"నువ్వు చెప్పలేదుగాని. ఇంత అనర్ధం నీవల్లేకదా జరిగింది?" కొరకొరా చూసింది పారిజాతకేసి. "బిడ్డడి అదృష్టం బాగుండబట్టి సమయానికి వాడి స్నేహితులువచ్చి అడ్డుపడ్డారు.గాని లేకపోతే ఆ గూండాలు ఏ కీలు కాకీలు విరగ్గొట్టి ఏ కారు క్రిందకో త్రోసిపోయేవాళ్లు!"
"మనూ గదిలోనే ఉన్నాడా? దెబ్బలు బాగా తగిలాయా?" ఇక ఆగలేనట్టుగా మనోహర్ కోసం పైకి బయల్దేరింది పారిజాత.
అలా వెడుతున్న పారిజాతను కంపరంగా చూచింది కోమలమ్మ. ఇదివరకు ఆ పిల్ల అంటే ఉండే ఆప్యాయత స్థానంలో ఈర్ష్యలాంటి భావమేదో చోటుచేసుకో సాగింది. మనూ మనూ అనివెంట తిరిగి వాడిని వల్లో వేసుకోదుకదా? అనుకొంది. ఏమైనా దీన్ని కొంచెం దూరంలోనే ఉంచాలి? చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోవాలి!
మనోహర్ గదిలో మంచం మీద విశ్రాంతిగా పడుకొని ఉన్నాడు.
"మనూ!" పారిజాత సమీపించింది. "దెబ్బలు బాగా తగిలాయా?"
"వెక్కిరిస్తున్నావా?"
"నీకూ కోపంగానే ఉందా నేనంటే?" పారిజాతకు కళ్ళనీళ్ళు తిరిగినంత పనైంది. "ఇందులో నేను చేసిన తప్పు ఏముంది. మనూ?అత్తకూడా తిట్టింది!"
మనోహర్ మెత్తబడిపోయి, "నువ్వు తప్పుచేశావని కాదు పారూ! నీ మూలంగా నాకీ అవస్థపట్టిందని నాకేం బాధలేదు. నువ్వు చదువు మానేసి ఇంట్లో కూర్చోవడం మాత్రం నాకు బాధగా ఉంది."
"అయితే రేపటినుండి బడికి వెళ్ళనా?"
పారిజాత అమాయకంగా తనేం చెప్పినా కాదనలేనట్టుగా అడుగుతోంటే మనోహర్ పూర్తిగా కరిగిపోయాడు. ఒకక్షణం ఆ పిల్ల ముఖంలోకి నిదానించి చూసి "వద్దులే, పారూ?" అన్నాడు.
"ఎందుకు?"
"నీలాంటి అందమైన ఆడపిల్ల బ యటకాలు పెడితే ఇలాంటి కష్టాలే ఎదురౌతాయి. నిన్ను రక్షఇంచుకోడానికి మీ నాన్నగారికి అంగబలమూ అర్ధబలమూ రెండూ లేవు!"
తన సౌందర్య ప్రసక్తి తనకు ప్రియమైన వ్యక్తినుండి రావడంతో పారిజాత బుగ్గల్లో రోజారంగు లీనాయి. తల క్రిందికి వాలిపోయింది.
మనోహర్ లేచి కూర్చోబోయి. "అబ్బా" అన్నాడు కాలుపట్టుకొని
పారిజాత చటుక్కున వంగి అతడికాలు పట్టుకొని చూచింది. మోకాటి దగ్గర బాగా ఎర్రగా వాచిపోయి ఉంది. "ఇంత బాధనూ, ఇంత అవమానాన్నీ నువ్వు నావల్ల పొందినవే కదూ?" వణికే కంఠంతో అంది.
తెల్లగా, పొడవుగా ఉన్న వేళ్లు తన కాలిని పట్టుకు చూస్తూంటే మనోహర్ ఎలాగో అయిపోయాడు! ఒక స్త్రీ అందమైందని చెప్పాలంటే ఆమెపాదాలూ, హస్తాలూ చూస్తేచాలట!
పారు హస్తాలు ఎంత మృదువుగా అందంగా ఉన్నాయి!
పదహారేళ్ళ వయసు! కన్నె వయసు! యవ్వనం ప్రోగు చేసుకొంటున్న వయసు! మొగ్గ విచ్చుకొంటున్న వయసు! పురుషుణ్ని ఉన్మత్తుణ్ని చేసే వయసు!
ఈ రోజు సాయంత్రం పెళ్ళిమాటలకు తను మధ్యవర్తియై రామ్ ను తీసుకువెడతానన్న సంగతి గుర్తువచ్చింది అతనికి. అతడి మనసులో ఎక్కడో కలుక్కుమంది. ఈ అందాలరాణిని తన చేతులమీదుగానే మరొకరికి సమర్పిస్తున్నాడా? తను తలచుకొంటే ఈ సౌందర్యం తనది కాదూ పెళ్ళి చేసుకొంటానంటే మాస్టారు ఎగిరి గంతువేసి తన కివ్వడూ ఈ పిల్లను! అమ్మో! తను ఎలా ఆలోచిస్తున్నాడు! అమ్మ అంగీకరిస్తుందా పారూను కోడలిగా చేసుకోడానికి! ఎంత అసంభవమైన కోరిక! దీన్ని పెరగనిస్తే ఎన్ని అనర్ధాలు సంభవిస్తాయి!
* * *
"రేప్రొద్దుటికి పంచదార లేదన్నావు కదా? సంచీ ఇలా ఇవ్వమ్మా! బజారుకు వెళ్ళి వస్తాను!"
కూతురు చేతినుండి సంచి అందుకొని, వెళ్ళబోయాడు కృష్ణారావు.
మనోహర్ తనమిత్రుడితో గది బయట కనిపించాడు.
"ఒక్కమాట మాస్టారూ?" మనోహర్ ముందుగా గదిలోకి వచ్చి స్నేహితుడిని పిలిచాడు. "మీరు కొంచెం కూర్చోండి. మాస్టారూ!"
"ఏమిటి బాబూ?"కృష్ణారావు అయోమయంగా చూశాడు.
"రామ్! లోపలికి రా!"