హటాత్తుగా రంగనాధన్ గొంతు మళ్ళీ మోగింది.
"అయితే ఇందుకు ఓ షరతు ఉంది -"
అందరూ ఉలిక్కిపడ్డారు.
చిరంజీవి మొఖంలో మేఘాలు కదిలాయి.
"చిరంజీవి 'తెలుగుకిరణం' దినపత్రికలో చేరి, ఆ పత్రికను ఆరునెలల్లోపల మిగతా తెలుగు దినపత్రికలన్నిటికంటే ఎక్కువ సర్క్యులేషన్ గల పత్రికగా చేయగలిగినప్పుడే పైన ఉదాహరించిన నా ఆస్తులన్నీ చిరంజీవికి చెందుతాయ్! లేనియడల నా యావదాస్తీ విభూతి బాబా ఆశ్రమానికి చెందుతుంది."
చిరంజీవి కలవరపాటుతో శివతాండవం వేపు చూశాడు.
శివతాండవం మొఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. అతను విభూతి బాబా భక్తుడు.
మళ్ళీ రంగనాధన్ చదవటం కంటిన్యూ చేశాడు.
"ఈ ఆరునెలల పాటు చిరంజీవికి కనీసావసరాల నిమిత్తం - నెలకు - రెండు వందల రూపాయల చొప్పున లభిస్తుంది."
చదివి మెడను కుడివేపుకి తిప్పి జర్క్ ఇచ్చాడు మళ్ళీ.
చిరంజీవికి నవ్వాలో ఏడవాలో తెలీటం లేదు.
తను 'తెలుగు కిరణం' పేపర్లో ఉద్యోగం చేయనన్నందుకూ, ఓల్డ్ ఫెలో ని కాదని స్వప్నను చేసుకున్నందుకూ ఇంత కక్షా! ఈ లెక్కలో తనకు ఆస్తి దక్కటం కల్ల!
ఆ 'హూప్ లెస్' న్యూస్ పేపర్ని అత్యధిక సర్క్యులేషన్ గల దిన పత్రికగా చేయటం ఎవరి తనం? మావయ్య తన జీవితమంతా దానికోసమే ప్రయత్నించి ఫెయిలయ్యాడు . అన్ని దినపత్రికల కన్నా అతి తక్కువ సర్యులేషన్ తో ఉందది ఇప్పుడు - క్రమేపీ నిరాశా, నిస్పృహ లు అతనిని అవహించేశాయి.
"ఇదిదా విషయం! ఏమప్పా సిరంజీవి! పూర్తి అర్ధం అయి ఉండాదా?" అడిగాడు రంగనాధన్.
చిరంజీవి అయోమయంగా తల ఊపాడు.
"ఈ నిమిషం నుంచి - 'తెలుగు కిరణం' డెయిలీ కి నువ్వుదా ఫుల్ ఓనరు! అర్ధామయు ఉండాదా?"
"అయింది"
"ఆరు మాసములదానే సర్క్యులేషన్ నిండా జాస్తి సేస్తివా ఆస్థి నీది దానే అవుతాది!"
చిరంజీవి మాట్లాడలేదు.
శివతాండవం లేచి నిలబడ్డాడు.
"చిరంజీవి! మీరు ఈ అరునెలలూ ఈ ఇంట్లోనే ఉండవచ్చు!" అన్నాడు బట్టతల సవరించుకుంటూ.
"అవసరం లేదు! మనం మనింటి కెళ్ళి పోదాం!" అంది స్వప్న చటుక్కున లేచి నిలబడుతూ.
శివాతాండవం , వెంకటేశ్వర్లు ఆశ్చర్యంగా ఆమె వేపు చూశారు.
స్వప్న కళ్ళల్లోనుంచి రోషం తొంగి చూస్తోంది.
చిరంజీవి తను కూడా లేచి నిలబడ్డాడు.
"థాంక్యూ లాయర్ గారూ" అనేసి స్వప్న తో పాటు బయటకు నడిచాడు.
*****
హోటల్ హుయసలలో ఏసీ రూమ్ లో కూర్చున్నాడు భవానీ శంకర్, అమ్మాయి, దీప్ చంద్.
టేబుల్ మీద సెగలు కక్కుతోంది కాఫీ.
అయితే ధారాళంగా ప్రవహిస్తోన్న భావానీశంకర్ మాటల్ని, ఆసక్తితో వినడంలో మునిగిపోయారు అమ్మాయీ, దీప్ చంద్!
