అన్నయ్యకు ఉద్యోగం పోయిందన్న విషయం తెలిసి మృదుల కృంగిపోయింది. మరోవైపు తనకి మాటి మాటికి వస్తూన్న తలనొప్పికి తోడు - కొద్దికొద్దిగా దృష్టి మందగించటంతో మరింత బెంబేలుపడి, దాంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసింది.
వేణుకి ఇది పెద్ద దెబ్బ.
ఈ ప్రపంచంలో అతడు అభిమానించే ఏకైక వ్యక్తి అతడి చెల్లెలు! అటువంటి మృదులే తనను విడిచిపోయే ప్రయత్నం తలపెట్టిందంటే- ఆ ఆలోచనకే అతడు వణికిపోయాడు.
చెల్లెలు శాశ్వతంగా గుడ్డిదైపోవటానికి ఇంకా ఎంతో వ్యవధి లేదని అతడికి తెలుసు.
అటువంటి పరిస్థితులలో కూడా అతడు తన నిర్ణయాన్ని మార్చుకోలేదు.
లక్షరూపాయలకు కక్కుర్తిపడలేదు.
ప్రసాదరావు కోర్కెని మన్నించలేదు.
* * * *
గుమ్మం దగ్గిరే నిలబడి- "ఈ రోజు నువ్వెంత బావున్నావో తెలుసా" అన్నాడు ప్రసాద్. తలంటుకోవటం వల్ల పట్టులా జారుతున్న జుట్టు ఎయిర్ కండిషనర్ గాలికి నదీకెరటంలా ఎగురుతూ వుంటే, చదువుతున్న పుస్తకంలో లీనమైన ప్రేమ ఈ మాటలకి ఏకాగ్రత భగ్నం కాగా తలెత్తి చూసి సంతోషం ముప్పిరిగొనగా, "హల్లో...." అంది. ప్రసాద్ జుట్టు చెవుల క్రిందవరకూ వుంది. చేతిలో సిగరెట వెలుగుతూంది. లోపలికి రాకుండానే- "నిజంగా నిన్నిలా దూరంనుంచి చూస్తూ అలానే వుండిపోవాలనిపిస్తుంది- ఎంతకాలమైనా సరే...." అన్నాడు.
ప్రేమ కోపం నటిస్తూ "ఊఁ...." అంది. అతడు చొరవగా వచ్చి పక్కగా కూర్చుంటూ, "నీ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలుసా? అన్నీ ఆఖరి క్షణంలో చెప్తావు బ్రిటీష్ థియేటర్ లో వాళ్ళ నాటకం అంటే అసలు టిక్కెట్లు దొరకవు" అంటూ చేతిని ముందుకు సాచాడు. అతడి చేతిలో రెండు రవీంద్ర భారతి టిక్కెట్లు వున్నాయి. వాటిని చూస్తూనే ప్రేమ ఉత్సాహంతో- "థాంక్యూ ప్రసాద్, థాంక్యూ" అంది. ఆ అమ్మాయిలో అందంగా మిళితమైన అమాయకత్వమూ, చురుకుతనమూ ఆమె అందానికి మరింత శోభని ఇస్తున్నాయ్. వయసు తేవల్సిన గాంభీర్యం కన్నా చిలిపితనమే ఎక్కువ వుంది. అందులోనూ ఆమెని పెద్ద పెద్ద కళ్ళేమో, మొహంలో ప్రతీ భావమూ చక్కగా ప్రస్పుటమౌతుంది.
ఆమె లేచి పరుగుతో తండ్రి గదిలోకి వెళ్ళి "డాడీ! టిక్కెట్లు దొరికాయి డాడీ!" అంది ఉత్సాహంగా.
"ఏ టిక్కెట్లమ్మా...."
"అబ్బా! మరచిపోయావా? మనం ఈ రోజు నాటకానికి వెళ్ళాలని చెప్పానుగా...."
"నాకెక్కడ కుదురుతుందమ్మా?"
