ఎంతసేపు చర్చించినప్పటికీ స్వామి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేక పోయాడు- "దేశంలో అనేక రంగాల్లో అవినీతి ఉన్నది. అవి నీతిని ఎదుర్కొనడానికి నేను పుట్టలేదు. నా విద్యుక్త ధర్మ నిర్వహణలో అవినీతి ఉండరాదన్నది నా ఆశయం. ఈ ఉద్యోగంలో అది సాధ్యపడకపోతే దీనికి రాజీనామా ఇస్తాను" అన్నాడు.
తన ఈ నిర్ణయాన్ని స్వామి ప్రభుత్వానికి తెలియబర్చాలనుకుంటుండగానే హైదరాబాదు నుంచి ఒక వ్యక్తి వచ్చి అతన్ని కలుసుకున్నాడు.
అతను స్వామికి మూడు కథలు చెప్పాడు. నీతికి నిలబడదామనుకుని ప్రజల దృష్టిలో అవినీతిపరులుగా నిందించ బడుతున్న ముగ్గురు ప్రముఖుల వెనుకనున్న అసలు కథలు అవి.
అవి వింటూ స్వామి కంగారు పడ్డాడు. అతనింకా కంగారులో ఉండగానే స్వామికి విశాఖపట్నంలో మంచి ప్రాంతంలో అతనెక్కడ కోరితే అక్కడ లక్షరూపాయల వ్యయంతో కట్టబోయే బంగళా గురించి అతను చెప్పాడు.
ఏడాదికి లక్షరూపాయలు చొప్పున స్వామి ఏ విధంగా సంపాదించవచ్చునో అతడు వివరించాడు.
అపఖ్యాతి, జైలు జీవితం కావాలో-సుఖప్రద మైన, భాగ్యవంతమైన జీవితం కావాలో స్వామి నిర్ణయించుకోవలసి ఉంది.
స్వామి తన రాజీనామా నిర్ణయాన్ని ఆ వ్యక్తికి చెప్పాడు.
ఆ వ్యక్తి స్వామిని వదలలేదు.
ఈ పథకం స్వామి స్వయంగా నిర్వహించనవసరం లేదు. అతను విశాఖపట్నంలో ఉంటూ రీసెర్చి చేసుకోవచ్చు. అతని తరుపున కొందరు వ్యక్తులు ఆ పని చేస్తారు.
వాళ్ళు స్వామికి తప్పుడు రిపోర్టులు పంపిస్తారు. వాటిని నమ్మి స్వామి ఊరుకుంటాడు.
అపఖ్యాతి వస్తే ఆ వ్యక్తులకే కాని స్వామికి ఉండదు.
స్వామి ఇందుకు ఒప్పుకుంటే వెంటనే అతనికి మూడు లక్షలు లభిస్తుంది.
స్వామికిది కొంత మెరుగ్గా కనబడింది. ఈ అసహాయస్థితిలో అంతకు మించి గత్యంతరం లేదనిపించిందతనికి.
ఈలోగా ఆ వ్యక్తి ఈ విషయాలన్నీ మీనాక్షితో మాట్లాడారు. మీనాక్షి భర్తతో పెద్దపోట్లాట వేసుకోవడమేకాక- ఇప్పుడొచ్చిన అవకాశం ఈ జన్మలో లభించదనీ ఇది వదులుకున్న పక్షంలో తనకోరికలీ జన్మలో తీరవనీ, అందువల్ల తను ఆత్మహత్య చేసుకుంటాననీ నొక్కి చెప్పేసింది.
స్వామి తన గదిలో ఉన్న మహాత్ముల ఫోటోల ముందు నిలబడ్డాడు.
'నీతిగా ఉండాలనుకునే వాణ్ణి నీతిగా ఉండనివ్వని ఈ లోకంలో మహాత్ములుగా నిలబడ్డ మీ గొప్పతనం నాకీనాడు అర్ధమవుతోంది. అవసరం కోసం నీతిని ఆశ్రయించిన నాకూ, అవినీతిని ఎదుర్కోవడమే జీవన ధ్యేయంగా ఉన్న మీకూ పోలికలేదు. ఇంతకాలం నేను అజ్ఞానంలో ఉన్నాను. ఒకప్పుడు నేను అనుకున్నది సాదించడానికి ఋజువర్తన అవసరమైంది. ఇప్పుడు నేను బ్రతకడానికి అవినీతి అవసరమవుతోంది. అవసరాన్ని బట్టే నా బ్రతుకు' అని తనలో తనే గొణుక్కున్నాడు.
అంతకాలానికి స్వామి భార్య మెచ్చే నిర్ణయం తీసుకుని లక్షాధికారి అయ్యాడు.
ఆ మర్నాడు స్వామికి ప్రియమైన కుక్క రాజా అప్పారావు చేతి బిస్కెట్ తింది.
ఆ మర్నాడు ఇందిర చేతి బిస్కెట్ కూడా తింది.
అదిప్పుడు ఎవరిని చూసినా మొరగడం మానేసింది.
