మోహన్ రాజ్ చాలాసేపు చలనం లేకుండా కూర్చుండిపోయాడు కుర్చీలో. భవానీశంకర్ మాటలూ, చేష్టలూ అన్నీ అతనికి మతి పోగొడుతున్నాయి. అతను చెప్పినట్లు చేయాలా వద్దా అనేది అతనికి అర్థంకావటం లేదు.
భవానీశంకర్ జగన్నాథంగారి అమ్మాయిని పెళ్ళి చేసుకోబోతున్నాడన్న వార్త వినటం వల్ల భవానీశంకర్ థ్ పేచీ పెట్టుకోవటానికి అతనికి ధైర్యం చాలటంలేదు. చాలాసేపు దీర్ఘంగా ఆలోచించిన తరువాత భవానీశంకర్ ఆదేశాలను శిరసావహించటమే ప్రస్తుత కర్తవ్యమని నిర్ణయించుకున్నాడతను.
"కామ్రేడ్ ఝాన్సీలక్ష్మీ!" జిందాబాద్! జిందాబాద్!"
"స్త్రీ కిశోరం ఝాన్సీలక్ష్మీ!" జిందాబాద్! జిందాబాద్!"
"వీర విప్లవ నారీ సమితి" వర్ధిల్లాలీ! వర్దిల్లాలీ!"
"జనరంజనీ పబ్లిషర్ జగన్నాథం!" ముర్ధాబాద్! ముర్ధాబాద్!"
"జగన్నాథం!" "హాయ్ హాయ్!"
"పబ్లిషర్ జగన్నాథం!" ముర్దాబాద్! ముర్దాబాద్!"
"జగన్నాథం!" "హాయ్ హాయ్!"
"జగన్నాథం!" "హాయ్ హాయ్!"
హాయిగా మెత్తని పరుపు మీద పడుకుని గాఢ నిద్రపోతున్న జగన్నాథానికి చటుక్కున మెలకువ వచ్చింది. తను హాయిగానే నిద్రపోతున్నాడు కదా! మళ్ళీ ఈ హాయ్ హాయ్ అన్న కేకలేమిటి? అతనికేమీ అర్థం కాలేదు.
చటుక్కున లేచి కిటికీ తాలూకు కర్టెన్లు పక్కకు లాగి చూశాడు. తనింటిముందు పెద్ద గుంపులా నిలబడ్డ బోలెడుమంది యువతులను చూసేసరికి అతని నిద్రమత్తు పూర్తిగా ఎగిరిపోయింది. వాళ్ళ చేతుల్లో ప్లాకార్డ్స్!
నైట్ గౌన్ తో వడివడిగా మెట్లు దిగి కిందకు చేరుకున్నాడతను. అప్పటికే ప్రతిమ, నౌఖరూ ఇద్దరూ హాల్లో నిలబడి వున్నారు. ఓ యువతి ఆవేశంగా వారితో మాట్లాడుతోంది.
జగన్నాథాన్ని చూడగానే బయట నిలబడ్డవారిలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
"జగన్నాథం లాంటి చీడ పురుగులూ...నశించాలి-నశించాలి!"
జగన్నాథానికి కోపం ముంచుకొచ్చేసింది. "షటప్! షటప్! షట్ యువర్ మౌత్స్! ఏమిటా పిచ్చి కూతలు కూస్తున్నారు? ఎవరు మీరసలు?" ఆవేశంగా అరిచాడతను.
"వీర విప్లవ నారీ సమితి వాళ్ళం!" చెప్పింది లోపలికొచ్చిన యువతి "నేను ప్రెసిడెంట్ ఝాన్సీలక్ష్మిని."
"నా ఇంటి మీదకొచ్చి నన్ను ముర్దాబాద్ అని ఎందుకంటున్నారు?"
"నువ్వు సమాజానికి చీడపురుగువి గనుక."
"షటప్! షట్ యువర్ బ్లడీ మౌత్! నేను చీడపురుగునేమిటి నీ తలకాయ్! నీకేమయినా మెదడుందా?"