ప్రేమ ఉక్రోషంతో, "ప్రొద్దున్న వస్తానని చెప్పావుగా?" అంది.
"ప్రొద్దున్నకి ఇప్పటికీ ప్రోగ్రాం మారిపోయింది. అయినా ప్రసాద్ ని తీసుకుని వెళ్ళొచ్చుగా?"
"తనకీ ఏదో పనుందట."
"ఏదీ- ఇలా రమ్మను నేను చెప్తాను."
ప్రేమ ప్రసాద్ ని పిలిచింది. ప్రసాద్ జగపతిరావును చూసి నమ్రతగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు, "ఏమిటి__ ప్రేమని నాటకానికి తీసుకెళ్ళనన్నావట?" అడిగాడు జగపతిరావు.
"అన్నాను.... అబ్బే- లేదు. అంటే ఐమీన్...." తడబడ్డాడు ప్రసాద్.
"ఊఁ- ఇంకే ఎక్స్ ప్లనేషన్సూ అక్కరలేదుకానీ బయల్దేరు వెంటనే" ప్రేమ ప్రసాద్ వైపు గర్వంగా తలెగరేసింది.
పది నిముషాల తరువాత వాళ్ళ కారు రవీంద్ర భారతివైపు సాగిపోతుంది. ప్రసాద్ డ్రైవ్ చేస్తూంటే పక్కన ప్రేమ కూర్చుని వుంది.
"ఈరోజు ఇలా నీతో రావటంవల్ల నాకెంత నష్టమో తెలుసా?" అన్నాడు ప్రసాద్.
"ఎంతమ్మా?"
"గంటకి రెండువేలు? నాన్నకీ విషయం తెలిసిందంటే ఎగిరిపడ్తాడు"
"నాతో కలిసి వచ్చావంటే దయానందం మావయ్య ఏమీ అనడులే."
"నీతో వస్తున్నా కాబట్టి ఏమీ అనడనుకో. కానీ టైమ్...."
"అబ్బా నీకూ, అంకుల్ కీ డబ్బుసంపాదనని టైమ్ తో ముడిపెట్టడం తప్ప వేరే పనేమీలేదు. అంతగా కావాలంటే ఈ సాయంత్రం మూడు గంటల ఖరీదు నేనిస్తాన్లే సరేనా?" అంటూ పర్సు అతడివైపు తోసింది. అతడు దాన్ని తెరచిచూసి, "ఇందులో అయిదొందలకన్నా ఎక్కువలేవు" అన్నాడు ఏడిపిస్తున్నట్టు.
ప్రేమ- "పోనీ ఇంటికెళ్ళాక ఇస్తాలే. కాదు ఇప్పుడే కావాలి అంటే ఇదిగో- ఈ ఉంగరం తీసుకో" అంటూ నాజూకుగా చేతిని పైకెత్తింది. అప్పుడే వెలిగిన లైట్లకాంతి ఆ ఉంగరం మీదపడి అందంగా ప్రతిబింబిస్తూంది.
అతడు దాన్ని తీసుకోలేదు. తీసే నెపంమీద ఆమె చేతిని అందిపుచ్చుకొని, మరి వదలకుండా డ్రైవ్ చేయసాగాడు.
"ప్లీజ్...." అని ఇబ్బందిగా అంటూ ఆమె అతడి చెయ్యి వదిలించుకునే ప్రయత్నం చేసింది. అతడు నవ్వసాగేడు. "సరిగ్గా డ్రైవ్ చెయ్యి ప్రసాద్! నువ్వు ఎంత వేగంగా వెళుతున్నావో అసలు తెలుస్తూందా నీకు?" అంది ఆమె చిరుకోపంతో.
* * * *
వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి చూస్తూంటే చెట్లు వెనక్కి పరిగెడుతున్నాయా అనిపిస్తూంది. కిటికీ దగ్గర కూర్చొని బైటకి చూస్తున్నాడు వేణు.
లోకల్ ట్రైన్ అది.
