స్టూలు లాక్కుని కూర్చున్నాడు. రివైండ్ చేసి మొదటి నుంచీ వినటం మొదలుపెట్టాడు.
........
"మీరు నిలుచునే వున్నారు. కూర్చోండి." ఆరెస్బా కంఠం.
........
.... మామూలు సంభాషణ.
"అబ్బాయికీ అమ్మాయికీ మధ్య పవిత్రమైన స్నేహం వుందంటే నమ్మరండీ మన వాళ్ళు, అసలు ఎదగలేదు" కమల.
"అవునవును."
..........
...........
"కొంచెం పరిచయం పెరగ్గానే ప్రేమంటారు. భలే నవ్వు వస్తుంది. ఆడపిల్లలంటే అందరికీ చులకనే కదండీ."
"అవునండీ. ఆడపిల్ల అంటే పవిత్రమైనదీ అన్న భావమే పోతుంది- ఈ కాలం అబ్బాయిల్లో...."
ఒరె ఇడియట్. నువ్వు రా నిజంగా.
"పొట్టేలు పున్నమ్మ చూశారా."
........
"నన్నెవరూ అర్ధం చేసుకోరండీ. ఒక్కోసారి ఎంత ఒంటరితనం ఫీలవుతూ వుంటానో! చచ్చిపోదామని అనిపిస్తూ వుంటుంది" కమల.
"నాకూ అచ్చు అలానే అనిపిస్తూ వుంటుందండీ" ఆరెస్బా.
"మీరు కాబట్టి నన్ను అర్ధం చేసుకున్నారు."
"ఇన్నాళ్ళకి నాకో నిజమైన స్నేహితురాలు దొరికింది."
"నాకూ అంతే ఆరెస్"
"నిజమా కమలా-"
"ఆరెస్-"
"కమలా-"
గది బైట చీకటి, గది మధ్యలో మిత్ర. అచేతనంగా ఖాళీ కుర్చీలు, ఖాళీ కప్పులు, ఖాళీ ఆష్ ట్రే, ఖాళీ మనసు- ఎవరిమీదో తెలియని కసి.
చిన్న చప్పుడు టేప్ లో.
"ఎవరదీ" ఆరెస్బా కంఠం. మళ్ళీ అతనే ఆశ్చర్యంగా అంటున్నాడు "మంగతాయారూ-"
"నేనే!" మూడో కంఠం. "బయట మోటర్ సైకిల్ చూసి లోపలికి వచ్చాను. నెలరోజులనుంచి వెతుకుతూ వుంటే దొరకలేదు. ఈ రోజు కనబడ్డావు- నిన్నొదలను."
"-నే వెళతాను" కమల కంఠంలో అయోమయం.
"ఇదెవత్తె?" మంగతాయారు కంఠం.
"మంగ నోరు అదుపులో పెట్టుకో!"
"నే వెళ్తున్నాను." కమల కంఠం.
దూరంగా వెళ్లిపోతున్న అడుగుల చప్పుడు.
"ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి" మంగ.
"ఏం తేలాలి?" వెటకారం.
"ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకొని"
"ఏం ఆడుకున్నాను?"
"తెలీదా- చెప్తా విను."
క్షణం నిశ్శబ్దం.
"నాకు మూడో నెల."
"మైగాడ్ - ఎవరన్నా డాక్టర్...."
"నోర్ముయ్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి."
నవ్వు, "పెళ్ళా?"
"మరి ఇన్నాళ్ళూ ప్రేమ నటించావా?"
"ఏదో థ్రిల్లు......"
"ఆ థ్రిల్లు వదిలిస్తాను. మా అన్నయ్యకు ఒక్కమాట చెప్పానంటే....."
"అయినా నేనేనని నమ్మకం ఏమిటి?"
"ఏమిటీ- ఏమన్నావ్? మళ్ళీ అనూ."
"ఒకసారి ఏమిటి- లక్షసార్లు అంటాను."
