Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 13


    "ఇలా ఎంత వినయం నటించినా, ఎంత బాకా కొట్టినా మీ సేల్స్ గ్రాఫ్ పైకి లేవదు మైడియర్ మోహన్ రాజ్! కొంచెం మెదడుకి మేత పెట్టు! ఒకవేళ మెదడే లేకపోతే ఏ మేకతోనో బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఏర్పాటు చేసుకో! అప్పుడు ఫలితాలు చూడుము! నమ్మశక్యముగాని ఫలితములు."
    మోహన్ రాజ్ కి కోపం ముంచుకొచ్చింది "చూడు మిస్టర్!"
    "పేరు వాడుము! భవానీశంకర్!"
    "చూడండి మిస్టర్ భవానీశంకర్!" అనేశాక అప్పుడు గుర్తుకొచ్చిందతనికి. మార్కండేయులు అంతకుముందే ఫోన్ చేసి తమ సేల్స్ ప్రమోటర్ గా భవానీశంకర్ అనే అతనిని నియమించినట్లు చెప్పాడు.
    "హలో! హౌ డూ యూ డూ?" చిరునవ్వు తెచ్చుకుంటూ అడిగాడు.
    భవానీశంకర్ చిరాగ్గా చూశాడతనివైపు.
    "డోంట్ బాదర్ ఎబౌట్ దిఫార్మాలిటీస్ బ్రదర్! మీ జనరంజని పబ్లిషింగ్ హౌస్ తాలూకు సేల్స్ గ్రాఫ్ అలా తొంభై డిగ్రీల కోణంలో పాతాళంలోకాని కెళ్ళిపోవడానికి కారణాలు ఏమిటో చెప్పగలరా?"
    "డోంటాక్ నాన్సెన్స్! నువ్వు నాకింద పనిచేసేవాడివి! మర్యాదగా మాట్లాడటం నేర్చుకో!" ఆవేశంతో వణికిపోతూ అన్నాడు మోహన్ రాజ్.
    "కిందా పైనా అనేది నీ మనసులోని ఫీలింగ్ బ్రదర్! మనుషులంతా ఒక్కటే అంటూ మన తెలుగు టి.వీ.బొంగురు గొంతుకతో పావుగంటకోసారి ఘోశించటం లేదా లేక కనిపించటం లేదా? నీలాంటి మూర్ఖుల కోసమే మన టి.వి.వాళ్ళు ప్రత్యేకంగా ప్రోగ్రామ్ లు తయారుచేస్తున్నారు బ్రదర్! అంచేత ఆ ఫీలింగ్ ని మార్చేసెయ్యి, లేకపోతే మామగారయిన జగన్నాథం గారితో చెప్పి మీ కుర్చీలో నేను కూర్చోవాల్సి వస్తుంది."
    'మామగారయిన జగన్నాథం' అన్నమాట మోహన్ రాజ్ లోని ఆవేశాన్ని అతని సేల్స్ గ్రాస్ లాగానే తొంభై డిగ్రీల కోణంలో పాతాళానికి దించేసింది.
    "అఫ్ కోర్స్! అఫ్ కోర్స్!" అన్నాడు బలవంతంగా చిరునవ్వు నవ్వుతూ "పై స్థాయి, కింది స్థాయి, పై అధికారి, కింది ఉద్యోగి ఇవన్నీ నిజంగానే చాలా మీనింగ్ లెస్! నిన్న రాత్రే ఈ విషయం మా మిసెస్ తో అన్నాను కూడా! రాజ్యం, అనరూ గొప్పాడనీ, బీదాడనీ, అధికారి అనీ, నౌఖరనీ, గొప్ప కులం అనీ, తక్కువ కులం అనీ, ఇలా తారతమ్యాలు చూపుతారుగానీ నా మటుకు నాకు అలాంటి భేదాలు లేవు! మనుషులంతా ఒక్కటే! మా ఆఫీస్ లో కూడా నేనెవరినీ నాకింద పనిచేసేవారని చిన్నచూపు చూడటంగానీ, నేను ఆఫీసర్నని పైకి చూడటం గానీ చేయలేను! రేపు మా డిపార్టుమెంట్ లో జాయినవుతోన్న భవానీశంకర్ అనే మామూలు సేల్స్ ప్రమోటర్ ని కూడా నాతో సరిసమానంగా చూసుకుంటాను అని చెప్పను. అందుకు రాజ్యం ఏమందో తెలుసా? మనం అందరినీ మనతో సమానంగా గౌరవిస్తేనే భగవంతుడు మనల్ని ప్రేమిస్తాడు" అంది అన్నాడు ఉత్సాహంగా.
