ఆమె కంటినుండి ఒక నీటి బిందువు జారి ఆమె మోచేతి నీడ పడింది.
అది చూసిన ఆయన మనస్సు ఒకింత ద్రవించింది. చైర్ లోంచి లేచి ఆమె ప్రక్కనే కూర్చున్నాడు.
ఆమె తల మీద చేయి వేశాడు అనునయంగా.
ఆ సంభాషణని అక్కడి తోటే కట్ చేద్దామనుకున్న ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు.
ఆమె మనస్సులోని బాధ వినాలని నిర్ణయించుకున్నాడు.
"అర్చనా!"
ఎడమచేతి చూపుడువేలితో కంటినుంచి జారుతున్న నీటిచుక్కని తుడిచి, ఆయనవైపు తిరిగిందామె.
"నీ బాధ నేను అర్ధం చేసుకోగలనమ్మా! ఎందుకంటే పుత్రశోకం అంటే ఎలా వుంటుందో నాకూ తెలుసు. పాతికేళ్ళ వయస్సు వచ్చాక నా పెద్ద కొడుకు బ్రెయిన్ హెమరేజ్ వల్ల చనిపోయినప్పుడు నేను మానసికంగా అనుభవించిన క్షోభ మీ అత్తయ్య పడ్డ చిత్రవధ నాకు బాగా తెలుసమ్మా! ఈ రోజున మీ అత్తయ్య ఆరోగ్యం అంతంత మాత్రంగా తయారవటానికి కారణం కూడా అదే."
ఆమె నేలచూపులు చూస్తోంది.
"మాకు కూడా చాలా కాలంవరకు నా కొడుకు చనిపోయాడన్న నిజాన్ని నమ్మబుద్ధి అయ్యేదికాదు. వాడు బ్రతికే వున్నట్లు....మా మధ్యనే తిరుగుతున్నట్లు అనిపించేది. వాడి జ్ఞాపకాల నుంచి దూరమయి మామూలు అవటానికి చాలా సంవత్సరాలు పట్టింది."
నిర్లిప్తమైన చూపులు చూస్తోంది ఆమె.
"నీకు కూడా పవన్ తాలూకు కలలు వస్తు వుండవచ్చు. పవన్ బ్రతికే వున్నట్లు....ఈ గదులలో తిరుగుతున్నట్లు అనిపించవచ్చు....అంతేనా!"
కాదన్నట్లు తల అడ్డంగా వూపిందామె.
"మరి?" అర్ధంకానట్లు చూశాడాయన. అలా అన్నప్పుడు ఆయన కనుబొమ్మలు పైకి ఎగరేశాడు అలా చేసినప్పుడు ఆయన నుదుటి మీద నాలుగు గీతలు స్పష్టంగా ఏర్పడి తిరిగి మాయమయ్యాయి.
"అది....అది....ఎలా చెప్పాలో తెలియటంలేదు."
"అంటే...."
"ఏవేవో సంఘటనలు...."
"అర్ధం అయ్యేలా చెప్పమ్మా?"
"అది....ఒక నిమిషం" అని లోపలి గదిలోకి వెళ్ళింది ఆమె.
ఏం చెప్పబోతోందో అని వుత్కంఠతో ఎదురుచూస్తున్నాడాయన.
నిమిషం తరువాత తిరిగి వచ్చిందామె.
ఆమె చేతిలో రెండు కాయితాలున్నాయి.
ఆ రెండిటినీ ఆయన చేతికిచ్చింది అర్చన.
కళ్ళజోడు సర్దుకుని ఓ క్షణంపాటు ఆ పేపర్లని తేరిపార చూసాడాయన.
"నేను చావలేదు."
"ఈ కాయితాలేమిటి? నాకేం అర్ధంకావటంలేదు" అన్నాడు ఒకింత అయోమయంగా చూస్తూ.
"నాకూ అర్ధంకావటంలేదు అంకుల్" అంటూ జరిగిన విషయం చెప్పింది.
అంతా విని నవ్వాడాయన.
ఇదంతా చాలా సిల్లీగా వుంది అన్న అర్ధం కనిపించింది ఆ నవ్వులో.
"చూడు అర్చనా! ఈ స్లిప్స్ ఎవరయినా రాసి పడెయ్యచ్చు కదా!"
"కానీ హేండ్ రైటింగ్ అచ్చంగా పవన్ రాసినట్లే వుంది అంకుల్."
