Previous Page Next Page 
అజ్ఞాత బంధాలు పేజి 12


    ఎవరూ వినకపోతేనేం? తనే వీణ వాయించుకొంటే? మణిమాల వచ్చేవరకూ ఎలాగూ తను వెళ్ళటానికి వీలులేదు.
    వీణ శ్రుతి చేసుకుని తనను తను మరిచి వాయించుకోసాగింది లలిత.
    మణిమాల కారు దిగి లోపలికి వచ్చేవరకూ అలా వాయిస్తూనే ఉంది. మణిమాలను చూసి ఆపుచేసింది.
    ఆశ్చర్యంగా లలితను చూస్తూ "అరె! ఆ కన్నీళ్లేమిటి?" అంది.
    లలిత సిగ్గుపడుతూ కళ్ళు తుడుచుకుని "అప్పుడప్పుడు, వీణలో లీనమయినపుడు, నాకిలా కళ్ళ నీళ్ళు తిరుగుతుంటాయి. విశేషమేం లేదు!" అంది.
    డ్రాయింగ్ రూంలోంచి బెడ్ రూంలోకి వెళ్ళడానికి కర్టెన్ ఒత్తిగించిన మణిమాల మరోసారి విస్తుపోయింది.
    "మాధవ్! నువ్వీ గదిలోకి ఎప్పుడొచ్చావ్! నీ కళ్లలోనూ నీళ్ళు."
    మణిమాల మాటలతో ఆ గదిలో కుర్చీలో కూర్చున్న మాధవరావును చూసి బిడియపడింది లలిత. మధ్యతెర అడ్డుగా ఉండటం వల్ల, మనసంతా సంగీతంలో లీనం కావటం వల్ల అతనెప్పుడొచ్చాడో లలిత గమనించనే లేదు.
    మాధవరావు తన జేబులోనుండి రుమాలు తీసి కళ్ళు తుడుచుకుని నవ్వాడు. "కష్టాలు ఎదుర్కోగలను! చికాకులను తట్టుకోగలను. కానీ ఏవో అదృశ్య తరంగాలు నా అంతరాంతరాలు స్పృశించి నన్ను నాముందు నిలపటానికి ప్రయత్నిస్తోంటే కదిలిపోయాను. ఈ రకమైన కన్నీళ్ళలో ఒక రకమైన సౌఖ్యం ఉంది. అది వదులుకోలేకపోయాను"
    మాధవరావు మాటలు విని ఆశ్చర్యపోయింది లలిత. రాగిణిని చూడగానే వెంటబెట్టుకుని వెళ్ళిపోయిన వ్యక్తి నోట ఇటువంటి మాటలు!
    ఇంటికి వెళ్తూ దారిపొడుగునా ఈ విషయమే ఆలోచించింది! 'మనుష్యులంతా ఇంతే! కథల్లో మాత్రమే మూసపోసిన వ్యక్తిత్వాలతో కనిపిస్తారు' అనుకొంది.