    "చాలా గొప్పగా అంది ఆవిడెవరో గాని"
    "మా మిసెస్ అండీ! పేరు రాజ్యం!"
    "శభాష్ మోహన్ రాజ్! అలాంటి ఉత్తమ ఇల్లాలే మానవతకు వెన్నెముక! ఏదొకరోజు మదర్ థెరిసా అవార్డ్స్ వెతుక్కుంటూ రాక తప్పదని నా మాటగా చెప్పండి."
    "తప్పకుండా చెప్తాను"
    "ఇకపోతే మన లైబ్రరీ రేక్స్ లో వున్న పుస్తకాలన్నీ చూశాను మోహన్ రాజ్! మన సేల్స్ గ్రాఫ్ తొంభయ్ డిగ్రీల కోణంలో దిగిపోవడానికి కారణం ఏమిటో నాకర్థమయింది. సాహిత్యం అంటే అర్థం కూడా తెలీనివాళ్ళంతా ఈ ఆఫీస్ లో చేరి అడ్డమయిన చెత్తా వేలకొద్ది కాపీలు ప్రింట్ చేసేశారు. ఆ పుస్తకాలన్నీ చెక్కుచెదరకుండా రేక్స్ లో కట్టలు కట్టలుగా వుండిపోవడంతో సేల్స్ గ్రాఫ్ మటాష్ అయిపోయింది అంతేనా?"
    మోహన్ రాజ్ మొహం కోపంతో ఎర్రబడింది గానీ మళ్ళీ భయపడి నలుగు కలర్ కి మార్చేశాడు. "సాహిత్యం చెత్త అని కాదు గాని, ప్రభుత్వ లైబ్రరీస్ కి పుస్తకాలు కొనకపోవటం వల్ల."
    "అదే నీ అజ్ఞానం బ్రదర్! ప్రభుత్వం అడ్డమయిన చెత్తా కొంటుందన్న ధీమాతో విజృంభించి రంగంలోకి దూకి మటాష్ అయిపోయారు. ఆల్ రైట్. ఇప్పుడా విషయాలు డిస్కస్ చేయటం గత జలసేతు బంధనం లాంటిది అవునా?"
    మోహన్ రాజ్ బుర్ర గోక్కున్నాడు "గతజల సేతుబంధనం అంటే..."
    "అనవసరం బ్రదర్! దాని అర్థం తెలీని పబ్లిషింగ్ హౌస్ వాడికి అర్థం చెప్పినా ప్రయోజనం వుండదు. అంచేత వదిలేసెయ్. ఇప్పుడు మనం ముందు చేయాల్సిన కార్యక్రమం ఏమిటంటే మన దగ్గరున్న చెత్తను వీలయినంత వరకూ వదిలించుకోవటం, అవునా?"
    "అవునండీ!"
    "అయితే ఓ కాగితం పెన్నూ తీసుకో"
    మోహన్ రాజ్ ఠక్కున ఓ కాగితం పెన్నూ తీసుకున్నాడు. భవానీశంకర్ రెండు కాళ్ళూ టేబుల్ మీద జాపుకుని వెనక్కువాలి ఏదో ఆలోచిస్తున్నట్లు శూన్యంలోకి చూశాడు.
