ఇద్దరూ కూర్చున్నారు. రాజా జయసింహ స్కాచ్ ఓపెన్ చేస్తూ "చెప్పండి ఇంత రాత్రిపూట వచ్చారంటే ఏదో పని వుండే వుంటుంది."
"అవును. ఓ కేసు వివరణ కోసం వచ్చాను."
జయసింహ ఆశ్చర్యంగా "కేసా" అన్నాడు.
"అవును. కొన్నాళ్ళపాటు నేను కిడ్నాప్ అయ్యాను తెలుసుకదా."
"తెలుసు"
"పోలీసులకు వివరాలు చెప్పలేదు నేనే స్వయంగా పరిశోధిద్దామని."
జయసింహ ఉత్సుకతతో చూశాడు.
"నేనొక ఆస్పత్రిలాంటి ప్రదేశంలో వుంచబడ్డాను. నిజానికి అది ఆస్పత్రి కాదు ఒక పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకుని నన్ను అందులో వుంచారు."
"అయితే?"
"ఆ భవనం మీదే జయసింహా!"
ఆ గదిలో నిశ్శబ్దం వ్యాపించింది. దాన్ని చెదురుస్తూ ఆశ్చర్యం నుంచి తేరుకున్న జయసింహ "మైగాడ్ నిజమా?" అన్నాడు. "ఆ భవనాన్ని ఎవరో నెల రోజులపాటు షూటింగ్ కోసం కావాలంటే ఇచ్చాను. అంతేకానీ ఆ దుర్మార్గులు ఇలా మిమ్మల్ని బంధించటానికి ఉపయోగిస్తారు అనుకోలేదు. ఐయం సారీ- నిజంగా."
"ఫర్వాలేదు."
"నేను మీకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోవాలి. మీరు ఈ విషయం పోలీసులకీ, పత్రికలవాళ్ళకీ చెప్పివుంటే నన్ను భ్రష్టుపట్టించి వుండేవాళ్ళు. ప్రశ్నలతో చంపి వుండేవాళ్ళు."
"మీరు నాకో సాయం చెయ్యాలి."
"చెప్పండి."
"ఈ ఇంటికోసం మీ దగ్గరికి ఎవరొచ్చారో చెప్పండి"
"అతని పేరు జయరామ్ అని చెప్పాడు. నెలరోజుల అద్దె పదివేలు ముందే ఇచ్చాడు."
"అతడి అడ్రసు?"
"సారీ, తెలీదు."
"నన్ను పిచ్చివాడిని చెయ్యడం కోసమో, సుబ్బారావ్ ని అని నమ్మించటం కోసమో దాదాపు యాభైవేలు ఖర్చుపెట్టారు వాళ్ళు. ఎందుకో అర్ధంకావటంలేదు. నన్ను చంపటం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. అదే అయితే మొదటిరోజే ఆ పని చెయ్యొచ్చు. వాళ్ళు పెట్టిన హింసలకి ఇంకొకరయితే పూర్తిగా పిచ్చివాడయిపోయి వుండేవాడే. ఎందుకింత ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు? అది తెలుసుకోవటం కోసమే నేను స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాను. పోలీసులు కేవలం క్రిమినల్ గా ఆలోచించి, ఆ కోణంలో వెళతారు. నా విషయంలో అది కారణం కాదనిపిస్తోంది. వాళ్ళు ఏదో ఉపయోగం కోసం నన్ను వాడుకోవాలనుకున్నారు. మధ్యలో అది ఫెయిలైంది. నాకు వాళ్ళు దుర్మార్గులుగా, విదేశీ ఏజెంట్లుగానూ కనిపించలేదు. అందుకే నాకు ఇంత ఇంటర్స్టు పుట్టింది." అన్నాడు. అతడు ప్రనూషని గుర్తుతెచ్చుకుంటూ ఈ మాటలు మాట్లాడాడని అతని మనసుకి మాత్రమే తెలుసు. ఒకవైపు ఆమె అందం సూదంటురాయిలా ఆకర్షిస్తున్నా- ఆమె తనని పట్టి వుంచిన నాటకం తల్చుకుంటూ వుంటే ఒళ్ళు మండిపోతోంది. ఎలాగయినా ఈ నాటకం తాలూకు రహస్యం కనుక్కుని ఆమెని రెడ్ హేండెడ్ గా పట్టుకోవాలని అతడి మనసు ఉవ్విళ్ళూరుతోంది.
