Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 12


    అంతా నవ్వులు.
    "యే బకరా కహామిలా తుమ్ లోగోంకో?"
    "నిన్నటి డ్రయివరే బెటరేమో."
    "వాడో రోడ్డింజన్ డ్రయివర్."
    "వీడు మున్సిపల్ లారీ డ్రయివర్."
    మళ్ళీ నవ్వులు.
    రక్తం ఉడికిపోతోంది.
    ఇంత అవమానం తను జన్మలో పొందలేదు.
    కేవలం మాటలే కాకుండా చెంపమీద కొట్టటం, మోకాలి మీద తన్నటం, ఎంత పొగరుబోతు తనం? అది వరలో జమీందార్లు తమ నౌకర్లను హింసిస్తే సహించేవారేమో! ఈ రోజుల్లో ఎవడూరుకుంటాడు?
    చిరంజీవికి చిరాకు కలిగించసాగినయ్ తన ఆలోచనలు.
    తనెందుకూరుకున్నాడో అందరూ అందుకే ఊరుకుంటారు.
    కానీ తనెందుకూరుకున్నాడు?
    తిరిగి ఆమెను ఎందుకు చెంపదెబ్బ కొట్టలేదు?
    ఆమెను కనీసం ఎందుకు తిట్టలేదు?
    తను బీదాడవ్వచ్చు. తిండి లేకపోవచ్చు. అక్క పిల్లలు నలుగురు తనమీద ఆధారపడి ఉండవచ్చు.
    అయినంత మాత్రాన అన్ని అవమానాలు భరించాలని ఎక్కడుంది?
    ఈ ఉద్యోగం కాకపోతే ఇంకోటి? కారు కాకపోతే లారీ నడుపుతాడు. లారీ కాకపోతే రోడ్డింజన్ నడుపుతాడు. ఇవేమీ కాకపోతే సినిమా హాల్ దగ్గర బ్లాకులో టిక్కెట్లమ్ముకుంటాడు. అదీ కాకపోతే ఏదొక రాజకీయపార్టీ తరఫున దాదాగిరి చేస్తూ దుకాణాల నుంచి మామూళ్ళు వసూలు చేసుకుంటూ జీవితం గడపగలడు.
    అంతేగానీ ఇంత దారుణమయిన ఇన్సల్ట్ ని ఎందుకు భరించినట్లు?
    హఠాత్తుగా కారాపి ఆమెనూ, ఆమె ఫ్రెండ్స్ నీ కార్లో నుంచి బయటకు లాగి కిందపడేది, ఆమె రెండు చెంపలూ వాయగొట్టి, నోటి కొచ్చినట్లల్లా తిట్టి తనదారిన తను కారు తీసుకుని వెనక్కు వెళ్ళిపోవాలనుంది. చిరంజీవిలో కోపం పెరిగిపోతోంది. మనసంతా ప్రతీకారంతో నిండిపోయింది.
    ఎదురుగ్గా వరుసగా రోడ్డంతా ఆక్రమించుకుని వెళుతోన్న ఎద్దు బళ్ళు.
    హారన్ కొట్టాడు చిరంజీవి.
    కోపం, అసహనం పెరిగిపోతున్నాయ్. వాటిని ఓవర్ టేక్ చేయడానికి వీల్లేకుండా ఉంది. ఎదురుగ్గా వచ్చే లారీలు.
    "వీడు లారీ డ్రయివర్ కూడా కాదు. ఎద్దు బండి డ్రయివర్."
    మళ్ళీ నవ్వులు.
    "ఏయ్! ఏమిటీ డ్రయివింగ్? ఓవర్ టేక్ చెయ్ త్వరగా! ఇడియట్."
    "బేవకూఫ్ కహీకా."
    "బత్తమీజ్."
    నవ్వులు...
    చిరంజీవి పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయ్.
    ఎదురుగా స్వామి మొఖం కనబడుతోంది.
    "వాళ్ళు మనకు బంగారు పిచ్చుకలు! మన కంపెనీకి వాళ్ళవల్ల మాంఛి లాభం ఉంటుంది. ఈ సంగతి తెలుసా? ఇప్పుడే కొత్త మారుతీ కారుకి కిలో మీటర్ కి ఆర్రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను."