    "ఆ! రాసుకో! పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు ఓ ముఖ్య ప్రకటన! వివరాలకు రేపు ఇదే చోట చూడండి అంతే!!! ఈ మేటర్ అన్ని న్యూస్ పేపర్స్ లోనూ ఫ్రెంట్ పేజీలో ప్రకటన ఇవ్వండి."
    "మోహన్ రాజ్ మళ్ళీ బుర్ర గోక్కున్నాడు "ఎందుకు సార్ అలా ఇవ్వటం?"
    "ప్రపంచంలోనే అతి హీనమయిన ప్రశ్న వేశావు మోహన్ రాజ్. దయచేసి నీ ప్రశ్నల్ స్టాండర్డ్ పెంచుకో! ఆ ప్రకటన ఎందుకిస్తున్నామో ఇంకా తెలీదా? పెళ్ళికాని యువతులందరూ మర్నాడు అమితమయిన కుతూహలంతో మళ్ళీ అదే స్థానంలో వివరాల కోసం వెతుకుతారు గనుక!"
    "మరి అక్కడ వెతికితే ఏం కనబడుతుంది మరుసటిరోజు" ఇంట్రెస్టింగ్ గా అడిగాడు.
    "వెరీగుడ్! ఇప్పటికిప్పుడే కొంత ఇంప్రూవ్ మెంట్ కనబడుతోంది నీ ప్రశ్నల స్టాండర్డ్ లో. వెతికుతే ఏం కనబడుతుందని అడిగావు కదూ? చాలా మంచి ప్రశ్న మోహన్ రాజ్! వెతికితే మళ్ళీ ఇంకో ప్రకటన కనబడుతుంది. అదేమిటీ అంటూ మళ్ళీ అడగకు! నిశ్శబ్దంగా రాసుకో. చెప్తాను."
    "పెళ్ళీడు కొచ్చిన యువతులు తెలుసుకోవలసిన అద్భుత దాంపత్య సౌఖ్యాలు! వెంటనే ఇరవై రూపాయల డ్రాఫ్ట్ పంపించండి. అరవై నాలుగు ఫోటోలతో మహా మత్తెక్కించే రకరకాల ఘట్టాలతో నిండిన ఈ పుస్తకం కాపీలు చాలా తక్కువగా వున్నాయి. అంచేత ముందు డ్రాఫ్టు పంపిన వారికే పుస్తకాల గ్యారంటీ. జనరంజనీ పబ్లికేషన్స్."
    మోహన్ రాజ్ భయంగా చూశాడు "కాని మన దగ్గర అలాంటి బూతు పుస్తకాలు లేవుకదా" అడిగాడు అనుమానంగా.
    "నీ అనుమానాలకూ, సందేహాలకూ, ప్రశ్నలకూ సమాధానాలు చెప్పేంత తీరికలేదు బ్రదర్! చెప్పిన పని చేసెయ్! అంతే! ఈ విషయంలో ఏమయినా సందేహముంటే చెప్పు, ఇప్పుడే జగన్నాథం మామయ్యతో మాట్లాడి సెటిల్ చేసేస్తాను."
    మోహన్ రాజ్ గాభరా పడిపోయాడు. "అహహ! అలాంటి సందేహాలేమీలేవండీ! వెంటనే మీరు చెప్పినట్టు ప్రకటనలు ఇప్పించేస్తాను."
    "వెరీగుడ్! ఇలా చక్కటి సమాధానాలివ్వటమే మంచి బాలుడి లక్షణాలు మైడియర్ మోహన్ రాజ్! నేనింక సేల్స్ సెక్షన్ లోకెళ్ళి నిరీర్యమయినపోయిన మన స్టాఫ్ కి అద్భుతమైన ఆనందోత్సాహాలు. ప్రోత్సాహకాలు కలిగించే టానిక్ లాంటి ఉపన్యాసం ఒకటి ఇచ్చి వస్తాను" అంటూ లేచి ఆ సెక్షన్ వైపు నడిచాడతను.

 Previous Page Next Page