Previous Page Next Page 
అందమైన శతృవుతో అరవై రోజులు పేజి 14


    "దిగు" అన్నాడు డ్రయివర్.
    చిరంజీవి లారీ దిగేశాడు.
    ఇలా వాళ్ళు డబ్బు అడిగేలోపల కొంచెం కొంచెం దూరం చొప్పున ప్రయాణం చేస్తే తెల్లారేసరికయినా హైద్రాబాద్ చేరుకుంటాడేమో.
    అర్థరాత్రి దాటాక ఇబ్రహీంపట్నం వరకూ చేరుకున్నాడతను.
    అక్కడనుంచి సిటీకి సబర్బన్ సర్వీస్ లున్నాయి.
    కండక్టర్ నెవర్నయినా బ్రతిమాలితే ఫలితం ఉండవచ్చు.
    హోటల్లో టీ తాగుతున్న కండక్టర్, డ్రయివర్ల దగ్గరకు నడిచాడతను.
    మర్నాడు ఉదయం భారత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీసుకి చేరుకున్నాడతను.
    అప్పటికే అక్కడ మిగతా డ్రైవర్లు, క్లీనర్లు అందరూ గుమిగూడి వున్నారు. చిరంజీవి ఆత్రుతగా వారిని తోసుకుంటూ ముందుకి నడిచాడు.
    అక్కడి దృశ్యం చూసి అతను నిశ్చేష్టుడయ్యాడు.
    సుజుకి థౌజండ్ సిసి కారు ఓ పక్కంతా వంకరపోయి వుంది. హెడ్ లైట్ ఒకటి, మిర్రర్స్, ఒక డోర్ అన్నీ డామేజ్ అయిపోయినయ్.
    బతిమాలి తాగుబోతు సాలే గాడిని తెచ్చి కారు అప్పజెప్పి ఇన్వెస్ట్ చేసిన పైసలన్నీ బ్లాక్ అయిపోయె. బంగారం లాంటి గిరాకీని పోగొట్టుకుంటి. సర్వనాశనం చేసేడు దగుల్బాజీ! యాక్సిడెంట్ చేసి లోపల కూర్చున్న పార్టీని కూడా వదిలి పరారయిపోయాడు. ఆళ్ళు పాపం మర్యాదస్తులు, గొప్ప కుటుంబానికి చెందినోళ్ళు కాబట్టి నిన్నరాత్రే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన్రు. ఆడి మీద ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా! ఇంక జన్మలో డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వకుండా చేస్తా."
    చిరంజీవికి కోపం ఆగటం లేదు.
    నడిచి స్వామి ముందు నిలబడ్డాడు.
    "ఏమిటి అంటున్నారు?"
    స్వామి అతనిని చూసి క్షణకాలం ఆశ్చర్యపోయాడు. అంతలోనే ఆవేశం ముంచుకొచ్చింది.
    "ఆ సవాల్ అడగడానికి శరమ్ లేదురా? మంచి డ్రైవరువని కొత్త కారు చేతికిస్తే ఇష్టం వచ్చినట్లు నడిపి యాక్సిడెంట్ చేస్తావా? పైగా కారు అక్కడే వదిలి బాపత్ అయినావే? నువ్ మనిషివేనా అసలు? నీకూ గొడ్డుకి ఏమిటిబే తేడా?"
    "స్వామి" గట్టిగా అరిచాడు చిరంజీవి.
    స్వామి స్టన్ అయిపోయాడు.
    చిరంజీవి తననెప్పుడూ ఏకవచనంతో సంబోధించలేదు.
    "నువ్ చెప్పేవన్నీ అబద్ధాలు. కారు నేను యాక్సిడెంట్ చేశానని ఎవరు చెప్పారసలు?"
    నిరంజన్ గారి బిడ్డ స్వయంగా చెప్పింది. చెప్పటం కాదు నా ఇజ్జత్ తీసిపారేసింది నీకు తెలుసా? నేను ఇంతవరకూ ఎవడితోనూ మాటనిపించుకోలే. గసంటిది ఇవాళ నీవల్ల కేవలం నీలాంటి తాగుబోతు వల్ల బ్లడీ ఫూల్ అనిపించుకున్నా! అదే ఇంకెవరయినా అంటే చెప్పు తీసుకుకొట్టేవాడిని. నిరంజన్ లాంటి కరోర్ పతిని ఏమనగలం?"
    "అదంతా అబద్ధమని నేను చెప్తున్నాను"
    "అంటే నువ్వసలు యాక్సిడెంట్ చేయలేదంటావా?"
    "లేదు లేదు లేదు"
    "మరెవరు చేశారు?"
