Previous Page Next Page 
సుడిగుండాపురం రైల్వే హాల్ట్ పేజి 12


    "అయితే మరి ఇంకొకతను వస్తాడని ఎందుకన్నావు?" ఇరిటేటింగుగా అడిగాడు.
    "నేనలేదు! అన్నీ మీరే అనుకుంటున్నారు" చిరుకోపంతో అంది.
    "ఆల్ రైట్! అయితే ఏదో విషయం మాట్లాడాలని రమేష్ ని పిలిపించావన్నమాట! అంతేనా?"
    "రమేష్ కాదు డాడీ! విజయ్ ని! ఇతని పేరు విజయ్!"
    సుధీర్ కుమార్ అసహనంగా తనలోతనే గొణుక్కుంటున్నట్టుగా అన్నాడు- "ఒక మనిషి ఇన్ని పేర్లు పెట్టుకుంటే ఇదే కన్ ఫ్యూజన్! ఆల్ రైట్! ఏ విషయం మాట్లాడాలి?"
    మృదులకెలా చెప్పాలో తెలియలేదు.
    "నువ్వు చెప్పు" అంది విజయ్ తో.
    "ఊహు! నువ్వే చెప్పు" అన్నాడతను కంగారుగా.
    "విజయ్... అంటే ఇతను... నాకు మంచి ఫ్రెండు డాడీ!"
    "ఓ అలాగా! వెరీ గుడ్!"
    "అంటే విజయ్ కి నేను మంచి ఫ్రెండుని డాడీ!"
    "ఓహో! అలాగా!"
    "అంటే... ఇద్దరం... ఇద్దరికీ మంచి ఫ్రెండ్స్ మి డాడీ!"
    సుధీర్ కుమార్ కన్ ఫ్యూజయిపోయాడు. "ఆగాగు! ఏ ఇద్దరికి ఏ ఇద్దరు మంచి ఫ్రెండ్స్?"
    "మా ఇద్దరికీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ డాడీ"
    "ఓహోహో! అదా! ఇంతేనా మాట్లాడాల్సింది"
    "అబ్బే! కాదు డాడీ! ఇంకా వుంది"
    "ఏమిటది?"
    మృదుల ఓ క్షణం తటపటాయించి ధైర్యం తెచ్చుకుని చెప్పేసింది "నేను విజయ్ ని ప్రేమించాను డాడీ! అంటే ఇతనిని"
    సుధీర్ కుమార్ మళ్ళీ కన్ ఫ్యూజయిపోయాడు "అదేమిటి? అతను నీ ఫ్రెండన్నావ్?"
    "అఫ్ కోర్స్! ఫ్రెండే డాడీ! అంటే ఫ్రెండ్ నే ప్రేమించానన్నమాట"
    "ఏమిటో అంతా చాలా గందరగోళంగా వుంది. ఆల్ రైట్ నెక్ట్స్?"
    "అతను కూడా నన్ను ప్రేమిస్తున్నాడు డాడీ!"
    "అతనంటే ఎవరు? నువ్వు ఇతనిని ప్రేమిస్తూంటే వాడెవడో నిన్ను ప్రేమిస్తున్నాడు అంతేనా? ట్రయాంగ్యులర్ లవ్వా?"
    "వేరే ఎవరూ కాదు డాడీ! ఇతనే అంటే విజయ్ కూడా నన్నే ప్రేమిస్తున్నాడు."
    "ఓహో అంటే..."
    "అంటే మేమిద్దరం మా ఇద్దరిలో ఒకరినొకరు ప్రేమించుకుని... ప్రేమించుకుంటున్నామన్నమాట"
    "ఓహోహో! అదా సంగతి"
    "అవును డాడీ" ఆత్రుతగా తండ్రివైపు చూస్తూ అంది.
    విజయ్ టెన్షన్ తో నిండిపోయి గుడ్లప్పగించి చూస్తున్నాడు. సుధీర్ కుమార్ సోఫాలో నుండి లేచి ఓసారి అటూ ఇటూ పచార్లు చేశాడు. అతని ముఖకవళికలు పూర్తిగా మారిపోయినాయి.
    కొద్దిక్షణాలు జరిగాక మృదులతో మాట్లాడాడతను "సారీ బేబీ! నీకోసం నిన్నే ఓ వరుడిని చూశాను"
    మృదుల ఉలిక్కిపడింది. విజయ్ ముఖంలో కళ తప్పింది.
    "నాకు సంబంధం చూశారా?" కంగారుగా అడిగింది.
    "అవునమ్మా! ఆ కుర్రాడెక్కడుంటాడో తెలుసా నీకు? వీరాంజనేయ గుడిశెల కాలనీలో! చాలా అందమైన గుడిశెలో ఎనిమిది మేకల్నీ, పదహారు కోళ్ళనూ, రెండు కుందేళ్ళనూ పెంచుకుంటూ, తనంతట తానే సజ్జలతో అంబలి కాచుకుని, కొరివికారం నంజుకుని తాగుతూ, గొడ్డులా కష్టపడుతూ జీవితం గడుపుతుంటాడట" పరవశంతో అన్నాడతను.
    మృదుల ఉడికిపోయింది. "డాడీ! ఏమిటి డాడీ! మీరు మరీనూ! ఎప్పటినుంచో నేనూ విజయ్ ప్రేమించుకుంటున్నాం. విజయ్ అంటే ఇతనే!"
    "కాని విజయ్ గుడిశెల్లో వుండడని నువ్వే చెప్పావ్ కదా?"
    "అవును డాడీ! వాళ్ళకు నాలుగంతస్తుల భవనం వుంది"
    సుధీర్ కుమార్ ఇంక సహించలేకపోయాడు "మృదులా! ఈ పెళ్ళి జరగదు. నా కంఠంలో ప్రాణం వుండగా నీకు డబ్బున్న వాడితో పెళ్ళి జరగనీను. మిస్టర్ లక్ష్మణ్! నువ్విక వెళ్ళవచ్చు. మళ్ళీ జన్మలో ఇంక మృదులతో మాట్లాడ్డానికి కూడా ప్రయత్నించకు! గెటౌట్!"
    విజయ్ భయంగా లేచినుంచుని మృదులవైపు చూశాడు.
    మృదుల కోపంతోనూ, అవమానంతోనూ దహించుకుపోతూ కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడినుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయింది.
    విజయ్ ఇంకొక్క క్షణం కూడా ఆగకుండా బయటకు నడిచాడు వడివడిగా.


