సంతోషంతో వెలిగిపోయింది ఏండెటో ముఖం.
"ఓ! ఐయామ్ ఆనర్డ్. ఇటీజ్ వండ్రఫుల్."
"కాని మా భాగవతార్ కి తెలియకూడదు."
"ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వను."
"థాంక్యూ!"
* * *
మృదులకి ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకుని ఆవిడ ఎపార్ట్ మెంట్ కి వెళ్ళాడు అనంగ్. అతడ్ని ఆహ్వానించి కాఫీ యిచ్చి "నవలకి ప్లాట్ తయారు చేసుకున్నారా?" అని అడిగింది. అనంగ్ గదంతా కలయజూస్తూ "ఒక్కరే వుంటున్నారా?" అన్నాడు.
"ఇంట్లో వుండడం ఒక్కదాన్నే కాని ఈ యింట్లో చాల తక్కువగా వుంటాను."
"ఓ!"
"ప్లాట్ తయారుచేసుకున్నారా?"
"ఆ! చాలా బ్రహ్మాండంగా వచ్చింది ప్లాట్. ట్రైబల్ దారిద్ర్యం. షావుకారు వాళ్ళని పెట్టే బాధలు- అప్పులూ- వడ్డీలూ- అనాగరికత- మూర్ఖత్వం- ఇవన్నీ మామూలే. ఇలాంటివి రాస్తే ఎవరు చదువుతారు చెప్పండి? సెన్సేషనల్ గా. థ్రిల్లింగ్ గా వుండాలి.అలా ఒక ప్లాట్ తయారుచేసుకున్నాను. అఫ కోర్స్ ట్రైబల్ లైఫ్ బేగ్రౌండ్ గా వాడుకుంటాననుకోండి. అడవుల్లో ఒక గిరిజన ప్రాంతం. దాని దగ్గరలోనే ఒక పెద్ద కొండ గుహ. ఒకరోజు అందమైన గిరిజన యువతిని ఎవరో ఎత్తుకుపోయారు. అడవిలో దూరంగావున్న కొండ గుహలోకి తీసుకెళ్లారు. ఆ గుహలో మూడంతస్థుల భవనం వుంది. గుహలోనే జనరేటర్ తో కరెంట్ సప్లయి చేసుకుంటూ లిఫ్ట్ కూడా నడిపిస్తున్నారు అక్కడివాళ్ళు. ఆ గాంగ్ కి యజమాని ఒక విదేశీ గూడచారి. అతని దగ్గర బోలెడంత ఫారిన్ కరెన్సీ వుంది. ఈ అమ్మాయితో "ఆర్మీ చీఫ్ ని వలలో వేసుకుని ఇండియన్ ఆర్మీ రహస్యాలు నాకందజేయాలి" అంటాడు. ఒప్పుకోకపోతే ఆ అమ్మాయిని, ఆ అమ్మాయి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తానని బెదిరిస్తాడు. ఆర్మీ చీఫ్ ని వలలో వేసుకోవడానికి ట్రైనింగ్ అంతా ఆ అమ్మాయికిప్పిస్తారు. ఆ అమ్మాయి వీళ్ళకి సహాయపడుతున్నట్లే నటించి చాకచక్యంగా వీళ్ళందర్నీ ఇంటలిజెన్స్ కి పట్టిస్తుంది. తన సేవకు ప్రతిఫలంగా మంత్రిగారి దగ్గిర గిరిజనుల అభివృద్ధికి పాటుపడతానని వాగ్దానం తీసుకుంటుంది. ఈ రకంగా ట్రైబల్ వెల్ ఫేర్ సాధించినట్లవుతుంది మనం" గొప్పగా చెప్పాడు.
మృదుల ఫకాలున నవ్వేస్తూ "ఇది చాలా అసంబద్ధంగాలేదూ?" అంది.
