Previous Page Next Page 
నీ కలల బందీని పేజి 12


    తన కధలు బైండ్ చేయించిన పుస్తకం ఒకటి తీసి చదవమని సీత కిచ్చిందామె. ఇల్లు చేరుకొని వెంటనే ఆ కధలు చదవ సాగిందామె. సాయంత్రం లోపల అన్ని కధలూ చదవడం పూర్తీ అయిపొయింది. అయితే ప్రతి కధలోనూ ఏదో ఒక లోపం కనిపించసాగిందామెకి. అదే తను రాసి ఉన్నట్లయితే అంతకంటే అద్భుతంగా రాయగలిగి ఉండేదనిపించింది.
    అంతలోనే చటుక్కున ఓ ఆలోచన మెరుపులా మెరిసింది.
    అవును! తను మళ్ళీ కధలు రాయడం మొదలు పెడితే! తనకెందుకో నమ్మకం వుంది. తను ఖచ్చితంగా అరుణ కంటే బాగా రాయగలనని. ప్రయత్నించి చూస్తె నష్టమేముందీ? అప్పటికప్పుడే పుస్తకాల షాపుకెళ్ళి ఒక తెల్ల కాగితాల కట్ట కొనుక్కొచ్చిందామె. త్వరగా వంట ముగించేసి కాగితాలు ముందేసుకు కూర్చుంది. కధా వస్తువు ఏం తీసుకోవాలో అర్ధం కాలేదామేకి. తనకు తెలిసిన వారందరి గురించి అలోచించింది. హైస్కూల్లో చదివినప్పుడు జరిగిన సంఘటనలూ - విన్న సంఘటనలూ అన్నీ గుర్తుకు తెచ్చుకోడానికి ప్రయత్నించసాగింది. ఎలాగైతేనేం , చివరకు రెండు మూడు కధా వస్తువులు తయారయినాయి. అందులో నుంచి ఒకటి ఎన్నుకొని రచనకు ప్రారంభోత్సవం చేసింది. దిద్దటాలూ, కొట్టివేతలతో మొత్తానికి సాయంత్రానికి మూడొంతుల కధ పూర్తయి పోయింది. పూర్తీ అయిపోయేదే గాని మాధవరావు ఆఫీసు నుంచి వచ్చేయడం తో కధకి బ్రేక్ పడిపోయింది.
    "ఏమిటి కష్టపడి రాస్తున్నావ్? మీ ఇంటికి ఉత్తరమా?" అడిగాడు మాధవరావు.
    "కాదు" నవ్వుతూ అందామె.
    "మరేమిటి?"
    "చెప్పుకోండి చూద్దాం!"
    అతను కొద్ది క్షణాలు ఆలోచించాడు. గానీ ఏమి తట్టలేదు.
    "ఏమో! నాకేమీ తట్టడం లేదు. నువ్వే చెప్పెసేయ్యరాదూ?" ఆమె దగ్గరగా నడుస్తూ అడిగాడతను.
    సీత ఏమీ చెప్పలేదు. అతనే చొరవగా ఆమె చేతిలోని కాగితాలు తీసుకొని ఆత్రుతగా చదవసాగాడు. రెండు లైన్లు చదవగానే అతనికి అర్ధమయిపోయింది.
    "ఓహో! నువ్వు కధలు మళ్ళీ ప్రారంభించావంనమాట! మరి ఆ విషయం రహస్యంగా ఎందుకుంచినట్లు?" ఆమెను రెండు చేతుల్తో చుట్టేస్తూ అన్నాడతను.
    "బావుంది . కధలు రాస్తే సరిపోయిందా ఏమిటి? వాటి నేవరయినా ప్రచురించుకోవద్దూ!"
    "ఎందుకు వేసుకోరు? చాలా బాగా స్టార్ట్ చేశావ్ కధని. అసలు కధంతా చదవనీ ఓసారి ...." కాగితాలు పట్టుకొని కుర్చీలో కూర్చున్నాడతను. సీత ఆనందంగా లోపలకు పరుగెత్తి అతనికి కాఫీ తీసుకొచ్చి అందించింది.
    రాసినంత వరకూ చదివి కాగితాలు తిరిగి ఆమె కందించాడతను.