                           *    *    *    *


    భవానీశంకర్ సేల్స్ డిపార్ట్ మెంటులోకి చేరుకుని ఓసారి చుట్టూ చూశాడు. రేక్స్ లో రకరకాల తెలుగు పుస్తకాలు అందంగా అట్టలు కనబడేటట్లు వరుసగా అమర్చి వున్నాయి. వాటిమధ్య నలుగురు గుమాస్తాలు, ఓ లేడీ టైపిస్టు కూర్చుని వున్నారు. అందరూ ఆ రేక్స్ లోని పుస్తకాలు చదువుతున్నారు.
    ఆ రేక్స్ లోని పుస్తకాలన్నీ దగ్గరకెళ్ళి చూశాడు. ఆ తరువాత తిన్నగా సేల్స్ మేనేజర్ గదిలోకి నడిచాడు. మేనేజర్ వెనక్కు తిరిగి పైనుంచి క్రిందకు జారిపోయిన గ్రాఫ్ వైపు చూస్తున్నాడు.
    "గుడ్ మార్నింగ్ మిస్టర్ మోహన్ రాజ్!" అంటూ పలుకరించాడు చిరునవ్వుతో.
    మోహన్ రాజ్ గాబరాపడి వెనక్కు తిరిగి భవానీశంకర్ ని చూసి సర్దుకుని "కూర్చోండి సర్! మీకు నేనేం చేయగలను?" అనడిగాడు వినయంగా.
    "ఎవడికి ఎవడూ ఏమీ చేయలేడు మైడియర్ ఫ్రెండ్! ఎవడిక్కావలసిన సహాయం వాడే చేసుకోవాలి! వేదాల కాలం నుంచీ ఈ తాత్పర్యాన్నే రకరకాల కాంబినేషన్స్ తో ఘోషిస్తున్నారు మన పూర్వీకులు."
    మోహన్ రాజ్ బలవంతంగా నవ్వాడు "అఫ్ కోర్స్, వెల్ సెడ్ వెల్ సెడ్. ఇంతకూ తమరు బుక్స్ కొంటానికి వచ్చారా? ఏ స్కూల్ నుంచి వచ్చారు?"
    భవానీశంకర్ అతనిని చూస్తే జాలివేసింది.

 Previous Page Next Page