Previous Page Next Page 
ఇది ఒక కుక్క కథ పేజి 12

   
                                   13

    "నా పేరు ఇందిర. స్వామిగారితో మాట్లాడుదామని వచ్చాను."
    మీనాక్షి ఆ యువతి వంక అదోలా చూసి__"ఆయన పది నిముషాల్లో వచ్చేస్తారు. రండి-కూర్చోండి!" అంది.
    ఇందిర లోపలకు వచ్చి కూర్చుంది. మీనాక్షిని కుతూహలం బాధిస్తోంది. ఈ యువతి ఎవరో తనకు తెలియదు. మనిషి చూస్తే బాగా పరిచయమున్నదానిలా మాట్లాడుతోంది. ఆయనెప్పుడూ ఇందిర అనే యువతి గురించి తనకు చెప్పలేదు.
    "మీ గురించి నేను తెలుసుకోవచ్చా?" అంది మీనాక్షి.
    "తెలుసుకోవడానికేముందండీ? ఆయన ఆఫీసులో స్టెనోగ్రాఫర్ పోస్టు ఒకటి ఖాళీ ఉన్నదట...." అని ఆగింది ఇందిర.
    మీనాక్షి జాలిగా ఆమె వంక చూసి__"ఆ ఉద్యోగానికి చాలా పోటీగా ఉన్నట్లుంది" అంది. ఆ యువతి ఉద్యోగాన్నభిలషిస్తున్నదని తెలియగానే మీనాక్షి కాస్త గొప్పగా ఫీలయింది.
    "అందుకే ప్రత్యేకంగా వచ్చానండి! ఎంతో పోటీగా ఉన్న సమయంలో ఈ ఉద్యోగం నాకు వచ్చిందంటే అందుకు మీవారు కారణం. కృతజ్ఞతలు తెలుపుకోవడానికి వచ్చాను" అంది ఇందిర.
    మీనాక్షి ఆశ్చర్యంగా__"అప్పుడే ఆ ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరుగడమూ, అపాయింట్ మెంట్ ఆర్డరివ్వడం కూడా అయిపోయిందా?" అంది.
    "అవునండి! ఈ రోజే నాకు పోస్టులో ఆర్డరు వచ్చింది" అంది ఇందిర. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోతోంది.
    ఒకవారం రోజులుగా మీనాక్షికీ ఉద్యోగపు సమాచారం బొత్తిగా తెలియలేదు. ఎందుకంటే అప్పారావు కుటుంబం ఊళ్ళో లేదు. భర్త ఆమెకు ఆఫీసు విశేషాలు చెప్పడు. అదీకాక అప్పారావు భార్య కూడా ఓ మూడువారాల నుంచి ఈ ఉద్యోగం ప్రసక్తి తీసుకురావడం మానేసింది.
    "ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి! ఈ ఉద్యోగం రావడానికి డబ్బేమైనా ఖర్చుపెట్టారా?" అంది మీనాక్షి కుతూహలంగా. భర్త ఈ ఉద్యోగం పేరు చెప్పి చాలా సంపాదిస్తాడని ఆమె అనుకుంటోంది.
    "డబ్బిచ్చి ఉద్యోగం కొనుక్కునే స్థితి నాకు లేదండి! మీవారూ, నేనూ ఒకే కాలేజీలో చదువుకున్నాం. ఆ పరిచయాన్ని పురస్కరించుకొని నా బీద దశ వారికి చెప్పాను. ఆయన జాలిపడి, నాకీ సహాయం చేశారు" అంది ఇందిర.
    ఇందిర చాలా అందంగా ఉంది. దీన దశలో ఉంది. ఉద్యోగం గురించి స్వామిని కలుసుకుంది. తన పరిస్థితి చెప్పుకుంది. తామిద్దరమూ ఒకే కాలేజీలో చదువుకున్న విషయం స్పురణకు తెచ్చింది. అతను జాలి పడ్డాడు. ఆమెకుద్యోగం వచ్చేలా చేశాడు.
    ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇందులో మీనాక్షికి నచ్చని విషయం ఒక్కటే! ఈ విషయాలన్నీ స్వామి రహస్యంగా ఉంచాడు. ఎందుకలా చేశాడు? తన కివన్నీ ముందుగానే చెప్పి ఉంటే ఎంత బాగుండేది?
