దార్కాకి రెండోరోజు అర్ధమయింది, తను రాష్ట్రంలో కొంచెం దూరం ముందుకొచ్చేసేడని, ఆంధ్రలో మొట్టమొదటి పట్టణం విజయనగరం అనుకున్నాడు. పార్వతీపురం, బొబ్బిలిలో కూడా కళాశాలలు వున్నట్టు తెలిసింది వెళ్ళి పరిశీలించి వచ్చేడు. తులసి అన్న పేరున్న అమ్మాయి దొరకలేదు. పొద్దున్నే వెళ్ళి సాయంత్రం విజయనగరం వచ్చేసేవాడు.
చూస్తూ వుండగానే పదిరోజులు గడిచిపోయాయి. అనుకున్నదాని కన్నా చాలా తొందరగా చదువు నేర్చుకుంటున్నాడు దార్కా. తెలుగేకాదు., ఇంగ్లీష్ కూడా. అక్షరాల్ని కూడబలుక్కుని చదవడం - ఇంగ్లీషు పదాల్ని అర్ధం చేసుకోవడం కూడా తొందర్లోనే అలవడింది. అతడు ఒక్కనిముషం కూడా వధాపరిచేవాడు కాదు. చాలా తక్కువసేపు నిద్రపోయేవాడు. ఇంటిపని చేస్తూ కూడా చదువు గురించే ఆలోచించేవాడు.
ఆ రోజు అమావాస్య!
రాత్రి దాదాపు పన్నెండు అవుతూ వుండగా అతడు లేచాడు. ఒక పని మిగిలిపోయింది. టికెట్ కలెక్టర్ మీద కసి తీర్చుకోవడం ..... అతడు అసలు ఆ పని మొదటి రోజే చేయవలసింది నిజానికి మంత్రగాళ్ళు తమ పనులు నిర్వర్తించడానికి అమావాస్య, పూర్ణమి అని ఏమీ లేవు కానీ బాగా చీకటిగా వుంటుందనే వాళ్ళు అమావాస్య ఎన్నుకుంటారు.
అతడు స్మశానం చేరుకునే సరికి రాత్రి పన్నెండయింది. అతడికి అది కొత్తగా వుంది. బిస్తా గ్రామపు స్మశానాన్ని మాత్రమే చూసేడు అతడు. అయినా దాని గురించి పట్టించుకోకుండా తన పనికి ఉపక్రమించేడు.
తనతోపాటు తెచ్చిన మట్టిని దొప్పలో వుంచి దక్షిణ దిక్కుగా కూర్చున్నాడు. నడుము గుడ్డలోంచి చిన్న గుడ్డ తీసేడు కాలి మట్టి దాని కాళ్ళకు రాసేడు. చిన్న గొయ్యి తీసి, ఆ బొమ్మని నడుము వరకూ పాతి పెట్టాడు. అతడు ఈ పనిని చాలా సునాయాసంగా చాలా అనుభవజ్ఞుడైన డాక్టరు ఒక చిన్న టాన్సిల్స్ ఆపరేషన్ ఎంత సులభంగా నిర్వర్తిస్తాడో అలా చేస్తున్నాడు.
నిజానికి ఇది అతడికి చాలా చిన్న విద్య కాష్మోరా నేర్చినవాడికి చేతబడి......
అతడు దక్షిణం దిక్కుగా తిరిగి మంత్రం చదవబోతుంటే అఫ్పుడు పడింది అతడి భుజంమీద చెయ్యి. మెరుపులా వెనక్కి తిరిగాడు.
వెనుక ఆచార్యులవారు నిలబడి వున్నారు.
అతడు విస్మయంనుంచి తేరుకోవటానికి నిముషం పట్టింది. నిజానికి చేతబడి చేస్తున్న మాంత్రికుణ్ని ఎవరయినా చూసినా, ఆపినా అలా చూసినవాణ్ని మంత్రగాడు చంపడమో, తను చావడమో చేస్తాడు, ప్రాణాలతో వదలడు.
కానీ ఇక్కడ వున్నది గురువయిన ఆచార్యులు. గాఢమయిన నిశ్శబ్దంలో కొద్దిగా కదిలి "ఇప్పుడు చెప్పు- ఎవరు నువ్వు?" అడిగాడాయన.
దార్కా మాట్లాడలేదు.
"ఒరిస్సా నుంచి ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఈ స్మశానంలో నీకేం పని? మా కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికే ఈ రాత్రి ఇలా వచ్చావు కదూ?" ఆయన కంఠం అతణ్ని నిలదీసింది.
కర్కోటకుడూ -కారుణ్యం లేని మాంత్రికుడు అయిన దార్కాయే ఈ మాటలకి కదిలిపోయేడు.. "నేనా .... మీ కుటుంబాన్నా...." అన్నాడు విచలితుడై..... "ఎందుకు?"
"మరి ఏమిటి ఈ పని?"
