వేణు మాట్లాడలేదు. అతడే అన్నాడు, "అవతల వ్యక్తిని చిత్తు చెయ్యటం, ఎత్తుకు పైఎత్తు వెయ్యటం, ఇవన్నీ నాకు వదిలిపెట్టు. ఆ ప్రసాద్ గాడంటే ఆ అమ్మాయికి ఏవగింపు పుట్టించేలా నేను చెయ్యగలను. నాకు తెలియనిదల్లా ఒకటే, అమ్మాయిని ప్రేమించేలా చేసుకోవటం.... వెధవది ప్రేమించే వయసులో బోంబేలో డబ్బు సంపాదనలో సమయం అంతా గడిపేశాను. ఆ ఒక్కటీ నువ్వే ఆలోచించాలి...."
"నేను ఇంతకాలం ఫ్యాక్టరీలోనే గడిపేశాను. నాకూ అమ్మాయిని ఆకర్షించటం రాదు" అన్నాడు బిక్కమొహంతో వేణు.
"పాతికేళ్ళ కుర్రాడిని ప్రేమించటం ఎలానో వయసే చెప్తుందయ్యా. అంతలో తలుపు దగ్గిర చప్పుడయింది. బలంగా నల్లగా వున్న రౌడీలాంటి ఒక యువకుడు, ఒక బక్కపలచటి యువతి లోపలికి వచ్చారు. వారిని విలియమ్స్, బంగారీలుగా పరిచయం చేశాడు. ఇద్దరూ సినిమాల్లో ఎగస్ట్రా వేషాలు వేసేవారట. దాదాపు కలిసే వుంటున్నారు. వాళ్ళకి ప్రసాదరావు ముందే అంతా చెప్పినట్టున్నాడు.
బంగారి వేణువైపు చూసి, "కుర్రాడు బానే వున్నాడు. మీ పందెం అయిపోయాక ఆ ఫోటోలు నాకిచ్చేద్దురూ! ఇతడితోనే కలిసి వుంటాను" అంది గోముగా.
రోషంతో వేణు మొహం కందిపోయింది. అతి కష్టంమీద తనని తాను నిగ్రహించుకున్నాడు.
ఈ లోపులో ప్రసాదరావు కెమేరా బయటికి తీసేడు. వేణు బంగారి మెడలో మంగళసూత్రం కడ్తున్నట్టూ, పెళ్ళి పీటలమీద కూర్చున్నట్టూ ఫోటోలు తీసేరు. ఇది జరుగుతున్నంతసేపూ విలియమ్స్ చూస్తూ వున్నాడే తప్ప మాట్లాడలేదు. వేణూకి అతడు కొద్దిగా చిత్రంగా కనపడ్డాడు. తన భార్య (అఫ్ కోర్స్ _ పెళ్ళికాలేదు) ఇంకొకరి భార్యగా నాటక మాడుతూ వుంటే కూడా దానికి వప్పుకోవటం....డబ్బు ఎంతపనయినా చేయిస్తుందన్న మాట_ అనుకున్నాడు. అంతలోనే, తను చేస్తున్నదేమిటి అన్న ఆలోచన వచ్చింది. తను చేస్తున్నది కేవలం డబ్బు కోసమే కాదు. అదో సంతృప్తి.
ఫోటోలు తియ్యటం అయిపోగానే, వేణు చేత చిన్న కాగితంమీద సంతకం పెట్టించుకున్నాడు. పెళ్ళి విషయం అందులో వ్రాసి వుంది. ఆ తరువాత అతడిచ్చిన డబ్బు తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు.
ప్రసాదరావు వేణువైపు తిరిగి, "ఈ క్షణం నుంచీ ఈ పనిలో మనం పార్టనర్స్ ము. విష్ అజ్ బోత్ బెస్టాఫ్ లక్" అన్నాడు. ఇద్దరూ ఒకరికొకరు షేక్ హాండ్ లు యిచ్చుకున్నారు.
"మన ఈ అసైన్ మెంటు ఆర్నెల్లపాటు జరుగుతుందని అనుకుంటున్నాను. ఈ ఆర్నెలలూ నీ చెల్లెల్ని మనం ఎక్కడికన్నా పంపాలి. దానికి నేను ఏర్పాట్లు చేస్తాను."
వేణుకి అర్ధంకాక, "ఎక్కడికన్నా పంపటం దేనికి?" అన్నాడు.
"ఎందుకంటే_ నువ్వు ఆ యింట్లో తిష్ట వేయబోతున్నావు గనుక" అన్నాడు కిటికీలోంచి ఎదిరిల్లు చూపిస్తూ. వేణు అదిరిపడి, "ఎలా?" అని అడిగాడు.
