Previous Page Next Page 
8 డౌన్ పేజి 12

    తను పూర్తిగా ఎగ్జయిట్ అయిపోయాడు.    
    "అంటే - ఆ రోజు నేను అడిగి వుంటే మీరు నన్ను వివాహం చేసుకోడానికి వప్పుకుని వుండేవారా సంధ్యా?" ఆత్రుతగా అడిగాడు.    
    "సంతోషంగా వప్పుకునేదానిని"
    "పోనీ మీరే ఆ విషయం చెప్పివుంటే..."    
    "ఎలా చెప్పను? నేను భర్త చనిపోయిన స్త్రీని! నేను అడిగితే మీరు నన్ను ఎంత లోకువగా చూస్తారోనన్న భయం. వితంతువుని చేసుకోవాల్సిన ఖర్మ నాకేమిటి అనుకుంటారేమోనన్న సంశయం-".    
    తనకూ కళ్ళ వెంబడినీళ్ళు తిరిగినయ్ అప్పుడు.    
    ఎంత దురదృష్టవంతుడు తను? ఆమె తనకు అతి చేరువగా వచ్చికూడా దూరమయిపోతోంది. ఈ జన్మకు ఇంక ఆమెకూతనకూ ఋణం తీరిపోయినట్లే-అయిదేళ్ళ తర్వాతతిరిగి సంధ్యను ఈ రోజే చూడటం-    
    తను కిటికీ పక్కనే కూర్చున్న ఆమెకు సమీపంగా వెళ్ళాక గానీ గుర్తు పట్టలేకపోయింది.
    "మైగాడ్! మీరా!"    
    "సంవత్సరం అయిపోయింది కదూ?"    
    "అవును"    
    "ఎక్కడికి వెళుతున్నారు?"    
    "విజయవాడ"    
    "ఎందుకు?"    
    "ఆరు నెలల నుంచీ విజయవాడలోనే వర్క్ చేస్తున్నాను. అక్కడికి ట్రాన్స్ ఫరయింది. ఇంతకూ మీరు ఈ బండి మీద వర్క్ చేస్తున్నారా ఏమిటి?"    
    "అవును"    
    "అయితే నన్ను సురక్షితంగా విజయవాడ చేరుస్తారు కదూ?"    
    "నామీద ఆ మాత్రం నమ్మకం లేదా?"    
    ఆమె నవ్వింది. ఆమె అందంరోజు రోజుకీ పెరుగుతూంటుందా లేక తన కళ్ళకలాకనబడుతుందా?       
    "మీ వారేరీ?"    
    "అదో పెద్ద కధలేగానీ మన ట్రెయిన్ ఇంకా బయల్దేరదేం?"    
    "వ్యాక్యూమ్ ట్రబుల్"    
    "ఇంకెంత సేపు పడుతుంది?"    
    "ఓ గంట పట్టవచ్చు-"    
    "పొద్దున్న ఆరుగంటలకయినా చేరుస్తే చాలు. మా ఆఫీస్ ఎనిమిది గంటలకు"    
    "ఆరుగంటలకు డెఫినెట్"    
    "ఇంతకీ మీకు పిల్లలెంతమంది?" అడిగిందామె.    
    "బాగుంది. పెళ్ళి అవకుండానే పిల్లల్ని కనమంటారేమిటి?"    
    ఆమె కళ్ళల్లో ఆశ్చర్యంతోపాటు కలవరం కనిపించింది.    
    "ఇంకా మీరు పెళ్ళి చేసుకోలేదా?"    
    "ఈ మధ్యే సెటిలయింది. బహుశా వచ్చేనెలలో ముహూర్తం వుంటుంది"    
    "ఇంత ఆలస్యం చేశారెందుకని?"    
    "తెలీదు-"    
    "పోనీండి! ఇప్పటికయినా ఓ ఇంటివారవుతున్నారు! నాకు హాపీగా వుంది!"    
    "ఓ.కే! విజయవాడలో బండి దిగగానే ఫ్లాట్ ఫారంమీద వెయిట్ చేయండి. నేను కలుసుకుంటాను".    
    "సరే"    
    తను వచ్చేశాడు ఇంజన్ వేపు. తనకు అప్పటినుంచి మధ్యమధ్యలో ఆమె అన్నమాటే గుర్తుకొచ్చి మనసుని వ్యాకులపరుస్తోంది. "అదో పెద్దకధలే" అంటూ సంభాషణను డైవర్ట్ చేసిందామె. ఏమిటా కధ? ఆమె భర్త గురించి ఏం కధ వుంటుంది? అతనూ చనిపోయాడా? తన ఆలోచనతనకే నవ్వు కలిగించింది.   