    మీనాక్షి ఇంకా ఆలోచనల్లో ఉండగానే స్వామి వచ్చాడు. స్వామిని చూస్తూనే ఇందిర లేచి నిలబడింది. థాంక్స్ చెప్పింది. అతను నవ్వుతూ ఆమెను కూర్చోమన్నాడు. స్వామి ఆమెను మీనాక్షికి పరిచయం చేయబోయాడు. పరిచయం జరిగినట్లు మీనాక్షి చెప్పి, లోపలకు వెళ్ళి కాఫీ కలిపి తెచ్చింది. ముగ్గురూ కాఫీలు తాగారు. మధ్య మధ్య మీనాక్షి ఓ మాట అన్నప్పటికీ ఎక్కువగా స్వామి, ఇందిర- ఇద్దరే మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ చనువుగా నవ్వుతున్నారు. మీనాక్షి వారిద్దర్నీ గమనిస్తోంది. తనని ఇందిర స్థానంలో పోల్చుకుంటోంది. ఇందిర తన కంటె అందంగా ఉన్నట్లు ఆమెకు అనిపిస్తోంది. అదే విధంగా స్వామికి కూడా అనిపించవచ్చునని ఆమెకు తోస్తోంది. 'స్టెనో గ్రాఫర్ అంటే ఎవరు? ఏయే విధులుంటాయ'ని ఆలోచిస్తోంది. ఆమె ఆలోచనలు చాలా దూరం వెళ్ళగా మళ్ళీ ఈ లోకంలోకి వస్తోంది. స్వామి, ఇందిర నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు.
    మీనాక్షి అక్కణ్ణించి లేచి లోపలకు వెళ్ళింది. ఓ గదిలో స్థంభానికి కట్టబడి ఉన్న రాజాను చూసి ఆప్యాయంగా పలకరించింది. గొలుసు స్థంభం నుంచి విప్పి-తన చేతిలోకి తీసుకుంది. నెమ్మదిగా నడుచుకుంటూ స్వామి, ఇందిరల దగ్గరకు వచ్చింది. ఇద్దరూ అర్ధం లేకుండా నవ్వుతూ, ఏమేమిటో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో రాజా ఇందిరను చూసి అదే పనిగా మొరగడం మొదలు పెట్టింది.
    ఇందిర ఉలిక్కిపడి కుక్కనూ, మీనాక్షినీ మార్చి మార్చి చూసింది. కుక్క ఇంకా మొరుగుతూనే ఉంది- "చాలా గొప్ప కుక్కలా ఉంది. మీ ఇంట్లో ఇలాంటి కుక్క ఉన్నట్లు నాకు తెలియదు. ఎంత ముద్దుగా మొరుగుతోందో! దీని కోసం పాపం బిస్కట్లు తేవాల్సింది. మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా తెస్తాను" అంది ఇందిర.
    నిజానికి కుక్క మొరుగుతూంటే ముద్దుగా లేదు, భయంకరంగా ఉంది. కుక్కను చూస్తే భయం వేస్తోంది. అయితే తనున్న పరిస్థితులను బట్టి ఇందిర అలా మాట్లాడింది. ఆగకుండా మొరుగుతున్న కుక్క అరుపులలో తన మాటలు వినబడడం కోసం ఆమె కాస్త గట్టిగా మాట్లాడింది.
    స్వామి ఆలోచనలు మరో రకంగా ఉన్నాయి. తన వల్ల ఉపకారం పొందిన ఇందిరను చూచి రాజా మొరగడం అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇందిర తనకు ఆప్తురాలు కాకపోవచ్చు. కాని ఆమె మనసులోంచి రాజా పసికట్టిన దురూహలేమిటి? వాటి ప్రభావం ముందు ముందు తనపై ఏ విధంగా ఉంటుంది? ఈ ప్రశ్నలకు జవాబు దొరకడం కష్టం. అతను ఇందిర మాటలు విని- "ఆ పని మాత్రం చేయకండి. ఇది ప్రత్యేక శిక్షణ పొందిన కుక్క. పేరు రాజా. ఇతరులు తెచ్చిన బిస్కట్లూ కాని, మరి ఏ ఇతర ఆహార పదార్ధాలుగాని వాసన కూడా చూడదిది" అన్నాడు.
    "నిజమా?" అంది ఇందిర.
    కుక్క ఇంకా మొరుగుతూనే ఉంది. ఇందిర మనస్సులో విసుక్కుంది. ఈ మొరుగు మూలంగా ఏ మాటా తొణకడం లేదని. ఆ తర్వాత అక్కడ ఆమె ఎంతో సేపు ఉండలేదు.
    ఇందిర వెళ్ళిపోయేక కుక్క ప్రశాంతంగా ఉంది.
    "చాలా ఆశ్చర్యంగా ఉంది!" అన్నాడు స్వామి.
    "నాక్కూడా!" అంది మీనాక్షి. ఆమె భర్తతో ఏకాంతం కోసం చాలా సేపట్నించి ఎదురు చూస్తోంది.
    ఈ విషయంలో ఇంకేమీ మాట్లాడకూడదని స్వామి అనుకున్నాడు. మాట మార్చడం కోసమని- "తమ్ముళ్ళిద్దరూ బీచి నుంచి ఇంకా రాలేదా?" అన్నాడు.
    "వాళ్ళు ఎనిమిదిన్నరకు గానీ రారని మీకు తెలుసు" అంది మీనాక్షి.