"చూడండీ! ఏదీ అసంభవంకాదు. ఇలాంటివన్నీ నిజంగా జరుగుతున్నాయని చెప్పటానికి అవసరమైన పేపర్ కటింగ్స్ నేను సంపాదించగలను. అదీగాక ఏది సంబద్ధం- ఏది అసంబద్ధం అని ఎవరాలోచిస్తారు. రచనలో సస్పెన్సు వుండాలి, థ్రిల్లింగ్ గా వుండాలి. కొత్తగా వుండాలి అదే ముఖ్యం."
"బాగుంది. నేనొక మారుమూల గ్రామానికి వెళుతున్నాను. కొంతదూరం అడవిలోంచే వెళ్ళాలి. నిర్జనంగా వుంటుంది దారంతా. మీరు కూడా నాతో రాగలరా?"
"ష్యూర్. తప్పకుండా వస్తాను. అంతకంటే కావలసిందేముంది?"
"థాంక్యూ వెరీమచ్." ఆ యింట్లోంచి బయటికి వస్తూ ఈలవేసుకున్నాడు అనంగ్.
* * *
సోమనాథ్ ఏజన్సీస్ చీఫ్ డిటెక్టివ్ సోమనాథ్ ఫల్గుణ తెచ్చిన వీడియో కేసెట్ టి.వి.స్క్రీన్ మీద ప్రాజెక్టుచేసి చూసుకున్నాడు. ఒక సీన్ లో వీపులు, మరో సీన్ లో వెనకనించి ఒక బాబ్డ్ హెయిర్ క్రాప్ కనిపించాయి. మంచాలమీదకి వాలుతున్నప్పుడు నీడల్లాగ రెండు ఆకారాలు కనిపించాయి. సోమనాథ్ నవ్వుకుని చిరాకుపడుతూ.... "ఏవిటయ్యా మీ రికార్డింగు? ఏం తెలుస్తోంది మనకి దీనివల్ల" అన్నాడు?
"వీడియో కెమేరా బెడ్ ని ఫేస్ చేసేలా ఫ్లవర్ వేజ్ లో అమర్చాను. వాళ్ళు బెడ్ పొజిషన్ మార్చారో, ఫ్లవర్ వేజ్ పొజిషన్ మార్చారో అర్ధం కావటంలేదు" అన్నాడు బిక్కమొహంతో ఫల్గుణ్.
"పోనీ మళ్ళీ మరోసారి మరో వీడియో రికార్డింగ్ చెయ్యవా?" అడిగాడు.
సోమనాథ్ ఆలోచించి "వద్దులే. ఈ వీడియో కోర్టులో సబ్మిట్ చెయ్యడానికి కాదుగా. భాగవతార్ ఎల్లుండి వస్తున్నట్లు టెలిగ్రాం వచ్చింది. అనుకున్నదానికంటె పదిరోజులు ముందుగా వస్తున్నాడు. అతనింటికి తరచుగా వచ్చే వ్యక్తి ఎవరో అతనికి తెలుసుంటుంది. వెనకనుంచి చూసినా గుర్తు పట్టగలడేమో? నీకు మరో అస్సైన్ మెంట్ యిస్తున్నాను" అని ఫల్గుణ్ ని పంపేశాడు. తరువాత సహదేవ్ యిచ్చిన రిపోర్టు చదివాడు. అతడ్ని పిలిపించాడు. లోపలికి వెళ్ళినవాళ్ళు బహుశా హాల్లోంచి మరేదేనా గదిలోకి వెళ్ళుంటారు. ఈ మాత్రం వూహించడానికి పెద్ద తెలివితేటలు అఖ్కరలేదు. అయితే వాళ్ళెవరో తెలుసుకోవాలి" అన్నాడు ఆలోచిస్తూ.
"సర్. మీరు మాకు పిస్టల్స్ లాంటివి పర్మిట్ చెయ్యటంలేదు. పిస్టల్స్ - బాంబ్స్ వగైరాలు యిస్తే వాళ్ళందరి అంతూ తేల్చుకుంటాను".
