శంకర్ దాదా సింహం జూలు విదిలించినట్టు తల విదిలిస్తూ చక్రవర్తి మీదకు దూకాడు. కానీ చక్రవర్తి ఒడుపుగా ప్రక్కకుతప్పుకోవడంతో బోర్లా పడ్డాడు.
అతని ముఖం రోడ్డుని తాకి ముక్కు చిట్లి రక్తం బొటబొటా కారింది.
ఈలోపు ఒక దృఢకాయుడు చక్రవర్తి మీదకు దాడి చేశాడు.
అతనికన్నా వేగంగా కదిలిన చక్రవర్తి కుడికాలు అతని గుండెలను తాకడంతో వెర్రికేక వేస్తూ నాలుగు అడుగుల దూరంపోయి పడ్డాడు.
దాదాపు పది నిమిషాలపాటు జరిగిన పోరాటంలో శంకర్ దాదా, అతని మనుషులు చిత్తు చిత్తుగా ఓడిపోయారు.
"శంకర్ దాదా....మీ అందరికీ ఒకే ఒకగంట టైమ్ ఇస్తున్నాను. ఈ ఏరియాలోనే కాదు ఈ సిటీలో ఎక్కడ కనిపించినా మీ శవాలు హుస్సేన్సాగర్ లో తేలతాయి జాగ్రత్త...." క్రిందపడి మూలుగుతున్న శంకర్ దాదాకు వార్నింగ్ ఇచ్చి తన జీప్ వైపు అడుగులు వేశాడు చక్రవర్తి.
అంతమంది గూండాలను ఒకే ఒకవ్యక్తి మట్టి కరిపించి ధీమాగా వెళ్ళడం విడ్డూరంగా చూస్తున్నారు జనం....
కానీ, అతను రాణా మనిషి అన్న సంగతి ఎవరికీ తెలియదు....
ఒక్క శ్రీప్రియకు తప్ప!
శంకర్ దాదా అక్కడకు వస్తాడనీ....సేఠ్ జీ అతని భరతం పట్టడానికి రాణా గ్యాంగ్ తో కాంట్రాక్ట్ కుదుర్చుకున్న విషయమూ....ఆ సమయంలో చక్రవర్తి అక్కడ అతనితో ఢీకొంటాడని ముందే వూహించిన శ్రీ ప్రియ.... భృకుటి ముడిపడింది.
ఆమె కళ్ళకు ఒక వస్తువు తళతళా మెరుస్తూ కనిపించింది.
అది కీ చెయిన్!
చక్రవర్తి నడుముకు చుట్టబడిన సైకిల్ చెయిన్ ను లాగుతున్న సందర్భంలో జారిపడింది. ఆ కీ చెయిన్ ను తన చేతిలోకి తీసుకున్నది శ్రీప్రియ!
దానిమీద "222 324" అనే నంబర్ వున్నది.
శ్రీప్రియ పెదవులపై చిరునవ్వు....!
* * *
ప్రియా....నువ్వు చెప్పేది నిజమా...."
ఆమె చెప్పిందంతా విన్న అలేఖ్య ఆశ్చర్యపోయింది.
"అవునే....అతని గురించి నేను అంతకుముందే విని వుండడం వలన నేను ఆశ్చర్యపోలేదు కానీ.... నిజంగా అంతమందిని ఒక్కడు మట్టి కరిపించడం గొప్ప థ్రిల్ గా వుందనుకో"
క్రితంరోజు నగలషాపులో జరిగిన ఫైటింగ్ గురించి వివరిస్తూ అన్నది శ్రీప్రియ.
"అలాగైతే ఆ హీరోను ఒకసారి చూడాల్సిందే...."
"ఈసారి అతను కనిపిస్తే తప్పకుండా నిన్ను ఫోన్ చేసి మరీ పిలిపిస్తాను సరేనా?"
