Previous Page Next Page 
ఆత్మబలి పేజి 12


    "రోజూ తలనొప్పిగా ఉందని మాట్లాడకుండా పడుకునేవారుగా!"
    శోభ ఫకాలున నవ్వింది. రావు సిగ్గుపడ్డాడు. అయినా, శోభ కనపడకపోవటం వల్ల తను బాధపడ్తున్నట్లు శోభకు తెలియటం అతనికి సంతోషంగానే ఉంది.
    శోభ ఎందుకు నవ్విందో తనకు తెలియకపోయినా, తనూ నవ్వింది ఆశ.
    ఆశను దగ్గరకు తీసుకుని ముద్దుపెట్టుకున్నాడు రావు.
    "ఆశా! భోజనానికి రా అమ్మా!" ముద్దుగా పిలిచింది ఆయా!
    ఆశ బెదురుగా శోభ వంక చూస్తూ "టీచర్! మీరూ భోజనం చేస్తారా?" అంది. శోభ ఆశ్చర్యపోయింది. రావు ముఖం వికసించింది. లాలనగా ఆశ చెక్కిళ్ళు నిమురుతూ "ఇవాళ కాదు ఆశా! ఇంకొక రోజు తప్పకుండా తింటాను. ఇవాళ నువ్వు తినిరా తల్లీ!" అంది.
    ఆశ తృప్తిపడి వెళ్ళిపోయింది. హాలులో రావు, శోభ మాత్రమే మిగిలారు. ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి. ఇద్దరికీ ఒకరిని విడిచి మరొకరు ఉండలేరనేది అర్థమయిపోయింది. రావు తడబడే అడుగులతో శోభను సమీపించాడు. రెండు చేతులతో శోభను చుట్టి బలంగా గుండెలకు హత్తుకుని "నువ్వు నాదానివి శోభా! కాదనకు." అన్నాడు గుసగుసగా.
    శోభ శరీరంలోని అణువణువూ పులకించింది. అతని హృదయానికి మరింత హత్తుకుపోయి "కాదని ఎలా అంటాను? జన్మ జన్మలకూ మీదానిని." అంది.
    తన చూపుడువేలి ఉంగరం తీసి శోభ మధ్యవేలికి పెట్టాడు రావు. వారించబోయిన శోభ చేతిని అలాగే పట్టుకుని పెదవుల దగ్గిరకు తీసుకున్నాడు.
    "ఈనాటితో మనమిద్దరం ఒకటయ్యాం శోభా! ఏ గొడవా లేకుండా రిజిష్టర్ మారేజ్ చేసుకుందాం."
    "నాకూ అదే ఇష్టం. కాని, కొంతకాలం ఆగలేరా?"
    "నీ ఇష్టం దేవీ! నీకోసం ఎంతకాలమైనా నిరీక్షిస్తాను. కారణం తెలుసుకోవచ్చా?"
    "స్థిమితంగా చెపుతాను."
    "నువ్వు అంగీకరించిందే పదివేలు. నువ్వెప్పుడంటే అప్పుడే."
    శోభను మళ్ళీ దగ్గరకు తీసుకుని పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు.
    "ఇంత మధువు ఈ చిన్ని పెదవులలో ఎలా దాగింది శోభా!"
    "దాగిలేదు. మీ పెదవుల నుండి ప్రవహించింది."
    "అల్లరిపిల్లవి. ఈ చైతన్యమే నన్ను నీవాడ్ని చేసింది."
    "ఒట్టి చిలిపి మనుష్యులు! ఈ చమత్కారమే నన్ను మీదానిని చేసింది."
    ఇద్దరూ నవ్వుకున్నారు. ఆశ వస్తున్న అలికిడైంది. ఇద్దరూ విడిపోయారు.  


