Previous Page Next Page 
పరిహారం పేజి 14


    ఉట్టిమీదున్న చల్లకుండ కోసం చేతులు పైకెత్తింది.
    అంతే
    కెవ్వుమంది.
    "ఉష్! అరవకు!" మనోహర్ పెదవులు పారిజాత పెదవుల్ని బంధించాయి. అంతకుముందే అతడి బాహువులు ఆమె నడుముని బంధించాయి!
    "ఉఁ. ఇక చెప్పు! ఎందుకు అలిగావు నామీద?"
    అలిగింది నిజమే. దానికి ఇంత అందమైన శిక్ష విధిస్తాడని కలలో కూడా ఊహించలేదు పారిజాత.
    "నేను తెచ్చిన సంబంధాలు నీకు నచ్చలేదా?"
    "నువ్వు తెచ్చిన సంబంధాలు కాదు నచ్చనిది! నువ్వు సంబంధాలు తేవడం" అని చెప్పాలనుకొంది గాని పారిజాత గొంతు పెగల్లేదు.
    "డబ్బు, చదువు అందం అన్నీ నాలో ఉన్నాయి. నన్నయితే మెచ్చుతావా?" గుసగుసగా అడిగాడు.
    పారవశ్యంతో పారిజాత కన్నులు అరమోడ్పులయ్యాయి.
    "అబ్బ! ఎంత పొట్టి! నా భుజాల ఎత్తున్నావు!" తన ఛాతీమీద తల ఆన్చినట్టుగా ఉన్న పారిజాత తలమీద గడ్డం ఆన్చి అన్నాడు.  "నిన్న మొన్నటిదాకా మొగ్గవు! ఇంత అందమైన పువ్వుగా తయారవుతావనుకోలేదు ఒక్క రాత్రిలో రేకులు విచ్చుకొన్న పువ్వులా నాకు అద్భుతం గొల్పుతున్నావు. పారూ! నువ్వు ఎంత అందంగా తయారయ్యావు!"
    అతడి స్తోత్రం ఇంకా ఎంతసేపు సాగేదోగాని అవతల ఎవరో, "అమ్మగారూ" అంటూ గట్టిగా పిలిచాడు.
    మనోహర్ చప్పున వదిలేశాడు?
    మజ్జిగ తీసుకోకుండానే గిన్ని తీసుకొని మరో ద్వారం గుండా పరిగెత్తుకు వచ్చింది పారిజాత. అడుగులు భూమి మీద పడుతున్నట్టుగా లేవు! స్వర్గంలో తేలుతున్నట్టుగా ఉంది. ఆనందపు వరదలో కొట్టుకుపోతున్నట్టుగా ఉక్కిరి బిక్కిరిగా ఉంది. పక్కమీద బోర్లా పడిపోయి నవ్వసాగింది.
    "పిచ్చిదానిలా ఏమిటా నవ్వు ఒక్కదానివే?" లలిత ఆశ్చర్యంగా ప్రవేశించింది.
    "........." పారిజాత ఒకటే నవ్వసాగింది.
    "అబ్బ! నా క్కొంచెం చెబుదూ! ఏమిటా నవ్వు?"
    "స్వర్గం వచ్చి నీ ఒడిలోవాలితే నువ్వూ ఇలాగే నవ్వుతావు!" కళ్ళలో నీళ్లు తిరిగిపోతుంటే అంది.
    "స్వర్గం వచ్చి ఎక్కడైనా మనిషి ఒడిలో వాలుతుందా? అదేమైనా పావురమా ఏమిటబ్బా?" బుగ్గన వేలుంచుకొంది లలిత.
    పారిజాత గబుక్కున లలితను వాటేసుకొంది.  "నీ వాక్కు ఫలించింది, తథాస్థు దేవతా!"
    "ఏమిటి? మొన్నయితే పెళ్ళిళ్ళ పేరయ్యలా రెండో సంబంధం వాడిని నీకోసం తీసుకువచ్చాడు!"
    "అదంతా నాకు తెలీదు?"
    "పెళ్ళి చేసుకొంటానన్నాడా?"
    "అనలేదు కౌగిలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు పెదవులమీద!"
    "పెళ్ళి చేసుకొంటానని చెప్పకుండానే పెదవుల మీద ముద్దు ఎలా పెట్టుకోనిచ్చావు?"
    "ప్రేమించకపోతే. పెళ్ళి చేసుకొనే ఉద్దేశ్యం లేకపోతే మనూ అలా......"
    "ఎంత అమాయకురాలివి పారూ! అతడి ఉద్దేశ్యమేమిటో తెలుసుకోకుండానే ఒంటిమీద చెయ్యి ఎలా వెయ్యనిచ్చావు? అతడు నిన్ను ప్రేమిస్తే వేరే సంబంధాలెందుకు తీసుకువస్తాడు! ఈ మగవాళ్ళకి పెళ్ళి వేరు. అవసరం వేరు."
    పారిజాత ముఖం వెలవెలబోయింది సంతోషపారవశ్యాలు క్షణంలో భయాందోళనలుగా మారిపోయాయి.
    "అమాయకమైన నీ ప్రేమ నిన్ను దగాపడిన అమ్మాయిగా మిగిల్చేలాగుంది , పారూ!"
    "ఛ! మనోహర్ అలాంటివాడు కాదు, లలితా?"
    "మనుష్యుల్లో ఎవరూ దుష్టులుండరు. అవకాశం అవసరం మనిషిని దుష్టుడిగా మారుస్తాయి. ఏం? నువ్వు తనకు సులభంగా చిక్కేలా ఉంటే మనోహర్ నిన్నెందుకు వదులుకొంటాడు? అనుభవం కోసం నిన్ను? జీవితంకోసం వేరొకరినీ కోరితే నీ కప్పుడు దారి ఏమిటి చెప్పు? మీ నాన్న ఏ గంగలో దిగుతాడు వెళ్ళి? అందుకని నిన్ను జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. అతడు మనసు పడి వివాహమాడితే అంతకంటే కావలసింది లేదు. ఈలోగా మాత్రం నువ్వతడికి చిక్కిపోవద్దు?"

 Previous Page Next Page