14
అప్పారావు స్వామిలేని సమయంలో అతని ఇంటికి వచ్చి కుక్కను మచ్చిక చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని ప్రయత్నాలన్నీ వమ్మవుతున్నాయి. కుక్క అతనిచ్చిన వేమీ తినేది కాదు సరిగదా, అతన్ని చూడగానే మొరుగుతూండేది.
ఇందిర కూడా కుక్కకోసం అవీ ఇవీ తెచ్చేది. రాజా ఏవీ ముట్టేది కాదు. ఆమెను చూసినప్పుడల్లా అది మొరుగుతూనే వుండేది. కుక్కకు సంబంధించిన పూర్తి విశేషాలు స్వామి ఇందిరకు చెప్పలేదు. అవి చెబితే తన్ను చూసి అది మొరిగినందుకు ఆమె బాధపడుతుందని అతనికి అనిపించింది. ఆమెను చూసి మొరిగిందన్న విషయాన్ని పదేపదే మీనాక్షి అతనితో అన్నప్పుడు మాత్రం అతను చిరాకుపడి- "అది నిన్ను చూసీ మొరుగుతుంది. నా ఆశయాలను వ్యతిరేకించే వారెవర్ని చూసినా అంతే అది" అనేవాడు.
క్రమంగా స్వామికి పరికరాలు చేకూరుతున్నాయి. అతను ఆంధ్ర దేశ మంతటా తిరిగి సర్వే చేయవలసిన సమయం ఆసన్నమవుతోంది. ఈలోగా అతను తన కార్యక్రమాలకు అంతిమరూపం ఇవ్వడానికిగానూ ఢిల్లీలో సైంటిస్టుల సమావేశానికి వెళ్ళవలసి వచ్చింది. ఆ సమావేశపు వివరాలను ఎప్పటికప్పుడు నోట్ చేయడానికి స్టెనోగ్రాఫర్ ఇందిరను కూడా అతను కూడా తీసుకు వెళ్ళవలసి వచ్చింది. భార్యతో ఈ విషయాన్ని ముందుగానే చెప్పి- "ఏ గొడవా లేకుండా నువ్వు కూడా నాతో బయలుదేరి రా" అన్నాడు. మీనాక్షి అంగీకరించింది.
మీనాక్షి తోడుగా ఉన్నప్పటికీ ఉద్యోగ వ్యవహారాల కారణంగా ఇందిరకూ స్వామికీ ఏకాంతం లభించడం జరిగింది. ఒక పర్యాయం వారిద్దరూ ఒకే గదిలో 2 గంటలుసేపు వుండిపోయారు. స్వామి బుర్రలో ఎక్కువగా సబ్జక్టుకు సంబంధించిన ఆలోచనలే వుండేవి. ఇందిర మాత్రం రెండు మూడుసార్లు అతన్ని ఆకర్షించేటంత స్పష్టంగా పైట సవరించుకొంది. అనుకోకుండా తాకినట్లు అతన్ని తాకింది. ఏమీ ఎరుగనట్లే అతన్ని రెచ్చగొట్టడానికామె కొన్ని ప్రయత్నాలు చేసింది.
స్వామి మనసు కొద్దిగా చెదిరినా నిగ్రహించుకొన్నాడు. కాని అతని దృష్టిలోని ఏకాగ్రత చెడి ఆమెను ఏకాంతంలో స్త్రీగా గుర్తించడం జరిగింది. అయినా అతను చొరవచేయలేదు. ఆమె మనసు తెలుసుకునేందుకు ప్రయత్నించలేదు.
ఇందిరకు స్వామిని వదిలిపెట్టాలని ఉన్నట్లు లేదు. ఆమె ఎదురుచూసి ఎదురు చూసి తటాలున అతన్ని కౌగలించుకొంది. బరితెగించిన ఆమె ఈ ప్రవర్తనకు స్వామి ఆశ్చర్యపోయినా, వెంటనే కౌగిలి విడిపించుకోలేదు. ఆ కౌగిలి అతనికి హాయిగానే ఉన్నది.
"ఏమిటిది?" అన్నాడతను.
"ఇందులో తప్పుంటే అది నాదే- మీది కాదు" అంది ఇందిర.
