"అంటే ఇప్పుడీ ఫోటోలోని అమ్మాయికి మీరు రాస్తారన్న మాట!" దొంగను పట్టేసినట్లు అందామె.
"రాస్తానంటే ఇప్పుడు రాస్తానని కాదు డియర్! మన టెరిఫిక్ సామర్థ్యం, భాష మీదున్న కమాండ్ గురించి మాట్లాడుతున్నాను."
"నో. సారీ? నమ్మటానికి వీల్లేదు మగాళ్ళను!"
"వెరీబాడ్ డియర్. ఇలా మగాళ్ళందరినీ ఒకటిగా."
"ఇంక మీరు వెళితే నా పని చేసుకుంటాను."
"పోనీ ఇంకో విషయం మాట్లాడదాం. టాపిక్ ఛేంజ్."
"ఏమిటది?"
"మీకెప్పుడయినా, ఎవరయినా ప్రేమలేఖలు రాశారా?"
"మీ కనవసరం."
"అక్కడే మీరు పొరబడ్డారు డియర్! దానినిబట్టే నేను మీ సైకాలజీ స్టడీ చేయటానికి వీలుంటుంది. ఉదాహరణకు మీకు బోలెడుమంది ప్రేమలేఖలు గుప్పించేశారనుకోండి. దాంతో మీ అందం మీద మీకు ఆత్మవిశ్వాసం పెరిగిపోయి_ ప్రేమలేఖలు రాసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసేస్తారు. ఉదాహరణకు మీకు అస్సలెవరూ ఒక్క ప్రేమలేఖ కూడా రాయలేదనుకోండి! దాంతో మీకు మీ ఎట్రాక్షన్ పవర్ మీద ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోయి_ ప్రేమలేఖలు రాయాలనుకునే వారందరికీ అడ్డుపడిపోతుంటారు కనుక_"
"మీరు వెళతారా లేదా?" కోపంగా అందామె. భవానీశంకర్ బయటికొచ్చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం ఆఫీస్ లో కూర్చుని 'వెన్నెల' అడ్రస్ ఎలా సంపాదించటమా అని ఆలోచిస్తూంటే మిసెస్ చందన వచ్చిందతని దగ్గరకు.
"ఏమండోయ్ ప్రేమికుడుగారూ? ఎనీ సక్సెస్?"
"లేదు మేడమ్! నిన్న తేజస్సు ఆఫీస్ కెళితే ఓ ప్రేమంటే తెలీని పిల్ల తరిమి కొట్టింది."
"అందరూ నాలాగా మంచివాళ్ళుండరు." నవ్వుతూ అందామె.
"ఇప్పుడు నాకేం దారి మేడమ్? ఆ రాకాసి పిల్లను ఎలా మంచి చేసుకోవటం?" దిగులుగా అడిగాడు భవానీశంకర్.
"ముందాపిల్లనే ప్రేమించండి! అప్పుడు సహాయం చేస్తుంది"
"ఏడ్చినట్లుంది"
"లేకపోతే ఇంకోపని చేద్దాం! ఆ కాగితం నాకివ్వండి. నేను రేపొక రోజు శెలవుపెట్టి హైద్రాబాద్ లో మాసపత్రికల ఆఫీసులన్నీ తిరిగి చెక్ చేసుకొస్తాను"
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు.
"ఇందుకు ప్రతిఫలంగా నేనేంచేయాలి? వీక్లీ కవర్ మీద ముఖచిత్రం మీది వేయాలా?"
చందన అతని భుజం మీద చరిచింది నవ్వుతూ.
"ఏమీ అక్కర్లేదులే. కేవలం మీమీద జాలి! అంతే."
"నిజంగానా?"
"యస్! అయ్ నో వాటీజ్ లవ్! నేనూ ఒకప్పుడు ప్రేమలో పడ్డదాన్నే"
"థాంక్యూ మేడమ్! మీరీ సహాయంచేస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను"
"అనెసిసరీ" అందామె.
మర్నాడంతా ఆమె దగ్గర్నుంచి ఎప్పటికప్పుడు ఫోన్ వస్తుందేమోనని ఎదురుచూస్తూ గడిపాడతను. సాయంత్రం అయిదయిపోయినా ఫోన్ రాలేదు.
ఆఫీస్ నుంచి రూమ్ కి బయల్దేరుతుంటే రోడ్డు మీద ఎదురువచ్చిందామె.
"అయామ్ సారీ! సిటీ నుంచే వచ్చే మాసపత్రికలు వేటిలోనూ లేదా పేజీ"
భవానీశంకర్ నిరుత్సాహపడిపోయాడు.
"ఓ.కే. మేడమ్. రేపే నేను విజయవాడ, మద్రాస్ కూడా వెళ్ళి వస్తాను"
"అంతకంటే గత్యంతరం లేదనుకుంటాను"
"ప్రేమ గుడ్డిది, ప్రేమ పిచ్చిది అంటూ ఏవేవో అన్నారుగానీ ప్రేమ ఇంత కష్టమైనది అని ఎవరూ అనలేదెందుకనంటారు?"