"నేను మీకే విధంగా సాయపడగలిగినా సంతోషమే" అన్నాడు జయసింహ.
"ఆ జయరాం మీకు గుర్తున్నాడా?"
"ఉన్నాడు. సాధారణంగా ఒకసారి చూస్తే నేను మర్చిపోను."
"మీరొక పెయింటర్. అతడి ఫోటో చిత్రీకరించగలరా?"
జయసింహ స్థబ్ధుడై చూశాడు. కానీ క్షణం సేపే. అతడి మొహం విప్పారింది.
"నిజమే. ఇది మంచి ఆలోచనే."
జయసింహ మరి ఆలస్యం చెయ్యలేదు. స్టాండ్ అరేంజ్ చేసి, పెయింట్ చేయటం మొదలు పెట్టాడు. సరిగ్గా గంట పట్టింది బొమ్మ వేయటానికి.
బొమ్మ పూర్తిచేసి పక్కకి తొలుగుతూ "చూడండి చైతన్యా! ఇతడే జయరాం" అన్నాడు.
చైతన్య ఆ బొమ్మని చూసి ఉలిక్కిపడి "మైగాడ్! ఇతను మీ దగ్గరికి జయరాం అని పేరు పెట్టుకుని వచ్చాడా? నా దగ్గర డాక్టర్ పాల్ జోసెఫ్ అని పేరు పెట్టుకున్నాడు" అన్నాడు.
జయసింహ ఆ బొమ్మని చూస్తూ వుండిపోయాడు.
"ఇతను ఈ ప్రపంచంలో ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను" దృఢంగా అన్నాడు చైతన్య.
"అంత అవసరం లేదు. అతడిని నేను తరచు ఒకచోట చూస్తూ వుంటాను" వెనుకనుంచి వినపడింది.
ఇద్దరూ చప్పున వెనుదిరిగారు.
గుమ్మం దగ్గర నిలబడి వుంది జయశ్రీ. జయసింహ కూతురు. ఐ.ఏ.యస్.కి తయారవుతున్న అమ్మాయి.
"నిజంగానా! ఎక్కడ చూస్తూ వుంటావు అతన్ని?" తొందర తొందరగా అడిగాడు చైతన్య.
"సిటీ సెంట్రల్ లైబ్రరీలో" అంది జయశ్రీ.
"నేను చాలాసార్లు అతన్ని అక్కడ చూశాను."
"అతడిని పట్టుకోవటానికి ప్రయత్నం చేస్తాను. నీకు కనపడితే వెంటనే స్టూడియోకి ఫోన్ చెయ్యి."
"తప్పకుండా" అంది జయశ్రీ.
చైతన్య జయసింహతో కరచాలనం చేసి "థాంక్స్, చాలా సాయం చేశారు. ఒక "క్లూ" దొరికింది. వెళ్ళొస్తాను" అన్నాడు.
అతడిని దింపటానికి జయశ్రీ కారు వరకూ వచ్చింది.
చైతన్య కారు కదిలింది.
ఆమె ఒక నిమిషం అలాగే నిలబడి తర్వాత లోపలికి వెళ్ళింది. బెడ్ రూంలోకి వెళ్ళి తలుపేసుకుని ఫోన్ డయల్ చేసింది.
"హల్లో ప్రనూషా"
"నేనే మాట్లాడుతున్నాను."
