Previous Page Next Page 
రక్త సింధూరం పేజి 12


    ఆమె అయోమయంగా చూసింది.
    "మీరెళ్ళిపోతే నేను ఒక్కణ్నే ఉన్నానన్న భావం నన్ను చంపేస్తుంది. చుట్టూ మంటలొచ్చి ముంచేస్తున్న భావం నన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది. నేను భరించలేను. భ....రిం...చ...లే...ను"
    మరేం చేద్దాం- అన్నట్టు ఆమె ఆలోచనలో పడింది. ఆమెని ఎక్కువ ఆలోచించుకోనివ్వలేదు.
    "నేను గుడ్డివాడినని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవటం ఇష్టం లేక పోయినా తప్పదు. నేనెలాగూ బ్రతికున్న శవం లాంటి వాడిని కాబట్టి మీరు కాస్త తలుపు దగ్గిరకి మాత్రమే వేసి వుంచి స్నానం చేయకూడదూ" బిక్కమొహంతో అభ్యర్ధిస్తున్నట్టు అన్నాను.
    కాస్త తటపటాయించి, ఆమె తలూపి "అలాగే" అని వెళ్ళి పోయింది.
    తలుపు సందులోంచి ఆమె స్పష్టంగా కనిపిస్తూంది. (నా) దురదృష్టవశాత్తు తువ్వాలు అలాగే వుంచుకుని స్నానం చేయటం మొదలు పెట్టింది.
    'ఆపరేషన్ నెంబర్ వన్ కంప్లీటెడ్ గోపీ- రెండోది ప్రారంభించు" అనుకుని తడువుకుంటూ అటు వెళ్లాను.
    నెమ్మదిగా తలుపు తెరుచుకున్న శబ్దం అయ్యేసరికి ఆమె ఉలిక్కిపడి 'ఏమిటి' అంటూ ఇటు తిరిగింది.
    తప్పు గ్రహించినట్టు "ఎక్కడున్నాన్నేను" అంటూ గిరుక్కున వెనుదిరగ బోయాను. లా తిరగటంలో సర్రున జారిపడ్డాను. ఏమీ వెనుకాడలేదు. తల టప్ మని నేలకు తగిలినా సరే... ఆమె అరెరె అంటూ వంగబోయింది. అప్పటికే ఆమె కాళ్ళముందు పడిపోయాను.
    "అయ్యొయ్యో ...మైగాడ్" లేవదీస్తూ ఆమె అంటూంది. ఛాతీ, భుజాలూ మొహం నీటిలో తడిసిపోయాయి. సబ్బు నీళ్ళు మొహం అంతా చిమ్మేయి.
    సరీగ్గా నిముషం తరువాత వాష్ బేసిన్ దగ్గిర మొహం కడుక్కుంటూ వుంటే ఆమె వెనుకనుంచి సున్నితంగా మందలిస్తూంది.
    "ఇక్కడ నేలమీద కత్తిపీట గానీ, మరేదైనా గానీ వుంటే ఏమైవుండేది. అసలు మీరా సోఫాలోంచి ఎందుకు లేచారు?" కోపంగా అంది. అంత నిష్టూరంగా నేనూ అన్నాను. "అనండి. మీరుకూడా నన్నే అనండి. ఈ గుడ్డితనం నన్నెంత బాధిస్తూందో మీకు తెలీదు. నన్ను ఎందుకు లేవదీశారు? ఇంకొంచెం గట్టిగా పడితే నుదురు బ్రద్దలయ్యేది. గుడ్డితనానికి తోడు స్పెషల్ అట్రాక్షన్ గా నుదుట మచ్చకూడా మిగిలి వుండేది."
    "అయ్యో! అంతమాట అనకండి. నా ఉద్దేశ్యం అదికాదు".
    "ఇదేమిటి షాంపూనా" వాష్ బేసిన్ పక్కన తడుముతూ చేతికి తగిలిన దాన్ని పట్టుకుని అడిగాను.
    "అవును."
    మిషన్ కన్నా వేగంగా వేళ్ళని కదిల్చి దాన్ని నా తలమీద పోసుకున్నాను.
    "అయ్యోయ్యో - అదేమిటి?"
    "ఇకనుంచీ నా పనులు నేనే చేసుకుంటాను. ఎవరూ నాకు సాయం చేయక్కర్లేదు. జీవితాంతం చేసుకోవలసిన పనులకి ఇప్పటి నుంచీ ప్రాక్టీసు మొదలుపెడతాను."