    "ఆమెగారే! ఆ నిరంజన్ గారమ్మాయే యాక్సిడెంట్ చేసి వుండాలి. దారి మధ్యలోనే నేను సరిగా డ్రైవింగ్ చేయటంలేదని వంకపెట్టి కారుని కొండల మధ్య ఓ పల్లెటూరి వేపు తిప్పి నిర్మానుష్యంగా వున్నచోట నన్ను కారు దిగమని చెప్పి నేను డ్రైవింగ్ సీటు దగ్గరకు తిరిగివచ్చేలోగా కారు స్టార్టు చేసుకుని పారిపోయారు. నేను తిండి తిప్పలు లేక జేబులో ఒక్క పైసా కూడా లేక నానా చావూ చచ్చి ఇప్పటికి సిటీకి చేరుకున్నాను.
    అందరూ ఘొల్లున నవ్వేశారు.
    "ఎంత మంచిగ చెప్పిండు భయ్ కథ!"
    "కథల్జెప్పడంలో ఎక్స్ పర్టు ఉన్నడు"
    "సినిమా ఫీల్డుకి పోరాదువయ్యా! మంచిగ షైనవుతావ్"
    వాళ్ళ మాటలు చిరంజీవికి మరింత కోపం తెప్పించసాగినయ్.
    "ఏయ్ ఇంకోసారి కామెంట్ చేశారంటే మర్యాదగా వుండదు, జరిగింది చెప్తోంటే మీరేమిటి మధ్యలో.
    స్వామి కోపంగా చిరంజీవి వేపు చూశాడు.
    "ఇదిగో చూడు చిరంజీవి! ఈ గొడవంతా పోలీసులు తేలుస్తారు పద. ఇక్కడ యింకేం మాట్లాడకు. నిన్ను జైలు కొట్టుకి పంపించకపోతే నాపేరు స్వామి కాదు."
    చిరంజీవికి తిక్క రేగిపోయింది. "ఏమిటయ్యా నన్ను జైలుకి పంపించేది? నేనేం దొంగతనం చేశానా? ఇందాకట్నుంచి ఊరుకుంటుంటే నెత్తి కెక్కుతున్నారు. అసలు నేనే ముందు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ పిల్ల నన్ను జంగిల్లో మోసం చేసి కారు తీసుకుని పారిపోయింది. అక్కడితో ఆగక తనే యాక్సిడెంట్ చేసి నేను చేశానని అబద్ధం చెప్తొందా? అది మీరు నమ్ముతారా? ఎందుకంటే ఆ పిల్లకు డబ్బుంది, నాకు లేదు కాబట్టి. సిగ్గు పడక్కరలేదు డబ్బుకలా అమ్ముడు పోవడానికి!"
    ఎవ్వరూ మాట్లాడలేదు. ఎక్కడివాళ్ళక్కడ నెమ్మదిగా జారుకోసాగారు.
    చిరంజీవి వెనక్కు తిరిగి బయటకు నడవసాగాడు.
    తనకు తెలుసు. ఇక వాదించి కూడా లాభం లేదని.
    తన ఉద్యోగం పోయినట్లే.
    తన డ్రైవింగ్ లైసెన్స్ కూడా రాద్దవుతోంది.
    మళ్ళీ రోడ్డున పడ్డాడు.
    తనకు ఇంకా నమ్మబుద్ధి కలగటంలేదు. ధనవంతుల్లో అంత పొగరుబోతులు అబద్ధాల కోర్లు ఉంటారంటే! అదీ ఆడపిల్లల్లో...
    తనమీద నిజంగా పగబట్టినట్లే ప్రవర్తించింది.
    కావాలని కారు డామేజ్ చేసి అది తెలివిగా తనమీదకు నెట్టి...
    నిజంగా ఆమె తెలివితేటల ముందు తను చిత్తయిపోయాడు.
    కారు వేగంగా నడిపి వాళ్ళను బెదిరగొట్టి రివెంజ్ తీసుకున్నానని తను భ్రమించాడు. కానీ జరిగిందేమిటి ఆ పిల్ల డబుల్ రివెంజ్ తీసుకుంది. ఒక బీదవాడి మీద ఇంత దారుణమైన ప్రతీకారమా? మూడు లక్షల రూపాయల కారూ, ఒక జేవితం, నిండు జీవితం రోడ్డున పడేసింది.
    అవును! తనను కట్టుబట్టలతో నడిరోడ్డున పడేసింది.
    తనతోపాటు తనమీద ఆధారపడ్డ అక్కయ్య పిల్లలు కూడా రోడ్డున పడ్డారు.
    నిజంగా ఆమెను మెడ పిసికి చంపాలని వుంది తనకు.
    పిల్లలంతా పరుగుతో వచ్చి అతనిని కౌగిలించుకున్నారు.
    "మావయ్యా మమ్మల్ని స్కూలు నుంచి వెళ్ళగొట్టేశారు"
    చిరంజీవి విస్తుబోయాడు.
    "అదేమిటి? ఎందుకని?"

 Previous Page Next Page