                                             8


    మణిమాల కారు తమ ఇంటిముందు ఆగటం చూసి లలిత చాలా చికాకుపడింది! జీవితంలో తనకు అందుబాటులో ఉన్న అన్నింటితోనూ ఆడుకోవటం మణిమాల స్వభావం కాబోలు! తనను కూడా అలా ఒక పావులా వాడుకోవాలనుకుంటోందా?
    కానీ కారులోంచి మాధవరావు దిగాడు. లలిత తబ్బిబ్బుపడి పోయింది. మాధవరావు తన ఇంటికి వచ్చాడు!
    "మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యటంలేదు గదా!"
    చిరునవ్వుతో అడిగాడు మాధవరావు. లలిత కంగారుగా "ఏం లేదు! రండి! రండి!" అంటూ ఆహ్వానించింది. ఒక్కసారి ఆ ఇంటి వాతావరణం పరిశీలించాడు మాధవరావు. వెంకట్రావు ముందు గదిలో మూలుగుతూ పడుకుని గొణుగుతున్నాడు! జానకి లోపలి గదిలో కళ్ళు మూసుకుని పడుకుంది ఉంది. ఉన్నదాన్లో ఉన్నంతగా నాలుగు కుర్చీలు వేసి ఒక డ్రాయింగ్ రూం ఏర్పాటుచేసింది లలిత. అక్కడే మాధవరావును కూర్చోబెట్టింది.
    "మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీ వీణ వినలేకపోయాను. ఎప్పుడూ పని పని. ఇవాళ నేనే మీ వీణ వినటానికి మీ ఇంటికి వచ్చాను."
    తనకు అలవాటయిన గంభీర స్వరంతో అన్నాడు మాధవరావు. ఆ స్వరం తనను ఆజ్ఞాపిస్తున్నట్లుగా తోచి మాట్లాడలేదు లలిత.
    "ఇవాళ నాకు చాలా అలసటగా ఉంది. కొంచెం రిలీఫ్ కావాలనిపించింది. వెంటనే మీ ఇంటికి వచ్చేశాను. నేను కోరగానే మీరు వీణ వినిపించగలరా? అనుకోకపోలేదు. కానీ, కళాకారులు కఠినంగా ఉండరనే ధైర్యంతో వచ్చేశాను."
    లలిత కాదనలేకపోయింది. గాంభీర్యంతోపాటు అతనిలో కనిపించే ఒక రకమైన నిష్కపట ధోరణి లలితలో గౌరవభావాన్ని కలిగించింది. వీణ ముందు కూర్చుని వీణ శృతి చేసింది. వీణ వింటూ కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు మాధవరావు.
    అతనికి సంగీతమంటే ఎంత ఇష్టమో అర్థమయింది లలితకి.
    లలిత వీణ పూర్తిచేసేసరికి వెంకట్రావు బయటి గదిలోనుండి లోపలికి తొంగి తొంగి చూస్తున్నాడు. ఆ దృశ్యం కంటపడే సరికి మనసు భగ్గుమంది లలితకి! ఏ విషయమైనా తమ దృక్పథంలోంచి మాత్రమే చూడగలరు మనుష్యులు! మాధవరావు ఏమనుకుంటాడో ననుకునేసరికి జుగుప్సతో శరీరం జలదరించినట్లయింది! వెంకట్రావు అలా తొంగి తొంగి చూడటం మాధవరావు గమనించనే గమనించాడు!
    "ఆయన ఎవరు?" అని అడిగేసాడు.
    "మా నాన్న గారు!" గొంతుకేదో అడ్డుపడుతున్నట్లుగా సమాధాన మిచ్చింది.
    "మీ తమ్ముడేం చేస్తున్నాడు?"
    "ఏం చేస్తున్నాడో తెలీదు. ఎక్కడున్నాడో, అసలే తెలీదు."
    "అదేమిటి?"
    "వాడు జైలు నుండి విడుదలయ్యాక ఉద్యోగం దొరకటం మరీ కష్టమయింది. ఆ చికాకు భరించలేక ఇంట్లోంచి వెళ్ళిపోయాడు, ఆ తర్వాత వాడి సంగతి ఏమీ తెలియలేదు."
    "అరె! అతని ఫోటో ఏదైనా ఉంటే ఇవ్వండి. ఎక్కడున్నాడో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాను!"
    లలిత పొంగిపోయింది.సరిగ్గా ఈ సహాయం కోరటానికే లలిత మణిమాల స్నేహాన్ని ఆశ్రయించింది. మాధవరావును చూడగానే ఈ మాత్రం కూడా అడగలేకపోతోంది.కానీ మాధవరావు ఫోటో కావాలంటున్నాడు.
    "మోహన్ లేటెస్ట్ ఫోటో ఏదీలేదు. చిన్నప్పటివే ఉన్నాయి!"
    "అలా అయితే కొంచెం కష్టమే! పోనీ, అదే ఇవ్వండి." లలిత స్కౌట్ వేషంలో ఉన్న మోహన్ ఫోటో__హైస్కూల్ రోజుల్లోది తెచ్చిచ్చింది.
    "ప్రయత్నిస్తాను. భయపడకండి! ఈ రోజుల్లో చాలామంది యువకులిలాగే గమ్యం తెలియకుండా పరిగెడుతున్నారు!"
    లలిత ఇచ్చిన కాఫీ తాగి వెళ్ళిపోయాడు మాధవరావు.
    మాధవరావు వచ్చేసరికి మణిమాల ఇంట్లోనే ఉంది. ఆవిడ అంతకు అరగంటకు ముందే వినోద్ దగ్గిరనుండి వచ్చింది. తను వినోద్ దగ్గర కెళ్తున్నట్లు చీటీ రాసిపెట్టే పోయింది. ఎప్పుడూ అలాగే వెళ్తుంది. సాధారణంగా అలాంటి సందర్భాల్లో మణిమాల ఇంటికొచ్చేసరికి, మాధవరావు అశాంతిగా పచార్లు చేస్తూనో, నుదుటికి చెయ్యి అడ్డంగా పెట్టుకుని కనుబొమలు చిట్లించుకుని పడక్కుర్చీలో పడుకుని ఆలోచిస్తోనో కనిపించేవాడు. అలాంటిది ఆరోజు మాధవరావు ఎక్కడినుండో రావటం_ అంతేకాక అతని ముఖంలో కనిపిస్తోన్న వికాసం మణిమాలకు ఆశ్చర్యాన్ని కలిగించాయి.
    "ఎక్కడ్నుంచి మాధవ్?"
    "లలిత ఇంటిదగ్గిర నుండి! ఆవిడ వీణ విని వస్తున్నాను!"
    మరింత ఆశ్చర్యపోయింది మణిమాల! ఎవరో సన్నిహితుల ఇళ్ళకి కాని వెళ్ళడు మాధవరావు. అతనికి సంగీతమంటే ఇష్టమని తెలుసుకాని...
    చిరునవ్వు నవ్వుతూ "ఓ!..." అంది.
    నవ్వుతోన్న మణిమాల ముఖంలోకి ఒక్కక్షణం చూసి "ఓ, న, మా, లు, తెలియకుండా "ఓ!" అనుకుంటే ప్రయోజనం లేదు." అన్నాడు. మణిమాల పకపక నవ్వింది.
    " 'ఓ' తెలిసిందిగా! ఒక నామాలు, నామరూపాలు, క్రమంగా తెలుస్తాయి" అంది.
    "అంత తేలిక కాదు మణీ! అన్ని భాషల ఓనమాలూ ఒక్కలా ఉండవు. ఎవరి భాష వాళ్ళది!"

 Previous Page Next Page