ఆ సమయంలో పార్థసారధి వచ్చిచిన్న వంటింటి గుమ్మం ముందు నిలబడి "అక్కయ్యా" అన్నాడు జాలిగా.
చపాతీ తిరగేస్తున్న సరళ తలెత్తకుండానే "ఏంటిరా?" అంది!
సారధి మాట్లాడలేదు.....
సరళ తలెత్తి సారధి ముఖంలోకి చూసి ఆ ముఖములో దైన్యం గమనించిన తరువాత విషయం అర్ధమయింది.
పాపం, సారధి ఎలాగయినా చదువుకోవాలని ప్రయివేట్ గా ఎస్. ఎస్. సి కి కట్టాడు. ఆ రోజు పరీక్ష ఫీజు కట్టటానికి ఆఖరు తేదీ! డబ్బు కావాలి!
డబ్బు కావాలంటే వరదాచారి నడగాలి! వరదాచారి ముందు నిలబడి చెయ్యి జాపి డబ్బు అడగాలంటే ప్రాణం పోయినట్లుగా వుంటుంది సరళకి..... పురుగను విదిలించినట్లు విదిలిస్తాడు వరదాచారి! పరమ అసహ్యంగా చూస్తాడు. తనేదో మహా కష్టపడిపోతున్నట్లు ముఖం పెడతాడు! ఇంతా చేసి డబ్బు ఇస్తాడన్నది అపనమ్మకమే! ఎలాగయినా ఇయ్యకపోవటానికే ప్రయత్నిస్తాడు!
"అడుగుతానుండు....." అని పేనం మీదనుంచి చపాతీ తీసి గిన్నెలో సర్ది లేచి బావగారి దగ్గరకొచ్చి "మా తమ్ముడికి ఇవాళ పరీక్షఫీజు కట్టాలి- డబ్బు కావాలి...." అంది.....
"డబ్బు" అన్నమాట వింటూనే వరదాచారి ముఖం వికృతంగా మారిపోయింది!
"డబ్బు! డబ్బు! డబ్బు! అందరికీ డబ్బు కావాలి! ఎక్కడ్నుంచి తేను? దాని రోగాలకి, మందులకీ తేనా? ఇంట్లో ఇంతమంది పడితినటానికి తేనా? ఇంకాపైన చదువులూ, ఫీజులూనా? ఇంతోటి పదో క్లాసు పాసయితమ్ముడు కలెక్టరయిపోతాడా?"
తనెప్పుడు ఏది అడిగినా వరదాచారి ఇలా కసురుకోవటం అలవాటే గనుక మౌనంగా నిలబడింది సరళ, అన్నీ సహిస్తూ.....
"ఏదీ, ఇంకా పంటచేతికి రాలేదు. ఆ రైతులు ఎప్పటికప్పుడు ఏవో వంకలు పెట్టి రావలసినదానిలో సగం కూడా ఇయ్యరు! మాయదారి రోజులు! ఎక్కడలేని చట్టాలూ వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయి. ఇక ఆ కోవెల ఉందనుకుంటే అదీ అంతంత మాత్రంగానే వుంది. జనుల్లో ఎక్కడైనా దైవభక్తీ, పాపభీతి ఉండి ఏడుస్తేగా! ఉండు చూస్తాను...." అని సరళముందే ఎంతో శ్రద్ధగా పెట్టెవెతికినట్లు వెతికి లాభం లేదమ్మా! ఒక్క రూపాయి కూడా లేదు" అన్నాడు నిట్టూరుస్తూ.
సరళకు నిట్టూర్పు కూడా రాలేదు. అక్కడినుంచి అడుగు కదలటంలేదు. సారధి ముఖం ఎలా చూడాలి? పాపం, తానొక వ్యక్తిగా నిలబడాలని అష్టకష్టాలూ పడుతున్న తమ్ముడికేమని సమాధానం చెప్పాలి? ఏది తప్పుతుంది గనుక.
ఈడ్చుకుంటూ మళ్ళీ చిన్న వంటింట్లో చపాతీల దగ్గిరకి వచ్చింది.
సరళ ఏం మాటాడకుండా చపాతీల దగ్గిర కూర్చోవటంతోనే విషయం అర్థంమయింది సారధికి.
అయినా ఊరుకోలేక "ఏమయిందక్కయ్యా! బాగా చదివాను. పరీక్షఫీజు కట్టకపోతే....." అన్నాడు.