"ఈ మంగ ప్రేమిస్తే మనిషి- ద్వేషిస్తే రాక్షసి! నీ అంతు చూడకుండా వదలను."
"మీ అన్నయ్యలకు చెపుతావా?"
"నీ బుద్ధి సరిచెయ్యటానికి మా అన్నయ్యలే అక్కర్లేదురా. నేను చాలు."
"నువ్విలాంటి బజారు సరుకు అనుకోలేదు".
"నువ్వూ ఇలాటి వెధవ్వని నేననుకోలేదు. చెప్పు, చేసుకుంటావా లేదా-"
"నేన్నిన్ను చేసుకోవటమా- జోకు."
"ఫలితం అనుభవిస్తావ్."
"ఏం చేస్తావ్?"
"అరుస్తాను. గోల చేస్తాను. నీ పరువంతా బజారులోకి ఈడుస్తాను."
"ఏదీ అరువు చూద్దాం."
"ఏం? నీ చేతిలో ఫ్లవర్ వేజు చూసి భయపడతాననుకున్నావా?"
కొంచెం నిశ్శబ్దం.
గింజుకుంటున్న ధ్వని. "వదులు- వదులు" చిన్న చిన్న చప్పుళ్ళు.
పెద్దగా అరుపు "ర...క్షిం...." మాటను మధ్యలో బ్రేక్ చేస్తూ ఏదో పగిలిన ధ్వని. "అమ్మా" అని పెద్ద ఆర్తనాదం.
తరువాత స్మశాన నిశ్శబ్దం.
శంభు స్థాణువై కూర్చుండిపోయాడు. రక్తం చుక్కలేనట్టు మొహం పాలిపోయింది. చాలాసేపు అలానే కూర్చుండిపోయాడు.
పది నిమిషాల తరువాత ఆరెస్బా వచ్చాడు.
"ఇవిగో తాళం చెవులు" అని యిచ్చి శంభు మౌనాన్ని గుర్తించకుండా వడివడిగా వెళ్లిపోయాడు.
శంభు అలానే చాలాసేపు వచ్చాడు. టేప్ తిరుగుతూనే వుంది. రాత్రి మరింత ముందుకు జరిగింది. హరిదా లేకపోవటం వల్ల యిల్లంతా నిశ్శబ్దంగా వుంది.
టేప్ నుంచి మళ్ళీ మాటలు.
"నీ కారు కావాలి అర్జెంటుగా" ఆరెస్బా కంఠం.
"ఎందుకు?" తను.
"కావాలి మళ్ళీ అయిదు నిముషాల్లో తెచ్చిస్తాను."
"కారు తాళాలేవీ?"
..... నిశ్శబ్దం.
మిత్ర మెదడులో ఏదో మెరిసినట్లయింది.
చప్పున తాళాలు తీసుకుని గారేజీలో పరుగెత్తాడు. వెనుక సీటు చెక్కు చెదరలేదు. డోర్ బలంగా వేశాడు.
చిన్న అనుమానం.
డిక్కీ తెరిచి చూసి, షాక్ తగిలినట్టూ అలాగే నిలబడిపోయాడు. తొందర తొందరలో కడిగినట్టుంది. ఇంకా తడారలేదు.
రక్తపు మరకలు కూడా అక్కడక్కడా పోలేదు.
8
మంగళ వాయిద్యాలు మ్రోగుతున్నాయి. చెవులు చిల్లులు పడేలా భజంత్రీల చప్పుడు. ఉచ్ఛస్వరంతో పురోహితుడు మంత్రాలు చదువుతూ వుండగా చంద్రం లేచి వధువు మెడలో తాళికట్టాడు.
చేతిలో అక్షింతలు ఇద్దరిమీదకు విసిరేడు మిత్ర.