"సరేలేవే....ఇక ఆ టాపిక్ వదిలెయ్....ఈ వూళ్ళో నేను వుండేది చాలా తక్కువ రోజులు..... ఎంతసేపూ ఆ కబుర్లేనా....మన గురించి ఏమైనా మాట్లాడవే మొద్దూ...." స్నేహితురాలిని విసుక్కుంది అలేఖ్య. ప్రముఖ బిజినెస్ టైకూన్ జగపతి ఒక్కగా నొక్క కుమార్తె ఆమె....
ఐదు సంవత్సరాల క్రితం ఒక అమెరికన్ తో పెళ్ళి అయిన దగ్గర నుంచి అమెరికాలోనే కాపురం చేస్తుంది అలేఖ్య.
ఏడాదికి ఒక్కసారి హైదరాబాద్ వస్తుంది.
వచ్చినప్పుడల్లా ఆమె తన ఫ్రెండ్స్ అందరినీ కలుస్తుంది.
ఆమెకున్న అతిముఖ్యమయిన స్నేహితులతో శ్రీ ప్రియ ఒకరు....గంట క్రితం ఆమెను ఇంటికి పిలిపించుకుని ఇద్దరూ కలిసి షికారుకు బయలుదేరి కబుర్లు చెప్పుకుంటున్నారు.
"చెప్పవే ప్రియా ఇన్నాళ్ళు ఎలాగడిపావే....పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నువ్వు నన్ను అసలు కలవనేలేదు....నిన్ను చూసి రెండేళ్ళయినా ఎన్నో సంవత్సరాలు అయినట్టుగా వుందే నాకు...." తాపీగా కూల్ డ్రింక్ తాగుతూ అన్నది అలేఖ్య.
ఆ సమయంలో ఇద్దరూ ఒక రెస్టారెంట్ లో కూర్చునివున్నారు.
"చెప్పడానికేముంది...."
"ఏమీ లేదంటే నేను నమ్మను....నువ్వు ఏ ఎడ్వంచర్ చేయకుండా ఇంతకాలం ఖాళీగా కూర్చుని వున్నావంటే నమ్మేటంత అమాయకురాలిని కాదు."
"ఎడ్వంచరా....?"
"అవును...."
"ఏమిటే, నువ్వు మాట్లాడేది....నేనేమిటి....ఎడ్వంచర్ చేయడమేమిటి?"
"అదేనే పిచ్చిమొద్దూ....ఎడ్వంచర్ అంటే ఎవరినైనా లవ్ చేశావా అని"
"ఒహ్....అదా....ప్రేమాలేదు....దోమాలేదు....అలాంటి వాటికి నేను దూరం అని తెలుసుకదా"
"అయితే మాత్రం....అసలు పెళ్లే చేసుకోవా ఏమిటే?"
"పెళ్ళికీ, ప్రేమకూ ఏమిటే సంబంధం....ప్రేమించకుండానే పెళ్ళి చేసుకోకూడదా ఏమిటి?"
"చేసుకోవచ్చు....కానీ ప్రేమించి చేసుకునే పెళ్ళే మంచి ఫలితాన్ని ఇస్తుంది"
పెళ్ళిలో ఫలితాలు కూడా వుంటాయా?"
"తప్పకుండా వుంటాయి. కొన్ని పెళ్ళిళ్ళు సడన్ గా జరిగిపోతుంటాయి. కాని తీరా పెళ్ళి అయ్యాక ఒకరి భావాలు మరొకరికి సరిపడక ఎన్ని కుటుంబాలు ఫెయిల్యూర్ కావడం లేదు? అందుకని నా ఉద్దేశంలో పెళ్ళికిముందే అమ్మాయి అబ్బాయి ఇష్టపడడం, ఒకరి భావాలు మరొకరు తెలుసుకోవడం చాలా మంచి పద్ధతి....నా ఉద్దేశంలో నీకయితే...."
"వూ....నాకయితే...."