సరళ తలెత్తి పొయ్యిమంటకి ఎర్రబారిన కళ్ళతో తమ్ముణ్నిచూస్తూ "సారధీ! నా దగ్గిర ఈమంగళ సూత్రాలు తప్ప వేరు బంగారంకూడా లేదురా! ఇవితీసి ఇయ్యటానికి నాకేమీ అభ్యంతరం లేదు! నువ్వు తీసుకోగలవా?" అంది.
సారధి చివ్వున కళ్ళలో నీళ్ళు చిమ్మగా తల వంచుకుని వెళ్ళిపోబోయాడు.
అంతలో కమల చేతిలో రూపాయిలతో వచ్చి "పిన్నీ! నాన్న నీకియ్యమన్నాడు" అని కొన్ని నోట్లు సరళ చేతికిచ్చింది.
సరళ తన కళ్ళనూ, చెవులనూ నమ్మలేకపోయింది. నిజంగా దేవుడున్నాడేమో! తన అవస్థచూసి ఆ శిలాకృతి వదిలి శిలలాంటి తన బావగారి మనసు కరిగించాడేమో!
ఇంకేమీ ఆలోచించకుండా ఆ డబ్బు సారధి చేతిలో పెట్టేసి "వెళ్ళి ముందు పరీక్ష ఫీజు కట్టేసిరా!" అంది.
ఒక్క క్షణం ఆలస్యం చేస్తే తన అదృష్టం ఏది ఏ విధంగా మారుతుందోనని భయపడుతున్నట్లు వెంటనే వెళ్ళిపోయాడు సారధి.
సారధి వెళ్ళిపోగానే చపాతీలు పూర్తిచేసి పిల్లలిద్దరికీ డబ్బాల్లో సర్ది - మళ్ళీ నూతిదగ్గరకు వెళ్ళి తలారాస్నానంచేసి పెద్ద వంటింట్లోకి వచ్చింది సరళ.
అప్పటికి వరదాచారి రంకెలేస్తూ "దేవుడిముందు నేనుపెట్టిన డబ్బు ఎవరు తీశారు? దేవుడి గదిలోకి ఎవరొచ్చారు?" అని అరవసాగాడు.
సరళ భయపడిపోయింది.
కమల నిర్భయంగా తండ్రి ముందు నిలబడి "ఆ డబ్బు నేనే తీశాను నాన్నా!" అంది.
వరదాచారికి మతిపోయింది. తన కూతురు దొంగతనం చేసిందా?
"ఛ! దొంగతనం చేశావా? పాపంకదూ?" అన్నాడు అలవాటైన ధోరణిలో బెదిరిస్తూ.
"నేను పాపం చెయ్యలేదు నాన్నా! నిన్ను పాపం నుంచి తప్పించాను......"
"ఏమిటే వెధవవాగుడు?"
"అవును నాన్నా! నీ దగ్గర డబ్బుంది, పిన్ని అడిగితే లేదని అబద్దం చెప్పావు! ఆ అబద్ధం పాపమని నువ్వేగా అంటావు? అందుకే నీ అబద్ధాన్ని నిజం చేసేశాను"
నిర్ఘాంతపోయాడు వరదాచారి. అతనికి నోటమాటరాలేదు.
అమాయకంగా, గర్వంగా నవ్వుతోంది కమల.
కూతుర్నేమీ అనలేక కోపంగా సరళ దగ్గిరకొచ్చి "పసిపిల్ల తెలిసి తెలియక ఏదో చేస్తే, మందలించటానికి బదులు ఆ డబ్బు తీసుకుంటావా?" అన్నాడు.
"కమల మీరియ్యమన్నారని ఇచ్చింది. అందుకే తీసుకున్నాను."
"అఘోరించినట్లే ఉంది. ఏదీ ఆ డబ్బు?"
"నా దగ్గర లేదు. సారధికిచ్చేశాను"
"ఏదీ వాడు?"
"లేడు పరీక్ష ఫీజు కట్టడానికి వెళ్ళాడు.
"శ్రీ రామచంద్రా!" అని రెండుచేతులూ నెత్తిన పెట్టుకున్నాడు వరదాచారి.
శ్రీరామచంద్రుడు పేరు వరదాచారి తెల్లవారిలేస్తే అనేక సందర్భాలలో అనేక రకరకాలుగా వాడుతూనే ఉంటాడు! కానీ ఇలాంటప్పుడు వచ్చినంత నిజాయితీగా ఆ పేరు అతనినోట మరో సందర్భంలో రాదు.
రంగనాయకమ్మకు తలనొప్పితోపాటు వాంతులు కూడా ప్రారంభమయ్యాయి! పెరటికొచ్చి ఆవిడ వాంతులు చేసుకుంటుంటే వెంకడు చూసి-