Previous Page Next Page 
కాంక్రీట్ జంగిల్ పేజి 14


    "నిన్న పదిమందిని ఎడాపెడా వాయించి ఇన్ డైరెక్టుగా నిన్ను కాపాడాడు అని చెప్పావే అతనే నీ జీవిత హీరో అయితే యు ఆర్ సో లక్కీ...."

    శ్రీప్రియ చేతిలోని కూల్ డ్రింక్ సీసా క్రిందకుజారి పాలీష్ బండలపై పడి భళ్ళున మ్రోగింది. తన మాటలకు అంతలా ఎందుకు ఉలిక్కిపడిందో అర్ధంకాక స్నేహితురాలివైపు ఆశ్చర్యంగా చూసింది అలేఖ్య.

    ఆ శబ్దానికి అటుగా వెళుతున్న బేరర్ గిర్రున వెనుదిరిగి వచ్చాడక్కడకు....

    "ఏమ్మా....సీసా పట్టుకోవడం చేతకాదా?" అన్నాడతను.

    అతని మాటలకు అలేఖ్యకు కోపం ముంచుకువచ్చింది.

    "ఏయ్ మిస్టర్....ఆ సీసా ఖరీదెంతో చెప్పు....అంతే తప్ప అనవసరంగా మాట్లాడకు"

    బేరర్ ఇక ఎలాంటి మాటలూ మాట్లాడే సాహసం చేయలేదు. సీసా పెంకులు తీయడంలో మునిగిపోయాడు.

    "ఏమిటే....నేనేం తప్పు మాట్లాడానని అలా ఉలిక్కిపడ్డావు" అన్నది అలేఖ్య స్నేహితురాలి ముఖంవైపు పరిశీలనగా చూస్తూ.

    "ఏదో లేవే....చేయి జారిపోయింది...."

    "అంతేనా....లేక....అతనికీ, నీకూ ఏదైనా ఎఫైర్ నిజంగానే వుందా?"

    "ఏమీ లేకపోయినా ఏదేదో ఉందనుకొని ఊహించే అలవాటు నీ కింకా పోలేదన్నమాట....సరేలే.... ఇప్పుడు అవన్నీ ఎందుకుకానీ, నాకు అర్జెంటుగా ఒక ఉద్యోగం కావాలి....నువ్వే ఎలాగైనా ఆ ఉద్యోగం ఇప్పించాలి..."

    "నీకు ఉద్యోగం చేయవలసిన ఖర్మ ఏం పట్టిందే....హాయిగా పెళ్ళిచేసుకోక...."

    "నీకేం తల్లీ నీకు అలానే అనిపిస్తుంది....నాలాంటి మధ్యతరగతి ఆడపిల్లల జీవితాలు నువ్వు ఊహించేటంతటి పూలపాన్పులు కావు....నీవల్ల అవుతుందా లేదా అనేది చెప్పు....లేదంటే నాపాట్లు నేను పడతాను"
 
    నిష్టూరంగా అన్నది శ్రీప్రియ.

    "ఐయామ్ సారీ ప్రియా....నిన్ను బాధపెట్టాలనికాదే....మీ మమ్మీ డాడీలు చనిపోయాక నువ్వు ఎవరి దగ్గరో వుంటున్నానని చెప్పినట్టు గుర్తు....ఆ ఆస్తులు అమ్మి మిగిలిన డబ్బు బ్యాంక్ లో వేసారని చెప్పావు. అందుకే అలా అన్నాను. జీవితంలో సెటిల్ అయ్యే ప్రయత్నాలు చేయాలి. కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేయడం ఎందుకని...."

    "ఫరవాలేదు అలేఖ్యా....నువ్వేమీ నాకు పరాయి దానివి కాదుగా....కన్నవాళ్ళు దూరంగా పోయిన క్షణం నుంచీ ఆయమ్మ నన్ను పెంచి పెద్దచేసింది. బ్యాంకులోవున్న డబ్బు తరిగిపోకుండా ఎన్ని సంవత్సరాలు వుంటుంది చెప్పు....డిగ్రీ అయితే పూర్తిచేయగలిగాను....ఉన్న ఆయమ్మ కూడా అనారోగ్యంపాలై ఈ మధ్యనే నన్ను వదిలివెళ్ళిపోయింది....నాకు ఇప్పుడిప్పుడే ఆర్ధిక ఇబ్బందులు తెలిసి వస్తున్నాయి. అందుకే ఈ నిర్ణయానికి వచ్చాను. ఏదో ఒక ఉద్యోగం చేయడం మీదే ఆధారపడివుంది నా భవిష్యత్...."