                                      10


    ఆశకు టీచర్ గా రోజూ రావు ఇంటికి వెళ్తోంది శోభ. ఈ విషయం ఇంట్లో చిన్న దుమారం లేపింది.
    "ఆడవాళ్ళు లేని ఆ ఇంటికి నువ్వు రోజూ వెళ్ళడానికి వీల్లేదు శోభా!" ఆజ్ఞాపిస్తూ అన్నాడు ప్రభాకరం.
    "వెళ్ళడానికి నిర్ణయమయిపోయింది అన్నయ్యా." శాంతంగా అంది శోభ.
    "నిర్ణయం ఎవరు చేశారు?" గర్జించాడు ప్రభాకరం.
    "నేనే చేసుకున్నాను."
    "నీ ఇష్టం వచ్చినట్లు నిర్ణయించుకునే అధికారం నీకెక్కడిది?"
    "నాకు మైనారిటీ తీరిపోయింది."
    ఈ పెంకె సమాధానాలతో ప్రభాకరానికి మండిపోయింది.
    "కాని, ఇంకా మామీద ఆధారపడే జీవిస్తున్నావు."
    "మీమీద 'ఆధారపడి' కాదు. మీతో 'కలిసి' జీవిస్తున్నాను.
    "అది. అదీ అసలు పొగరు. సంపాదిస్తున్నానని గర్వం. బోడి ఉద్యోగం. పోనీ గదా అని చెయ్యనిస్తూంటే పెట్రేగిపోతూంది. నువ్వు అసలీ ఉద్యోగం చెయ్యడానికి వీల్లేదు."
    అంతవరకూ శాంతంగా ఉన్న శోభ 'ఉద్యోగం వీల్లే'దనేసరికి మండిపోయింది.
    "కేవలం నాకంటే రెండు మూడు సంవత్సరాలు ముందు పుట్టిన కారణం చేత నామీద అధికారం చెలాయించకన్నయ్యా! అన్నగా నీ బాధ్యత ఏది నిర్వర్తించావని అన్నగా అధికారం చెలాయిస్తున్నావు? నువ్వు వీల్లేదన్నంత మాత్రాన ఉద్యోగం మానేస్తాననే అనుకుంటున్నావా? ఎందుకు తెలిసితెలిసి నీమాట తేలికపరచుకుంటావు?"
    ప్రభాకరానికి ఒళ్ళు తెలియలేదు.
    "ఛీ! ఛండాలురాలా! నా ఇంట్లోంచి అవతలకు పో!" అని అరిచాడు.
    "నన్నేం తిట్టినా నువ్వు నాకు అన్నవు. ఈ ఇల్లు నువ్వు కట్టించింది కాదు. తాతల నాటిది. ఈ ఇంట్లో ఒక చాప పరుచుకుని పడుకునే పాటి స్థలం నాది కాకపోదు. అంతకంటే ఎక్కువ స్థలం నేనాక్రమించటం లేదు.
    శోభ విసురుగా లోపలిగదిలోకెళ్ళి చాపమీద పడుకుంది.
    "ఉమ బంగారుతల్లి. దేవత! మా వంశంలో ఈ రాక్షసి ఎలా పుట్టుకొచ్చిందో?" కసిగా అన్నాడు ప్రభాకరం. శోభకు వినపడాలనే గట్టిగా అన్నాడు. వినపడింది. అయినా మాట్లాడక ఊరుకొంది.
    అదేం విచిత్రమో! అవతలివాళ్ళు మాట్లాడక ఊరుకున్నకొద్దీ ఇంకా ఇంకా అనబుద్దేస్తుంది. అవతలివాళ్ళు రెచ్చిపోయి దెబ్బలాడ్తేకాని సంతృప్తి కలుగదు.
    "ఈ తిరుగుళ్ళు మరిగి పెళ్ళి వద్దంటుంది. పెళ్ళి చేసుకుంటే, ఈ ఆటలెలా సాగుతాయి మరి?"
    అప్పటికీ శోభ సమాధానమివ్వలేదు.
    "వంక పెట్టాలనే దృష్టితో చూస్తే అన్నీ వంకలే! రావు మన కులం కాదు. రెండో పెళ్ళి. ఇది నచ్చింది కాబోలు!"
    "..........."
    "పోనీ, పెళ్ళి చేసేసుకోరాదూ! 'ఏదో కర్మ' అని నోరు మూసుకుంటాం! పెళ్ళి కాకుండా ఈ తిరుగుళ్ళేవిఁటీ? ఇది భోగం కొంపకాదు."
    "..........."
    ప్రభాకరానికి విసుగేసింది. మాటకుమాట సమాధానం చెప్పే శోభ ఇంతింత మాటలంటున్నా ఊరుకోవటం ఆశ్చర్యమనిపించింది. కసి పెరిగింది.
    "నాన్నగారు అదృష్టవంతులు. ఇదంతా చూడకుండా వెళ్ళిపోయారు. నేను మిగిలాను" అనేసి వెళ్ళిపోయాడు.
    శోభ ఆరోజు అన్నానికి లేవలేదు. పార్వతి తన కూతురు రాణితో కబురు చేసింది. "నాకొద్దు" అంది శోభ. ఆమెనింకెవ్వరూ బ్రతిమాలలేదు.

 Previous Page Next Page