ఒక్కక్షణం ఆమెనుంచి మాటలు వినబడలేదు. హఠాత్తుగా తన రెండు చేతులూ ముందుకు చాచింది. పిడికిళ్ళు బిగించింది. అవి నా గుండెను స్పృశిస్తున్నాయి. గుండె తెగి క్రిందపడినట్లయింది. కళ్ళు వాల్చి వాటికేసి చూశాను. కోమలమైన ఆమె హస్తాలు యినుములా రాటుదేలి వున్నాయి. ఆ పిడికిలి బిగింపు ప్రపంచాన్ని అందులో యిరికించుకొని నలిపి పిండిచేసి వేస్తున్నట్లుగా వుంది. ఒక్కసారిగా యెందుకో వాటిలో సంచలనం కలిగింది. గాజులు గలగలమన్నాయి. అవును గాజులు! మణికట్టుదగ్గరనుంచీ వెనుకకు అందంగా, రంగురంగులుగా, సౌష్టంగా వ్యాపించివున్నాయి.
"గాజులు" అన్నాను.
"సంకెళ్ళు" అంది ఆమె కర్కశత్వంతో.
"అవును ఇవి మీకళ్ళకు అందంకోసం అలంకరించుకున్న గాజులులాగా కనబడుతున్నాయా! మీకు చాయగా బ్రతుకుతున్న స్త్రీలుకూడా అలాగే తల వూపి, మురిసిపోతున్నారు. కాని యివి సంకెళ్ళు, నాకు తెలుసు. ఇవి సంకళ్ళు."
ఆ చేతులు కదలకుండా అలానే యింకా స్థిరంగావుండి రెండు బల్లేలలాగా హృదయాన్ని చీలుస్తున్నట్లుగా వున్నాయి. "సంకెళ్ళు తొడగబడి జైలులో వేయబడిన ఖైదీలెంతో మేమూ అంతే ఖైదీకెంత స్వాతంత్ర్యముందో మాకూ అంతే వుంది. ఇహ మీ ప్రశ్నకు సమాధానం వినండి వీటినుంచి పగలగోట్టుకు పోదామని నాకు వున్న దృఢసంకల్పమే, వీటినుంచి విముక్తి పొందాలని నేను నిరంతరం పడుతున్న తాపత్రయమే నన్నిలా తయారుచేసింది. నాచేత యిట్లా పలికింపచేస్తోంది. విన్నారా డాక్టర్? నేనంటే ఎవరో తెలుసా? ఒక జాతికి ప్రతినిధిని."
ఆ చేతులు గుండెను నొక్కుతూ అలానే వున్నాయి. భయంతో ఒక్కసారి నా శరీరం వణికిపోయింది. బలమంతా ఉపయోగించి ఆ చేతుల్ని తోసేశాను. ఒక్కఊపులో బయటకు వచ్చిపడి చలించిపోతూ నడవసాగాను.
ఇంతలో కసుక్కుమని నా కాలిలో పెద్ద ముల్లుదిగిపోయింది. బాధతో మూలిగి, ఆ ముల్లును తీసివేసేలోగా "అయ్యా! అయ్యా!" అంటూ నా చెప్పులు పట్టుకుని కుర్రాడు పరిగెత్తుకు వచ్చాడు. జేబులో చెయ్యిపెట్టి చిక్కింది వాడి చేతిలోపెట్టి మళ్ళీ తూలిపోతూ నడవసాగాను.
* * *
ఇంటికి వచ్చేసరికి యధాలాపంగా వంటమనిషి తన భోజనం ముగించి వెళ్ళిపోయె ప్రయత్నంలో వుంది. నన్ను చూసి "వచ్చావా బాబూ! ఇంతవరకూ చూసి రాకపోయేసరికి వెళ్ళిపోదామనుకొన్నాను. ఇదిగో వడ్డించేస్తున్నాను."
"నా కాకలి లేద" న్నాను.
"అదేమిటి బాబూ! మీరు తినకపోతే నేనెవరికి వండినట్టు? కాస్త ఎంగిలి పడి లేద్దురుగాని రండి. వంకాయకూరా, మజ్జిగపులుసూ చేశాను" అంటూ బలవంతం చేసింది.
"వద్దండి. నా కాకలి లేదు ఈ పూట. ఒక్కమెతుకుగూడా మింగుడుపడదు" అని పడక్కుర్చీలో కూలబడి వెనక్కు వాలి, నీరసంగా కళ్ళు మూసుకున్నాను.