15
స్వామి కొత్తగా కట్టుకున్న ఇంట్లో దొంగతనం జరిగింది. పాతికవేలు విలువచేసే నగలు, నాలుగు వేలు రొక్కం పోయాయి. ఈ దొంగతనం జరిగినపుడు స్వామి ఊళ్ళో లేడు. అతను తిరిగిరాగానే ఈ విషయం విని- "ఇంట్లో సింహంలాంటి కుక్క ఉండగా ఇదెలా జరిగింది?" అన్నాడు.
"తిండి దండగ తప్పితే దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. దొంగలు వచ్చినపుడు అది మొరగనైనా మొరగలేదు. చూస్తూ ఊరుకుంది. దానివల్ల ఏ సహాయమూ లభించక నేను పూర్తిగా అసహాయురాలైపోయాను. నా కళ్ళముందే అన్నీ దోచుకుపోయారు" అంది మీనాక్షి.
"చంపేస్తాను- వెధవ కుక్కని" అన్నాడు ఆవేశంగా స్వామి.
"అంతే కావాలి దానికి" అంది మీనాక్షి.
ఆ రోజు స్వామి చేసిన ఏర్పాట్లతో రాజా తనువు చాలించింది. దీనికీ తనకూ ఉన్న అనుబంధం మామూలుది కాదు.
రుద్రరాజుగారికీ విషయం తెలిస్తే తన్ను క్షమించరు.
కాని తను ఆవేశపడడంలో తప్పేముంది?
తన ఇంటిని సంరక్షించవలసిన కుక్క తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించలేదు. అందులోనూ ఒకప్పుడెంతో విశ్వాస పాత్రంగా ఉండే కుక్క!
'నీ ఆలోచనలకూ ఆశయాలకూ ప్రతిబింబంగా ఉంటుంది రాజా ప్రవర్తన' అన్నాడు రుద్రరాజు. ఇదా ఆ ప్రతిబింబం?
స్వామి ఊళ్ళో లేకపోవడానికో కారణముంది.
అస్సాంలోని కొత్త ప్రాంతంలో నిపుణులు కొందరు పరిశోధనలు జరిపి ఒక నివేదికను సమర్పించారు.
ఆ నివేదిక ప్రకారం ఆ ప్రాంతంలో పెట్రోలు లభ్యమవుతుంది.
అయితే ఆ నివేదిక తప్పు అనీ- ఆ ప్రాంతంలోని స్థలాలు ఒక పార్లమెంటు సభ్యునకు చెందినవనీ- ఆ సభ్యుడు తన స్థలాలకు మంచి ధర రాబట్టాలను కుంటున్నాడనీ- ఈ నివేదిక ఆ సభ్యునకు అనుకూలంగా తయారు చేయబడినదనీ ఒక వదంతి బయల్దేరింది.
ఆ వదంతి కారణంగా ఆ నివేదికలోని తప్పొప్పులు నిర్ణయించడానికింకో కమిటీ వేశారు. దానిలో స్వామి ఒక ముఖ్య సభ్యుడు.
ఆ నివేదిక నిజంగానే సరియైనది కాదని స్వామికి తెలిసిపోయింది. అయితే లక్షరూపాయల లంచంతో అతను నిజాన్ని దాచిపెట్టాడు.
ఇప్పుడాప్రాంతంలో కొన్ని కోట్ల ప్రభుత్వ ధనం - దొరకని పెట్రోలు కోసం ఖర్చు చేయ బడుతుంది.
ఆ నివేదికలో తప్పున్న పక్షంలో అది చెప్పడం స్వామి బాధ్యత. ఆ బాధ్యతను తను నిర్వహించలేదు. తన కళ్ళ ముందున్న తప్పు విషయంలో అతను మౌనం వహించాడు. తనకేమీ లోపాలు కనబడలేదన్నాడు.
అదయ్యాక ఇంటికి వచ్చి దొంగతనం జరుగుతూండగా చూస్తూ ఊరుకున్నందుకు రాజాని చంపించేశాడు.
రాజా ఒక కుక్క. అది తన కివ్వబడిన శిక్షణ కారణంగా మనిషిలా మసిలింది. అందుకే నిర్ధాక్షిణ్యంగా చంపబడింది.
స్వామి మనిషే కాని అతని మనసు కుక్క అనుసరించింది.
రాజాను చంపక ముందే అతని మనసులోని కుక్క చనిపోయింది. అతనిప్పుడు మనిషిలా బ్రతుకుతున్నాడు.
కుక్క కుక్క ప్రవర్తనను సహించగలదేమో కాని- మనిషి మనిషి ప్రవర్తనను సహించలేడు.
రాజా చనిపోయింది. స్వామిలోని రాజా చనిపోయాడు.
తన ఆలోచనల ప్రతి బింబపు రూపం రాజాలా భయంకరంగా కన్పిస్తూంటే సహించలేక, భరించలేక తను రాజాను చంపించేశానన్న నిజం స్వామికి స్పురించిందో లేదో తెలియదు. ఎందుకంటే అతనిప్పుడు మనిషి- కేవలం మనిషి!
ఇది ఒక కుక్క కథ. ఆ కథ అయిపోయింది.
అయితే ఈ కథలోని కుక్క ఎవరో ఈ కథా రచయితకూ సరిగ్గా తెలియదు.
__* సమాప్తం *__