    "మరీ చిన్నపిల్లాడిలా ఏమిటిది? తలమీద షాంపూ పోసుకున్నా రెందుకు?"
    "క్రింద పడినప్పుడు తల తడిసింది. బాత్ రూమ్ లో నీళ్ళు... అరె. మీరు స్నానం చేస్తున్నారు కదూ... మర్చేపోయాను... ఉక్రోషం వస్తే అంతే. అంతా మర్చిపోతాను చిన్నప్పటినుంచీ అంతే."
    "చాల్లెండి, ఇలా కూర్చోండి"
    "అక్కర్లేదు. నేను కడుక్కుంటాను"
    "అరె- కూర్చోమంటే..."
    ముక్కాలి పీటమీద కూర్చొన్నాను. ఆమె తలమీద నీళ్ళు పోసింది.
    "మీరూ నేనూ కలిసి ఒకే బాత్ రూమ్ లో ఇలా స్నానం చేయటం చాలా బావుంది కదండీ. ఇప్పుడు మీనాన్నగారొస్తే బావుణ్ణు. మీ ఒంటి కలర్ కీ మీరు కట్టుకున్న పసుపురంగు టవల్ కీ మ్యాచ్ సరీగ్గా సరిపోయింది. ఆ టవల్ కేగానీ మధ్యలో ఆ నీలం గీత లేకపోయినట్టయితే, అసలు టవల్ కట్టుకున్నట్టే ఉండకపోవును. మీ నాన్నగారికి మతి మరింత తొందరగా పోయి ఉండును. అరె, మీరు చూసుకోనట్టుంది- వీపు వెనుక టవల్ మీద పై పిన్ను వూడిపోయింది-"
    వియత్నాంలో అమెరికా సైనికుడు పొరపాటున మైన్ బాంబ్ మీద కాలువేసి ఎగిరిపడినట్టు ఆమె తృళ్ళిపడింది. ఆమె చేతిలో చెంబు దబ్బున నేలమీద జారి శబ్దం చేసింది. కళ్ళు గోళీలయ్యాయి. చప్పున చేతులు రెండూ వెనక్కి పెట్టుకుని- పిన్ను సర్దుకోవటంలో, ముందువైపు టవల్ మరింత క్రిందకు జారింది.
    తలమీద షాంపూ తాలూకు నురగ కంటిమీదకు జారి ఒక గాలి బుడగలా ఏర్పరటంతో ఈమె ఈస్ట్ మన్ కలర్ లో కనిపించసాగింది. ఆ అందమైన దృశ్యాన్ని ఆనందంగా మరింతసేపు చూసేవాడినే గానీ, ఆమె చప్పున బాత్ టబ్ కి ఎదురుగా ఆనుకుని వున్న ప్లాస్టిక్ కవర్ వెనక్కి వెళ్ళిపోయి, "నువ్వు..మీరు... నువ్వు" అంది నోటి మాట రానట్టు.
    "మీ నాన్నగారితో నేను కట్టిన పందెం ఇదే. బాత్ రూమ్ లో ఇద్దరం కలిసి స్నానం చేస్తామనీ, మీతో తలంటు పోయించుకుంటాననీ... ఇంకెప్పుడూ మొగవాళ్ళ తెలివితేటల మీద తక్కువ నమ్మకం పెట్టుకోకండి- ముఖ్యంగా పోలీసాఫీసర్ల మెదళ్ళమీద".
                                                  7
    మంగళతూర్యారవాలు మ్రోగుతున్నాయి. తలెత్తి చూశాను. పెళ్ళికూతుర్ని తీసుకువస్తున్నారు. మొగ్గలా ముడుచుకుపోయి, ఇద్దరాడవాళ్ళ మధ్య ఆమె వస్తూంది. బ్రాహ్మడు మంత్రాలు చదువు తున్నాడు. ఒక్కటీ అర్ధంకావటంలేదు. జైలు స్టాఫంతా ముందు వరుసలో కూర్చున్నారు. పసుపు కుంకుమా కలిసిన వాసన ముందు వరస వరకూ పాకుతూంది. పట్టుచీరెల రెపరెపలు కంటికీ, గరగరలు చెవికీ మధురంగా ఉన్నాయి. పెళ్ళికూతురు కూర్చోగానే మధ్య తెర పట్టుకున్నారు. అంతకు ముందు తెలిసి వున్న అమ్మాయికీ, అయిదు నిముషాల్లో భార్య అవబోయేదానికి ఇలా తెర అడ్డుగా కట్టటం ఎందుకో అర్ధంకాలేదు.
