Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 10

 

    "ఇక్కడే చావుదెబ్బతింది గదురా నీ అయిడియాలజీ! మనక్కావలసిన కాపిటలిస్ట్ లు క్షేమంగా ఉండాలి! మన కక్కర్లేని వాళ్ళు చావాలీ అనటం వల్లే కమ్యూనిజం గతి అలా అయిపోయింది అయినా అయిడియాలజీ అంతా ఈ కాపిటలిస్ట్ ఇంట్లో చికెన్ కర్రీ తినేప్పుడేమయిందంటావ్?"

    "నువ్వు నా స్నేహితుడివి కాబట్టి తిన్నాన్రా" నవ్వుతూ అన్నాడు.

    రాజశేఖరం కూడా నవ్వేడు.

    మరికాస్సేపు చిన్ననాటి కబుర్లు చెప్పుకున్నాక కనకారావ్ ఇంటికెళ్ళిపోయాడు.


                        *    *    *    *    *

    హైద్రాబాద్ నగరంలో ప్రపంచంలో మరే నగరంలోనూ లేని సొగసొకటుంది.

    అదేమిటంటే ఎన్ని లక్షలమంది గూండాలకయినా సరే చేతినిండా పని వుంటుంది. నగరానికున్న ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క గూండా కూడా ఏ ఒక్కరోజూ పస్తుండలేదు. ఏ ఒక్క గూండా కూడా ఎంత పెద్ద నేరం చేసినా ఎక్కువ రోజులు జైల్లో గడపలేదు. ఏ ఒక్క గూండాకు ఎన్ని మర్డర్లు చేసినా ఉరిశిక్ష పడలేదు.

    తమ నగరానికి చెందిన గూండాలను అక్కడి ప్రజలు అంత ఆదరంగా చూసుకుంటారు. అంత గారాంగా పెంచుకుంటారు వారిని అక్కడి రాజకీయ నాయకులు. ఏ పండగొచ్చినా అక్కడి పోలీసులు, రాజకీయ నాయకులు కలిసి గూండాలతో ఉన్నత సమావేశం జరిపి ఆ పండగ ఎలా జరపాల్సిందీ సలహాలు తీసుకుంటారు.

    అంత సెంటిమెంటుంది గూండాలకూ, పరిపాలకుల మధ్య.

    అలాంటి నాలుగొందలేళ్ళ సుందర నగరంలో మల్లేష్ కూడా ఒకడు. అయితే మల్లేష్ లో విచిత్రం ఏమిటంటే అతను గూండా అవ్వాలనుకుని అయినవాడు కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల గూండా చేయబడ్డాడు.

    తల్లీ తండ్రీ లేని మల్లేష్ ధ్యేయం ఒక్కటే! ఎప్పటికయినా రాజకీయ నాయకుడవటం.

    తమ ఏరియాలో గూండాలందరూ రాజకీయ నాయకుడి ముందు రోజూ చేతులు కట్టుకుని నిలబడటం అతను చూశాడు. వాళ్లు వెళ్ళిపోయాక పోలీసులు, పోలీసు అధికారులూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడటం కూడా అతను చూశాడు.

    అయితే తన కోరిక ఎలా తీరుతుందో తెలీలేదు. హఠాత్తుగా ఓ రోజు గాలీ వానకు అతని గుడిశె ఎగిరిపోయింది. ఉండటానికి కూడా గూడు లేని పరిస్థితిలో రెండు దుప్పట్లు చిన్న టెంట్ లాగా వేసుకుని అందులో వున్నాడతను.

    ఆ స్థలం ఓనరెవరైనా ఖాళీ చేయమంటే చేయడానికి సంసిద్ధంగా కూడా వున్నాడతను.

    మర్నాడు ఓ వ్యక్తి కారుదిగాడు తిన్నగా మల్లేష్ దగ్గర కొచ్చాడు.

    "ఈ స్థలం నాది- ఎవర్నడిగి గుడిశె వేశావ్?" అనడిగాడతను.

    "ఎవర్నీ అడగలే! నేనే ఏసినా" అన్నాడు మల్లేష్.

    ఆ జవాబు ఆ వ్యక్తికి కొంచెం భయం కలిగించింది.

    "నిన్నిక్కడ లక్ష్మీనారాయణ వుండమన్నాడు కదూ?" అన్నాడతను.

    మల్లేష్ కి అతని మాటలేమీ అర్ధం కాలేదు.

    "అవును" అన్నాడు ఇంకేమనాలో తెలీక.

    "ఈ స్థలం కిరికిరిలో వుంది. లక్ష్మీనారాయణ నాదంటున్నాడు గానీ డాక్యుమెంట్లు నా పేరుమీదున్నయ్. కోర్ట్ లో కేసు నడుస్తోంది. ఈలోగా నీకు పైసలిచ్చి నిన్ను తెచ్చి కబ్జా చేయడానికి కోషిష్ జేస్తుండు" అన్నాడతను.

    మల్లేష్ కి కొంచెం కొంచెం అర్ధమవటం ప్రారంభించింది.

 Previous Page Next Page