సుదూరంలో ఉన్న శుభోదయం
పార్కులో తన ఎదురుగా తల వంచుకుని కూర్చున్న సునీతను చూస్తూ చిన్నగా నవ్వి "పెళ్ళి చూపుల వరకూ నేను అనుకున్నట్లుగా ఆధునిక పద్ధతులలోనే సాగింది. ఇకముందు మన దాంపత్యం కూడా ఇలాగే ఆధునికంగా సాగాలి!" అన్నాడు మాధవ్__
ఈ పెళ్ళిచూపులు సునీతకే వింతగా ఉన్నాయ్ - అటు పెద్దవాళ్ళూ, ఇటు పెద్దవాళ్ళూ రెండువైపులా కూర్చోవడమూ... మధ్యన పెళ్ళికూతుర్ని కూచోబెట్టి అర్ధంలేని ప్రశ్నలడగటమూ ఇదంతా వీల్లేదన్నాడు మాధవ్... తను పార్క్ కి వస్తానన్నాడు. పెళ్లికూతుర్ని కూడా పార్క్ కి తీసుకు రమ్మన్నాడు__మాధవ్ పట్ల సదభిప్రాయం ఏర్పడిన సునీత అన్న అన్నింటికీ ఒప్పుకున్నాడు. ఈ ఏర్పాటు సునీతకెంత సంతోషంగా ఉందో అంత భయంగా వుంది. మాధవ్ మాటలకు వెంటనే సమాధానం చెప్పలేకపోయింది...
"మాట్లాడరేం ?" రెట్టించాడు మాధవ్ ...
"ఆధునికంగా అంటే ? బార్ లకు వెళ్ళి... బాత్ రూం డాన్స్ లు చేస్తూ... అదా?" నవ్వింది సునీత ...
"ఛ! ఛ! అదికాదు..." తడబడ్డాడు మాధవ్ ...
"ఆధునికంగా అంటే నా ఉద్దేశం పెళ్ళిఅయిన పిల్లలు కావాలనకుండా కొంతకాలం అది..."
సునీత ముఖం సిగ్గుతో కందిపోయింది....
"సారీ ! ముందే ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నానని అనుకోకండి__ముఖ్యంగా ఇలాంటి విషయాల్లోనే ఒక Under Standings కి రావాలి. మీకు ఏమైనా అభ్యంతరముంటే..."
సునీత సిగ్గుపడుతూనే సమాధానం చెప్పింది.
"ఇందులో అభ్యంతరానికేముందీ ? ఈ రోజుల్లో అందరూ కోరుకుంటున్నదే ఇదీ !...."
"అవుననుకోండి ! కానీ, ఇందులో చిన్న చిక్కు ఉంది. మా అమ్మ ఒట్టి పాతకాలపు మనిషి __ నా పెళ్ళి మాట తలచుకోగానే "మనవణ్ని" కూడా తలచుకోకుండా ఉండదు. మా నాన్నగారు చిన్నప్పుడే పోయారు_ అప్పటి నుండీ మా అమ్మ నన్నే సర్వంగా చూసుకుంటూ బ్రతికింది. అర్ధంచేసుకోండి_ ఆవిడ మనసు కష్టపెట్టలేను_మన ఆలోచన రహస్యంగా ఉంచుకోవాలి..."
ఆశ్చర్యంగా వింది సునీత ...
"ఆవిడ అంత పాతకాలపు మనిషి అయినప్పుడు ఈ రకమైన పెళ్ళి చూపులకు ఒప్పుకోవటం వింతగానే వుంది_"
నర్వస్ గా కదిలాడు మాధవ్ ...
"ఆవిడకు ఈ ఏర్పాటు తెలియదు__"
గతుక్కుమంది సునీత...
"అయితే... ..."
"మా అమ్మ మళ్ళీ మిమ్మల్ని చూడటానికి వస్తుంది_అప్పుడు నేను రాను__ "నువ్వు చూస్తే చాలు! నేను చూడనక్కర్లేదు__" అంటాను..."
తెల్లబోయింది...మాధవ్ ఆధునిక భావాల్లోని అతి భాందసత్వం సునీతను అయోమయంలో పడేస్తోంది...