"నువ్వు వూహించింది కరక్టేనే. చైతన్య 'ఆ ఇల్లు అద్దెకి ఎవరికిచ్చారు' అని వాకబు చేయటానికి మా ఇంటికొచ్చాడు."
"తర్వాతేమైంది?" అవతలి కంఠంలో టెన్షన్.
"మా నాన్న ఓ పిచ్చిమారాజు. ఆ మనిషి బొమ్మవేసి చూపించాడు. మధ్యలో నేను కల్పించుకుని అతను లైబ్రరీ దగ్గర దొరుకుతాడని చెప్పాను."
అవతలి కంఠం రిలీఫ్. "మంచిపని చేశావ్."
"విష్ యు బెస్ట్ ఆఫ్ లక్"
"థాంక్యూ."
ఫోన్ పెట్టేసి ప్రనూష లేచి డ్రాయింగ్ రూంలోకి వచ్చింది.
ఆ రూంలో వున్న ఫర్నిచర్ దాదాపు యాభై లక్షలు చేస్తుంది. మామూలుకన్నా దాదాపు రెండింతలు ఎత్తున్న పైకప్పు, ఎంతో పనితనంతో నగిషీలు చెక్కిన తలుపులు, ఆరడుగుల ఎత్తున్న దంతపు విగ్రహం రాజభవనంలా వున్న ఆ విశాలమైన గది మధ్యలో ఆమె ఒక్కతే ఎడారి మధ్యలో తప్పిపోయిన శిశువులా వుంది.
ఆ గది గోడకి బంగారపు రంగు అద్దకం వున్న లతల ఫ్రేములో రెండు నిలువెత్తు ఫోటోలున్నాయి. రాజవంశీకుల్లా వున్న ఆ దంపతుల్లో భర్త మాత్రం మిలటరీ డ్రస్ లో వున్నాడు.
అతడు ప్రనూష తండ్రి.
అతడు రాజవంశానికి చెందినవాడు. ఆమె తాతముత్తాతలు సామ్రాజ్యాధీశులు. రాజ్యాలు పోయినా వారి దగ్గర నిక్షిప్తమైన వజ్రాలే కోట్లు ఖరీదు చేస్తాయని ప్రతీతి. ఎన్నికోట్లకి అధిపతులయినా, వారు దేశభక్తులు. ప్రనూష తండ్రి భారత సైన్యంలో చాలా పెద్ద పోస్టులో పనిచేసి మరణించాడు. ఆమె తల్లి కూడా తండ్రితోపాటే హతురాలయింది. ఆ మరణాలు ప్రనూష గుండెల్లో శాశ్వత చిత్రాలు. ఆమె వాటిని మర్చిపోలేదు.
ఆ ఫోటోలు క్రిందగా వున్న డ్రాయర్ లోంచి ఆమె ఒక కాగితాల కట్ట తీసింది. రకరకాల మ్యాపులూ, వివిధ ఫోటోలు వున్నాయి ఆ కట్టలో. వాటిని కొంచెంసేపు పరిశీలించి తిరిగి లోపల పెట్టేసింది. తలెత్తి తండ్రి ఫోటోవైపు చూసింది. 'వచ్చేసింది నాన్నా, ఏ రోజుకోసమైతే నేను ఇన్నాళ్ళూ ఎదురు చూస్తున్నానో ఆరోజు దగ్గర్లోకి వచ్చేసింది' అనుకుంది మనసులో.
8
ఇస్మాయిల్ తిరుపతి బస్ స్టాండ్ లో దిగాడు. బస్ స్టాండ్ పక్కనే వున్న డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ కి వెళ్ళి "చైతన్య అమ్మగారు ఈ వూరొచ్చారట. ఎక్కడ దిగారో చెప్పగలరా?" అని అడిగాడు.