    "సారీ ప్రియా....ఏనాడో కలిసి విడిపోయాం....తీరా ఇప్పుడు కలిశాక నీ క్షేమాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను....రియల్లీ ఐయామ్ వెరీసారీ"

    "ఒక స్నేహితురాలిగా నా జీవితంలో ఇంతవరకూ నిన్ను ఏమీకోరలేదు. దయచేసి నాకు ఈ ఒక్క సహాయం చేసిపెట్టు. డాడీకి చెప్పి ఎక్కడో ఒకచోట ఎలాగైనా నాకు ఉద్యోగం ఇప్పించవే"

    "తప్పకుండా ప్రియా....స్నేహితురాలికి ఆ మాత్రం సహాయపడలేనా?....నువ్వేమీ కంగారుపడకు....ఇప్పుడే మా ఆఫీసుకు వెళదాం....నిన్ను ఎక్కడో కాదు....మా ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇవ్వమని మా డాడీని రిక్వెస్ట్ చేసి ఒప్పిస్తాను"

    ఇక వెళదాం అన్నట్టు మాటలు ముగించి అక్కడినుంచి శ్రీప్రియతో పాటు సరాసరి ఫ్యాక్టరీకెళ్ళింది అలేఖ్య.

    జగపతి కూతురిని చూసి తను చూస్తున్న ఫైల్స్ ను మూసేశాడు.

    "ఏంటి బేబీ....ఇలా వచ్చావు?"

    శ్రీప్రియ గురించి క్లుప్తంగా చెప్పింది అలేఖ్య.

    జగపతి కళ్ళు శ్రీప్రియ వైపు మళ్ళాయి.

    ఆమెను చూసీ చూడడంతోనే అతను ఒక్కసారిగా అదోలా అయిపోయాడు....ప్రక్కనే కూతురు వున్న సంగతి గ్రహించి తమాయించుకున్నాడు.

    శ్రీప్రియ కూడా అతనివైపు ఓరగా తల త్రిప్పిచూసింది.

    కొన్ని క్షణాలపాటు ఇరువురి చూపులూ కలుసుకుని విడిపోయాయి.

    అలేఖ్య తండ్రి జగపతి ఎవరోకాదు అంతకు ముందు శంకర్ దాదా నగల దుకాణంలో గొడవ పడినరోజున, తనను నగలు సెలెక్టు చేయమన్న పెద్దమనిషి!

    అతనుకూడా ఆమెను గుర్తించాడు కానీ తెలియనట్టే ప్రవర్తించాడు....

    "సో....ఉద్యోగం ఇవ్వక తప్పదంటావు" అన్నాడతను కుమార్తెతో....

    "తప్పదు డాడీ....నా ప్రాణస్నేహితురాలు అని చెబుతున్నానుగా"

    "ఒకే....డన్....నీ రికమెండేషన్ కాదనగలనా? ఈమెను నా పర్సనల్ సెక్రటరీగా అపాయింట్ చేసుకుంటున్నాను. రేపే వచ్చి ఉద్యోగంలో జాయిన్ కావచ్చు....సరేనా?" చెప్పాడతను కోటు మడతలను సరి చేసుకుంటూ.

    "థాంక్యూ డాడీ....థాంక్యూ వెరీమచ్...."

    తండ్రి బుగ్గలమీద ముద్దుపెట్టుకున్నది అలేఖ్య.

    తండ్రి కూతుళ్ళ అనురాగాన్ని ఆసక్తిగా చూస్తుండిపోయింది శ్రీప్రియ.

    "నీకు ఉద్యోగం దొరికిందిగా....ఇకనైనా సాయంత్రంవరకూ నాకు కంపెనీ ఇస్తావా?" శ్రీప్రియ వైపు చూస్తూ అడిగింది అలేఖ్య.

    "ఓకే....ష్యూర్...."

    "వెళ్ళివస్తాం డాడీ...." చెప్పి బయలుదేరింది అలేఖ్య.
 

 Previous Page Next Page