Previous Page Next Page 
ఈ దేశంలో ఒక భాగమిది పేజి 12

   

      ఆయనకు తన వయసును పదేపదే గుర్తుచేసుకునే అలవాటు కూడా వుంది.
   
    "నాకు అరవైఏళ్ళు వచ్చినా చకచకమని పనిచేస్తూ ఉంటాను. ఇప్పటి కుర్రాళ్ళు నాలా కష్టపడలేరు. మావాడిని నేను కష్టపడినట్లుగా పడమనండి చూద్దాం? ఆ వయసులో నేను పడిన కష్టంలో వెయ్యోవంతు పడలేరు వీళ్ళు" అనేవాడు.
   
    తాను ఆచరించిన విధానమే సరియైనది. తాను ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తేనె సబబైనది అనికూడా ఆయన అనుకుంటూ వుంటాడు. తను ఉదయం ఎనిమిది గంటలకి డిస్పెన్సరీకి వచ్చి పన్నెండూ ఒంటిగంటకల్లా ఇంటికి పోయినట్లే మరొకరు ఓ గంట ఆలస్యంగా వచ్చి రెండు, మూడుదాకా పనిచేసినా అది ఎబ్బెట్టుగనే కనిపిస్తుందిగానీ అతన్ని వాళ్ళ అలవాటుతోను అంగీకరించరు.
   
    ఒక వృత్తిలో ఇద్దరు వ్యక్తులు స్నేహితులుగానీ, అన్నదమ్ములుగానీ, తండ్రీ కొడుకులుగానీ నిరంతరం ఒకరికొకరు కనబడుతూ ఒక స్థలంలో ఉన్నట్లయితే అనుకూలతకన్నా వ్యతిరేకత ఎక్కువని కుమార్ మొదట్లోనే గ్రహించాడు.
   
    తండ్రినుంచి అతనాశించిన సహకారం ఊహించిన రీతిలో రావటంలేదు.
   
    ఎప్పుడయినా ఆయన తొందరగా వెళ్ళిపోయే పని ఉన్నట్లయితే ఆయనకోసం ఎదురుచూసేవాళ్ళని 'మా అబ్బాయి వున్నాడుగా, చూపించుకోండి. ఎవరయితే ఏమిటి?' అనకుండా 'మా అబ్బాయితో చూపించుకోండి, రేపు నేను మళ్ళీ చూస్తాను' అనేవాడు.
   
    ఒక్కోసారి "రేపు నేను ఆసుపత్రికి రావటంలేదు, వేరేపని వుంది. అందుకని మీరు రేపు రాకండి, ఎల్లుండి రండి" అనేవాడు.
   
    తండ్రి ఈ విధంగా అంటుంటే కొడుకుస్థాయి ఎప్పటికి పెరుగుతుంది?
   
    తండ్రి తనకో ఛాలెంజిగా కనిపించాడు కుమార్ కి. అతను 'సైలెంట్ మేన్' కావచ్చు కానీ అతని మనసు నిశ్శబ్దంగా ఊరుకోదు. అతని వ్యక్తిత్వం అతన్ని చిత్రవధ చేయటం మొదలుపెట్టింది.
   
    చాలాకాలం తర్జనభర్జన పడి, ఒక నిర్ణయానికి వచ్చాక చివరికి తండ్రితో "సాయంత్రంపూట ఇద్దరికీ సరిపడే పని వుండటం లేదుకదా! టైమ్ వేస్టు చేస్తున్నామనిపిస్తుంది నాకు. ప్రొద్దుట ఇక్కడ ఇద్దరం కలిసే పనిచేద్దాం. సాయంత్రం మీరిక్కడ వుండండి. నేను విడిగా బ్రాంచి ఓపెన్ చేస్తాను" అన్నాడు.
   
    రంగారావుగారు అతనివంక అయిష్టంగా చూసి "నేను ఒక్కడ్నీ చేసుకోలేక కదా నిన్ను కూడా ఇక్కడ ఉండమన్నది. మళ్ళీ నువ్వు విడిగా బ్రాంచిపెడితే నాకు ప్రతిరోజూ విధిగా సాయంత్రాలు ఇక్కడికి రావలసి వస్తుంది కదా?" అన్నారు.
   