    "ఏమిటి? నువ్ చెవిటివాడివా? చెపుతూంటే వినిపించటం లేదా? త్వరగా పోనీ... ఓవర్ టేక్ చేయటం చేతకాదా? బ్లడీ మఫ్!"
    చిరంజీవి ముఖం అగ్నిగుండంలా తయారవుతోంది.
    కోపం, అవమానం ఏమీ చేయలేని తనం.
    యాక్సిలేటర్ మీద కాలు నొక్కాడు. గాలిలో తేలుతున్నట్లు ముందుకి దూకింది కారు. ఎద్దు బళ్ల మధ్యనుంచీ రాంగ్ సైడ్ లో కొచ్చి ఓవర్ టేక్ చేసి ఎదురుగ్గా వచ్చిన లారీ డ్రయివర్ ఖంగారు పడి సడెన్ బ్రేక్ వేసేసరికి దానికీ ఎద్దుబండికి మధ్య వున్న సన్న గ్యాప్ లో నుంచే దూసుకుపోయి, రోడ్ మీద నుంచీ వీల్ పోతుండగా ఇంకో బస్ ని ఓవర్ టేక్ చేసి రోడ్డు మధ్యకొచ్చి అప్పుడు వేగం స్టేబిలైజ్ చేశాడతను. అంతవరకూ వెనుకనుంచి వినబడుతున్న భయంతో కూడిన కేకలు అతను వినిపించుకోలేదు.
    "మైగాడ్! మనల్ని చంపేస్తాడు వీడు. బాస్టర్డ్."
    చిరంజీవి మళ్ళీ వేగం పెంచాడు. కోపం ఉడికిపోతోంది.
    తన ఉద్యోగం పోయినా సరే! గతుకుల రోడ్డున్నా సరే!
    రియర్ వ్యూలో వాళ్ళ ముఖాల్లో కలవరం కనబడుతోంది.
    ఆ పొగరుబోతు మొఖంలో భయంతోపాటు కోపం.
    "ఏయ్. మాడ్ ఫెలో!"
    స్పీడ్ వంద-
    "ఇడియట్. ఏమిటా స్పీడ్ చెపుతూంటే నీక్కాదూ?"
    "స్పీడ్ నూటఇరవై-
    "మైగాడ్ వీడికి పిచ్చెక్కింది."
    "మనం ఇళ్ళకు తిరిగి వెళ్ళం."
    "స్టాపిట్ యూ డెవిల్ స్టాపిట్!"
    స్పీడ్ నూటముప్పయ్!
    ముందు వెళ్ళే లారీలను, బస్ లను విమానంలా ఓవర్ టేక్ చేస్తున్నట్లు చేస్తొందది.
    భయంతో వాళ్ళు వేస్తున్న అరుపులు దారిన పోయేవాళ్ళను కూడా తిరిగి చూసేలా చేస్తున్నాయి.
    దీపకు పిచ్చెక్కిపోతున్నట్లుంది.
    "రాస్కెల్! స్టాపిట్! ఆపుతావా లేదా?" గట్టిగా అరుస్తోంది.
    చిరంజీవి అదేమీ వినిపించుకోవటం లేదు. నిజంగానే పిచ్చెక్కినట్లు డ్రైవ్ చేస్తున్నాడు.
    గతుకుల్లో ఎగిరి పడుతోంది కారు.
    అందరూ దాంతోపాటు గాలిలో కెగిరి మళ్ళీ సీటు మీద పడుతున్నారు.
    దీప అతని కాలర్ పట్టుకుని చెంపమీద బలంగా కొడుతోంది.
    దూరంగా ఒక లారీని ఇంకో లారీ ఓవర్ టేక్ చేస్తూ రావటం కనిపించాక గానీ చిరంజీవి స్పృహలోకి రాలేదు. కారుని ఆపక గత్యంతరం లేదని తెలీగానే సడెన్ బ్రేక్స్ వేశాడతను.
    ముగ్గురూ సీటు మీదనుంచీ కిందకు జారిపోయారు.
    "అమ్మో!
    "మై మర్ గయా!"
    "దిన్ బాస్టర్డ్ హాజ్ కిల్డ్ మి!"
    కారు ఆగిపోయింది. దీప అమాంతం ముందుసీట్లోకి దూకింది.

 Previous Page Next Page