తప్పు అనే పదం వింటూనే స్వామి ఆమెను విడిపించుకొని - "తప్పుకూ నాకూ ఆమడ దూరం. ఒకరిపై నెపం వేసి నా బలహీనతను కప్పిపుచ్చుకొనే పద్ధతి నా మనస్తత్వానికి సరిపడదు. నేను ఇటువంటివి సహించను. మీ ఉద్యోగం ముఖ్యమనుకొంటే మళ్ళీ ఇలా ప్రవర్తించకండి...." అని అక్కణ్ణించి బయటపడిపోయాడు. ఈ అనుభవం మాత్రం విచిత్రమైనదిగా అతనికి తోచింది. ఇలా జరిగిందని సగర్వంగా మీనాక్షికి చెప్పుకోవచ్చు, కాని ఆమె ఇందులోని నిజాన్ని నమ్మదు. సగం మాత్రమే నమ్ముతుంది. ఒకవేళ పూర్తిగా నమ్మినా ఇందిర ఉద్యోగం ఊడపీకేవరకూ ఊరుకోదు. ఒక చిన్న తప్పుకు ఇందిర ఉద్యోగం ఊడపీకడం అతనికిష్టం లేదు. కాని తన్ను మొరిగి హెచ్చరించిన కుక్క గొప్పతనాన్ని అతను అర్ధం చేసుకోగలిగాడు.
'నీ ప్రతిబింబాన్ని రాజా ప్రవర్తనలో చూసుకో' అన్నాడు రుద్రరాజు. స్త్రీకి సంబంధించినంతవరకూ తనకు కొన్ని నియమాలున్నాయి. మీనాక్షిని తప్ప మరో స్త్రీని తను తలపులో కూడా ఉంచుకోకూడదు. అయితే ఇందిరకు తన మీద ఆశలున్నాయి. అవి తన ఆశయాలకు వ్యతిరేకం. అందుకే రాజా ఆమెను చూడగానే మొరిగింది.
ఇందిర దగ్గర్నుంచి బయటపడ్డాక స్వామికి అంతులేని సంతృప్తి కలిగింది. తప్పుచేయకపోవడంలో ఉన్న ఆనందమూ, తృప్తీ-చేయడంలో లేవని అనుభవపూర్వకంగా అతనికి అర్ధమైంది. ఒక విషమ పరీక్షకు తట్టుకొని నిలబడగలిగినప్పటికి-ఆ పరిస్థితులూ, అప్పటి తన మనో భావాలు తలచుకొని 'పరిస్థితుల ప్రభావానికెంతటి వాడైనా దాసోహమనక తప్పదు. మళ్ళీ అలాంటి పరిస్థితులెదురు పడనివ్వకూడదు' అనుకున్నాడతను.
నైతిక బలం స్వామిలో క్రొత్త కళను తీసుకువచ్చింది. అతని ముఖంలో వింత తేజస్సు కూడా ఉట్టిపడసాగింది. అతను ఉత్సాహంగా తిరిగి తన ఆఫీసుకు వెళ్ళాడు. సైంటిస్టుల సమావేశంలో స్వామి ప్రతిభకు మంచి గుర్తింపు లభించింది. అతని కార్యక్రమాన్ని అందరూ ప్రశంసించారు.
స్వామి తిరిగి వెళ్ళగానే త్వరగా కార్యక్రమం తయారుచేశాడు. తూర్పు గోదావరి జిల్లాలోని ఒక గ్రామంలో అతని కార్యక్రమం ప్రారంభం కానున్నది.
స్వామి తన కార్యక్రమం వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాడు. తన కార్యక్రమంపై ప్రముఖుల అభిప్రాయాలనూ, తన వద్దనున్న వివిధ పరికరాలనూ, వాటి ప్రయోజనాలనూ అతను దానితో జతపరిచాడు. ఇది జరిగిన 10 రోజులకు అతనికి టెలిగ్రాం వచ్చింది. ఆ ప్రకారం అతను హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది.
హైదరాబాద్ లో అతను రామదాసు అనే పేరుగల ఎమ్మెల్లేని కలుసుకొన్నాడు. ఆయన స్వామితో అన్ని విషయాలూ ముచ్చటించి-అతని ఉత్సాహాన్నభినందించాడు. స్వామి కృతజ్ఞతలు తెలుపుకొన్నాడు.
"కృతజ్ఞతలు మేమే మీకు చెప్పాలి" అన్నాడు రామదాసు. "మీరు మీ కార్యక్రమాన్ని కొద్దిగా మార్పుచేసి కృష్ణాజిల్లాలోని మా గ్రామంలో మొదలుపెట్టాలి. మీరు చేయబోయేది పేరుకు మాత్రమే సర్వే! అక్కడ కొందరు ముఖ్యుల పోలాలకు బోరింగులు తీయాలి. ఈ విధంగా మీరు కనీసం 200 గ్రామాలకు చేయవలసి వుంటుంది. ఆ తర్వాతనే మీ అసలు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందుకు మీకు అదనంగా కొన్ని లక్షల ప్రతిఫలం ఉంటుంది."
తెల్లబోయాడు స్వామి. రామాదాసు వేళాకోళమాడుతున్నాడన్న అనుమానం అతనికి కలిగింది. అయితే రామదాసు అతనికసలు సంగతి స్పష్టంగా వివరించి చెప్పాడు.