    "మీరెలాగూ రోజూ వస్తూనేవున్నారు కదా?" అన్నాడు కుమార్.
   
    "ఇప్పుడు వస్తున్నాననుకో ఎప్పుడయినా సుస్తీ చేస్తుంది. ఎ ఊరయినా వెళ్ళాల్సివస్తుంది, అప్పుడిక్కడ ఇబ్బంది అవుతుంది కదా?"
   
    "అలాంటి అవసరం వచ్చినప్పుడు టైము ఎడ్జస్టుచేసుకుని అక్కడా ఇక్కడా చూసుకుంటాను లెండి" అన్నాడు కుమార్.
   
    "ఈ బాధ్యతంతా నీకప్పజెప్పి ముందు ముందు రిటైరవుదామన్న తలంపుతో వున్నాను కదా, అప్పుడు దానికీ దీనికీ లంగరెలా కుదురుతుంది?"
   
    "మీరెప్పటికి రిటైరవుతారు?" అని అడగాలనుకున్నాడు కుమార్.
   
    "బయటికి మాత్రం అప్పటి విషయం తరువాత చూసుకోవచ్చు గదా! బ్రాంచి పెట్టాలనే నేను నిశ్చయించుకున్నాను" అన్నాడు కుమార్.
   
    రంగారావుగారు కొడుకుతో ఏమీ తర్కించలేదు. ఇంట్లో మాత్రం తల్లిదగ్గర "వీళ్ళు పెద్దవాళ్ళయిపోయారు. మన మాటలు వింటారా? వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటారు. అడగటానికి మనమెవరం?" అన్నాడు.
   
    కొద్దిరోజుల్లోనే కుమార్ మంచి లొకాలిటీ చూసుకుని బ్రాంచి పెట్టుకున్నాడు. సాయంత్రంపూట అయిదు గంటలకు వెళ్ళి ఎనిమిది గంటలదాకా వుండేవాడు అక్కడ.
   
    తను వ్యక్తిగతంగా పైకిరావాలన్న పట్టుదల ముద్రవేసుకుని కూర్చుంది.
   
    ఆ పట్టుదల వల్ల కావచ్చు, కృషివల్ల కావచ్చు. అదృష్టంకూడా కలసివచ్చి వుండవచ్చు. తొందరలోనే అతని 'క్లయింటేరియా' పెరిగింది. అతనిపేరు ఆ చుట్టుప్రక్కల నలుగురిలోనూ బాగా నలిగింది.
   
    సాయంత్రాలు తన డిస్పెన్సరీలో పనిచేస్తుంటే అతనికి చాలా ఆనందంగా వుండేది.
   
    అక్కడ పేరు సంపాదించుకోవటం వల్ల ఉదయంపూట కూడా అతనికోసం వచ్చేవారు రానురానూ బాగా పెరగసాగారు. మర్రిచెట్టులాంటి తండ్రిదగ్గర ఓ ఊడలానే వున్నా, ఆ ఊడకూడా పెద్దది కాజొచ్చింది.
   
    ఓ గంట గడిచేసరికి కుమార్ కోసం వచ్చే పేషెంట్లు వరుసగా రాసాగారు.
   
    అంతవరకూ పనిలేనట్లు అయోమయావస్థలో కూర్చుండిపోయిన కుమార్ వున్నట్లుండి బిజీ అయిపోయాడు. ఓ గంటక్రితం తండ్రి తిరిగినట్లే అటునుంచి ఇటూ, ఇటునుంచి అటూ చకచకా తిరుగుతూ పేషెంట్లను చూసి పంపించేస్తున్నాడు.
   
    కాసేపటికి రంగారావుగారికి చెయ్యటానికి పనిలేకుండా అయిపోయింది.
   
    కాంపౌండర్ని పిలిచి 'ఇంకా ఎవరైనా వున్నారేమో పిలవవయ్యా!' అన్నాడు.
   
    "ఎవరూ లేరండీ!" అన్నాడు కాంపౌండరు.
   
    "లేకపోవడమేమిటి? బయట పాతికమందికి పైగా కూర్చునివుంటే?"
   
