Previous Page Next Page 
పసుపు కుంకుమ పేజి 12


    భానుమతి వెనకనుంచి ఆమెకు  దగ్గరగా వచ్చింది. "మాలీ" అంది జాలిగా. "ఈ విషయాలగురించి ఇప్పట్నుంచీ ఆలోచించకు."

    మాలతి ఆమెకు అభిముఖంగా తిరిగింది. "ఆలోచిస్తాను. అంతే కాదు. నా భవిష్యత్తునిగురించి కూడా నేను నిర్ణయించుకున్నాను. పరిస్ధితుల వల్ల పవిత్రతకు దూరం కావాల్సి వస్తుందనటం ఎక్కేపిజం. మనిషిలో చిత్త శుద్ధి వున్నప్పుడు ఏ పరిస్థితులూ, ఎటువంటి ఆకర్షణలూ ఏమీ చెయ్యలేవు. నేను దేవుడ్ని నమ్ముతాను. పాపపుణ్యాలని నమ్ముతాను. పవిత్రతను నమ్ముతాను. ఏ వ్యక్తికైయినా మనసివ్వటం జరిగితే, ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా అవాంతరాలు వచ్చినా ఎదుర్కొని ఆ వ్యక్తితోనే జీవితాంతం నీడలా, నిజంలా బ్రతుకుతాను." ఆమె కంఠంలో దృఢమైన వ్యక్తిత్వం, ఆత్మవిశ్వాసం ఖంగు ఖంగుమని మ్రోగినట్లయాయి.

    భానుమతి ఏమీ వ్యాఖ్యానం చెయ్యలేదు. "మంచిదే" అన్నట్లు ఆమె పెదవులు కదిలాయి.

                                        5

    మేనేజరు చంద్రశేఖరం ఉత్తరాలు డిక్టేట్ చేస్తున్నాడు. మాలతి రాసుకుంటోంది.

    ఫోన్ మ్రోగింది.

    వన్ మినిట్ అంటూ రిసీవర్ అందుకుని "హలో" అన్నాడు.

    అవతలనుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి. మరు నిముషంలో అతని ముఖం పాలిపోయింది. "అలాగే..... ఇప్పుడే వచ్చేస్తున్నాను" అని ఫోను పెట్టేశాడు.

    "మా అమ్మకు సీరియస్ గా వుండట. గోపయ్య ఫోన్ చేశాడు."

    అతను చెప్పకముందే ఆమె అర్ధం చేసుకుంది.

    లోలోపల చెలరేగే అలజడిని బయటకు కనిపించకుండా బింకంగా వుండటానికి ప్రయత్నిస్తూ "ఆల్ రైట్ ! ఈ లెటర్ ఒక్కటీ కంప్లీట్ చెయ్యండి. తర్వాత నేనింటికి వెళ్ళొస్తాను" అన్నాడు.

    తర్వాత పదిపంక్తులూడిక్టేట్ చెయ్యటంలో అతను పదహారు తప్పులు దొర్లించాడు. తప్పులు దొర్లినప్పుడల్లా అతను సారీ అనటం, ఆమె తల ఎత్తి చూడటం సరిపోయింది. మొత్తానికి ఎలాగయితేనేం ఉత్తరం పూర్తయింది. అతను ఆదరాబాదరాగా లేచి నిలబడి "సారీ అండీ, ఏమీ అనుకోకండి" అని మళ్ళా ఒకసారి సారీ చెప్పి తడబడే అడుగులతో బయటకు వెళ్ళిపోయాడు.

    తర్వాత అయిదునిముషాలదాకా మాలతి కుర్చీలోంచి కదలలేకపోయింది. ఫోన్లో మాట్లాడే భంగిమలో అతన్లోని ఆదుర్దా, తర్వాత లెటర్ డిక్టేట్ చెయ్యటంలో అతని తొట్రుపాటు, ఆమెవంక జాలిగా చూసి బయటకు వెళ్ళిపోవటం ఇవే పదే పదే గుర్తొస్తున్నాయి.

    చివరకి దస్తగిరి "అమ్మా!" అని పిలిచేవరకూ ఈ లోకంలో పడలేకపోయింది.

    ఆ రాత్రికూడా అవే ఆలోచనలు. ఒక వ్యక్తి అంటే అనుకోని ఇష్టం ఏర్పడితే గంటలతరబడి, ఆ మాటకొస్తే రోజులకొద్దీ ఆ నామాన్ని జపిస్తూ ఆ రూపాన్ని స్మరిస్తూ ఎంత హాయిగా గడిపేయవచ్చో బహుశా ఆమెకు జీవితంలో మొదటిసారిగా బోధపడింది. బాధేమో వుంటుంది. బహుశా అది నిర్వచించలేని బాధ. గుండె బరువుగా వుంటుంది. అప్పుడప్పడూ ఉలికిపాటు. ఎందుకో భోరుమని ఏడవాలని వుంటుంది. ఇంతకన్నా నిజం ఏముంటుంది?