"దానిదేముందీ? పవన్ బ్రతికి ఉన్నప్పుడే ఏదో ఆటల్లో ఆ స్లిప్స్ రాసి పడేసి వుండవచ్చు కదా! అవే ఈ రోజు దొరికాయేమో?"
ఆ సమాధానంతో ఆమె తృప్తిపడినట్లనిపించలేదు.
"అది కాకపోతే....నిన్ను ఆట పట్టించడానికి ఎవరయినా ఈ పని చేస్తున్నారేమో! అంతే కానీ....ఆ కాయితాలు పట్టుకుని పవన్ బ్రతికే వున్నాడేమో అనే ఆలోచన రావటం కూడా సరయినది కాదేమో!"
ఆమె అటూ ఇటూ పచార్లు చేస్తోంది.
సోఫాలోంచి లేచి ఆమెను సమీపించాడు శేషగిరిరావు.
"చూడమ్మా! నేనోమాట చెప్పనా!"
ఏమిటన్నట్లు చూసిందామె.
ఏమీలేదు. ఒంటరితనం వల్ల పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. మానసిక అశాంతికి కారణం ఈ ఏకాంత జీవితం. నా మాట విని, నాలుగు రోజులపాటు మా ఇంటికిరా! నా ఇంట్లో అయితే నలుగురు మనుషులున్నారు. కొంచెం కాలక్షేపం అవుతుంది. కనీసం....ఇటువంటి అర్ధంలేని ఆలోచనలు పెట్టుకునే అవకాశం వుండదు."
"అంకుల్! ఒకసారి....ఆ శ్మశానంలో బాబుని ఖననం చేసిన చోట తవ్వించి చూస్తే"
"అర్చనా! ఆర్ యు మేడ్ ఐసే? సంవత్సరం క్రిందట పాతిపెట్టిన చోట చూస్తే ఏముంటుంది? అయినా అలా తవ్వటానికి నీకు పర్మిషన్ ఎవరిస్తారు?" అసహనంగా మారాయి ఆయన స్వరం, చూపులు కూడా!
"పర్మిషన్ అప్లై చేస్తే?" తిరిగి ఆమె అడిగింది.
తల పట్టుకొని సోఫాలో చతికిలపడ్డాడు ఆయన.
అర్చన మానసిక స్థితి సరిగాలేదు. అందుకే ఇలా మాట్లాడుతోంది. కొన్నాళ్ళపాటు ఆమెని ఒంటరి జీవితం నుంచి దూరంగా తీసుకువెళ్ళాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడాయన.
బట్ షి ఈజ్ పర్ ఫెక్ట్ ఆల్ రైట్....ఆమె మానసిక స్థితి మామూలుగానే వుందని....ఒంటరితనం వల్ల ఆమెలో వస్తున్న పిచ్చి ఆలోచనలు ఏ మాత్రం కావు....అని ఆయనకీ తెలియదు.
* * * *
"థాంక్యూ సోమచ్. మేము వెళ్ళివస్తాం" అంటూ లేచి నిలబడ్డారు రామకృష్ణ, విజయరామ్ లు. అలాగే అన్నట్లు తలూపింది సంజు.
రెండు గంటల పాటు ఎయిర్ పోర్ట్ బయట పడిగాపులు పడి, తీరా ఎయిర్ పోర్ట్ లోకి వెళ్ళేసరికి ఫ్లయిట్ వచ్చేసింది కాని ఆమె కనిపించలేదు.
పాసింజర్సు అంతా వెళ్ళిపోయారు.
తమలాగే మ్యూజిక్ ప్రోగ్రాం ఆర్గనైజర్స్ కూడా వచ్చారు. వాళ్ళకీ ఆమె కనబడలేదు. ఎయిర్ పోర్ట్ లో పాసింజర్సు లిస్ట్ ప్రకారం ఆమె ఫ్లయిట్ ఎక్కింది. ఇక్కడ దిగింది. అయితే లగేజ్ కూడా కలెక్ట్ చేసుకోలేదు. ఏమయిందో అర్ధంకాలేదు. మరో రెండు గంటలపాటు పడిగాపులు పడి, ఒకవేళ హోటల్ రూమ్ కి వెళ్ళిపోయిందేమోనని ఎంక్వయిరీ చేస్తే, ఆమె హోటల్ రూమ్ లో వుందని తెలిసింది. అందుకని కలిసి వెళదామని వచ్చారు ఇద్దరూ.