    "వాళ్ళంతా చిన్న డాక్టరుగారే కావాలంటున్నారండీ!"
   
    "ఇదిగో చిన్న డాక్టరుగారూ, పెద్ద డాక్టరుగారూ అని ఈ తేడాలు వాళ్ళకు నేర్పకండి. ఒకచోట ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ఎవరికి వీలుంటే వాళ్ళు చూస్తుంటారు. ఆ డిసిప్లిన్ పేషెంట్లకి నేర్పాలి. ఊ, ఎవర్నో ఒకరిని పిలువు" అని రంగారావుగారు గర్జించారు.
   
    కాంపౌండరు భయంగా తల ఊపి బయటకు వెళ్ళి ఓ స్త్రీని లోపలకు తీసుకువచ్చాడు. ఆ స్త్రీ ఆయనదగ్గర పరీక్ష చేయించుకున్నట్లే చేయించుకుని అటూఇటూ చూసి మళ్ళీ కుమార్ గదిలోకి దూరించి. మళ్ళీ పరీక్ష చేయించుకుంది.
   
    రంగారావుగారిది చూసి ఆ విషయం పట్టించుకోనట్లు ప్రవర్తించి కాంపౌండర్ల పనిలో ఏదో లోటుపాటులెంచి, వాళ్ళని ఛడామఢా తిట్టాడు.
   
    అందమైన తండ్రీకొడుకుల సంఘర్షణలో కాలం గడిచి ఆసుపత్రి మూసేవేళ అయిపోయింది.
   
    ఇద్దరూ మళ్ళీ బయటికొచ్చి కారెక్కారు.
   
                                  4
   
    మధ్యాహ్నం భోజనాలయిపోయాయి. తండ్రీకొడుకులిద్దరూ ప్రక్కప్రక్కనే కూర్చుని భోజనం చేశారు. భోంచేస్తున్నంతసేపూ రంగారావుగారేదో మాట్లాడుతూనే వున్నారు. కుమార్ ఊఁ కొడుతూనే వున్నాడు.
   
    అతని తమ్ముడు హరి పదిగంటలలోపు భోజనంచేసి వెళ్ళిపోతాడు. అతను సి.ఎ.పాసయి, బ్యాంకులో సబ్ ఏజెంటుగా పనిచేస్తున్నాడు. ఆ వెళ్ళటం వెళ్ళటం సాయంత్రం అయిదుగంటలవరకూ రాడు.
   
    సాధారణంగా డాక్టర్లిద్దరి టైముకీ అతని టైముకీ కలవదు. సాయంత్రం అతనింటికి వచ్చే సరికి వీళ్ళిద్దరూ డిస్పెన్సరీలకు వెళ్ళిపోతారు. ఓ గంట ఇంట్లోవుండి, ముఖం కడుక్కుని అతను మళ్ళీ బయటకు వెళ్ళిపోతాడు. అతనికి స్నేహితులెక్కువ. వాళ్ళతో ఎక్కువగా వుంటాడు. వారానికి రెండుమూడు సినిమాలైనా చూస్తూ వుంటాడు. అతనికి స్నేహితులతో పార్టీలు, విందులు, వినోదాలూ ఎక్కువ. సాధారణంగా రాత్రి తొమ్మిది దాటితేగానీ ఇంటికి రాడు. ఆ టైముకు రంగా రావుగారు నిద్రపోతూ వుంటారు. కుమార్ భోజనం ముగించి పైకి వెళ్ళిపోయి వుంటాడు.
   
    అతని జీవితం చూస్తే కుమార్ కి అసూయగా వుంటుంది. తనకన్నా అతను సుఖపడిపోతూన్నట్లు దిగులుపడుతూ వుంటాడు.
   
    కానీ ఒకందుకు తమ్ముడ్ని చూస్తే అతనికి కోపం. ఒకరు చేసిన పొరపాట్లు ఇంకొకరు పునరావృతం చేస్తానంటే ఆ ఒకరు ఒప్పుకోరు. ఒకరి లోపాలు ఇతరుల్లో చూడటానికి ఆ ఒకరికి ఇష్టం వుండదు.

 Previous Page Next Page