    ఆమె మీద తనకు ఎంతప్రేమ వున్నా గానీ ఇంతకీడు తలచటంభావ్యం కాదు.   
    "హోమ్ డేంజర్" అరిచాడు అసిస్టెంట్.    
    గురుమూర్తి అప్రయత్నంగా తనూ అరిచాడు "హోమ్ డేంజర్".    
    నిజానికి ఆ స్టేషన్ లో బండి ఆగకూడదు. అయినా ఎందుకో సిగ్నల్ యివ్వలేదు గంగినేని స్టేషన్ మాస్టర్ లైన్ ఖాళీలేకపోయి వుండవచ్చు. లేదా పాయింట్స్ ట్రబుల్ వుండవచ్చు. లేదా సిగ్నల్ ఫెయిలయివుండవచ్చు.    
    డిస్టెంట్ సిగ్నల్ దగ్గరే వ్యాక్యూమ్ అప్లయ్ చేశాడతను. బ్రేక్స్ సరిగ్గా అప్లయ్ అవటం లేదన్నవిషయం తెలుస్తూనే వుంది. ఇప్పుడు హోమ్ సిగ్నల్ కూడా 'రెడ్' కనిపించేసరికి అతనిలో కలవరం ప్రారంభమయింది.    
    ఎమర్జన్సీ బ్రేక్ నెమ్మదిగా అప్లయ్ చేయటం ప్రారంభించాడు. అయినా ఏమాత్రం ఫలితం కనిపించటం లేదు. అక్కడ పట్టాలు డౌన్ గ్రేడియెంట్ గా వుండటంతో అకస్మాత్తుగా బండివేగం పెరగసాగింది. హెడ్ లైట్ కాంతిలో పల్లానికి దిగిపోతున్న పట్టాలు కనబడుతూనే వున్నాయ్. ఏం చేయడానికీ తోచటం లేదతనికి.    
    "సిగ్నల్ రైట్, హోమ్ కాషన్" అరిచాడు అసిస్టెంట్.    
    గురుమూర్తికి ప్రాణం లేచివచ్చినట్లయింది.   
    చటుక్కున హోమ్ సిగ్నల్ వేపు చూశాడు. ఎల్లో లైట్ కనబడుతోంది. దూరంగా కనబడుతోన్న స్టార్టర్ సిగ్నల్స్ వేపు చూశాడతను. మెయిన్ లైన్ స్టార్టర్, టాప్ లైన్ స్టార్టర్  రెండూ ఎర్రలైటుతో కనబడుతున్నాయి.    
    అంటే తన బండి ఆ స్టేషన్ లో ఆగాలి. ముందు స్టేషన్ కి అంతకు ముందు బయల్దేరిన బండి ఇంకా చేరకపోవడంవల్ల తన బండిఆపే అవకాశం వుంది.    
    "స్టార్టర్ డేంజర్" అరిచాడు అసిస్టెంట్.    
    గురుమూర్తి ఉక్కిరిబిక్కిరయాడు. బండి హోమ్ సిగ్నల్ పాసవుతోందిగానీ స్పీడ్ మరింత పెరిగిపోయింది. వ్యాక్యూమ్ పూర్తిగా ఫెయిలయిపోయినట్లే! దానికి తోడు సన్నగా వర్షం. ఎమర్జెన్సీ బ్రేక్ అప్లయ్ చేయాలంటే భయంగా వుందతనికి. ఆ స్పీడ్ లో అది అప్లయ్ చేస్తే మొత్తంకోచ్ లన్నీ పడిపోతాయ్- ఒకదాని మీద ఒకటి. అయినాగానీ రిస్క్ తీసుకుని నెమ్మదిగా అప్లయ్ చేస్తూనే వున్నాడు గానీ ఏమాత్రం ప్రయోజనం కనిపించటంలేదు.    
    ఇప్పుడు స్పీడ్ ఎనబైకి చేరుకోవటం గమనించాడతను.    
    "సార్! స్పీడ్ ఎక్కువయిపోతోంది" గాభరాగా అన్నాడు అసిస్టెంట్.    
    "వ్యాక్యూమ్ పూర్తిగా ఫెయిలయిపోయింది. ఇదెలా జరిగిందో అర్ధంకావటం లేదు" అన్నాడు గురుమూర్తి గొణుక్కుంటున్నట్లు- మూడు ఎలక్ట్రికల్ స్పీడో మీటర్లలోనూ, స్పీడ్ రికార్డర్ లోనూ ఎనభై చూపుతున్నయ్. స్టార్టర్ సిగ్నల్ ని శరవేగంతో సమీపిస్తోంది బండి.    