"ఆ రోజు అన్యాయంగా నన్ను కొట్టిన ఆ టికెట్ కలెక్టర్ అంతం చూడడానికి."
"చేతబడి చేస్తున్నావ్ కదూ" సూటిగా అడిగాడు "దార్కా! అసలు నువ్వెవరు?"
దార్కా చెప్పాడు తమ పూర్తి మాంత్రికుడ్ని ముగ్గురు చంపిన సంగతీ -తన పగ సంగతి అంతా చెప్పి అన్నాడు -" ఆ టికెట్ కలెక్టర్ నా గురించి ఏమనుకున్నాడు? అంతు తేల్చందే నేను వూరుకోను"
"అంత గొప్పవాడివా నువ్వు?"
"కాష్మోరా ప్రయోగించగల ఏకైక మాంత్రికుణ్ని"
"ఎంతో నిష్టతో మంత్రాన్ని నేర్చిన నీకే ఇంత అహం వుంటే, ఒక మామూలు మనిషైన ఆ టికెట్ కలెక్టర్ కి ఎంతుండాలి? అందుకే అతడు నిన్ను కొట్టేడు. మంత్రంలో రుషత్వం పొందిన నువ్వు అతణ్ని క్షమించలేవూ!"
దార్కా మాట్లాడలేదు.
"ప్రపంచంలో ఎవరూ సాధించలేనిదీ, చేయలేనిదీ అయిన కాష్మోరాని నీ చెప్పుచేతుల్లోకి తీసుకోగలిగిన ఓ మహా మాంత్రికుడా! ఈ ప్రేక్షకుడికోసం నీ విద్యల్లో ఒకదానిని ప్రదర్శించగలవా?"
ఆ మాటతో దార్కా కదిలేడు. అతడి మొహం మామూలుగా మారిపోయింది. అవే కళ్ళు, నిస్తేజంగా.... ఉన్నట్టుండి అతడు కేక పెట్టేడు. అది ధ్వనించి.... ప్రతి ధ్వనించింది..... దిగంతాల్లో మార్మోగింది. స్మశానం కదిలిపోయింది. అతడి పూర్వీకులైన కాద్రా, విషాచీల ప్రేతాత్మలు కూడా భయంతో వణికిపోయేలా వుంది ఆ కేక......
అతడు చూపుడు వేలుతో ఒక వృక్షాన్ని చూపిస్తూ అన్నాడు.
"నా సేవల్తో సంతుష్టుడై రురుడ్ని నేను పిలుస్తాను, కళకళ లాడుతున్న ఈ మర్రిచెట్టుని క్షణంలో మసి చెయ్యమని ఆజ్ఞాపిస్తున్నాను" అని మౌనం వహించేడు. అతడి పెదవులు అస్పష్టంగా కదిలేయి. మొదటి అక్షరం 'మ' మరో అక్షరం "హ" -ఇలా అతడి మంత్రం పూర్తయింది.
గాలిలో చిన్న కదలిక క్షణంలో ఉధృతం అయింది. ప్రేతాత్మలు గుసగుసలాడుతున్న ధ్వని.
కానీ అంతలో మళ్లీ మామూలు వాతావరణం నెలకొంది. చెట్టు అలాగే వుంది ఆచార్యులవారు అలాగే చూస్తున్నారు.
దార్కా మొహం ఎర్రబడింది. మరోసారి మంత్రం పఠించేడు. కానీ చెట్టులో ఏ మార్పూలేదు. అంచెలంచెలుగా పెద్ద పెద్ద దేవతలందర్నీ పిలిచాడు. రురుడు - కాలుడు- రుద్రుడు -భైరవుడు.
అతడిలో కసి పెరిగిపోతూంది. ఆవేశంతో వూగిపోతూ అధిష్టాన దేవత "క్షిత్" నే ఎలుగెత్తి ఆహ్వానించాడు. క్షిత్ కూడా పూజ్యము పవిత్రము అయిన స్థలానికి రావడానికి భయపడ్డట్టు మౌనం వహించింది.
దార్కా మోకాళ్ళ మీద కూలిపోయేడు. సర్వశక్తి సంపన్నుడనని అనుకుంటున్న ఆ మహా మాంత్రికుడు, సామాన్యంగా కనబడే ఒక పండితుడి ముందు ఓడిపోయాడు. తలవంచి అన్నాడు."పదహారు సంవత్సరాల ఆకుంఠిత దీక్షతో నేనెంతో నేర్చుకున్నానని అనుకున్నాను. కానీ ఇంకా నేర్చుకోవలసింది చాలా వుందని అర్దమయింది. ఇరవై రెండు అంశాల క్షుద్ర దేవతలకన్నా గొప్ప దేవత ఎవరు మీ చెప్పు చేతల్లో వున్నారు? కాష్మోరా, క్షిత్ లను కూడా శాసించగల ఏ దేవతని మీరు పూజిస్తున్నారు? చెప్పండి."