అందుకే....ఎర్రబడ్డకళ్ళతో ఆమెవైపు చూశాడు.
"ఒసేయ్....నువ్వేమైనా దేవలోకం నుంచి దిగి వచ్చిన ఊర్వశినని అనుకుంటున్నావా నిన్ను కాపాడడానికి ఇక్కడ గంధర్వులు ఎవ్వరూలేరే....ఇది కలియుగం....నాకే ఎదురు తిరుగుతావా? ఆల్ రైట్....! నీ పొగరు చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తోంది పాపా....అందుకే ఇంత మంది ముందు నేను నిన్ను రేప్ చేయబోతున్నాను...."
ఒక్కొక్క అడుగు వేస్తూ శ్రీప్రియను సమీపిస్తున్నాడతను.
అంతకుముందు ఆమెను నెక్లెస్ సెలక్ట్ చేసి పెట్టమని రిక్వెస్ట్ చేసిన పెద్దమనిషి రప్ప వేయడం కూడా మరచిపోయి ఆమె అందాలకోసం గుడ్లు మిటకరించుకుని చూస్తున్నాడు.
ఒకటి....
రెండు....
మూడు సెకన్లు....
ఏం జరుగబోతుందోనన్న సస్పెన్స్ తో కస్టమర్ల గుండెలు అదురుతున్నాయి.
శ్రీప్రియలో ఆందోళన అధికం అయింది.
అతను అన్నంతపనీ చేస్తే అందరూ నోళ్ళు తెరుచుకుని చూసేవాళ్ళే తప్ప తనను కాపాడే ప్రయత్నం చేసేవాళ్ళెవరూ లేరు....
ఒక విధంగా తనే కావాలని అతనిని రెచ్చగొట్టింది....ఆపదకొనితెచ్చుకుంది!
ఎదురు దిరిగి వాళ్ళందరితో పోరాడే శక్తి తనకు లేదు. పైగా వాళ్ళు ఆయుధాలతో వున్నారు. తను ఒట్టి చేతులతో వాళ్ళను ఎదిరించి నిలువ గలదా?
కామంతో కళ్ళుమూసుకుని ప్రవర్తించే శంకర్ దాదాకు తనుతప్పని సరిగా బుద్ధి చెప్పి తీరాలి....అలాంటి కిరాతకులను నిలువునా నరికినా పాపం లేదు!
తన గొంతులో ప్రాణం వున్నంతవరకైనా వాళ్ళతో పోరాడడానికే ఆమె మానసికంగా సిద్దం అవుతోంది.
శంకర్ దాదా చేయి ఆమె పైట చెంగును అందుకోబోతున్న క్షణం అది....
శ్రీప్రియ నిలుచున్నా భంగిమలో ఎలాంటి మార్పులేదు....
కస్టమర్స్ నోళ్ళు విచ్చుకున్నాయి.
సేఠ్ జీ బోసినోరు ఆశ్చర్యంతో తెరుచుకున్నది.
సరిగ్గా అదే సమయంలోనే....
ఆ షాపు ముందు షడన్ బ్రేక్ తో ఆగింది చక్రవర్తి జీప్.
శంకర్ దాదాకు రాణా గురించి పూర్తిగా తెలుసు. అందుకే చక్రవర్తి ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షమైనా ఎలాంటి ఖంగారు పడిపోలేదు.
"హల్లో దాదా....ఏదో ఘనకార్యం చేయబోతున్నట్టున్నావు...."
వచ్చీరావడంతోనే చక్రవర్తి సూటిగా ప్రశ్నించాడు.
ఆమెను బలాత్కరించడానికి ముందుకు సాచిన చేతిని వెనక్కు తీసుకున్నాడతను.
చక్రవర్తి చూడడానికి సన్నగా, సింపుల్ గా కనపడతాడే తప్ప....అతను చేయి కలపడమంటూ జరిగితే ఏం జరుగుతుందో దాదా మనుషులందరకు బాగా తెలుసు.
అందుకే, ఆ క్షణంలో అక్కడ అతన్ని చూడడంతో చేష్టలుడిగిన బొమ్మల్లా నిలిచిపోయారే తప్ప అతనిపై ఎదురు దాడి చేయాలనే ఊహ వెంటనే కలగలేదు వాళ్ళకు....
సూటిగా పోయి శంకర్ దాదా ఎదుట నిలిచాడు చక్రవర్తి.
"ఎంత ధైర్యంరా నీకు....మా దాదా ఎదుటకు వచ్చి నిలబడే దమ్ములున్నాయా నీకు....చూస్తారేంటిరా....వీడి అంతు చూడండి" దాదా అనుచరుల్లో ఒకడు పెద్దగా అరిచాడు.
వాళ్ళు ఆయుధాలతో తనపై దాడిచేసే అవకాశాన్ని ఇవ్వదలచుకోలేదతను.
నడుముచుట్టూ చుట్టబడివున్న సైకిల్ చెయిన్ ను సర్రున లాగి మెరుపు వేగంతో అక్కడవున్న వాళ్ళందరినీ చెల్లాచెదురు చేసేశాడు.
ఆ అవకాశాన్ని వినియోగించుకుని అక్కడవున్న కస్టమర్స్ ఆ షాపులో నుంచి తప్పించుకుని బయటపడ్డారు.
కానీ, శ్రీప్రియ మాత్రం అక్కడే వుండిపోయింది.
శంకర్ దాదా ఆమె ఎదురుగా నిలిచి వుండడంతో ముందుకు కదిలే అవకాశం లేదామెకు.
పరిశుభ్రమైన అద్దాల మధ్య, ఆఖరుకు కాళ్ళకింద కార్పెట్ నుంచీ ఖరీదైన వస్తువులతో కూడి వున్న ఆ షాపులో చిన్నసైజు మొదటి ప్రపంచం యుద్ధం లాంటిది సభవించడంతో ప్రాణాలకన్నా ఎక్కువగా అక్కడ జరగబోయే భారీ నష్టం గురించి సేఠ్ జీ గుండెల్లో ఖంగారు మొదలైంది.
కానీ....
ఆ సేఠ్ జీ కూడా శంకర్ దాదాను లేపెయ్యమని డబ్బు ఇచ్చిన వాళ్ళల్లో ఒకడని చక్రవర్తికి తెలవడం వలన అతిసూక్ష్మంగా ఫైటింగ్ రంగస్థలాన్ని షాపులోనుంచి మెయిన్ రోడ్ మీదికి మళ్ళించాడు.
తన మనుషులను చిత్తుచేస్తున్న చక్రవర్తిని చూస్తున్న శంకర్ దాదాలో పౌరుషం చిందులు వేసింది.
శ్రీప్రియ విషయం తాత్కాలికంగా మరచిపోయి ఎనుబోతులా రంకెవేస్తూ చక్రవర్తితో ఢీకొన్నాడు.
పోరాటంలో ఉన్నది చక్రవర్తి ఒక్కడే....
అతని అనుచరులు మాత్రం జీప్ లో వుండే జరిగే తతంగాన్ని చూస్తున్నారు. ఏ మాత్రం అవసరం అయినా రంగంలోకి దూకడానికి సిద్దంగా వున్నారు.
చుట్టూ జనం పోగయ్యారు....
శ్రీప్రియ షాపులోనుంచి బయటకొచ్చి చక్రవర్తి పోరాటాన్ని అబ్బురంగా చూస్తోంది.