    గురుమూర్తి మొఖం పాలిపోయింది. కాళ్ళూ చేతులూ వణకసాగినయ్. స్టార్టర్ ని బండి 'స్టాప్' పొజిషన్ లో దాటటం ఖాయం.    
    "డ్రైవర్ డేంజర్ సిగ్నల్ ని పాసయ్యాడు" అంటూ స్టేషన్ మాస్టర్ కంట్రోల్ మెసేజ్ ఇవ్వక తప్పదు.    
    కానీ తను ఆలోచిస్తోంది ఆ అంశం కాదు. ఆ బండిలో ప్రయాణం చేస్తున్న సుమారు రెండువేల మంది ప్రయాణీకుల ప్రాణాలసంగతి. ఏ క్షణంలోనయినా రెండు వేలమంది పాలిట మృత్యువుగా మారబోతోంది '8 డౌన్'    
    ఎమర్జన్సీ బ్రేక్ ఇప్పుడు ఇంజన్ వీల్స్ ని పట్టేస్తోందిగానీ ఆ స్పీడ్ లో తను అది అప్లయ్ చేయటం అవివేకం!    
    లివర్ నార్మల్ చేశాడతను.    
    ఇంక తన బండిని ఎవరూ రక్షించలేరు.    
    అతను చూస్తూండగానే బండి స్టార్టర్ సిగ్నల్ ని 'ఆన్' పొజిషన్ లో శరవేగంతో దాటేసింది. అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగినయ్. అంత చలిలోనూ చెమటలు పట్టేస్తున్నాయ్. నాలుక దాహంతోపిడచగట్టుకుపోతోంది. భయం వలన ఏర్పడిన దాహం అది!    
    "సార్! ఇవాళ్టితో మనకు ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయాయ్" తడబడుతోన్న గొంతుతో అన్నాడు అసిస్టెంట్. "విజిలెన్స్ కంట్రోల్ డివైస్ కూడా అవుటాఫ్ ఆర్డర్ అయిపోయింది"    
    "మనమే కాదు! మనబండిలో వున్న రెండువేల మంది ప్రయాణీకులవి కూడా" అన్నాడు గురుమూర్తి.    
    బండి వేగం వందకిలోమీటర్లకు పెరిగింది. గురుమూర్తికి మెదడు పనిచేయటం మానేసింది.    
    "భగవంతుడా! నువ్వొక్కడివే మా అందరినీ రక్షించాలి. ఇంకెవరివల్లాకాదు" అన్నాడు కళ్ళుమూసుకుని లోలోపల ప్రార్ధిస్తూ.    
                                                                 * * *    
    కళ్ళమీదకు కమ్ముకొస్తూన్న నిద్రమత్తునుంచి తప్పించుకోడానికి స్టేషన్ బిల్డింగ్ లో నుంచి బయటికొచ్చి నిలబడ్డాడు అసిస్టెంట్ స్టేషన్  మాస్టర్ చంద్రశేఖర్. అంతకుముందే గూడ్స్ ట్రెయిన్ ఒకటికొండపల్లికి పంపించాడతను. అదింతవరకూ కొండపల్లిచేరుకోలేదు.    
    ఈ లోగా 8 డౌన్ వచ్చేస్తూంటే మెయిన్ లైన్ మీద అడ్మిట్ చేసుకోడానికి సిగ్నల్ ఇచ్చాడు. 8 డౌన్ ఎలాగో అయిదు, పది నిముషాల్లో తన స్టేషన్ లో డిటెయిన్ అవుతుందని తనకు తెలుసు స్టేషన్ బయటచలిగాలి విదిలించికొట్టింది. దూరంగా 8 డౌన్ వేగంగా దగ్గరవుతూ కనిపిస్తోంది.    
    "డ్రైవర్ ఎవరోగాని చాలా స్పీడ్ గా దంచుకొస్తున్నాడు" అనుకున్నాడతను.        
    అయినా అది మెయిన్ లైన్ మీద ఎడ్మిషన్ కాబట్టి సరిపోయింది. అదే లూప్ లైనులోకి ఎడ్మిట్ చేసుకుంటే ఏమయేది? ఆ స్పీడ్ లో టర్న్ అవుట్ మీదకెళ్తే మొత్తంబండి డిరైల్ (తలకిందులు) అయిపోతుంది. హోమ్ సిగ్నల్ దాటుతూంటే బండి వేగం మరింతపెరగడం గమనించేసరికి  అతని నిద్రమత్తంతా ఎగిరిపోయింది.

 Previous Page Next Page