Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 13


    లారీలు వెళ్ళగానే చిరంజీవి మళ్ళీ యాక్సిలేటర్ మీద కాలు పెట్టబోతూంటే తను అతనిమీద కలబడి బ్రేకు మీద తన కాలుంచి గట్టిగా నొక్కింది.
    కారు ఠక్కున ఆగిపోయింది. చిరంజీవికి అప్పుడు ఆవేశం తగ్గింది. 'ట్రాన్స్'లో నుంచి బయటకు వచ్చినట్లుంది.
    ఇగ్నీషన్ కీ లాక్కుని డోర్ తెరుచుకుని కారు దిగింది.
    మిగతా ఇద్దరు కూడా భయంతో కారు దిగారు.
    ఆమెకు శరీరమంతా ఆవేశంతో వణికిపోతోంది.
    తన మాటను లెక్కచేయకుండా ఇంత పొగరుబోతుగా ఓ వ్యక్తి ప్రవర్తించడం ఇదే మొదటిసారి.
    అతనిని కొరడాతో కొట్టాలన్నంత కోపంగా ఉందామెకి.
    ఊహు! అది కూడా సరయిన శిక్ష కాదు.
    ఇంకా మంచి పనిష్ మెంట్ ఇవ్వాలి.
    మళ్ళీ జీవితంలో మర్చిపోలేనంత గొప్ప పనిష్మెంట్.
    "నువ్వు కారు దిగు" అంది చిరంజీవితో.
    చిరంజీవి కారు దిగాడు.
    తను డ్రైవింగ్ సీట్లో కూర్చుంది దీప.
    "అటు కూర్చో నువ్వు. నేను డ్రైవ్ చేస్తాను."
    "నేను తప్ప ఇంకెవరూ డ్రైవ్ చేయగూడదని మా ప్రొప్రయిటర్ చెప్పారు మేడమ్."
    "షటప్! బాస్టర్డ్. వెళ్ళి అటు కూర్చో!"
    చిరంజీవి వెళ్ళి ఫ్రంట్ సీట్లో ఆమెకు దూరంగా కూర్చున్నాడు.
    "ఎక్కండి. నేను డ్రైవ్ చేస్తాను" అందామె ఫ్రెండ్స్ తో.
    ఇద్దరూ బ్యాక్ సీట్లో కూర్చున్నారు.
    కారు స్టార్టయింది.
    నెమ్మదిగా నడుపుతూ అటూ ఇటూ చూస్తోందామె.
    వెనకనుంచి రెండు కార్లు వచ్చి ఓవర్ టేక్ చేసినయ్.
    "మీరు పదండి మేము స్లోగా వస్తున్నాం" అంది దీప ఆ కారులో వున్న శ్రీరామ్ తో.
    ఆ కార్లు రెండూ వెళ్ళిపోయినయ్.
    మరికొంత దూరం వెళ్ళక కూడి చేతివేపు మెయిన్ రోడ్ నుంచీ చీలిన ఓ కంకర రోడ్డు కనిపించింది. చాలా దూరం వరకూ కొండ అంచునే కనబడుతోందా రోడ్డు.
    అమాంతం కారుని అటువేపు తిప్పిందామె.
    "ఇటెక్కడికి మేడమ్? మన రూట్ అటు" ఆత్రుతగా అన్నాడు చిరంజీవి.
    "షటప్" అందామె అతనివంక చూడకుండానే. దుమ్ము ఉవ్వెత్తున లేస్తోంది. పది నిమిషాలపాటు ప్రయాణించాక అప్పుడు దూరంగా కనిపించిందో వూరు.
    హఠాత్తుగా కారు ఆపిందామె.
    "ఇక్కడి నుంచి నువ్వు డ్రైవ్ చేద్దువుగాని అటునుంచి దిగిరా" ఆజ్ఞాపించిందామె.
    చిరంజీవి కారు దిగి డోర్ మూసి కారుని చుట్టబోయేంతలో హఠాత్తుగా కారు స్టార్ట్ చేసిందామె.
