Previous Page Next Page 
మరో హిరోషిమా పేజి 12


    ఆమె అప్రతిభురాలయి అతడివేపు చూస్తూ వుండిపోయింది. అతడు చెపుతున్నది ఎంత షాకింగ్ గా వుందంటే కోపాన్ని అది డామినేట్ చేసింది. ఆమె భావ సంచలనాన్ని పట్టించుకోనట్టు అతడు కొనసాగించాడు.

    "మీరు ఢిల్లీ నుంచి శలవులయ్యాక కర్నూలు వెడుతున్నట్టు చెప్పారు. మధ్య స్టేషన్ లో దిగిపోయిన నేను వెనక్కి హైదరాబాద్ వచ్చి బట్టలు సర్దుకుని కర్నూలు వచ్చేసాను. మీరు ఏ కాలేజీలో చదువుతున్నారో తెలుసుకాబట్టి మిమ్మల్ని పట్టుకోవడం పెద్ద కష్టం కాలేదు. నాకు ఉద్యోగాలమీదా, పనిమీదా పెద్ద నమ్మకంలేదు. మీతోపాటు కర్నూలులో వుండి ప్రతిరోజూ మిమ్మల్ని చూడటం కోసం అక్కడే చిన్న ఉద్యోగంలో చేరాను. ఇదంతా మీకు నమ్మశక్యంగా కనబడక పోవచ్చు. కానీ జరిగింది మాత్రం అదే! ప్రేమంటే ఇంత గాఢంగా ఉండాలని నా విశ్వాసం" అతడు ఊపిరి పీల్చుకోవడానికన్నట్లు ఒక్కక్షణం ఆగాడు. ఆమె ఇంకా విస్మయం నుంచి తేరుకోలేదు. అతడు కొనసాగించాడు.

    "ఆ తర్వాత రెండు రోజులకి మిమ్మల్ని యాదృచ్చికంగా కలుసుకున్నట్లు కనబడ్డాను. నేనూహించినట్లే మీరు నన్ను గుర్తుపట్టారు. అపుడే 'పెర్వర్షన్' కంపెనీ అన్న నాటకం ఆడాను. ప్రేమపట్ల మీ భావాన్నీ, పెళ్ళిపట్ల మీ ఉద్దేశాన్నీ తెలుసుకోవాలన్నదే నా అభిప్రాయం. యదాలాపంగా చూసినట్టు హోటల్లో నోట్ బుక్ ని తిరగేసి, మీ చేతిరాతని గుర్తుపెట్టుకున్నాను. అమ్మాయిలందరూ అందజేసిన కాగితాల్లోంచి, మీరు రాసిన జవాబుల్ని విడదీసి చదివాను. అంతే! నా 'ఆశల సౌధం కూలి పోయింది' అన్నంత పెద్ద మాటలు వాడను కానీ వూహించలేనంత దెబ్బ తగిలింది."

    "ఎందుకు?" అప్రయత్నంగా అడిగింది.

    "మీకు అప్పటికే ఒక బాయ్ ఫ్రెండ్ వున్నాడనీ, మీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని అందులో మీరు రాసారు కదా?"
   
    "నాన్సెన్స్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు బాయ్ ఫ్రెండ్ ఉండటం ఏమిటి?" కోపంగా అంది.

    "మీరు రాసారు కదా?"

    "నేనలా ఏమీ రాయలేదు. అయినా ఆ సంగతి పక్కన పెట్టండి. అసలు మీ ఉద్దేశ్యం ఏమిటి? మీకు గొప్ప తెలివి తేటలు వుంటే వుండచ్చుగాక! 'సెక్స్ పట్ల మీ ఉద్దేశ్యం ఏమిటి' లాంటి ప్రశ్నలు వేసి మాతో సమాధానాలు చెప్పించి...." ఆ అమ్మాయి ముఖం అకస్మాత్తుగా ఎర్రబడింది. తన అభిప్రాయాలన్నీ అతడు చదివాడన్న విషయం అప్పుడు గుర్తొచ్చి- "....ఛీ!" అంది రాగరంజితమైన మొహంతో.