"ఉంది కాబట్టే నీ అంతు చూడ్డానికొచ్చాం. పెళ్ళీడుకొచ్చిన అమ్మాయిలకు సెక్స్ పుస్తకాలు అమ్ముతావా? వ్యాపారం కోసం గడ్డి తింటావా?" అంటూ న్యూస్ పేపర్ అతని ముఖాన కొట్టిందామె.
ప్రతిమ, జగన్నాథం చప్పున న్యూస్ పేపర్ అందుకున్నారు.
మొదటిపేజీలోనే కొట్టొచ్చేట్లుగా కనిపించిందా ప్రకటన. పెళ్ళీడుకొచ్చిన యువతులు తెలుసుకోవాల్సిన అద్భుత దాంపత్య సౌఖ్యాలు! అరవై నాలుగు ఫోటోలతో సహా మత్తెక్కించే రకరకాల ఘట్టాలతో నిండిన ఏకైక గ్రంథం వెల ఇరవై రూపాయలు మాత్రమే. నేడే డ్రాఫ్టు పంపండి! కాపీలు తక్కువగా వున్నాయి. అంచేత ముందు డ్రాఫ్టు పంపిన వారికే పుస్తకాల గ్యారంటీ. జనరంజనీ పబ్లికేషన్స్.
జగన్నాథం కోపంతోనూ, అవమానంతోనూ దహించుకుపోసాగాడు.
"ఈ ప్రకటన నాకు తెలీదు. ఐమీన్ మా సంస్థ ఇలాంటి పిచ్చి పిచ్చి పుస్తకాలు అమ్మదు" అన్నాడతను మండిపడుతూ.
"అయితే ఈ ప్రకటన ఎందుకిచ్చారు మరి?"
జగన్నాథానికేం చెప్పాలో తెలీలేదు.
"అది...అ...గా...యి...సా..." అన్నాడు మాటల కోసం తడుముకుంటూ.
వెంటనే ఝాన్సీలక్ష్మి కేకలు ప్రారంభించింది. "అబద్ధాల కోరు జగన్నాథం-" "ముర్దాబాద్- ముర్దాబాద్"
"వెధవపని చేసి చేయలేదనే జగన్నాథం-" ముర్దాబాద్- ముర్దాబాద్"
"భారతదేశ స్త్రీ ఔన్నత్యాన్ని మంటగలిపే జగన్నాథం-" "నశించాలి - నశించాలి"
"షటప్" బిగ్గరగా అరిచాడు జగన్నాథం.
అంతా సైలెన్స్ అయిపోయారు.
"ఈ ప్రకటనేమిటో నాకు తెలీటం లేదు. ఇప్పుడే మా ఆఫీసుకెళ్ళి కనుక్కుందాం పదండి" అన్నాడతను.
"సరే పదండి" అంది ఝాన్సీలక్ష్మి.
మరో అరగంటలో అంతా జనరంజని పబ్లిషింగ్ హౌస్ ఆఫీసుకి చేరుకున్నారు. జగన్నాథం ఆవేశంతో వణికిపోతూ వాచ్ మెన్ దగ్గర ఆగాడు.
"త్వరగా వెళ్ళి ఆ మోహన్ రాజ్ ని, మిగతా స్టాఫ్ నీ పిల్చుకురా" అన్నాడు ఆయాసంతో రొప్పుతూ.
"అంతా ఆఫీస్లోనే వున్నారు సార్!"
జగన్నాథం, ప్రతిమ ఇద్దరూ ఆశ్చర్యపోయారు.
"ఇంత పొద్దున్నే ఎందుకొచ్చారు ఆఫీసుకి?"
"పుస్తకాలన్నీ ప్యాకింగ్ చేసి పంపిస్తున్నారు కదండీ రెండ్రోజుల నుంచీ"
జగన్నాథానికేమీ అర్థం కాలేదు. అందరితోపాటు లోపలకి నడిచాడు. లోపలి దృశ్యం అతని మతిని పూర్తిగా పోగొట్టేసింది. హాలు నిండా స్టాఫ్ అంతా కూర్చుని పుస్తకాలన్నీ కవర్లలో పెట్టి అడ్రస్ లు రాస్తున్నారు. భవానీశంకర్ హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ ఎవరెవరికి ఎన్నెన్ని కాపీలు పంపాల్సిందీ డిక్టేట్ చేస్తున్నాడు.