    మరునాడు ఆదివారం. ఆఫిసులేదు. మధ్యాహ్నం పన్నెండయే సరికి స్నేహితురాళ్ళిద్దరూ భోజనాలు ముగించుకుని చెరో పుస్తకం చేత్తో పట్టుకుని పక్కలమీద పడుకున్నారు.

    "అమ్మగారూ!" అన్న పిలుపు వినబడి, తలలు త్రిప్పి వీధివైపు చూశారు.

    గేటుదగ్గర సంకోచంగా నిలబడివున్న గోపయ్యని చూసి మాలతి ఉత్సాహంగా లేచి నిలబడి, గుమ్మం దగ్గరకొచ్చి "రా గోపయ్యా!" అన్నది.

    ఆమెని చూడగానే అతని ముఖం చాటంత అయింది. ఎండలో తిరిగి వచ్చాడేమో ముఖమంతా చెమటలు పట్టేసి వుంది. ముసలితనం వల్ల ఎండకు తట్టుకోలేని అలసటకుడా కనిపిస్తోంది.

    "హమ్మయ్య! ఉన్నారా? మీ ఇంటిని వెతుక్కుంటూ ఈ సందులన్నీ ఒక గంటనుంచి వెతుకుతున్నానమ్మగారూ! అమ్మగారూ, ముందు కొంచెం మంచినీళ్ళు ఇప్పించరా!"

    మాలతి లోపలకొచ్చి ఓ గ్లాసులో నీళ్ళునింపి, గోపయ్యకిచ్చి, అతను ఎంతో దాహంగా గ్లాసు నోటికి తగలకుండా ఎత్తిపోసుకుంటూ,గటగటా త్రాగేస్తోంటే ఆపేక్షగా చూస్తూ నిలబడింది.

    మంచినీళ్ళు త్రాగాక గ్లాసు క్రిందపెడుతూ "అయ్యగారు మిమ్మల్ని అర్జంటుగా పిలుచుకురమ్మన్నారు అమ్మగారూ!"అన్నాడు.

    ఎందుకో ఈ మాటలు విని మాలతి పులకితురాలయింది. అయినా బయటకు మాత్రం ఎంతో బింకంగా "దేనికట?"అన్నది.

    "అమ్మగారికి సుస్తీ బాగా ఎక్కువగా వుందమ్మగారూ! పిచ్చి బాగా ముదిరిందను కోండి. ఆ పిచ్చిలోకూడా తమాషాగా మాట్లాడుతున్నారు" అని ఒకసారి బుర్ర గోక్కుని "అందుకనే అనుకుంటా వెంటనే పిలుచుకురమ్మన్నారు" అన్నాడు.

    "అయితే అమ్మగారికి బాగా సీరియస్ గా వుందన్నమాట."

    "అవునమ్మగారు! బహుశా ఈసారి గండంగడిచి బయట పడరనుకుంటాను" అన్నాడు  అంతా తనకు అర్ధమయిపోయిందన్నట్లుగా.

    అమ్మగారికి సీరియస్ గా వుండటానికీ, తనను రమ్మనటానికి సంబంధమేమిటో మాలతికి అర్ధంకాలేదు. ఒక నిముషంపాటు వెడదామా, వద్దా? అని తటపటాయించింది. అలాంటి సన్నివేశంలోకి జొరపడడానికి మనస్ఫూర్తిగా సమ్మతించలేకపోయింది. కానీ అతని అభ్యర్ధనను కాదనటానికి కూడా ఆమెకు శక్తి లేకపోయింది.

    లోపలకు వచ్చి భానుమతితో జరిగింది చెప్పి "వెళ్లనా?" అని అడిగింది.

    "నువ్వు ఎలాగూ వెళ్లడానికే నిశ్చయించుకున్నావు" అని భానుమతి నవ్వింది.

    మాలతికూడా నవ్వింది. జవాబు చెప్పకుండా ఒకసారి అద్దంముందు నిలబడి ముఖం చూసుకుని, చెదిరిన జుట్టును కాస్త సరిచేసుకుంది. చీరను కూడా మార్చుకోలేదు. చెప్పులు తొడుక్కుని "పద గోపయ్యా!" అని బయటకు నడిచింది.

                      * * *                                                                                         

 Previous Page Next Page