గతుక్కుమంది సుమతి. బంగారయ్యని తనకు, అందరికీ తెలుసు. యాభై రూపాయ లిచ్చి కుమార్ ని బంగారయ్య కొంటానన్నది ఔదార్యంతోనూ కాదు - పుత్ర ప్రేమతోనూ కాదు. ఇప్పుడు యాభై రూపాయలిచ్చి కొనేస్తే వాడు పెద్దవాడయ్యాక, తిండి మాత్రం పడేసి, జీతం బత్తెం లేకుండా, ఎంత చాకిరీ అయినా చేయించుకో వచ్చునని....
తన మామ్మ పక్కన అమాయకంగా నిలబడ్డ కుమార్ కేసి చూసి వణికిపోయింది సుమతి. రెండు చేతులలోనూ ఆ పసివాణ్ణి లాక్కుని గుండెల్లో దాచుకుంది.
"వీల్లేదు-అభమూ శుభమూ తెలియని ఈ పసివాణ్ణి అమ్మటానికి వీల్లేదు" అంది.
సుబ్బులు తల్లి రుసరుసలాడుతూ "అదేంటమ్మా! నా మనవడు- నా యిష్టం" అంది.
"అయితే నాకే అమ్ము. యాభై కాదు-అరవై యిస్తాను."
సుమతి ఇలా మాట్లాడటంతో, సుబ్బులు తల్లికి ఇంకా ఆశ ఎక్కువై "అరవై కాదు. వంద ఇచ్చెయ్యి. బిడ్డ నిచ్చేస్తా" అంది.
సుమతికి మండిపోయింది "బిడ్డ!....దొరికాడు, నీకు! అమ్ముకోటానికి....ఇలా బిడ్డల్నమ్మటం నేరం. నిన్ను పోలీసులకి పట్టిస్తా" అంది కోపంగా.
సుబ్బులు తల్లి హడలిపోయి "పోనీయమ్మా! ఆ అరవయ్యే యియ్యి" అంది. సుమతి లోపలికెళ్ళి చంద్రశేఖర్ పర్స తీసి అరవై రూపాయలు తెచ్చి ఇచ్చింది. ఆ డబ్బు తీసుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది సుబ్బులుతల్లి. "మామ్మా!" అని ఏడవబోయిన కుమార్ సుమతి దగ్గరకి తీసుకోగానే ఏడుపు మరిచిపోయాడు. అలా కుమార్ చంద్రశేఖర్ చంద్రశేఖర్ కుటుంబంలో ఒక వ్యక్తిగా చేరిపోయాడు. కానీ సమస్యలు అంతటితో ఆగలేదు. ఏ పెళ్ళికి వెళ్ళినా, పేరంటాని కెళ్ళినా బంధువులంతా చంద్రశేఖర్ కుటుంబాన్ని చూసి మూతులు ముడుచుకునేవారు. మిగిలినవాళ్ళ సహపక్తిలో భోజనం పెట్టడానికి ఒప్పుకునేవారు కాదు. ఈ బాధ పడలేక పాపం, సుమతి బంధువుల మధ్యకు రావటమే మానేసింది. అయినా కొందరు బంధువులు ప్రత్యేకించి పనికట్టుకుని ఇంటికేవచ్చి సూటిపోటి మాటలనేవారు. ఆ మాటలకు తట్టుకోలేక లోలోపల బాధపడినా కుమార్ ని మాత్రం నిర్లక్ష్యం చేసేదికాదు.
ఆ తరువాత కొంచెం రోజులకే సుమతికి నెల తప్పింది. చాలామంది "ఇంక కుమార్ పని అయిపోయింది. సుమతి కడుపు పండింది." అనుకున్నాడు. కానీ, సుమతి కుమార్ ని ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యలేదు. వీడు వచ్చిన వేళావిశేషం. సంతానం కలగదనుకున్న నాకు సంతానం కలుగుతోంది" అని మరింత అభిమానం చూపించింది. సుమతికి ఆడపిల్ల పుట్టింది. ఆనాడు సుమతి అన్న మాటలు చంద్రశేఖర్ ని విభ్రాంతిలో ముంచేశాయి.
"మనకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇంకచాలు!" పొత్తిళ్ళలో పసిపాపనీ, పక్కనే నిలబడ్డ కుమార్ నీ రెండుకళ్ళతోనూ చూసుకుంటూ నిండుగా నవ్వింది.
కుమార్ కి తనే ఇంట్లో చదువుచెప్పి ఒకటో క్లాసులో బళ్ళో వెయ్యమంది సుమతి.
"రిజిష్టర్ లో తలిదండ్రుల పేర్లు ఏమని వ్రాయను? మనపేర్లు వ్రాసెయ్యనా?" అని అడిగాడు చంద్రశేఖర్.
సుమతి కొంచెంసేపు ఆలోచించి "వద్దు, వాడి అమ్మ నాన్నలపేర్లే వ్రాయండి. వాడి కులమే వ్రాయండి" అంది.
ఈ సమాధానానికి చంద్రశేఖర్ కొంచెం ఆశ్చర్యపోయాడు. అనుకోకుండా అదొకరకంగా నవ్వాడు. సుమతి కోపం తెచ్చుకుని "వాడిమీద ప్రేమలేక నేనలా అనలేదు. ప్రభుత్వం ఆ కులాల వాళ్ళకి కొన్ని సదుపాయాలూ కలగజేస్తోంది. అవి వాడికెందుకు లేకుండా చెయ్యాలి? మనమూ, మామూలు మధ్యతరగతి కుటుంబీకులమే! మన పిల్లల్ని మనం ఎంతవరకు పైకి తీసుకురాగలం? ఒక బిడ్డకయినా, ప్రభుత్వ సహాయం అందితే మంచిదే కదా!" అంది. చంద్రశేఖర్ కి కూడా అది సమంజసమే ననిపించింది. అదీగాక కుమార్ ని అభిమానంతో పెంచినంతమాత్రాన అతడి బంధువర్గం నుండి అతడికి తెగతెంపులు చెయ్యటం ఎంతవరకు న్యాయమో, నిర్ణయించుకోలేక పోయాడు చంద్రశేఖర్.
ఆ కారణాలచేత స్కూల్ రిజిష్టర్ లో కుమార్ పుట్టినకులమూ, అతడిని కన్న తల్లిదండ్రుల పేర్లూ వ్రాయించాడు.
సుమతి తన కూతురికి మంజులత అని పేరు పెట్టుకుంది. చెల్లెల్ని ప్రాణంగా చూసుకునేవాడు కుమార్. చదువుకూడా మానేసి మంజు నెత్తుకు తిరుగుతోంటే సుమతి మందలించి వాడిని పుస్తకాల ముందు కూచోబెట్టేది.
కాలం ముందుకు నడిచింది. చంద్రశేఖర్ తలిదండ్రు లిద్దరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఇద్దరూ కూడా తమ అంత్యదశలో పితృకార్యాలు జరుగుతున్నప్పుడు కుమార్ ని రానివ్వవద్దని తమ తుది కోరికగా ప్రార్ధించటం సుమతికి, చంద్రశేఖర్ కు కూడా చాలా కష్టం కలిగింది.