"ఇన్ ఫాక్ట్ - అద్భుతమయిన ప్లాన్ ఒకటి కాదు! కొన్ని వందలున్నాయ్ నా దగ్గర. వాటిల్లో ఏ ఒక్కటి ఆచరించినా మీ డాడీ మీ ఇద్దరికీ ఇన్ స్టంట్ గా పెళ్ళి చేసి పారేస్తారు.
ప్లాన్ నంబర్ వన్-
మీ డాడీ చీఫ్ మినిస్టర్ ఆయె అవకాశం కొంచెంలో పోయినందుకు ఎంతో కోపంతో అశాంతితో మీడ్రాయింగ్ రూమ్ లో గంటకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో పచార్లు చేస్తుంటారు. అప్పుడు దీప్ చంద్ పిల్లిలా నక్కుతూ హాలు బయట కిటికీ దగ్గర కెళ్ళి కిటికిలో నుంచి లోపలకు చూస్తూ అమితోత్సాహంతో, పూర్తి మాధుర్యంతో గొంతు విప్పి -
"ఉందిలే మంచీ కాలం ముందూ ముందూనా-
అందరూ సుఖపడాలి నంద నందనా-"
అని బ్రహ్మాండంగా పాడతాడన్న మాట! మీ డాడీ ఆ పాటకు పరవశం చెందుతాడు.
"ఎవరు?" ఇంత ,మంచి పాటను - ఇంత క్లిష్ట పరిస్థితులలో పాడి నాకు పరవశత్వం కలుగాజేస్తోన్న గంధర్వుడేవరు?" అని ఆకాశం వేపు వెతుకుతూ అడుగుతారు.
సరిగ్గా అ సమయంలో మీరు ప్రవేశిస్తారన్న మాట లోపల్నుంచీ!
"అయన గంధర్వుడు కాదు డాడీ! ఫేమస్ రైటర్ దీప్ చంద్! క్లీష్ట పరిస్థితిలో వున్న అనేకమంది కిటికీల దగ్గర నిలబడి వారిని ఉత్తేజితులను చేసే పాటలు పాడి వారిని ఆనందపరుస్తుండటం ఇతని హబీ! అందుకే నేనతనిని ప్రేమించాను డాడీ! మీరు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుంటాము...." అంటారు మీరు. డాడీ ఆనందంగా బయటకు పరుగెత్తి దీప్ చంద్ ని ఇంట్లోకి లాక్కొచ్చి కౌగలించుకొని అనండభాష్పాలు విడుస్తారు." ఇంత వెన్నపూస హృదయం గలవాడినా - నేనారోజు ఇంట్లో నుంచి కనబడకుండా పరుగేత్తమని అరసేకను టైమిచ్చింది? నన్ను క్షమించు దీప్ చంద్ - క్షమించు -' అంటారన్న మాట-"
నెమ్మదిగా తెరపడుతుంది.
"ఎలా వుందది?" అడిగాడు భవానీశంకర్!
అమ్మాయికి ఇదేదో కొంచెం ఎడ్వంచరస్ గానే ఉన్నట్లనిపించింది గానీ దీప్ చంద్ కి మాత్రం బొత్తిగా నచ్చలేదు.
అయితే ఆ విషయం ఠకీ మని చెప్పేస్తే అమ్మాయి విరుచు'పడుతుందెమోనని జంకుగా అమ్మాయి వేపు చూశాడు.
"చెప్పు దీప్ చంద్!...." అంది అమ్మాయి కూడా అతనికే ఛాయిస్ ఇస్తూ.
"బాగానే ఉంది గానీ .......ఇంతకన్నా మంచిదేదయినా...."
భవానీశంకర్ టక్కున అందుకున్నాడు.
"ఒకే మైడియర్ ఫ్రెండ్! వదిలేసెయ్-
ప్లాన్ నెంబర్ టూ-
మెంబర్ ఆఫ్ పార్లమెంటు బీమారావ్ - తమ ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఆయె అవకాశం పోయినందుకు దిగులుతో వాళ్ళింటి ముందు లాన్స్ లో కూర్చుని ఉంటారు. అప్పుడు కాంపౌండ్ బయట నుంచి ఓ రాయి విసురుగా వచ్చి అయన తలకి తగుల్తుంది.
అయన అబ్బా! అని తల మీద చేయి పెట్టుకునేసరికి రక్తం తడిగా తగుల్తుంది. సరిగ్గా ఆ సమయంలో దీప్ చంద్ గేటు తీసుకుని ఓ ట్రేలో బాండెడ్, టించర్, అయోడిన్ కాటన్ తో లోపలి కొస్తాడు. అయన తలకయిన గాయానికి నొప్పి తెలీకుండా కట్టు కట్టేస్తాడు.
