Previous Page Next Page 
తదనంతరం పేజి 12


    "నువ్వన్నది నిజమేరా. ఈ మధ్య నా తిండి తగ్గిపోయింది" అనేవాడు అందులో వ్యంగ్యాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించకుండా.


    "అమ్మడూ! ఎగ్జిబిషన్ కి పోదాం రావే" అంటూ సాయంత్రమయేసరికి చెల్లెల్ని ప్రయాణం చేసేవాడు.


    "ఇక్కడ అప్పడాలు బావున్నాయే. మిరియాలపొడి కారం చల్లి బలేగాయున్నాయే. అబ్బో! మిరపకాయ బజ్జీలు కూడా వున్నాయే. ఇదేమిటీ ప్రక్కన చెరుకు రసమా అంటూ బజ్జీలూ, అప్పడాలూ తిని రెండు గ్లాసుల చెరుకు రసం అవలీలగా త్రాగేసేవాడు. ఒక్కదానికీ బయటకు డబ్బులు తీసేవాడు కాదు.


    "అన్నట్లు మీ మేనల్లుడు టీ షర్టు కావాలన్నాడు. మీ మేనకోడలు ఛుడీదార్ కావాలంది. నువ్వు ముందు డబ్బులియ్యి ఆనక చూసుకుందాం" అంటూ తనకు కావాల్సిన వస్తువులు కొనిపించేసి, తర్వాత దాన్ని గురించి గుర్తులేనట్లు ఊరుకునేవాడు.


    రాత్రుళ్ళు అతను పడుకునే తీరు భయంకరంగా వుండేది. గదిలో కాకుండా నలుగురూ నడిచే వసారాలో మంచమేసుకుని పడుకొనేవాడు. ఉదయం పదయినా నిద్రలేచేవాడు కాదు. వంటిమీద లుంగీ స్థానంలో వుండేదికాదు. ఒక్కోసారి అసలు వంటిమీద ఏవీ వుండేది కాదు. ఓ నగ్న పర్వతం పడివున్నట్లు పడుకుని వుండేవాడు. మనుషులు అటూ యిటూ తిరుగుతున్నా అతనిలో కొంచమైనా స్పృహ వుండేది కాదు. అటూ యిటూ నడిచేవాళ్ళు_వాళ్ళే అతని వంటిమీద దుప్పటి కప్పి పెడుతూ వుండేవాళ్ళు. అయినా ఆ ఇంటిల్లి పాదికీ ఇబ్బంది కలిగిస్తున్నానన్న జ్ఞానం లేకుండా తాను గెస్ట్ ననీ, కరెక్టయిన మనిషిననీ అనుకుంటూ చెలరేగిపోతూ వుండేవాడు.


                                *    *    *    *


    "అమ్మా!" అని పిలిచింది నీరజ వంటింటి గుమ్మంలో నిలబడి.


    అరుంధతి నేలమీద కత్తిపీట ముందు కూర్చుని కూరలు తరుగుతోంది.


    "ఏమిటమ్మా" అంది తలెత్తి.


    "నేను...ఉద్యోగం చేద్దామనుకుంటున్నానమ్మా"


    అరుంధతి కూతురి మొహంలోకి చూస్తూ విషాదంగా నవ్వింది. "ఎందుకు అలాంటి ఆలోచనకు వచ్చావమ్మా?" అనడిగింది.


    "కొన్నాళ్ళుగా మన ఇంటి పరిస్థితులు చూస్తున్నానమ్మా. మారుతోన్న పరిస్థితుల్ని బట్టి రోజు రోజుకీ ఖర్చులు పెరిగిపోతున్నాయి. నాన్నగారి ఒక్కరి సంపాదన మీద యింతమంది ఆధారపడాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఈ పూట ఎలా గడవాలా అని వెతుక్కుంటూ బతకటం_మనం పైకి రావాలమ్మా. పైకి రావాలంటే కుటుంబంలో అందరూ కష్టపడి పని చెయ్యాలి"


    అరుంధతి కూతురి హృదయంలోని ఆందోళనని అర్థం చేసుకుంది. ఈ సమస్య ఆమెకు తెలియనిది కాదు. కొన్ని సంవత్సరాలుగా ఆమెనూ నిరంతరం కలవారపెడుతూనే వుంది.


    "ఉద్యోగాలు వెంటనే ఎక్కడ దొరుకుతాయమ్మా" అంది.


    "ప్రయత్నిస్తే..."


    "చూడు నీరజా! సరియైన క్వాలిఫికేషన్స్, ఫస్టు క్లాసులు వుండి యీ రోజుల్లో ఎన్ని లక్షలమంది ఉద్యోగాలు లేక మగ్గి పోతున్నారు. చదివిన చదువుకూ, చేసే ఉద్యోగాలకూ పొంతన వుండటం లేదు. మంచి ఉద్యోగం కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి చివరకు తన చదువుకు సంబంధంలేని ఏదో ఉద్యోగంలో చేరి ఘోరంగా రాజీపడిపోయి జీవితాంతం అందులోనే మ్రగ్గిపోతున్నారు. ఇహ అప్పుడప్పుడూ ఆశా కిరణంలా తళుక్కుమనిపించేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ద్వారా వచ్చే ఉద్యోగాలు. ఇందులో గవర్నమెంటువయితే రిజర్వేషన్స్, క్లాస్ ఫీలింగ్, రికమెండేషన్లు లక్షలలో లంచాలు, గ్రూప్ వన్, గ్రూప్ టూ సర్వీసెస్ వున్నాయి. ప్రైనరీ ప్యాసయి ఫైనల్స్ కి వచ్చేసరికి రెండు మూడేళ్ళు పడుతుంది. ఎందుకంత వ్యవధి పడుతుందో యీ కాలమంతా ఏ మతలబు జరుగుతుందో ఎవరికీ అంతుపట్టదు. ఇంటర్వ్యూ వరకూ వచ్చేసరికి, ఏ రికమండేషనూ, డబ్బూ విరజిమ్మటానికి ఆర్ధికబలమూ లేని సామాన్యుడు ఆలసిపోతాడు. స్టేట్ లెవెల్ లో ఎప్పుడోకప్పుడు ఆశపడటమే గాని, న్యాయం జరిగిన పరిస్థితులు చాలా తక్కువ. అన్యాయంతో, స్వార్థంతో, కులతత్వంతో ఈ వ్యవస్థ పాలకులూ కుళ్ళిపోయారు. ఇహ సెంట్రల్ గవర్నమెంటు జాబ్స్, బ్యాంకింగ్ సర్వీసెస్ లాంటి వాటిల్లో కొంతవరకూ నిజాయితీ వుంది. కానీ అదో మహాసముద్రం. ఉద్యోగాలు రావాల్సిన వారిసంఖ్య వేలల్లో వుంటే కావాల్సిన వారిసంఖ్య పదుల్లో వుంటుంది. ఎందుకొస్తుందో, ఎలా వస్తుందో తెలీదుగాని, జూనియర్ క్యాండిడేటిలలో వుండిపోయి, అతి సామాన్యమైనవారు సెలక్టవటం కనబడుతూ వుంటుంది. ఈ పొరపాటు జరుగుతున్నదో అర్థంకాదు. ఇహ చివరిగా ప్రయివేటు ఉద్యోగాలు. జీతాలు తక్కువ, శ్రమ ఎక్కువ. రాయితీలేవీ వుండవు. ఎదుగూ బొదుగూ లేని జీవితాలు.   

 Previous Page Next Page