Previous Page Next Page 
పరిహారం పేజి 13


    స్నేహితుడికి ఓ పాత కుర్చీ జరిపి, కృష్ణారావువైపు తిరిగాడు. "ఇతడిని మీరు చూసే ఉంటారు మాస్టారూ!" అన్నాడు.
    "ఎందుకు చూడలేదూ? ఎదురింట్లోనేకదా ఉండేది? నీ క్లాస్ మేట్ కదూ?"
    "అవును. పేరు రామచంద్రరావు. మీరు మొన్న పారుకు ఏదైనా సంబంధం చూడమన్నారు కదూ? ఇతడు పారును వివాహమాడటానికి ఇష్టపడ్డాడు."
    రామ్ గొంతు సవరించుకొని, "మాకు ఈ ఎదురుగా ఉండే మేడ, రెండు దుకాణాలు ఉన్నాయి. మేం ఇద్దరం అన్న దమ్ములం. మా అన్నగారు బట్టలషాపు చూచుకొంటున్నాడు. ఆయనకి పెళ్ళయ్యింది. నేను స్టీలుసామాను షాపు చూసుకుంటున్నాను."
    "మనోహర్ నాకన్ని సంగతులూ చెప్పాడు. మీ పారిజాతను నేను వివాహమాడుతాను. కాని, ఇంట్లో అంగీకరించరు. ప్రస్తుతం రిజిస్టర్ మారేజ్ చేసుకొంటాను. తరువాత తెలిసినా మావాళ్ళు ఏమీ చెయ్యలేరు. చివరికి అన్నీ సర్దుకొంటాయన్న నమ్మకం నాకుంది!" అన్నాడు.
    కృష్ణారావు కళ్ళజోడు సవరించుకొని ఎగాదిగా చూశాడు వరుణ్ణి. రంగు నేరేడుపండు, ముక్కు చట్టిముక్కు, కళ్ళు ఎక్కడో గుంటల్లోంచి చూస్తున్నట్టుగా ఉన్నాయి. వయసు చిన్నదేగాని సగం జుట్టు తెల్లబడింది. మనిషికి అన్ని అవయవాలు అందంగా ఉండకపోవచ్చు లేకపోయినా ఒక్కో మనిషికి ఆకర్షణ, కళ అనేవి ఉంటాయి. ఈ యువకుడిలో అలాంటిదికూడా కనిపించడంలేదు.
    తన అయిష్టాన్ని అప్పటికప్పుడు బయటపెట్టడం భావ్యంగా ఉండదనుకున్న కృష్ణారావు మొక్కుబడిగా ఏవో రెండు మూడు ప్రశ్నలు వేశాడు.
    కొంతసేపు కూర్చొని లేచాడు రామచంద్రరావు.
    స్నేహితుడిని సాగనంపి వచ్చాడు మనోహర్.
    "ఏం మాస్టారూ? మీరిష్టపడ్డట్లేనా?"
    "పారును అతడి ప్రక్కన నిలబెడితే ఎలా ఉంటుంది మనోహర్? కాకి ముక్కుకు దొండపండు అనేది."
    "అతడు అందంగా లేకపోవచ్చు, డబ్బుంది, చదువుంది. ముఖ్యంగా మీ అమ్మాయిని ఇష్టపడి కట్నం కానుకలు లేకుండా పెళ్ళాడుతా నంటున్నాడుకదా?"
    "కట్నం కానుకలు లేకుండా పెళ్ళాడతాడని ఒక కురూపికి ఇస్తానా నా కూతుర్ని?"
    "ఇక మీ ఇష్టం?"
    వారం రోజులు గడిచాయి
    పారిజాత మనోహర్ తో మాట్లాడడం మానేసింది. ఎదురుపడినా మూతి బిగించుకొని, అతడికేసి చూడకుండా అలిగినట్టుగా తప్పుకుపోతుంది.
    ఈలోగా మరో సంబంధంకూడా తీసుకువచ్చాడు మనోహర్.
    ఆ వరరత్నం మనోహర్ వాళ్ళ కాలేజీలో హిస్టరీ లెక్చరర్. అతడి మొదటి కళత్రం పురిటిలో పోయింది అతడి వయసు ఏమంత ఎక్కువకాదు. మనిషికూడా ఒడ్డూ పొడవుతో బాగుంటాడు. అతడికి పారిజాత బాగా నచ్చింది కూడా.
    నచ్చనిది కృష్ణారావుకే. చూసిచూసి రెండో సంబంధానికి తన కూతుర్ని ఇవ్వడం. భార్య పోయినవాడి జీవితాన్ని పంచుకోవడమంత శాపం మరొకటి ఉంటుందా ఆడపిల్లకు!
    "బాబూ మనోహర్! డబ్బు లేకపోయినాసరే. చదువు  లేకపోయినా సరే. నా కూతురికి ఈడూజోడైన వాడై తేచాలు అంత కంటే నేనిక ఎక్కువ కోరను. అని చెప్పేడు కృష్ణారావు.
    పారిజాత అభిప్రాయ మేమిటో తెలియలేదు మనోహర్ కి ఇంతకీ ఆవిడెందుకు అలగినట్టు తనమీద?
    "అత్తా!"
    "అత్తలేదు." లోపలినుండి వచ్చాడు మనోహర్.
    "వంటావిడ వుందా లోపల?"
    "ఆవిడకూడా లేదు. అమ్మా, ఆవిడా కలిసి బజారుకు వెళ్ళారు. ఏం కావాలి నీకు!" పారిజాత చేతిలోవున్న గిన్నె వంక ప్రశ్నార్ధకంగా చూశాడు.
    "మజ్జిగ పిల్లి తాగేసిపోయింది. రాత్రి భోజనానికి అత్తనడిగి కాస్త మజ్జిగ పట్టుకుపోదామని."
    "ఉందేమో చూసి తీసుకెళ్ళు అమ్మ వచ్చాక నేను చెబుతాలే"
    పారిజాతకు ఆ ఇల్లంతా సుపరిచితం. ఏది ఎక్కడుండేది తెలుసు. వంటగదిలో ప్రవేశించింది.

 Previous Page Next Page