నగరానికి మరోవైపున వున్న ఫ్యాక్టరీలో ఏదో ఉద్యోగం వుందంటే వెళ్ళి వస్తున్నాడు అతడు.
తనంత అనుభవం వున్నవాడికి సులభంగానే ఉద్యోగం వస్తుందనుకున్నాడు. ఒక్కోచోటా ప్రయత్నం చేసేకొద్దీ, ఉద్యోగం అనేది ఈ రోజుల్లో ఎంత కష్టమైన కోరికో అర్ధమవుతుంది. అలా అర్ధమయ్యేకొద్దీ దానికి కారణభూతుడైన ప్రసాదరావు మీద కోపం పెరుగుతూంది. ఆ ముసలాడ్ని చంపెయ్యాలనిపిస్తూంది.
'భలే- భలే' అన్న మాటలకి ఆలోచన చెదిరి వేణు తలతిప్పాడు. ఎదురు సీట్లో ఒక కుర్రవాడు తల్లివళ్ళో కూర్చుని బైనాక్యులర్స్ తో కిటికీలోంచి బైటకు చూస్తున్నాడు జాతర్లలో అమ్మే చిన్న ప్లాస్టిక్ గొట్టం అది.
కన్నార్పకుండా దాన్నే చూడసాగేడు.
ఎదుటి కుర్రవాడు అది గమనించి, చెయ్యి సాచి దాన్ని వేణుకి అందించాడు. కుర్రవాడి తల్లి నవ్వింది వేణు దాన్ని అందుకుని చూసేడు, చెట్లు పెద్ద పెద్ద ఆకారాల్లో దాటిపోతున్నాయి.
అప్పుడే అతని స్మృతి పథంలో ఏదో ప్లాష్ లాగా కదలాడింది.
బైనాక్యులర్స్!!
ఈ మధ్య వీటిని ఎక్కడ చూసేనా అని ఇంతసేపు ఆలోచించాడు! వాటిని తను ప్రసాదరావు గదిలో చూశాడు.
ఆ క్షణం వాటి అవసరం ఆ ముసలాడి కెందుకొచ్చిందా అనుకున్నాడు కూడా.
ప్రసాదరావు అన్న మాటలు వేణుకి జ్ఞాపకం వచ్చినయ్ "....నీడలాగా అనుక్షణం అతనిని వెంటాడి అతని దినచర్య తెలుసుకున్నాను. అతడి కూతురి మనస్తత్వమూ, అభిరుచులూ, ఇష్టాయిష్టాలు అన్నీ కనుక్కున్నాను."
వేణూకి కొద్ది కొద్దిగా అర్ధం కాసాగింది. అతన్ని నీడలాగా వెంటాడాలీ అంటే అతడి ఇంటి దరిదాపుల్లో వుండాలి. అదీగాక-
ఇంటిగలావిడ వచ్చినప్పుడు ప్రసాదరావు అన్న మాటలు కూడా కలుపుకుంటే....
"ఈ గదికి నూటయాభై కన్నా ఎక్కువ అద్దె ఇవ్వటం అనవసరం. అదీగాక మరో నాలుగు నెలల్లో ఈ గది అవసరం తీరిపోతుంది...." అన్నాడతను.
....నాలుగు నెలల్లో అవసరం తీరిపోతుంది__అంటే.... అంటే అప్పటివరకూ ఆ గదికి ప్రాముఖ్యత వుందన్నమాట!
గదికి- గదిలో బైనాక్యులర్స్ కీ....
....ఎదురింటివైపు చూడటానికి-
ఎదురిల్లు అంటే?....
వేణు నిటారుగా అయ్యాడు. ఎదురిల్లు అంటే జగపతిరావు ఇల్లు!
ప్రసాదరావు ప్రత్యర్ధి జగపతిరావు!
ఆ అమ్మాయి ప్రేమ!
తన అంచనా నిజమేనా? ఏమో నిశ్చయించుకోవాలి....