    "మీరేదో చెపుతూ ఆగిపోయారు?" అనడిగాడు.

    "ఇంత జరిగాక కూడా మీతో నేను మాట్లాడుతున్నానంటే నాకే సిగ్గుగా వుంది. ఎవరు ఏం రాసారో తెలీదన్న ధీమాతో మేమందరం అమాయకంగా మీ ప్రశ్నలకి జవాబులు రాసి ఫూల్స్ అయ్యాం. మీమీద మాకున్న నమ్మకాన్ని పాడుచేశారు. నాకు బాయ్ ఫ్రెండ్ వున్నాడో లేదో తెలుసుకోవటానికీ- ప్రేమ మీద నా అభిప్రాయం కనుక్కోవటానికీ అంతమంది అమ్మాయిల సెక్సువల్ ఫీలింగ్స్ కావలసి వచ్చాయా మీకు" ఆవేశంతో హేమంత కంఠం వణికింది.

    "మిగతా కాగితాలేవీ నేనొక్కటి కూడా చూడలేదు మేడమ్! మీరు రాసినదాంట్లో కూడా- బాయ్ ఫ్రెండ్ ప్రసక్తి రాగానే మిగతా సమాధానాలేవీ చదవలేదు. నా తల్లిదండ్రులమీద ఒట్టేసి చెపుతున్నాను. ఎప్పుడైతే మన ప్రేమ ఫలించదని తెలిసిపోయిందో ఇక నాకు ఆ వివరాలు ఎందుకు?"

    "ఫలిస్తే మాత్రం ఎందుకు? అంత అసహ్యకరమైన వివరాలు ఎందుకు తెలుసుకోవాలనుకున్నారు?"

    "మామూలు మనుషుల మధ్య అసహ్యకరమైన వివరాలు, భార్య -భర్తల మధ్య అందమైన సరదాలు అవుతాయి కాబట్టి"

    ఆమె చప్పున తలెత్తి అతనివైపు చూసింది.

    అతను తన చేతి గోళ్ళ వైపు చూసుకుంటూ చెప్పసాగాడు.

    "అవును! ప్రేమకి పర్యవసానం పెళ్ళి తప్ప మరొకటి వుంటుందని నేనెప్పుడూ వూహించలేదు. నేను నా వైపునుంచి స్టుపిడ్ గా ఆలోచించిన మాట నిజమే! చాలా ఫూలీష్ గా ఆలోచించాను కదూ? ప్రేమంటేనే ఒక ఫూలిష్ నెస్ అని ఇప్పుడు అర్ధమవుతోంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగింది మాత్రం ఇది! నా తప్పులు క్షమించండి! ఒకటి మాత్రం నిజం. నేను జీవితంలో పెళ్ళి చేసుకోను. ఇదేదో ఇన్ ఫాక్సుయేషన్ తాలూకు ఆవేశంలో చెపుతున్న మాట కాదు. అలాగని చెప్పి మిమ్మల్ని బాధపెట్టటం కూడా నా ఉద్దేశం కాదు. జరిగినదంతా మర్చిపోండి. మీ వైవాహిక జీవితం సుఖంగా సాగాలని ఆశిస్తున్నాను బై...."

    అతడు చివరలో చెప్పినదంతా ఆమె వినడంలేదు. నుదురు చిట్లించి దీర్ఘాలోచనలో వుంది. నిమిషం తర్వాత ఎక్కడో, ఏదో లింక్ దొరికినట్టు ఫక్కున నవ్వేసి-

    "ఇప్పుడు అర్ధమైంది" అంది.

    "ఏమిటి?" అన్నాడు.

    "మీరు హోటల్లో చూసిన నోట్ బుక్ నాది కాదు."

    ఆమె చెప్పింది అర్ధంకావటానికి అతడికి కొంచెం సేపు పట్టింది.

    "నోట్ బుక్ మీది కా....దా?" అన్నాడు.

    "కాదు. ఆ రోజే స్నేహితురాలిది తీసుకున్నాను. బృహస్పతి అని పేరు పెట్టుకున్నందుకు గొప్పగానే ఆలోచించారు కానీ...." క్షణం ఆగి- ".... అన్నట్టు 'పప్పులో కాలెయ్యడం' అన్న సామెత ఎందుకు వచ్చిందో చెప్పగలరా?" అనడిగింది.