సోమనాథ్ నవ్వాడు. "నువ్వు మరీ అంతా సినిమాటిక్ గా ఓవర్ యాక్షన్ చెయ్యఖ్కరలేదు. ఆ పరిసరాలలో ఏదన్నా హోటల్ లాంటిది వుంటే, టిఫిన్ తింటూ కాఫీ త్రాగుతూ కూర్చో. ఆ యింట్లోనించి బయటికొచ్చే వాళ్ళనందర్నీ ఫోటో తియ్యి. అదిచాలు" అన్నాడు.
నిరుత్సాహ పడిపోయాడు సహదేవ్,సోమనాథ్ దగ్గిర అసిస్టెంట్ గా చేరబోయేముందు అతడు కౌబాయిలాగ గుర్రాలెక్కి స్వారీ చేయాలని, నడిరోడ్డుమీద చెలరేగే దుర్మార్గుల్ని అక్కడికక్కడే పిస్టల్ చూపించి బయపెట్టి, పోలీసుల కప్పగించాలని చాలా కలలు కన్నాడు. అలాంటి కలతోనే ప్రయివేటు డిటెక్టివ్ ఏజెన్సీస్ లో అసిస్టెంటుగా చేరాడు.... కాని యింతవరకు సోమనాథ్ సహదేవ్ కి రిపోర్టు తయారు చెయ్యడం ఫోటో తియ్యడం తప్ప నడిరోడ్డుమీద పిస్టల్ పేల్చేలాంటి సాహసకార్యాలేవీ అప్పజెప్పలేదు.
చిన్నబోయిన ముఖంతో కెమెరావున్న బేగ్ భుజానికి తగిలించుకున్నాడు. అతని మనస్సు అర్ధంచేసుకున్న సోమనాథ్ నవ్వుతూ అతని భుజంతట్టి "బాబూ! మన అదృష్టంకొద్దీ యింకా మన ఇండియాలో- ముఖ్యంగా ఆంధ్రదేశంలో నడిబజార్ లో పిస్టల్స్ పేల్చవలసిన అవసరం తరుచుగా రావడంలేదు. ఎప్పుడో ఒకప్పుడు నీకా అవకాశం వస్తుందిలే. తొందరపడకు" అన్నాడు బుజగిస్తూన్నట్లు.
* * *
అమెరికా నుంచి ఇండియాకొచ్చే ఎయిర్ బోయింగ్ విమానం బొంబాయి శాంతాక్రజ్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్టులో లేండ్ అయింది. విమానం దిగి కస్టమ్స్ క్లియర్ చేసుకుని లెంజ్ లోకి వచ్చాడు భాగవతార్. అతని కళ్ళు ఎవరికోసమో వెదుకుతున్నాయి.
"హాయ్ డాళింగ్!" అనే మాటలు వినబడటమూ, మృదులచేతులు అతని మెడ చుట్టి వేయటమూ, ఆమె పెదవులు అతని బుగ్గను ముద్దు పెట్టుకోవడమూ అన్నీ కన్నుమూసి తెరిచేలోపల- అతడు విభ్రాంతి నుంచి తేరుకొనే లోపల చకచకా జరిగిపోయాయి. మృదుల ముఖంమీద మెరిసిపోతున్న చిరునవ్వు వెన్నెలకి రెస్పాన్స్ యివ్వలేకపోయాడు భాగవతార్. అనుకున్న తేదీకంటే వారం రోజులు ముందుగా వచ్చాడు అతడు. మృదుల కేమాత్రం తెలియనీకుండా అకస్మాత్తుగా వెళ్ళి తలుపుతట్టి తను లేని సమయంలో - తనురాడు, రాలేడు- అని రూఢిగా తెలిసిన సందర్భంలో మృదుల యేం చేస్తూంటూందని రకరకాలుగా ఆలోచించుకున్నాడు. ఇప్పుడు ఈ అల్లరిపిల్ల ఎయిర్ పోర్టులోనే ఎదురొచ్చింది....