ట్రైన్ ఆగ్గానే అతడు దాదాపు ఉరుకుతున్నట్లుగా బైటకి గెంతాడు. అతడి మనసంతా టెన్షన్ తో నిండి వుంది.
స్టేషన్ నుంచి అతడు ఫ్యాక్టరీ చేరుకోవటానికి గంట పట్టింది. నుదుట చెమట పడ్తూండగా గబా గబా ఆఫీసులో రికార్డు వెతకసాగాడు. అతడికి ఫ్యాక్టరీలో ఉద్యోగం పోయినా, అందరూ అతడికి తెలుసు. దాదాపు పదిహేను సంవత్సరాలుగా అతడక్కడ అందరికీ తలలో నాలుకగా పని చేస్తున్నాడు. అదీగాక చదువుకున్నవాడు.
ఐదు నిముషాలలో అతడికి కావల్సిన ఇన్ఫర్ మేషన్ దొరికింది. ఫైలు గుమాస్తాకి అందజేస్తూ కృతజ్ఞతలు చెప్పి, బైటకి వచ్చేశాడు.
అతడు చూసింది దయానందం పర్సనల్ ఫైలు.
అతడికి కావల్సింది దయానందం ఏం చదువుకున్నాడా అని. అతడికి వచ్చిన అనుమానం కరక్టే. అతడు ఊహించినది నిర్ధారణ అయింది.
దయానందం 'లా' పాసయ్యాక కొంతకాలం ప్రాక్టీసు చేశాడు. తరువాత ప్లీడరు పనికి గుడ్ బై చెప్పేసి జగపతిరావు దగ్గిర మేనేజరుగా చేరాడు. అది అతడి సర్వీస్ రికార్డులో దొరికింది అది.
తనని మోసం చేసి ఉద్యోగం పోగొట్టిన ఈ దయానందమె, ప్రసాదరావుకి జైలుశిక్ష పడేలా చూసాడు.
* * * *
ఇది జరిగిన గంటకి వేణు ప్రసాదరావు గదిలోకి ప్రవేశించాడు. అకస్మాత్తుగా ప్రవేశించిన వేణుని చూసి ప్రసాదరావు ఆశ్చర్యపోయాడు. వేణు మొహం అదోలాంటి కసితోనూ, పట్టుదలతోనూ వెలుగుతూంది. అతను ఒకే ఒక మాట అన్నాడు.
"నేను మీరు చెప్పినపనికి ఒప్పుకుంటున్నాను."
ప్రసాదరావు సంభ్రమంతో "వ్వాట్!" అనరిచాడు తబ్బిబ్బయి.
"అవును."
"నువ్వు.... నువ్వు.... ఏ ఉద్యోగమూ దొరక్క ఈ పనికి వప్పుకొంటున్నావా?"
"లేదు."
"మరి? చెల్లెలికోసమా?"
"కాదు."
"మరెందుకు ఈ ఆకస్మిక నిర్ణయం?"
"నా తల్లికి జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకోవటం కోసం.... ప్రసాదరావుగారూ! మీ ప్రత్యర్ధి ఎవరో మీరు ముందే చెప్పి వుంటే అసలింత గొడవ అవసరమే వుండేదికాదు. మీ జీవితంలో మీకున్న ఏకైక ప్రత్యర్ధీ నా జీవితంలో నాకున్న ఏకైక ప్రత్యర్ధీ బాగా కావల్సిన వాళ్ళు అవటం యాదృచ్చికమే అయినా అది నా అదృష్టం. ఇన్నాళ్ళకి నాకు 'మీ రూపంలో' ఈ అవకాశం దొరికింది! ఆ అవకాశం కోసమే పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నాను...."
ప్రసాదరావు వేణు కళ్ళలోకి సూటిగా చూసేడు. ఒక గొప్ప రహస్యం అర్ధమయినట్లుగా, తలపంకిస్తూ నెమ్మదిగా నవ్వేడు.
"మనం అగ్రిమెంటు వ్రాసుకుందామా?" అని అడిగాడు వేణు.