    "అవును. మర్చిపోయాను" అన్నాడు స్వామి.
    "ఇదొక్కటే కాదు- చాలా విషయాలు మరిచిపోతున్నారు" అంది మీనాక్షి. అది సంభాషణకు నాంది మాత్రమే. ఆ తర్వాత ఆమె ఇందిర గురించి ముందుగా తనకేమీ చెప్పనందుకు భర్తను నిలదీసి అడిగింది. స్వామి ఆశ్చర్యాన్ని నటించి- "ఇందులో చెప్పడానికేముంది?" అన్నాడు.
    "పాతికవేల బేరముందన్నారు. పిచ్చిదానిలా నమ్మాను. ఈ పిల్లేనా మీరన్న పాతిక వేలూను. ఈ పిల్ల మీకు పాతిక వేలు విలువ చేయొచ్చు. కానీ నాకెందుకు పని కొస్తుంది? అంతగా అయితే నా కాపురంలో నిప్పులు పోయడానికి పనికి వస్తుంది" అంది మీనాక్షి.
    స్వామి తెల్లబోయి-"నన్ను ఇంత మాటనడానికి నీకు మనసెలా ఒప్పింది?" అన్నాడు.
    "మీ ప్రవర్తనే నా చేత ఈ మాట అనిపించింది. ఒకటి కాదు-రెండు కాదు-పాతిక వేలు పేరు చెప్పి, రసగుల్లాలాంటి ఈ పిల్లనుద్యోగంలో వేసుకున్నారు. సంవత్సరాల తరబడి ఆ పిల్ల మీ ఆఫీసులో మీకు తోడుగా ఉంటుంది."
    "మీనా!" కాస్త గట్టిగా అరిచాడు స్వామి-"నన్ను శంకించడం నేను సహించలేను. నిప్పులాంటి మనిషిని."
    "కారు కాకపోతే రవ్వలనెక్లెసైనా దొరికేది. పాతిక వేలు పేరు చెప్పి అప్పారావుగారిచ్చే ఆరువేలూ కూడా దక్కకుండా చేశారు. మీ స్వార్ధం చూసుకుని నన్ను వదిలేశారు" అంది మీనాక్షి.
    స్వామి తమాయించుకుని- "ఏమిటీ పిచ్చి మాటలు మీనా! నేను స్వార్ధం చూసుకుని నిన్ను వదిలేయడమేమిటి? నా స్వార్ధమే నువ్వు. నా బ్రతుకు నీ కోసం. ఇంక పాతిక వేల సంగతంటావా? అది అప్పారావుని వేళాకోళం చేయడం కోసం నేను చేసిన సృష్టి. చదువుకున్న దానివి కాబట్టి అర్ధం చేసుకోగలవను కున్నాను...." అని ఇంకా ఏదో అనబోతూండగా-
    "బ్రాందీ తాగకపోతే లాభం లేదన్నారు. మార్గరెట్ లేకపోతే బ్రతుకుండ దన్నారు. కుక్క మిమ్మల్ని చూసి మొరిగితే అవి ప్రేమాభిమానాలన్నారు. ఇప్పుడు పాతిక వేల విషయంలోనూ అలాగే అంటున్నారు. మొదట్నించీ మీరు నాకు జవాబు చెబుతూనే మళ్ళీ మాయ చేసేస్తున్నారు. చదువుకున్న దాన్నయుండీ మీ మాయలో పడిపోతున్నాను. ఇంకా ఇలా ఎన్నాళ్ళు మోసగిస్తారో మోసగించండి. రవ్వల నెక్లెసులు చేయించొద్దు- కార్లు కొని పెట్టవద్దు" అంది మీనాక్షి ఆవేశంగా.
    "ఎత్తుమీంచి క్రిందకు దూకడం సులభం. అయితే ప్రాణాలు పోవచ్చు. కాని క్రింద నుండి ఎత్తుకు ఎగబాకడం చాలా కష్టం. నేను ఎత్తుమీద ఉన్నట్లు భావిస్తున్నాను. నన్ను క్రిందకు దూకమంటున్నావు నువ్వు. ఏ పరిస్థితుల్లోనూ నిజాయితీని విడనాడనని నాకు నేనే మాట ఇచ్చుకున్నాను" అంటూ స్వామి ఉన్నతాశయాల గొప్పతనం గురించి వివరించి చెప్పాడు మీనాక్షికి.
    మీనాక్షి అంతా ఓపిగ్గా విని- "మీ ఉపన్యాసమయింది గదా-కుక్కని కూడా ఓసారి నన్ను చూసి మొరగమనండి" అంది.
    స్వామి తన పట్టు విడువలేదు. మీనాక్షిని నెమ్మదిగా లోబరచుకొని ఇందిర దీనావస్థ నామెకు మనసు కరిగించేలా వివరించి, అతికష్టం మీద ఆమె సానుభూతి పొందగలిగాడు. 

 Previous Page Next Page