ఆమె నలభై ఏళ్ళు దాటిన వితంతువు. తనకు చాలా అనుభవమున్నట్లు చెబుతూ వుంటుంది. అప్పుడప్పుడూ లేనిపోని ఆప్యాయత ప్రదర్శిస్తూ వుంటుంది. ఆమె దగ్గరకు వస్తున్న అలికిడి విని కళ్ళు మరింత గట్టిగా మూసుకున్నాను.
"మీరింకా పెళ్ళి చేసుకోకుండా యీ తీరున వుండటం బాగాలేదు బాబూ! ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి. మా ఇంటిప్రక్క మేడలో ఒక పిల్ల వుంది బాబూ. బంగారుతీగలా వుంటుంది. డాకటేరీ చదువుతుందిట. వాళ్ళు బాగా డబ్బున్నవాళ్ళు కూడా కట్నం దండిగా యిస్తారు."
నేను యేమీ బదులు పలకకుండా వూరుకున్నాను. ఆమె కొంచెం ఆగి "మరి బాబూ,. అయితే భోజనం చేయరుగా.... అనవసరంగా ఆ అన్నం రేపొద్దున్న పనిదాని ఎదాన కొట్టటమెందుకూ- నేను తీసుకుపోదునా!"
ఒక పదినిముషాల్లో ఆమె సన్నాహం పూర్తిచేసుకుని వెళ్ళిపోయింది నేను కళ్ళు తెరిచాను. హఠాత్తుగా ఒక్కడినే ఈ యింట్లో వుండటానికి భయంవేసింది. లేచి తాళం పెట్టుకుని బయల్దేరాను. వాళ్ళతో ఈ రాత్రి వస్తానని పొద్దున్న చెప్పాను. కాని, పోవాలంటే గుండె అదటుగా వుంది. ఆ తలపే భయానకమై సోకుతుంది.
నా జీవితంలో యిది మరో భయంకరమైన రాత్రి హుస్సేన్ సాగర్ వంతెన మీదకు పోయి సిమెంటు తిన్నెమీద కూర్చుని నిట్టూర్పులు విడుస్తూ ఎన్ని గంటలు గడిపానో! ప్రక్కనుంచి మనుషులు వస్తున్నారు, పోతున్నారు కిలకిల మణి నవ్వుకుంటున్నారు. కాని గాజులు గలగలమన్నప్పుడల్లా నా గుండె ఝల్లుమంటోంది. అనసూయ మాటలు మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. మొగవాడిని గురించి ఆమె క్రూరంగా అర్ధంచేసుకుంది. ఆమెకు పతివ్రతా ధర్మం తెలియదు. ఆమె దోషదర్శి.
వ్యక్తిత్వం అంత ప్రమాదకరమైనది ఏమీలేదు. అది మనిషిని శాశ్వతంగా ఒక కట్టుబడికి ముడిపెట్టి వదిలేస్తుంది. అతడిని స్వేచ్చగా మాట్లాడనీయదు. స్వతంత్రంగా సంచరించనీయదు.
అనసూయ దీనిబారికి గురైంది.
మరి నేనూ? నేనూ అంతేనా?
విజ్ఞానం పెరిగినకొద్దీ మనిషికి బ్రతకటం సంకటమౌతుంది. అనుభవం విశాలమైనకొద్దీ అతడి జీవిత గమనమార్గం యిరుకైపోతుంది. బాధ్యతను నెమరువేసుకోవటంలో గౌరవం, ఆశమీద ఇచ్చ నశించి సిద్దాంతాలమీద మమకారం పెరిగిపోతుంది.
వెలుగు కిరణాల ఒంపులలో చీకటిమడతలు వున్నట్లే సుఖములో దయా విహీనమైన దుఃఖమూ, అతిమంచిలోనూ చెడుకూడా మిళితమై దాగుకుని వుంటాయి. కాని యిది రహస్యం. అవ్యక్తంగా అందరికీ తెలిసిన రహస్యం. ఒక అందాన్ని రహస్యంగా వుంచినప్పుడే అందంగా, అద్భుతంగా వుంటుంది. అందుకే చిరునవ్వూ, సూర్యకిరణం అంత మనోహరంగా వుంటాయి.
అయ్యో! అయ్యో! అందుకేనా రంగురంగుల గాజులు ధరించిన స్త్రీయొక్క మృదుహస్తాలుకూడా అనంత సౌందర్యంతో అలరారుతాయి?