    కారు అమాంతం వెనక్కు తిరిగి మెయిన్ రోడ్ వేపు పరుగెత్తసాగింది.
    బ్లడీ ఇడియట్! ఇదే నీకు తగిన పనిష్మెంట్! ఈ జంగిల్లో పడి చావు" అరిచింది దీప.
    చిరంజీవి కంగారుగా కారు వెంబడి పరుగెత్తటం ప్రారంభించాడు.
    "మేడమ్! నన్ను రానీండి. మేడమ్ మేడమ్!"
    కారు కనిపించనంత దుమ్ము మేఘాల్లా అతనిని అలుముకుపోయింది.
    కొద్ది దూరం పరుగెత్తి ఆయాసంతో ఒగరుస్తూ నిలబడిపోయాడు.
    కావాలని తనను ఈ అడవిలో వదిలేసి వెళ్ళిందామె.
    "ఎంత ధైర్యం? ఎంత పొగరు?" లోలోపల తిట్టుకోసాగాడతను.
    ఈ అడవి నుంచి తనిప్పుడు ఎలా బయటపడటం?
    మెయిన్ రోడ్డు చేరుకోవాలంటేనే ఎనిమిది కిలోమీటర్లు నడవాలి. మెయిన్ రోడ్డు చేరుకున్నా ఏం లాభం? అక్కడి నుండి బస్సులో వెళ్ళాలన్నా, లారీలో వెళ్ళాలన్నా తన దగ్గర ఒక్క పైసా కూడా లేదు.
    ఏమిటిప్పుడు చేయటం?
    అదీగాక ఆమె చేతిలో సుజుకి కారు దేనికయినా పనికొస్తుందా? నాశనం అయిపోతుంది. దాంతో తన ఉద్యోగం గోవిందా!
    నెమ్మదిగా నడక ప్రారంభించాడతను.
    చిన్నప్పుడు అమ్మ చెప్పినట్టు విని బాగా చదువుకుని ఉంటే ఎంత బాగుండేది? ఇప్పుడీ అవస్థలు ఎందుకొస్తాయ్?
    చిరంజీవి కళ్ళ వెంబడి నీళ్ళు తిరిగినయ్.
    ఇవాళ ఈ పొగరుబోతు రాక్షసి తన తల్లిని గుర్తుకు తెచ్చింది.
    రెండు గంటల తర్వాత మెయిన్ రోడ్డు చేరుకున్నాడతను. ఆకలి! కాళ్ళ నొప్పులు, దాహం, రోడ్డంతా ఖాళీ! జేబులు ఖాళీ!
    ఉండుండి ఓ లారీ పోతోంది వేగంగా.
    దగ్గరికొస్తున్న ఓ లారీకి అడ్డు నిలబడి చేయి ఊపాడతను.
    లారీ ఆగింది.
    "ఏం కావాలి?" అడిగాడు డ్రైవర్.
    "హైద్రాబాద్ వెళ్ళాలి."
    "పదిహేను రూపాయలు ఇవ్వు."
    "డబ్బు హైద్రాబాద్ వెళ్ళాక ఇస్తాను."
    "ఏయ్ పోరా పో" లారీ వెళ్ళిపోయింది.
    చిరంజీవి నిరాశపడిపోయాడు.
    రోడ్డు పక్కనే ఉన్న చెట్టుకింద కూర్చుండిపోయాడు.
    మరికాసేపటికి ఇంకో లారీ వచ్చింది.
    'హైద్రాబాద్' అని చెప్పి లారీ ఎక్కి కూర్చున్నాడు.
    రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్ళాక క్లీనర్ డబ్బు అడిగాడు.
    "హైద్రాబాద్ వెళ్ళాక ఇస్తాను."
    "కుదరదు. ఇక్కడే ఇవ్వాలి."
    "ప్రస్తుతం నా దగ్గర లేదు. హైద్రాబాద్ వెళ్ళాక..."
    లారీ సడెన్ బ్రేక్స్ తో ఆగిపోయింది.

 Previous Page Next Page