    అతడు ఆమె ప్రశ్నని పట్టించుకోకుండా "అయితే.... అయితే మీ దృష్టిలో ఏ కుర్రవాడూ లేడా?"

    "దేనికి?"

    "పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశంతో."

    "లేడే"

    అతడి మొహం వెయ్యి క్యాండిల్ బల్బ్ గా వెలిగిపోయింది.

    అది గమనించి కూడా గమనించనట్టు ఆ అమ్మాయి- "అసలిదంతా ఇంత డొంక తిరుగుడు వ్యవహారంగా ఎందుకు చేసారు? రైల్లో నా మీద దొంగతనం ఆపాదించడం ఎందుకు? ఆపైన రక్షించినట్టు నటించడం ఎందుకు? నా కింతకు ముందే మగ స్నేహితులు వున్నారా లేదాని తెలుసుకునే ప్రయత్నమెందుకూ?" అనడిగింది.

    "చెప్పానుగా? మిమ్మల్ని చూడగానే మనసు పారేసుకున్నాననీ! అయితే అప్పుడు నేను ప్లాట్ ఫారంమీదా, మీరు కదులుతున్న ట్రెయిన్ లోనూ ఉన్నారు. రైలు మనల్ని విడదీయబోయింది. మరేమీ ఆలోచించకుండా ఎక్కేసాను. 'చూడానే మిమ్మల్ని ప్రేమించాననీ, అందుకే టిక్కెట్ లేకుండా రైలెక్కాననీ' చెబితే మీరు కాదుకదా, మూలనున్న ముసలమ్మ కూడా ప్రేమించదు. అందుకే మరో విధంగా పరిచయం చేసుకున్నాను. ఇకపోతే.... మిమ్మల్ని ప్రేమించానని చెప్పడం కోసం కొన్ని వారాలూ, నెలలూ నా పరిచయంతో మిమ్మల్ని ఇంప్రెస్ చెయ్యాలి. మీరు అప్పటికే వేరెవరినయినా ప్రేమించి వుంటే నేను పడిన శ్రమంతా వృధా అవుతుంది. అందుకే ఈ 'క్వశ్చనీర్' పద్ధతి అవలంబించాను."

    హేమంత సంధ్య తలెత్తి అతడివేపు సూటిగా చూసింది. ఆ చూపుకి అర్ధం 'నీకేమైనా మతి భ్రమించిందా లేక నిజంగానే చెపుతున్నావా?' అన్నట్టుగా వుంది చివరికి- "మీరు మాట్లాడినదంతా పరస్పర విరుద్ధంగా వుంది" అంది. "....ఒక వైపు ప్రేమించానంటున్నారు, మరొకవైపు సమయం వృధా అంటున్నారు."

    "నేను చెప్పినదాంట్లో కన్ ఫ్యూజన్ ఏమీలేదు హేమంతా! సమయం వృధా అన్నది నా గురించి కాదు, మీ గురించి.... నా ప్రేమలో అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమీలేదు. అందుకే ఆరునెలల్లో ఇలా అయిపోయాను" అని, ఆగి "....ఇంక చిట్టచివరి ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే- ఈ ప్రపంచంలో చాలామంది పరిచయంతో ఆకర్షణ ప్రారంభమై, అది ప్రేమగా పరిణామం చెందుతుంది. నా విషయంలో అది ప్రేమగా ప్రారంభమై, పెళ్ళిగా పరిణామం చెందాలనుకున్నాను. దానికి తగిన వాతావరణం ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఆ 'క్వశ్చనీర్' వ్రాయించాను.... చెప్పండి, నేనంటే మీకు ఇష్టమేనా?" అన్నాడు.

    "ఏ అమ్మాయీ మొదటి కొద్ది పరిచయంలో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగల పరిస్థితిలో ఉంటుందనుకోను".

    "అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేసే కార్యక్రమం మొదలు పెట్టాలన్నమాట.... నిజాయితీగా ప్రేమించడం మానేసి!" చివరి పదాలు అస్పష్టంగా అన్నాడు.