    మైకు పెట్టి మంత్రాల్ని మరింత గందరగోళం చేస్తున్నారు. పెండాల్ కి అవతలివైపున అమ్మ కూర్చొని వుంది. ఆమె ఏం ఆలోచిస్తూ ఉందో నాకు తెలుసు. చూపు మరల్చుకున్నాను.
    శివప్రసాద్ మొహంమీద కారణం తెలియకుండానే నవ్వు కదలాడుతూ వుంది. ఎలాగైతేనేం మంగతాయార్ని సాధించగలిగాడు. ఎప్పుడెప్పుడు మంగళసూత్రం కట్టేదామాన్న ఆతృత కళ్ళల్లో కనబడుతూ వుంది.
    మనుషులు మామూలుగా బ్రతికెయ్యటంలో ఎంత ఆనందం వుందో శివప్రసాద్ ని చూస్తూంటే తెలుస్తూ వుంటుంది నాకు. అతడిని చూసి ఎప్పుడూ ఈర్ష్య పడతాను నేను! రెండు నెలల క్రితం 'మంగతాయారు ఇచ్చింది గురూ' అని ఓ గులాబీ పువ్వుని డ్రాయింగు రూమ్ లో బల్లమీద పెట్టుకున్నాడు. అది మరుసటిరోజుకి వాడి, నాలుగురోజులకి నల్లబడి, పదిరోజులకి పొడి అయిపోయినా దాన్ని అక్కణ్ణుంచి తీయలేదు.
    అది చూసి 'నీకేమైనా మతిపోయిందా' అని అడిగాను. "మీరు దాదాపు ప్రతిరోజూ కలుసుకుంటున్నారు కదా. కావాలంటే రోజూ ఒక పువ్వు ఇమ్మని అడగొచ్చు కదా! ఈ పొడిని పెట్టుకుని కూర్చోవటం దేనికి?"
    "నీకు అర్ధంకాదులే గురూ" అన్నాడు. నాకేం అర్ధంకాదో నా కర్ధంకాలేదు. రెండ్రోజుల తరువాత మా ఇంటికి వచ్చాడు. మొహం దీపంలా వెలిగిపోతూంది. నా గదిలోకి తీసుకెళ్ళి కళ్ళల్లోంచి సంతోషం కురుస్తూ వుండగా, "మంగతాయారు ముద్దు పెట్టుకుంది గురూ నన్ను" అన్నాడు. (అప్పటికి వాళ్ళ పెళ్ళి నిశ్చయమై నెలరోజులైంది. ఇంకోవారంలో పెళ్లి) నాకందులో ఆశ్చర్యం కనిపించలేదు. అంతవరకూ పెట్టుకోలేదంటేనే ఆశ్చర్యపడే వాడిని.
    "నువ్వు పెట్టుకున్నావా? తను పెట్టుకుందా?"
    "తనే పెట్టుకుంది దగ్గరికి తీసుకుని-" మొదటి అనుభవం తాలూకు థ్రిల్ ఇంకా అతడి కళ్ళల్లో కనబడుతూంది.
    "అసలేమైంది!"
    "ప్రొద్దున్న మా ఇంటికొచ్చింది. బల్లమీద తన ఫోటో పక్కనవున్న పొడిని చూసి ఏమిటని అడిగింది. పది రోజుల క్రితం తనిచ్చిన పువ్వుని భద్రంగా అలా ఉంచాననీ, దాని తాలూకు పొడి అనీ చెప్పాను. అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా?"
    "ఏం చేసింది? ముద్దు పెట్టుకుందా?"
    "కాదు. ఏడ్చింది. నవ్వకు. నిజంగానే ఏడ్చింది. తరువాత నువ్వన్నట్లే ముద్దు పెట్టుకుంది."