    "చాలా బాగా రాశావ్ సీతా! ముగింపు ఏమిటా అని నాకు చెడ్డ కుతూహలంగా ఉందిప్పుడు. నేను బెట్ కడతాను సీతా! ఈ కధని తప్పక ప్రచురిస్తారు చూస్తుండు......" సంతోషంతో ఉప్పొంగిపోతూ అన్నాడతను.
    "ఏమో చూద్దాంగా .........." నవ్వుతూ అంది సీత.
    ఆ రాత్రి భోజనాలవగానే మళ్ళీ కాగితాలు ముందేసుకు కూర్చుందామె. కధ పూర్తయ్యేసరికి రాత్రి 12 గంటలయింది. అంతవరకూ కేవలం ఆమె రాసిన కధ చదవాలని మేలుకుని కూర్చున్న మాధవరావు తనకు తెలీకుండానే నిద్రలోకి జారిపోయాడు. అతన్ని లేపడం ఇష్టం లేక డ్రస్సింగ్ టేబిల్ మీదుంచి తనూ పడుకొని నిద్ర పోయిందామె.
    ఉదయం ఆమెకు మెలకువ వచ్చేసరికి మాధవరావు అప్పటికే లేచి తను రాసిన కధ చదువుతూ కనిపించాడు.
    "ఎలా వుంది?" అడిగిందామె అతను చదవటం పూర్తవగానే.
    'చాలా చక్కగా ఉంది. మరి ఇంత మంచి నేర్పు ఉంచుకొని ఇంత కాలం రాయకుండా ఎందుకూరుకున్నావ్!" అడిగాడు మాధవరావు ప్రశంసా పూర్వకంగా చూస్తూ.
    "నిజంగా బాగుందని పోగుడుతున్నారా, లేక పెళ్ళాం కధ కనుక పొగడాలని పోగుడుతున్నారా?" అనుమానంగా అడిగిందామె.
    "బావుంది, బయటి వాళ్ళనయితే పొగడాగాని, నీ కెందుకు అబద్ధాలు చెప్తాను?" ఇది ఏ పత్రికకు పంపదల్చుకున్నావ్?"
    అతని మాటల్తో ఆమెకు అనందం పొంగి పొరలింది.
    అతనిని తన కధ అంతగా ఆకర్షించిందంటే తను ధైర్యంగా రచనలు చేయవచ్చన్నమాట!
    "ఏమో! ఇంకా ఏ పత్రికకు పంపేది నిర్ణయించుకోలేదు చాలా ఉన్నాయిగా! పోనీ మీరు సజెస్ట్ చేయకూడదూ!"
    అతను కొద్ది సేపు ఆలోచించాడు గానీ ఏదీ తేలలేదు.
    "పోనీ -- ఓ పని చెయ్! సాయంత్రం వరకూ అగు. మా ఆఫీసులో ఒకతను కధలు రాసేవాడున్నాడు. అతన్నాడుగుతాను ఏ పత్రిక్కి పంపమంటాడో , ఏమంటావ్."
    "సరే మర్చిపోకుండా కనుక్కురండి ........."
    "నువ్వు సాయంత్రం వరకూ ఏం జేస్తుంటావ్ మరి?"
    "ఏముంది / మామూలే -- టైపూ......."
    "టైపు నుంచి రాగానే మరో కధ ప్రారంభించు. మా వాడు అంటుంటాడు, రచయిత అవాలంటే ఒక కధ రాసి వూరుకోకూడదుట. ప్రచురించబడినా లేకపోయినా కొన్ని వందల కధలూ ఏకదాటిన రాయాలట. వాటిలో ఏ ఒక్కటీ ప్రచురించబడిన ఇంక ఆ రచయితకు డోకా లేదట" నవ్వుతూ అన్నాడు మాధవరావు.
    సాయంత్రం అతనొచ్చేలోగా మరో కధ రాయడంలో నిమగ్నమయి కనిపించిందామె.
    "వెరీ గుడ్! అదీ స్పిరిటంటే ........మా ఫ్రెండ్ ని కనుక్కొచ్చాను . ఈ మాసపత్రిక కు పంపమన్జేప్పాడు . వీళ్ళు కొత్త రచయితలను బాగా ప్రోత్సహిస్తున్నారట. అడ్రస్ కూడా రాసిచ్చాడు....." అంటూ ఓ కాగితం ఆమె చేతికిచ్చాడు.

 Previous Page Next Page