సోమనాథ్, ప్రయివేట్ డిటెక్టివ్ ఏజన్సీస్ కి తప్ప తన రాక ఎవరికీ తెలియపరచలేదు. కొంపదీసి సోమనాథ్ కూడా మృదులకి ఫ్రెండ్ అయిపోయాడా?
బిక్కమొహం మార్చుకుని చిరునవ్వు పులుముకోడానికి చాలా అవస్థ పడవలసి వచ్చింది భాగవతార్.
"వాట్ ఎప్లజెంట్ సర్ ప్రయిజ్. నేనివాళ వస్తున్నట్లు నాకెలా తెలిసింది?"
"థాట్ రీడింగ్, వెరీసింపుల్. నా మనసుని నీమీద కేంద్రీకరించి నువ్వేం చేస్తున్నావోనని ఆలోచిస్తే ఆ క్షణంలో నువ్వేం చేస్తున్నావో నా మనసుకి కనపడుతుంది. మింగియార్ నేర్పాడు నాకీ విద్య."
"మింగియారా?" బావురుమని యేడ్వలేకపోతున్నాడు. భాగవతార్ చెయ్యి జుట్టుమీదకి వెళ్ళింది.
ప్లేన్ టేకాప్ కి సంబంధించిన ఎనెన్సౌమెంట్ మైక్ లో వినిపించింది. ఎటు తలతిప్పినా పైన గోడలకమర్చిన టి.వి. స్క్రీన్ మీద ఎనౌన్సర్ బొమ్మ కనిపిస్తోంది. తనున్నది ఎయిర్ పోర్టు అని గుర్తొచ్చి జుట్టుపీక్కోకుండా చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు.
"రా! పోదాం. కారు తీసుకొచ్చాను" అంది మృదుల అతని చెయ్యి పట్టుకొని.
భాగవతార్ ఎదురుచూస్తున్న వ్యక్తి కొంచెం దూరం నుంచి తను వచ్చినట్లుగా చెయ్యి వూపాడు. అతడి చేతిలో ఒక ఫైల్ వుంది. అది వెంటనే చదివేయాలన్న ఆరాటంతో గిలగిల్లాడుతోంది భాగవతార్ మనస్సు. ఆ ఫైల్ తను లేనప్పుడు మృదుల దినచర్య మీద సోమనాథ్ డిటెక్టివ్ ఏజన్సీస్ తయారుచేసినదని అతనికి తెలుసు. అది తీసుకుని ఎయిర్ పోర్టు రమ్మనమని ట్రంకాల్ చేసి మరీ చెప్పాడు సోమనాథ్ కి. హైదరాబాద్ నుంచి బొంబాయి రావడానికి విమానం ఖర్చులు కూడా తన బిల్లులో వేయమన్నాడు. ఇప్పుడు మృదుల యెదురుగా ఆ ఫైల్ ఎలా తీసుకోవాలి? సోమనాథ్ ని చూడనట్టు వెళ్ళిపోవడానికి ప్రయత్నించాడు. సోమనాథ్ అతని భుజం మీద చెయ్యివేసి "సార్! మీ ఫైల్" అన్నాడు చిరునవ్వుతో ప్రశంసలని ఆశిస్తూ. సోమనాథ్ కి మృదుల భాగవతార్ ని రిసీవ్ చేసుకోవడానికి వస్తూన్నట్లు తెలియదు. దూరంగా మృదులని వెనుకనుంచి చూసి ఎవరో "ఫేన్" అనుకుని దగ్గిరగా వచ్చాక గుర్తుపట్టి "ఇదేమిటి? ఈ మహానుభావుడు ఎవరిమీద రిపోర్టు తయారుచేయమన్నాడో వాళ్ళెదుగానే రిపోర్టు అందియ్యమంటాడేమిటి?" అని మనసులో అనుకుని తన డ్యూటీ తాను చెయ్యాలి కనుక ఫైల్ ముందుకు జాపాడు.