    మనిషికి మెటీరియలిజం కన్నా సెంటిమెంటలిజమే ఎక్కువ ఆనందం ఇస్తుందని అర్ధమైంది. కానీ అనవసరమైన మూర్ఖత్వం నుంచి సరీగ్గా ఏ గీత దగ్గిర సెంటిమెంటు విడిపోతుందో మాత్రం అర్ధంకావటం లేదు. మనం ఒకరికోసం ఏడవటం, ఒకరు మనకోసం ఏడవటం- వీటిలో ఇంత ఆనందం ఉందా? నేను జైలు కాంపౌండులో నడుస్తూ ఉంటే జవాన్లు భక్తితోనూ, ఖైదీలు భయంతోనూ తొలగిపోతారు. శివప్రసాద్ ని ఆఫీసర్ గానే గుర్తించరు. అధికారం, వ్యక్తిత్వం, నిండుతనం, సిద్ధాంతాలపట్ల బలమైన నమ్మిక- ఇవన్నీ నాకు అంతులేని సంతృప్తినిస్తాయి. మంగతాయారు నవ్వు, మంగతాయారు ఏడుపు, డాక్టర్ అంతటి నరసింహంగారి కవిత్వం- ఇవన్నీ శివప్రసాద్ కి సంతృప్తినిస్తాయి. ఎవరిదెక్కువ సంతృప్తి? బహుశా అతడిదేనేమో. ఎందుకంటే నేను అతడి గురించి కూడా ఆలోచించగలను. అతడు నా గురించి ఆలోచించడు. పక్కవాడి గురించి ఆలోచించే కొద్దీ 'మధన' ఎక్కువవుతుందే తప్ప తగ్గదు.
    అకస్మాత్తుగా - ఫ్లాష్ లా నాకెందుకో గండ్రగొడ్డలి గుర్తొచ్చాడు. విషాదకరమైన అతడి నవ్వు- పాట....
    ఆర్తరావ మందిరాలు
    అస్థిమూల పంజరాలు
    దారి పొడుగు జనశవాలు
    ఏ లోకం తల్లీ- ఇట ఏవో బాష్పజలాలు...
    .........
    ప్రియురాలి వాడిన గులాబిని జేబులో ఉంచుకొని ఆనందించే శివప్రసాద్ ని చూసి నవ్వే నేనూ, కాబోయే మాతృమూర్తి కడుపుమీద చేయి వేసి నన్ను చూసి నవ్వే గండ్రగొడ్డలీ-
    ఎవరు గొప్పవారు?
    నిచ్చెన మెట్లు ఎక్కినట్టు ఉన్నత శిఖరాలు అధిరోహించే కొద్దీ నవ్వుకి అర్ధం మారిపోతుందా? ఆనందానికి ఖరీదు ఎక్కువ అవుతుందా? అల్ప సంతోషి అయిన మనిషి తన అల్పత్వం నుంచి పైకి వెళ్ళేకొద్దీ ప్రియురాలి తలవెంట్రుకలూ, పచ్చిక బయళ్ళూ సంతోషాన్ని ఇవ్వటం మానేస్తాయా? శివప్రసాదుల్లా బ్రతికేస్తే చాలదూ? ఎందుకు కొందరు గండ్రగొడ్డళ్ళు తయారవుతున్నారు? ఇటూ అటూ మధ్య వూగే వ్రాసులా ఊగే నేనూ ఎటూ ఆనందించలేక పోతున్నానే. నేనేం చెయ్యాలి?
    -ఏం చెయ్యాలో నాకు సరీగ్గా పదిహేను రోజుల తరువాత తెలిసింది.
                                             *    *    *
    పెళ్ళవగానే శివప్రసాద్ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. నేను కూడా శలవు కాన్సిల్ చేసుకుని జాయిన్ అయిపోయాను.
    జగన్నాధం మాత్రం శలవు పొడిగించాడు. ఎందుకో తెలీదు. ఉన్న వాళ్ళందరిలోకీ నేనే సీనియర్ ని కాబట్టి జైలుని చూసుకోవలసిన బాధ్యత నా మీద పడింది. జగన్నాధం ఇంటిలో దొరికిన జైలు మ్యాపు గురించి నేనింకా మర్చిపోలేదు. అయితే జగన్నాధం ఇంకా ఎందుకు వచ్చి చేరలేదో, బలదేవపట్నంలో ఏం చేస్తున్నాడో మాత్రం అర్ధంకాలేదు. ఆయనింకా అక్కడే ఉన్నాడని రేఖ చెప్పింది. అన్నట్టు రేఖా నేనూ ఈ మధ్య తరచూ కలుస్తున్నాం. బాత్ రూమ్ క్రికెట్ సంగతి ఆ అమ్మాయి కూడా స్పోర్టివ్ గానే తీసుకుంది. తన తండ్రికి మాత్రం ఇలా పందెం గెలిచిన సంగతి చెప్పొద్దని అడిగింది. వెంటనే సరే అన్నాను. "స్పోర్ట్" కావాలంటే ఆ మాత్రం స్పోర్టివ్ గా ఉండాలి మనం కూడా!

 Previous Page Next Page