"ఒకవేళ మీ అమ్మగారికి ఇష్టంలేకపోతేనో ?" అంది...
"ఆ భయం అక్కర్లేదు - మా అమ్మకు నచ్చేలాగ నేను నచ్చజెప్పగలను..."
సునీత కెందుకో కాస్త చికాకు కలిగింది... కానీ తన ఎదుట ఉన్న వరుడు అందగాడు_ ఉద్యోగస్థుడు- అన్నిటికంటె కట్నం అడగకుండా పెళ్ళిచేసుకోవటానికి సిద్ధపడినవాడు- అందుకే ఏం మాట్లాడలేకపోయింది...
"ప్లీజ్! మీరు నాకోసం ... అదీ నేనంటే ఇష్టముంటేనే- మా అమ్మతో కాస్త సర్దుకోవాలి! ముందుగానే ఇది విన్నవించుకుంటున్నాను...."
అతని నిష్కపట ధోరణి సునీతకు నచ్చింది. "విన్నవించుకుంటున్నాను_" అనడం నవ్వు తెప్పించింది__ "తప్పకుండా అలాగే సర్దుకుంటాను. నాకు మాత్రం పెద్దలంటే గౌరవం లేదనుకున్నారా?" అంది__
"అయితే నేను మీకు నచ్చినట్లేనన్న మాట !"
హుషారుగా చిలిపిగా అన్నాడు మాధవ్ ...
తల వంచుకుని నవ్వింది సునీత....
ఆ తరువాత వారం రోజులకే వచ్చింది వెంకటమ్మగారు...మనిషి మంచిదిలాగానే ఉంది కాని చాదస్తం ఇంతా అంతా కాదు...
"పిల్ల లక్షణంగా వుంది_ మావాడు నిన్ను గురించి అంతా చెప్పాడమ్మా! నీకు నోములూ వ్రతాలూ అంటే ఇష్టంటకదూ! భజనపాటలు బాగా పాడుతావుట ! రామాయణ భాగవతాలు చదువుతానట ..."
ఈ వరసన ఆవిడ మాట్లాడుతోంటే సునీత కళ్ళప్పజెప్పి కూర్చుంది... "ఎందుకిన్ని అబద్ధాలు?" అని లోలోపల గుబగుబలాడింది...
అక్కడితో ఆగలేదు వెంకటమ్మగారు__
"మావాడున్నాడు చూసావ్ ? ఈ కాలపు మనిషికాడు-పిల్లను చూసుకోడానికి రమ్మని ఎంత అడిగాననుకున్నావ్ ? నువ్వు చూస్తే చాలమ్మా ! నేను చూడక్కర్లేదు అన్నాడు__నేనంటే అంత గురి వాడికి...."
ఆగి ఒక్కసారి గర్వంగా నవ్వి మళ్ళీ అంది వెంకటమ్మగారు "ఇదిగో అమ్మాయ్! ఒక వేళ నువ్వు మావాడిని చూడాలనుకుంటే చెప్పు - పిలిపిస్తాను__"
"ఎందుకులెండి ! మీ అబ్బాయిలాగే పెద్దలమాట నేనూ కాదనలేను__" చిన్నగా నవ్వుతూ సమాధానం చెప్పింది సునీత...
"నా తల్లీ?" మురిసిపోయింది వెంకటమ్మ ...
"ఏడాది తిరిగేలోగా నాకు గుమ్మడిపండులాంటి మనవణ్ని యివ్వాలి సుమా !" హెచ్చరించింది__
సునీత మనసు ఎలాగో అయిపోయింది - మాట్లాడలేక పోయింది. అదంతా సిగ్గు అనుకుని మరింత మురిసిపోయింది వెంకటమ్మ....
సునీతా మాధవ్ లకు మహా వైభవంగా పెళ్ళి జరిగింది. మూడు నెలల కాలం ముచ్చటగా జరిగింది. ఆ తరువాత వెంకటమ్మ నస ప్రారంభమయింది ...
ప్రతినెలా "ఏమైనా విశేషమా?" అని కోడలినడగటమూ, సునీత ఏమీ లేదనగానే ముఖం ముడ్చుకోనటమూ ... ఇదంతా మాధవ్ కు చెప్పింది సునీత...