"దానికి ప్లాన్ ఏదైనా ఆలోచిద్దాం" అంటూ బుక్ షెల్పులోంచి మరో నవల తీశాడు__ "ఇదికూడా ఒక గొప్ప నవల. ఇందులో అతి బీదదైన హీరోయిన్ తప్పనిసరి పరిస్థితుల్లో హీరో ఖరీదైన ఇంట్లో వుండవలసి వస్తుంది. కేవలం రోషం, ఆత్మాభిమానాలు ఆభరణాలుగా ఆమె అతడినించి దూరంగా తప్పుకుంటూనే అతడి ప్రేమలో పడుతుంది. ఇదే పరిస్థితుల్లో హీరోయిన్ బదువు నువ్వు వుంటావన్నమాట."
"ఇంతకాలంపాటు హాయిగా ఈ గదిలో కూర్చుని ఈ నవలా సాహిత్యాన్నంతా ఆధ్యయనం చేస్తూ వచ్చారన్నమాట."
"చెప్పానుగా! తెలివితేటలతో పరిస్థితులు సృష్టించటమైతే తెలుసుగానీ_ ప్రేమ పాఠాలు చెప్పటం రాదని. ఇంతకాలం బోంబేలో వున్నాను కాబట్టి తెలుగు పరిస్థితులు తెలియవు. ఒక దేశ కాలమాన పరిస్థితుల్ని తెలియజెప్పేది సాహిత్యం కాబట్టి, రాగానే ఈ నవలలన్నీ కొనేసేను. వీటిని ఆధారం చేసుకుని ఆ అమ్మాయిని మనం గెలవాలి."
వేణు తలూపాడు.
"రేపట్నుంచి నీకు డ్రైవింగ్ నేర్పుతాను. నాల్గు రోజుల్లో నేర్చేసుకోవాలి"
"అదేమిటీ? నేను బీదవాడిగా ఆ ఇంట్లో ప్రవేశించబోతున్నానుగా! నాకు కారు గురించి అసలేమి తెలుస్తుంది?"
"నీకు తెలియని విషయం అంటూ ఏమీ ఉండకూడదు. అయినా నువ్వు బీదవాడివే. ప్రెఅ ఒక సాయంత్రం హడావుడిగా షాపింగ్ కి వెళ్ళబోతూందనుకో! ప్రసాద్ కి అర్జంటు పనేదో తగుల్తుంది. ఎలా తగుల్తుంది అని అడక్కు. తగిలేలా మనం చేస్తాం. దాంతో ప్రేమ తండ్రి నీ వైపు తిరిగి_ 'నీకు డ్రైవింగ్ వచ్చా?' అని అడుగుతాడు. నువ్వు నమ్రతగా తలూపుతావు. కట్ చేస్తే లాంగ్ మిడ్ షాట్ లో మీరిద్దరూ కారులో వెళుతుంటారు...."
వేణు అవాక్కయ్యాడు.
"మిగతావి సమయం వచ్చినప్పుడు చర్చిద్దాం. ఇకపోతే నీ అడ్వాన్సు...." అంటూ బీరువా తెరిచి ఆరునోట్ల కట్టలు అతడికిచ్చాడు.
"ఇరవై మూడువేలు!"
"ఇరవై మూడువేలా?"
"అన్నాను. ఇరవై అయిదువేలు అడ్వాన్సు ఇస్తానన్నాను కదా?"
"మరి....?"
"నువ్వు నా పనికి వప్పుకోకుండా వెళ్ళిపోతున్నప్పుడు పడిన కష్టానికి రెండువేలు ఇచ్చాను కదయ్యా! ఇప్పుడు నువ్వు వప్పుకుంటున్నావు కాబట్టి, ఆ రెండు వేలూ ఇందులోకి వస్తుంది."
'అమ్మ ముసలోడా!' అనుకోలేదు. వేణుకి అతడి కాలిక్యులేషన్స్ చూస్తుంటే ముచ్చటేస్తూంది. ఇంత జాగ్రత్తగా వున్నాడు కాబట్టే బూట్ పాలీష్ స్టేజీనుంచి మూడులక్షల అధిపతి అయ్యాడు. ఇతడి పగ ఎలాగైనా నెరవేరేలా తను చూస్తాడు. దాంతోపాటే తన పగ కూడా!!
"ఇక మనకి సమస్యల్లా మృదులే. తనని రామయ్య ఇంట్లో వుంచుదామా?" అడిగాడు వేణు.
"ఉహూఁ, అలా అయితే దయానందానికి అనుమానం వస్తుంది."
"మరేం చేద్దాం?"
"కళ్ళు ఆపరేషన్ పేరు చెప్పి, ఇంకో వూరు పంపించేద్దాం. అక్కడే తర్వాత ఏదైనా ఉద్యోగం చూడవచ్చు. లేదా_మన ప్లాన్ ఏ మాత్రం కొద్దిగా సక్సెస్ అయినట్లు కనిపించినా మరో పాతికవేలు మధ్యంతర రిలీఫ్ గా యిస్తాన్లే. దాంతో అమ్మాయి పెళ్ళి చేసేద్దాం...."