ఓణీ పరికిణీ వేసుకున్న అమ్మాయిలు నిలబడి ఆ పెళ్ళిని తదేకంగా చూస్తున్నారు. పట్టుచీరల ముత్తయిదువలు హడావుడిగా పెళ్లి భారాన్నంతా తమమీదే వేసుకొని, ఏ పనీ లేకుండా తిరుగుతున్నారు.
వధూవరులిద్దరూ పెద్దల కాళ్లకి దణ్ణం పెట్టుకుంటూ వస్తున్నారు. మిత్ర దగ్గిరకి వచ్చేరు.
"ఏరా? నీకూ పెట్టమంటావా?" అడిగేడు.
మిత్ర నవ్వి "నీ మొహం" అన్నాడు.
చంద్రం పెళ్ళి కూతురువైపు తిరిగి "నా ప్రాణ స్నేహితుడు. ఇప్పటివరకూ ప్రాణంలో సగమైనవాడు" అన్నాడు.
ఆ అమ్మాయి స్నిగ్ధంగా నవ్వింది.
మిత్ర నవ్వి, "నా ఒక్కగానొక్క స్నేహితుణ్ణి కూడా మీరు లాక్కొన్నారు" అన్నాడు.
"లాక్కోవటానికి దోహదం చేసింది కూడా నువ్వే. ఆ రోజు నువ్వు రూమ్ ఇవ్వకపోయివుంటే మేము మనసువిప్పి మాట్లాడుకొనే వీలే చిక్కేది కాదు. అలా మూగగా ప్రేమించుకొంటూనే వుండేవాళ్ళం. ఈ లోపులో ఈ అమ్మాయికి ఎవరితోనో పెళ్ళయిపోయి వుండేది.
ఆ ఆలోచనే భయంకరం అన్నట్టూ అమ్మాయి చెయ్యి సన్నగా వణకటం గమనించాడు. అతడికీ జంటను చూస్తూంటే ముచ్చటేసింది. మనసుని దగ్గర చెయ్యటానికి మాటలెంత ఉపయోగపడ్తాయి! ఒక గంటసేపు ఏకాంతంగా మాట్లాడుకున్న ఈ జంట ఒక జీవితాంతమూ కలిసివుంటారు.
ఒకళ్ల బాధల్లో, ఆనందంతో వేరొకరు పాలుపంచుకుంటారు.
"మా ఇద్దరి తరపునా నీకూ, ముఖ్యంగా నీ గదికీ కృతజ్ఞతలు చెప్పుకుంటాం" అని. "గదంటే జ్ఞాపకం వచ్చింది. ఆరెస్బా సంగతేమన్నా తెలిసిందా?" అడిగాడు. ఆ విషయం జ్ఞాపకం వచ్చేసరికి శంభూ మొహం మ్లానమయింది. "ఆవేశంలో చేసిన హత్య కాబట్టి శిక్ష ఎక్కువ పడకపోవచ్చు అన్నాడు లాయరు. కానీ శిక్ష పడటం మాత్రం ఖాయం." అన్నాడు.
ఒక క్షణం మౌనంగా గడిచింది.
"ఆరెస్బా అసలు పేరు తెలుసా?"
"ఏమిటి?"
"ఆర్. సుబ్బారావు."
దూరంనుంచి పురోహితుడు పిలుస్తున్నాడు.
"రేపు మా యింటికి భోజనానికి రావాలి" శంభు.
"మీ హరిదా భోజనం మాకెందుకు? తొందరగా పెళ్లి చేసుకో వస్తాం."
పెళ్ళి! ఆడపిల్లలతో మాట్లాడడం రాని తనకి పెళ్లి!
చంద్రం అంటున్నాడు. "గదిలో టేప్ రికార్డర్ పెట్టాడని చెప్పేనే. తనే" ఆ అమ్మాయి సిగ్గుతో నవ్వింది.
పురోహితుడు మళ్ళీ పిలిచాడు.
వాళ్ళు వెళ్లిపోయారు.
శంభు అంటే చూస్తూ నిలబడ్డాడు.
* * *