Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 12

  

        ఒక్క ఆడపిల్ల పెళ్ళిగురించి ఇంత అవస్థపడాలా? ప్రతి సారీ పెళ్ళివాళ్ళు రావడం. వచ్చినప్పుడల్లా ఖర్చు. అంతకుమించిన టెన్షన్. ఇది కుదిరిపోతుందేమోనని మరో పక్క ఆశ.....వాళ్ళనుంచి సమాధానం వచ్చేవరకు వాదోపవాదాలు, ఆలోచనలు- ఇంతాచేసి "నో" అన్న సమాధానం రాగానే ఉత్సాహం అణగారి పోయి, ఓ రోజంతా వాళ్ళని తిట్టుకోవడం, నైరాశ్యం....పిచ్చి ఆలోచనలతో అమ్మ ఆరోగ్యం దిగజారడం, నాన్న చిరాకు - అంతా అలవాటయిపోయింది.
   
    "పెళ్ళి అయ్యేవరకూ మగవాడు మంచి బేరం కోసం వెయిట్ చేయగలడు. ఆడపిల్లని అలా వుంచితే కష్టం...." అన్న సిద్దాంతం మీద నిర్మించబడిన మార్షల్ లా ఆఫ్ డిమాండ్ అండ్ సప్లయ్ కట్నరేఖని పైపైకి తోస్తోంది. కలలన్నీ కల్లలై పోయాయి. అందాల రాకుమారుడి స్థానంలో 'డబ్బు-డబ్బు' అని చేతులుచాస్తూ అరుస్తున్న రాక్షసులే కనిపిస్తున్నారు. "దానికింకా టైం రాలేదు....." అన్నది మధ్యతరగతి కుటుంబాల్లో ఊరటనిచ్చే సమాధానం.
   
    "అక్కా.... అక్కా!" గట్టిగా అరుస్తోంది కృష్ణజ.
   
    'ఏమిటే అలా గొంతు చించుకుంటున్నావ్? నాకేం చెవుడు లేదు" కసురుకుంది పావని.
   
    "అమ్మకు నెప్పి వచ్చింది నిద్రలోనే బాగా ఏడుస్తోంది."
   
    గతుక్కుమని పావని లోపలి పరుగెత్తింది. అప్పటికే అరుంధతి ప్రాణం పోయింది. దుఃఖం నెప్పితో కాదు- పెద్దకూతురి పెళ్ళి అవదేమో అన్న విచారంతో!! ఇక ఏ దుఃఖమూ లేని తీరాలకు ఆమె ఆత్మ వెళ్ళిపోయింది.
   
                              *    *    *
   
    "జాతకాలు బాగా కుదిరాయి. మా వాడికి అమ్మాయి నచ్చింది అన్నాడు. ఇక మీరు వెళ్ళు మాట్లాడండి. వాళ్ళు సరేనంటే వస్తాం. తాంబూలాలు పుచ్చుకోవచ్చు" అంది పెళ్ళికొడుకు అత్త.
   
    రామశాస్త్రి ముఖం వికసించింది. "నే నాయనకు చెబుతూనే వున్నాను. వినిపించుకోలేదు. అందరికీ డబ్బే ప్రధానం అని వాదిస్తాడు. ఇప్పుడేమంటాడో చూద్దాం" అన్నాడు మధ్యవర్తిగా.
   
    "అలాగా! అయితే నేనే వచ్చి మాట్లాడతా పదండి....." అన్నాడు పెళ్ళికొడుకు.
   
    వాళ్ళు విశ్వపతి ఇంటికి చేరేసరికి సాయంత్రం నాలుగు దాటింది. దూరంనుంచే ఇంటిముందు వెలుగుతున్న మంట కనిపించింది.
   
    "ఏమిటది? ఏం జరిగింది?" రామశాస్త్రి అనుమానంగా నడిచాడటువైపు.
   
    వాకిట్లో అరుంధతి అంతిమ ప్రయాణానికి సిద్దపరుస్తున్నారు. విశ్వపతి ఓ పక్కన కూర్చుని విలపిస్తున్నాడు. పిల్లలంతా తల్లి శవం మీదపడి ఏడుస్తున్నారు. తండ్రి పక్కనే కూర్చుని అతడి బాధలో పాలుపంచుకుంటూ తన దుఃఖాన్ని అణచుకుంటోంది పావని.
   
    ఇద్దరూ వాళ్ళ దగ్గరకు నడిచారు. రామశాస్త్రిని చూడగానే విశ్వపతి దుఃఖం అధికమైంది. "చూశారా శాస్త్రిగారూ....! పన్నెండేళ్ళు ప్రాణం తీయలేదు జబ్బు- అమ్మాయి పెళ్ళి కుదరటంలేదన్న రెండేళ్ళ దిగులు చేయగలిగిందా పని! నేను చెప్పలేదూ-డబ్బే ప్రధానం అందరికీ....అది లేకుండా చేసుకునే వాడెవడూ లేడు."
   
    "ఉన్నాడు విశ్వపతిగారూ! ఇదిగో ఈ అబ్బాయే మీరన్న మాటలు తెలిసి మీ వాదన నిజం కాదని రుజువు చేస్తానంటూ వచ్చాడు."
   
    "అవునండీ! ఈ సమయంలో వచ్చినందుకు క్షమించండి. ఇలా జరిగిందని మాకు తెలీదు. నాకే కట్నమూ, లాంఛనాలూ అక్కరలేదు. మీ అమ్మాయిని నేను చేసుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే...." విశ్వపతి నమ్మలేనట్లు చూశాడు. "సెక్రటేరియట్ లో పని చేస్తున్నది ఈ అబ్బాయేనా?" అంత దుఃఖంలోనూ ఆశ్చర్యంగా అడిగాడు.
   