"చైతన్యగారి సినిమాలు పంపిణీ చేసేది మేం కాదు. పక్క వీధిలో మరో ఆఫీసు వుంది" అని చెప్పారు వాళ్ళు. ఇస్మాయిల్ అక్కడికి వెళ్ళాడు. చాలా పెద్ద ఆఫీసు అది. పెద్ద హాలు నిండా చైతన్య తాలూకు చిత్రాల రకరకాల ఫోటోలు అతికించి వున్నాయి. వాటిని చూస్తూ నిలబడ్డాడు అతడు. అప్రయత్నంగా అతడి కళ్ళు తడి అయ్యాయి. ఏదో తెలియని ఉద్విగ్నత మనసంతా నిండివుంది. "చైతన్యా! ఇంత చిన్న వయసులో ఇంత విజయాన్ని సాధించావు. దీన్నంతా నీ తండ్రి చూస్తూవుంటే ఎంత సంతోషించేవాడో కదా" అనుకున్నాడు అతడు. చైతన్యని దాదాపు పది సంవత్సరాల వయసులో వుండగా చూశాడు. మంచు పర్వతాలమధ్య చిన్న కాలనీ. ఆకాశాన్ని అంటే సూదిమొన ఆకుల చెట్లు. ఆ ప్రశాంత నిశ్శబ్దాన్ని చెదురుస్తూ బాంబుల చప్పుడు... యుద్ధం...
"ఎవరదీ?"
ఇస్మాయిల్ వెనక్కి తిరిగి చూశాడు. ఆఫీసు గుమాస్తా అడుగుతున్నాడు. ఇస్మాయిల్ అతని దగ్గిరగా వెళ్ళి "చైతన్య అమ్మగారు తిరుపతి వచ్చారట కదా. ఆమె ఎక్కడున్నారు?" అని అడిగాడు. చైతన్య ప్రసక్తి రాగానే గుమాస్తా మొహంలో నమ్రత కనబడింది. "మీరామె బంధువులా?"
అవునూ కాదుల మధ్య తలూపాడు ఇస్మాయిల్.
"రంగనాయకమ్మగారు కొండపైకి వెళ్ళారు. ఈ పాటికి బయల్దేరి వస్తూ వుండవచ్చు."
"ఇక్కడికే వస్తారా?"
"అవును. ఇక్కడికే వస్తారు. కాస్త విశ్రాంతి తీసుకుని ఇక్కడనుంచి వెళతారు. మీరిక్కడే వుండండి."
ఇస్మాయిల్ ఎదురు చూడటం ప్రారంభించాడు.
* * * *
"ప్రేమ నీళ్ళులాంటిది. ఏ హృదయపు సీసాలో పోస్తే ఆ ఆకారం దాలుస్తుంది."
"కాదు శేఖర్, ప్రేమ పంచదారలాంటిది, కాఫీలో వేస్తే తియ్యగా వుంటుంది. కాలిస్తే నల్లబడుతుంది. ఎక్కువయితే మొహం మొత్తుతుంది."
"నా ప్రేమ కాలిస్తే నల్లబడదు. ఎక్కువయినా మొహం మొత్తదు. స్వచ్చమైన పంచదారలా తెల్లగా మెత్తగా వుంటుంది."
"నువ్వు పంచదారలాంటి వాడివయితే నేను రసం తీసిన బత్తాయి పండులాంటిదాన్ని శేఖర్. బీదతనం తప్ప ఏ అర్హత లేనిదాన్ని శేఖర్. బీదతనం తప్ప ఏ అర్హత లేనిదాన్ని."
"కట్" అన్నాడు డైరెక్టర్. చైతన్య వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. నలుగురైదుగురు బెదురుగా వచ్చి నిలబడితే పిల్చి ఆటోగ్రాఫ్ లు ఇచ్చాడు.
"పిక్చర్ ఎలా వుంది?" వారంరోజుల క్రితం రిలీజయిన తన పిక్చర్ గురించి అడిగాడు.