"రెస్ట్ లేదు....ఈ రోజుకి వదిలెయ్యండి. రేపు మాట్లాడుకుందాం" అని ఆమె చెప్పటంతో వెనుతిరిగారు ఇద్దరూ.
వాళ్ళు వెళ్ళగానే డోరు క్లోజ్ చేసి బెడ్ మీద వాలిపోయింది సంజు.
జరిగినది కలో నిజమో అర్ధంకావటంలేదు ఆమెకు.
ఓ వ్యక్తి తనని కత్తితో పొడిచి చంపాలని ప్రయత్నించడం....అదే సమయంలో తన వెనుక ఒక టాక్సీ ఆగటం అందులో ఉన్న డ్రైవర్ కారు వెనుక డోరు తెరిచి ఎక్కమనటం....ముందు వెనుక ఆలోచించకుండా కారులోకి తను ఎక్కెయ్యటం....కారు ముందుకు దూసుకుపోవటం....అన్నీ క్షణాల్లో జరిగిపోయాయి.
కారులో కూర్చున్న ఆమెకు కాళ్ళలో వణుకు తగ్గలేదు.
ఐదు నిమిషాలు ప్రయాణించిన తరువాత కుదుటపడింది ఆమె.
అప్పుడు ఆమెకొక అనుమానం వచ్చింది.
ఈ కారు కూడా ఆ వ్యక్తులదేనా!
తనని కిడ్నాప్ చేసి తీసుకువెళుతున్నారా?
ఈ అనుమానం వచ్చిన మరుక్షణం ఆమె గుండె ఝల్లుమంది.
"హూ ఆర్ యు?" అడిగింది ధైర్యం తెచ్చుకుంటూ.
కొంచెం తల తిప్పి ఆమెను చూసి తిరిగి రోడ్డువైపు దృష్టి సారించి "ఇంగ్లీష్ రాదు" అన్నాడు డ్రైవరు.
అప్పుడు గుర్తు వచ్చిందామెకు తను తెలుగులో మాట్లాడాలన్న విషయం.
క్షణకాలం సర్దుకుంది.
ఆమె తిరిగి అడిగింది "ఎ....వరు....నువ్వు....చ....చం....పుతా....వా?" ఎండిపోతున్న పెదాలను నాలికతో తడుపుకుంటూ.
కొంచెం తల వెనక్కి తిప్పి లేదన్నట్లు తలాడించి తిరిగి దృష్టి రోడ్డు మీదికి సారించాడు.
"నేను....సంపేటోణ్ణికాను నిన్ను బచాయించేకి వచ్చిన....పరేషాన్ కావొద్దు" చెప్పాడు డ్రైవరు.
అతని భాషలో కొద్ది అక్షరాలు మాత్రం అర్ధమయ్యాయి ఆమెకు. తనకు తెలిసిన తెలుగు భాషలో అతను మాట్లాడిన మాటల్లో సగంమాటలు కూడా విన్నవి కాదు....మొత్తంమీద "నేను చంపను" అనే భావం మాత్రం అర్ధమయ్యింది.
"ఈయ్యాల హోంమినిస్టర్ వచ్చిండు. దానికొరకు పబ్లిక్ ని ఎయిర్ పోర్ట్ లోపటకి రానియ్యలే. ట్రాఫిక్ ని లోపటకి ఇడుస్తనే నేను వచ్చిన గాడ ఒకడు కత్తి తీస్కొని నిన్ను బగాయిస్తుండు....అది జూసిన....అందుకే జల్ది వచ్చి నిన్ను కార్లో కూసోబెట్టిన....నువ్వు ఎవరు? యాడ్కిబోవాలే?" అడిగాడు.
అతి కష్టంమీద ఆ తెలుగు భాష అర్ధంచేసుకుంటోంది ఆమె.
ఆమెకు ఇంకా అనుమానంగానే వుంది.
ఆ చూపుల్లోని భావాన్ని అర్ధంచేసుకున్నాడతను.
కారుని స్లో చేసి రోడ్డుకి ఎడమవైపు కొంచెం ఖాళీగా వున్న చోట ఆపాడు.
"గిట్ల సూడమ్మా! నిన్ను ఆ బాడ్కోవ్ గాండ్లనించి బచాయించెకే, నా టాక్సీలో ఎక్కించిన. నా మాట మీద భరోసా లేకుంటే....నువ్వు ఇప్పుడే కార్లోంచి దిగి ఎల్లిపోవచ్చు"డోరు తెరిచాడతను.