Previous Page Next Page 
జయ - విజయ పేజి 12


    "జయ చదువు మానేస్తానంటోంది!" అంది నెమ్మదిగా.
    "ఎందుకని?"
    "ఏమో చదవాలనిపించడం లేదంట!"
    "మరేం చేస్తుందట?"
    "ఉద్యోగం చేస్తుందట."
    "ఉద్యోగం ఎవరిస్తారుట?" నవ్వుతూ అడిగింది విజయ.
    'నరహరిగారిని అడుగుతుందట!"
    నరహరి తన తండ్రి స్నేహితుడు. ఆయనకు తన తండ్రంటే ఎంతో గౌరవం, ప్రేమానూ! ఆయన తల్చుకుంటే జయకు ఉద్యోగం లభించడం పెద్ద కష్టమేమీ కాదు! తనకీ ఉద్యోగం రావడానికి కూడా కొంతవరకూ ఆయనే కారణం.
    "పోనీలే అమ్మా! దానిష్టం వచ్చినట్లు చేయనీ! కాదనడం ఎందుకూ? ఎలాగూ దానికి త్వరలోనే పెళ్ళయిపోతుంది కదా!" అంది విజయ.
    "ఎలా అవుతుంది! ఓ పక్క నువ్వు పెళ్ళే వద్దని కూర్చుంటే?" నిష్టూరంగా అంది పార్వతి.
    విజయ ఆ టాపిక్ మార్చడానికని పుస్తకం తీసుకుని చదువుకోసాగింది. పార్వతి నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయింది.
    ఆ మర్నాడే చంద్రకాంత్ నుంచి ఉత్తరం, దాంతోపాటు అతని ఫోటో అందాయ్ విజయకు. ఫోటోలో అతని రూపం చూచి ముగ్ధురాలయింది విజయ. ఆ రూపం ఆమెనెంతో ఆకర్షించింది. ఆమె మనసుని ఆక్రమించుకుంది. ఒక్క చూపులోనే అతని వశమయి పోయినట్లనిపించిందామెకి. అంతలోనే ఏవేవో ఆలోచనలు మేఘాల్లా క్రమ్ముకుని ఆమె మనసుని నొప్పించ సాగినాయి.
    అతని రూపం ఎంతో బావుంది. అందుకే అతని ఫోటో చూడడంతోనే ఆకర్షింపబడింది. కానీ అతను తన ఫోటో చూస్తే ఏమనుకుంటాడు? అంతవరకూ ఉత్తరాల ద్వారా ఏర్పడ్డ ఆత్మీయత కాస్తా దూరమయిపోతే? తన మీద అతనేర్పరచుకున్న ఇష్టం అయిష్టంగా మారిపోతే? అల్లుకున్న స్నేహం విరిగిపోతే? భరించగల శక్తి తన హృదయానికుందా? అతనిని వదులుకోగల ధైర్యం తనకెక్కడిది? అతని తీయని స్నేహం నీడలు ఇంతదూరం ప్రయాణించాక ఇప్పుడు ఆ నీడ తొలగిపోతే తన గతేమిటి? అతని చల్లని పలుకరింపు వల్లనేగా తనీ ప్రపంచాన్ని మరచిపోగలుగుతుందీ?
    ఉత్తరం తీసి మరోసారి చదువుకోసాగింది విజయ.
    "విజయగారూ!"
    మీరు అడిగారు కదా_ అందుకని ఫోటో పంపుతున్నాను. అసలు నా దగ్గర రడీగా ఫోటో లేదు. వెంటనే స్టూడియోకి పరుగెత్తి ఫోటో దిగాల్సి వచ్చింది. అందుకే ఈ రోజు ఆలస్యంగా ఉత్తరం రాస్తున్నాను. ఫోటోలు పంపుకొనేంత గొప్ప పర్సనాలిటీ కాదులెండి నాది. అయితే ఇక్కడో తమాషా ఉంది. ప్రతి మనిషీ తనకు అందం, ఆకర్షణా లేకపోయినా అందాన్నీ ఆకర్షణనీ మాత్రం ఎంతో ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. పొందడానికి ఉవ్విళ్ళూరతాడు. అవును కదా! ఇది తమాషాగా లేదూ?
    సరే ఇప్పుడీ ఉపన్యాసం ఎందుగ్గానీ. మరి నాక్కూడా మీ ఫోటో పంపకూడదూ? దయచేసి వెంటనే పంపండి. మీ జవాబుతో పాటు ఫోటో కూడా రావాలి! ఆ ఫోటో మా ఫ్యామిలీ ఆల్బమ్ లో చేరుతుంది. దాని క్రింద ప్రాణమిత్రురాలు విజయ అని రంగురంగులతో అక్షరాలూ రాస్తాను!
    నవ్వుకుంటున్నారా? ఏమిటీ మనిషని?
    నవ్వకండి!
    ప్రతి రచయితా గొప్ప మేధావి కానవసరం లేదుకదా! అక్కడక్కడా నాలాంటి పిచ్చివాళ్ళు కూడా ఉంటారు.
    ఇక ఉండనా మరి!
    వెంటనే జవాబు రాస్తారు కదూ. ఫోటో మర్చిపోకండి.
                                                                   మీ
                                                               చంద్రకాంత్.
    ఇప్పుడేమిటి చేయడం? ఆలోచనలో పడింది విజయ.
    తన ఫోటో తప్పక అతనికి నిరుత్సాహం కలుగజేస్తుంది. తను అందంగా ఉంటుందని ఊహించుకున్న అతని ఊహలు చెల్లాచెదురయిపోతే జరిగేదేమిటో తనకు తెలుసు. అతని మనసులో తనంటే ఏర్పడే ఉదాసీనత భరించే శక్తి తనకు లేదు. తనకున్న ఏకైక ఆప్తుడు అతనొక్కడే! జీవితాంతం తామిద్దరూ కలుసుకోక పోయినా ఫర్వాలేదు. అతని తీయని స్నేహం మాత్రం తనకు కావాలి.
    అతనికి జవాబు ఎలా రాయాలా అని ఆలోచిస్తూనే గడిపేసింది ఆ రోజంతా. చివరకు తన ఫోటో ప్రస్తుతానికి ఏమీ లేకపోవడం చేత తరువాత ఎప్పుడయినా దిగి పంపుతానని వివరిస్తూ రాసేసింది.
    "అమ్మాయ్!" పిలుస్తూ ఇంట్లో కొచ్చి కుర్చీలో కూర్చున్నాడు నరహరి.
    ఆ పిలుపుకి జయ విజయ ఇద్దరూ బయటికి వచ్చారు.
    "నమస్కారమండీ!" ఇద్దరూ నమస్కరించారతనికి.
    "ఏమ్మా విజయా! ఎలా ఉంది నీ ఉద్యోగం?" అడిగాడతను ఆప్యాయంగా.
    "బాగానే ఉందండీ! కొంచెం పని ఎక్కువన్నమాటేగాని మరే సమస్యా లేదు."
    "ప్రైవేట్ కంపెనీలంటే అంతేమరి! వాళ్ళిచ్చే జీతానికి రెండింతలు పని తీసుకుంటారు" నవ్వుతూ అన్నాడతను.
    ఈలోగా పార్వతి వచ్చిందక్కడికి.
    "ఏమ్మా వంట్లో కులాసాగా ఉంటోందా!" అడిగాడతను.

 Previous Page Next Page