    ఆమె తల విదిలిస్తూ "మీరు నన్ను మరింత కన్ ఫ్యూజ్ చేస్తున్నారు. ఏది ఏమైనా మన స్నేహం కొనసాగాలంటే నాదో షరతు!"

    "ఏమిటది?" ఆసక్తిగా ముందుకు వంగి అడిగాడు.

    "భవిష్యత్తులో ఎప్పుడూ మీ తెలివి తేటలతో నన్ను గందరగోళ పరచకండి"

    "థాంక్స్. అయితే స్నేహం కొనసాగుతుందన్నమాట!" అన్నాడు బల్లమీద వేళ్ళతో ఆనందంగా కొడుతూ.


                         8


    "ఒరే, లేవరా!" భుజం మీద కొడుతూ బృహస్పతిని నిద్ర లేపాడు హనుమంతరావు.

    అప్పటికే సాయంత్రం అయింది. పక్షులు గూళ్ళకి చేరుకోవడం ప్రారంభించడంతో ఆ చిట్టడవంతా కిలకిలా ధ్వనులు ప్రతిధ్వనిస్తున్నాయి. ప్రకృతి చాలా ఆహ్లాదంగా వుంది.

    బృహస్పతి బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచాడు. అతడంత గాఢంగా నిద్రపోవటం చూసి, "నిన్ను చూస్తుంటే నాకు చాలా ఈర్ష్యగా వుందిరా" అన్నాడు రావు. "....రేపు ఏమవుతుందోనన్న ధ్యాస లేదు. ఇంట్లోనుంచి వెళ్ళగొట్టారన్న దిగులు లేదు. చాప లేదు.... దిండు లేదు.... అడవిలో కూడా మధ్యాహ్నం పూట ఇంత హాయిగా ఎలా నిద్రపోగలుగుతున్నావురా?"

    "డిటాచ్ మెంట్ బ్రదర్! దాన్నే తెలుగులో వైరాగ్యం అంటారు."

    "అదేదో నాకూ కొంచెం నేర్పకూడదూ?"

    "నేర్పితే రాదు. అనుభవంతో వస్తుంది. నన్నొదిలేసినట్టే - నీ గర్ల్ ఫ్రెండ్ కూడా నిన్ను వదిలేసి, ఉద్యోగ నిమిత్తం ఏ ఢిల్లీనో వెళ్ళిపోతే, నీకూ ఆ డిటాచ్ మెంట్ వస్తుంది! ప్రస్తుతం నీకూ నీ టోపీకి డిటాచ్ మెంట్ వచ్చినట్టుంది. చూడు" దూరంగా కోతి వైపు చూపిస్తూ అన్నాడు బృహస్పతి. రావు అటు చూశాడు.

    వాళ్ళున్న ప్రదేశానికి కొద్దిదూరంలో చిన్న కొలనులా వుంది. దాని ఒడ్డునే వున్న ఒక చెట్టుమీద ఓ కోతి రావు తాలూకు టోపీతో ఆడుకుంటోంది.

    రావు దగ్గరగా వెళ్ళి 'ఇలా ఇవ్వు' అన్నట్టు సైగ చేశాడు.

    'ఫలానా వ్యవహారంలో పదికోట్లు తినేసావు' అని ప్రతిపక్ష నాయకులు గొంతెత్తి అరుస్తుంటే, చిద్విలాసంగా పార్లమెంట్ లో కూర్చున్న మంత్రిలా ఓ చూపు అతడివైపు పడేసి- మళ్ళీ టోపీతో ఆడుకోవటంలో నిమగ్నమై పోయింది కోతి.

    రావు, నేలమీదున్న రాయితీసి, దానివైపు గురిచూసి విసిరాడు. అదికూడా కొమ్మకున్న కాయ తీసి, గురిచూసి అతడి వైపు విసిరింది. రాయి తగల్లేదు- కాయ తగిలింది. దెబ్బతిన్న రావు వెనక్కి తలతిప్పి బృహస్పతి వైపు చూసాడు.

 Previous Page Next Page