చాలాకాలంగా ప్రభుత్వ పక్ష సభ్యులీ విషయమై ఆలోచిస్తున్నారు. ఈ పథకంలో వున్న గ్రామాల్లో సరియైన నీటివనరులు లేవు. ప్రత్యేకంగా ఎవరికి వారు ప్రయత్నిస్తే ఇందుకు చాలా ఖర్చవుతుంది. ప్రభుత్వపు డబ్బుతో ఈ పని సాధించాలనుకొని స్వామికి పదవి సృష్టించారు. సర్వే పేరుతో అతను రాష్ట్రమంతటా పరిశోధనలు జరుపుతాడు. అతను పరిశోధనలని చేసే డ్రిల్లింగులే-వారికి బోరింగులు. ఇందుకయ్యే సర్వ ఖర్చులూ ప్రభుత్వం భరిస్తుంది. స్వామి అన్ని పరికరాలు దిగుమతి చేసుకోవడం కోసం వీరంతా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకోవడం వల్లనే అతని పరికరాలు తొందరగా వచ్చాయి.
తను ఎంతో కష్టపడి చేసిన పథకం ప్రభుత్వపక్షంలో వున్న కొందరు స్వార్ధపరులకోసం ఉద్దేశించబడిందని తెలియగానే స్వామికి కళ్ళు తిరిగిపోయాయి. అతను రామదాసుకు తన ఆశయాల గురించి చెప్పి ఈ పని తన వల్లకాదన్నాడు.
"కాదంటే ఎలా? మీమీద ఎందరో ఆశలు పెట్టుకొన్నారు. మీకు వచ్చే లక్షల ఆదాయం పోతుంది."
"లక్షలమీద నాకు మోజులేదు. నీతిగా, నిజాయితీగా జీవించానన్న తృప్తి నాకు చాలు" అన్నాడు స్వామి.
"నాయనా! నీకు వచ్చిన ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఆ ప్రభుత్వపుటాదేశాన్ని అక్షరాలా పాటించడం మీకు న్యాయం."
"లాభంలేదు. ఈ పని నావల్లకాదు" అన్నాడు స్వామి.
రామదాసు స్వామిని మరికొందరు ముఖ్యులకు పరిచయం చేశాడు. స్వామి లొంగిరాలేదు. చివరకు అతన్ని బెదిరించడం జరిగింది. ఏ నీతిని అతను నమ్ముకొన్నాడో అదే అతనిలో లోపించినట్లు ఋజువుచేసి అవినీతిపరుడైనందుకు అతన్ని జైల్లో పెట్టగలమని ప్రభుత్వంలో వున్న మంత్రి ఒకాయన అన్నాడు.
ఊహించని ఈ బెదిరింపు స్వామిపై ప్రభావాన్ని చూపించింది. ఏం చేయాలో అతనికి తోచలేదు. అతను-"నేను సామాన్యుణ్ణి. ఇలాంటి మహత్తర కార్యాలు నావల్లనయ్యేదీ లేనిదీ నాకు తెలియదు. ఆలోచించుకునేందుకు వ్యవధి కావాలి" అని కోరాడు.
స్వామి నిరుత్సాహంగా తిరిగిరావడం గమనించిన మీనాక్షి అతన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నించింది. తనకు కొత్తగా వచ్చిన అనుకొని ఇబ్బందుల్ని భార్యకు వివరించి చెప్పాడు స్వామి.
"దీనికంత విచారపడడ మెందుకు? మనకు డబ్బు వచ్చే యోగముంది. అందుకే అధికారంలో ఉన్న వారే బలవంత పెడుతున్నారు. దీనికి వేరే ఆలోచన పెట్టుకోవద్దు" అంది మీనాక్షి.
"చేసేది తప్పని నాకు తెలుసు. తెలిసినేను తప్పు చేయలేను" అన్నాడు స్వామి.
"తప్పో- ఒప్పో, మీ అధికారి చెప్పిన ప్రకారం చేస్తున్నారు. ఆ పని మీరు చెయ్యకపోతే ప్రభుత్వం మీ స్థానంలో మరొకర్ని నియమిస్తుంది. వాళ్ళైనా తప్పక అలా చేస్తారు. ఆ పని నివారించడం మీ వల్ల కాదు. ఈ విధంగానైనా మీ భార్య కోరికలు తీర్చగలరనుకోండి" అంది మీనాక్షి.
భార్యా భర్తలిద్దరి మధ్యనూ తీవ్రంగా చర్చ జరిగింది. ఆ చర్చలో ఇద్దరూ కూడా ఆవేశపడలేదు. ముందు కర్తవ్య మేమిటన్నదే వారి సమస్య.