"సక్సెస్ అయ్యాక ఆ కష్టం తెలీదు కాబట్టి"
"ఓ.కే. థాంక్యూ మేడమ్_వస్తాను"
"సీ యూ_"
ఆ రాత్రంతా భవానీశంకర్ కి నిద్రపట్టలేదు. మర్నాడు సాంబమూర్తి దగ్గరకెళ్ళి శెలవు తీసుకుని విజయవాడ వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడతను. అక్కడ అంకుల్ కి కనబడకుండా మాసపత్రికల ఆఫీస్ లన్నీ తిరిగి అదే రాత్రికి మద్రాస్ వెళ్ళిపోవాలి. వీటన్నిటికి తన దగ్గరున్న డబ్బు చాలదు ఎలా? ఏంచేయడానికి తోచలేదతనికి. ఉండుండి ఆ అమ్మాయి రూపమే కళ్ళముందు కనబడుతోంది.
చివరకు తాను పడుతున్న శ్రమంతా వృధా కాదుగదా! తీరా తనా అమ్మాయిని కనుక్కోగలిగాక ఆ అమ్మాయికి పెళ్ళయిపోయి ఉంటే లేదా ఆ అమ్మాయి ఇంకెవరినయినా ప్రేమించి ఉంటే.
ఆ ఆలోచనలంతగా నచ్చటం లేదతనికి. ఆ అమ్మాయి ఎక్కడో చోట ఇదే అందంతో, ఇంకా కన్యగానే ఉండి ఉంటుందనిపిస్తోంది.
తన ప్రేమను అంగీకరిస్తుందని తనను వివాహం చేసుకుంటుందని ఆశ. తెల్లారుజామున మూడింటికి నిద్ర పట్టిందతనికి. నిద్రపోయిన ఆ కాసేపూకూడా ఆ అమ్మాయే కలల్లో విహరించింది.
"నీకోసమే ఎదుర్చూస్తున్నా భవానీ" అని చెవిలో చెప్పినట్లనిపించసాగింది.
* * * *
మర్నాడు ఆఫీస్ కెళ్ళేసరికి ఆలస్యమయిపోయిందతనికి. అప్పటికే సాంబమూర్తి నుంచి రెండుసార్లు పిలుపు వచ్చిందతనికి. తిన్నగా సాంబమూర్తి రూమ్ కి చేరుకున్నాడు.
"హల్లో భవానీ! వీక్లీలో నువ్ చేసిన మార్పులు చూశాను" అన్నాడతను ఆనందంగా.
"డాక్టర్ సలహాలు తీసేసి దాని స్థానంలో వాత్సాయన కామసూత్రాలు ప్రచురించబోతున్నామన్న ప్రకటన సూపర్బ్_నాకు ఇప్పటికిప్పుడే బోలెడుమంది ఫోనులు చేసి అభినందనలు చెప్తున్నారు"
"థాంక్యూ అంకుల్_ ఇది మన టాలెంట్స్ లో మచ్చుక మాత్రమే! ఇంకా చాలా చేయాల్సి ఉంది."
"కారీ ఆన్ డియర్! కారీ ఆన్! ఆ రంగారావ్ ఏంచెప్పినా పట్టించుకోకు! అతను ఇకనుంచి పేరుకే ఎడిటర్ గానీ ప్రాక్టికల్ గా నువ్వే అన్నీ చూచుకో"
"ఓ కే. అంకుల్ అన్నట్లు నాకు రెండురోజులు లీవ్..."
"నోనోనో లీవ్ మాత్రం అడగకు. చేరిన మూడు నెలల వరకూ ఎవ్వరికీ లీవ్ ఇవ్వరిక్కడ"
"కాని మరి..."
"కొంపలు మునిగినా సరే! నో_లీవ్"
"ఒకవేళ జ్వరమొస్తే అంకుల్?"
"అది వేరేవిషయం"
"థాంక్యూ అంకుల్" అనేసి లేచి తన గదిలో కొచ్చాడతను. అర్జంటుగా ఓ డాక్టర్ దగ్గరకు వెళ్ళి తనకు జ్వరం వచ్చినట్లు ఓ సర్టిఫికెట్ తీసుకోవాలి. అంతే లీవ్ శాంక్షన్ అయిపోతుంది.
"హలో గుడ్ మాణింగ్ సర్" ఓ గిరజాల యువకుడు హడావుడిగా వచ్చి భవానీశంకర్ కెదురుగ్గా కూర్చున్నాడు.
"యస్, మైడియర్ యంగ్ మాన్!"
"నా పేరు రాజు! నేను పొయిట్రి రాస్తాను"
"ఓ! అలాగా! చాలా సంతోషం బ్రదర్ రాయండి! జాతీయ సమైక్యత మీద రాస్తారనటంలో నాకేమాత్రం అనుమానం లేదు"
"పొరబాటు పడ్డారు సార్! నేను గవర్నమెంట్ కవినికాదు! ప్రైవేట్ పొయిట్! అన్నిటిమీదా కవిత్వం రాస్తాను. ఒక్క ప్రభుత్వం గురించి తప్ప! ఎక్కువగా ప్రేమ మీద రాస్తాను"
"ఐసీ_అయితే మీరు ప్రేమేరా జీవితం టైప్ అన్నమాట!"
"అవును సార్! ఇవిగో ఇదివరకు నేను రాసిన ప్రేమ కవితలు_విరహ కవితలు" భవానీశంకర్ వాటిని దూరంగా నెట్టేశాడు.
"ఇప్పుడు మన వీక్లీలో వాటికి చోటులేదు బ్రదర్! హౌస్ ఫుల్ అయిపోయింది కనుక"