అయన ఆశ్చర్యంగా , ప్రేమగా దీప్ చంద్ వంక చూస్తుంటాడు.
"బాబూ! ఇంత క్లిష్ట పరిస్థితులో వచ్చి నాకింత సహాయం చేశావ్! ఎవర్నువ్వు? నీ ఋణం ఎలా తీర్చుకోవాలి?" అనడుగుతారు దగ్గుతూ.
అప్పుడు మీరు లోపల్నుంచి నెమ్మదిగా లాన్స్ లో కొస్తారు.
"ఈయన ఫేమస్ రచయిత దీప్ చంద్ డాడీ! గాయాలు తగిలిన వారందరికీ కట్లు కట్టడం ఈయనకు హాబీ! ఎన్.సి.సి. లో 'సి' సర్టిఫికేట్ కూడా ఇచ్చారీయనకు - మీరు అంగీకరిస్తే మేమిద్దరం వివాహం చేసుకుంటాం డాడీ౧ మీరసలే రాజకీయాలో ఉన్నారు. ఎప్పుడే ప్రదర్శన జరుగుతుందో తెలీదు.
మీరు పార్టీ మారినప్పుడల్లా ఎవరే రాయి వేస్తారో తెలీదు. అలాంటప్పుడు ఇలా ఇరవై నాలుగ్గంటలూ బాన్దేజీం టింక్చర్, అయోడిన్, కాటన్ తో సిద్దంగా ఉండే అల్లుడు ఇంట్లోనే ఉంటే ఎంత బావుంటుంది?" అంటారు. అయన నెమ్మదిగా లేచి దీప్ చంద్ ని కౌగలించుకుంటారు.
"వ్వాట్? ఇంతటి అమృతహృదయుడ్నేనా నేను నా కళ్ళకు కనబడకుండా అరసెకనులో పరుగేత్తమని ఆదేశించాను? క్షమించు దీప్ చంద్ - క్షమించు ...." అంటారు.
నెమ్మదిగా తెరపడుతుంది -- "సుఖాంతం " అన్న అక్షరాలూ పడతాయ్. ఎలా వుంది?" అడిగాడు భవానీశంకర్ ఉత్సాహంగా.
"ఒండర్ పుల్ ...." అంది అమ్మాయ్ అతనిని అభినందన పూర్వకంగాచూస్తూ, తన తండ్రి తలకు అనేకసార్లు ప్రదర్శనల్లో గాయాలు కావటం కొత్తేమీ కాదు.
ఇన్ని అద్భుతమయిన ఉపాయాలు భవానీశంకర్ బుర్రలో నుంచి వరుసగా బయటికొస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది! ఇలాంటి 'త్రిల్' నే తను దీప్ చంద్ నుంచి ఆశించింది. కానీ....
"కానీ....." అన్నాడు దీప్ చంద్ బెరుగ్గా.
"ఊ- కానీ?" అడిగాడు భవానీ శంకర్.
"కానీ....." అన్నాడు దీప్ చంద్ ...." బయటి నుంచి రాయి వచ్చి వాళ్ళ డాడీ కెట్లా తగులుతుంది?"
"వెరీ రీజనబుల్ ప్రశ్న! ఇలా ప్రశ్నలడిగే బాలురంటే నాకెంతో ఇష్టం! బయటనుంచీ రాయి ఎలా వచ్చి ఆయనకు తగుల్తుంది? అని కదూ అడిగావ్! వెరీ ఇంటిలిజెంట్ కొశ్చన్! ఆ రాయి ముందు నువ్వే వేస్తావ్! అంచేత తగుల్తుంది...."
దీప్ చంద్ ఆ ఊహకే వణికిపోయాడు....
"నేనా? ఊహు!నావల్ల కాదు ...." అన్నాడు ఖచ్చితంగా.
అమ్మాయి అతని వేపు చిరాగ్గా చూసింది. భవానీ శంకర్ అతని వేపు జాలిగా చూశాడు.
'అల్ రైట్ మై బాయ్-
ప్లాన్ నెంబర్ త్రీ -
ఒక యువకుడు నున్నని క్రాపుతో రేపు ఉదయం ఏడు గంటల కల్లా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ భీమారావ్ ఇంటి కెళ్తాడు. డోర్ బెల్ కొట్టి వినయంగా చేతులు కట్టుకుని నిలబడతాడు.