    "అవును....! అక్షరాలా ఈ అబ్బాయే...... నేను చెప్పిన సంబంధం యిదే" అన్నాడు గర్వంగా రామశాస్త్రి.
   
    విశ్వపతి భార్య ముఖంలోకి చూశాడు. అతడి దుఃఖం మరింత  అధికమైంది.
   
    "ఒక్కరోజు ముందుగా వస్తే బావుండేది. మీ అందరినీ నువ్వు ముఖాలతో చూస్తుండేవాడిని. ఈ దురదృష్టం నాది మామగారూ" అతడు వరస కలిపేశాడు.
   
    విశ్వపతి అనుకోకుండా అతడిని దగ్గరకు తీసుకున్నాడు. "బాబూ! మా అరుంధతి  ఆత్మ శాంతిస్తుంది...." అన్నాడు. అతడి కళ్ళవెంట నీళ్ళు జలజలా రాలాయి. ఆనందాన్నీ.....దుఃఖాన్నీ కలబోసుకుంటూ భార్యమొహం లోకి చూశాడు. ఈ ఆనందానికి.... దుఃఖానికి అతీతంగా వుంది అది.
   
                                *    *    *

    పావని కింకా అంతా కలలా అనిపిస్తోంది.
   
    ఎప్పటిలాగే అమ్మకు వచ్చిన నెప్పి కొద్దిగంటల్లో తగ్గిపోతుందని మందువేసి పడుకోబెట్టడం, ఆవిడ ప్రశాంతంగా నిద్ర పోతుందని సంతోషపడటం, అంతలోనే అది శాశ్వత నిద్ర అని తెలియటం...... ఆ అమ్మాయికి పెద్ద దెబ్బ.
   
    ఇంట్లో మొదటి చావు, అందులోనూ బాగా ఆప్తులయిన తల్లిదండ్రులలో ఒకరి మరణం ఎంతటివారినయినా కదిలిస్తుంది. కానీ పావనిని అంతకంటే కదిలించింది తండ్రి దుఃఖం అలాంటి స్థితిలో వుండగా ఆ అబ్బాయి రావడం, అమ్మ శవం ముందు కూర్చుని పెళ్ళికి ఒప్పుకోవడం..... అంతా కలలోలా జరిగిపోయింది.
   
    రోజులు వేగంగా గడిచిపోయాయి. పెళ్ళికొడుకు అక్కలిద్దరూ కుటుంబాలతో తరలి వచ్చారు. పెళ్ళి అతి నిరాడంబరంగా జరిగిపోయింది. ఎక్కడా ఎలాంటి గొడవలూ లేవు. విశ్వపతి దుఃఖాన్ని దిగమింగుకుంటూ అంతా సవ్యంగా జరిపించాడు.
   
    అనుకున్నంతసేపు పట్టలేదు అయిపోవటానికి.
   
                              *    *    *
   
    పాల గ్లాసుతో గదిలోకి అడుగు పెట్టింది పావని. తెల్లటి చీరెలో ఆమె అందం ద్విగుణీకృతమైంది. సిగ్గుతో నాలుగడుగులు వేసి ఆగిపోయింది.
   
    అతడు మెల్లిగా లేచివచ్చి గ్లాసందుకున్నాడు. పావని అతని కాళ్ళమీదకు ఒరిగిపోయింది భక్తిగా.
   
    "ఛ- ఏమిటిది? ఇవన్నీ యెవరు చెప్పారు నీకు?" గ్లాసు బల్లమీదుంచి ఆమెను లేవనెత్తాడు.
   
    "ఎవరో చెప్పాల్సిన అవసరంలేదు. రెండేళ్ళుగా చాలామంది వచ్చి నన్ను చూసిపోయారు. ఎవరిలోనూ మానవత్వం కనిపించలేదు. అసలు మానవత్వం మీద నమ్మకం పోయిన క్షణంలో మీరు దేవుడిలా వచ్చారు. దేవుడి పాదాలకు నమస్కరించడంలో తప్పులేదుగా...."
   
    "నేను దేవుడిని కాదు- మామూలు మనిషిని! నన్నిలా అందలం ఎక్కించకు."
   
    "మామూలు మనుష్యులతో మిమ్మల్ని పోల్చుకోకండి. వాళ్ళంతా డబ్బుకోసం పడిచచ్చేవాళ్ళు. డబ్బు తప్ప వాళ్ళకు మరో లోకం వుండదు."
   
    "నిన్ను భార్యగా పొందడం నా అదృష్టం అని నేను అనుకుంటున్నా చూద్దాం ఎవరిమాట నిజమవుతుందో" నవ్వాడతను.
   
    "సర్లెండి, ముందు పాలు తాగండి చల్లారిపోతున్నాయి."
   
    "తాగుతాను-ఒక్క షరతుమీద."
   
    "ఏమిటది?" అంది.
   
    "ఏమండీ, మీరూ అని పిలవడం బావోలేదు. నువ్వు నన్ను పేరు పెట్టి పిలవాలి."
   
    "పేరు పెట్టి పిలవటమా? ఊహుఁ నా వల్లకాదు" సిగ్గుతో అంది పావని. తను చదివిన రొమాంటిక్ నవలల్లో హీరో అచ్చం ఇలాగే అడగడాన్ని గుర్తుతెచ్చుకుంది. కలల రెక్కలు మెల్లిగా విచ్చుకుంటున్నాయి. మనసు ఆనంద డోలికల్లో వూగుతోంది.
   
    "ఎందుకు కాదు? నా పేరు భాస్కర రామ్మూర్తి. భాస్కర్ అనో, మూర్తి అనో పిలువు. నీ ఇష్టం" అన్నాడతను.
   
       
                               --****--

 Previous Page Next Page