Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 12


    "ఆలోచించి చెప్పండి."

    క్షణం నిశ్శబ్దం.

    "చూశాను."

    డాక్టర్ బి.పి. పెరిగింది. ఉత్సాహంగా ముందుకు వంగి "ఎక్కడ" అన్నాడు.

    ".... తెలుగు సినిమాలో."

    డాక్టర్ మిత్రవైపు తీక్షణంగా చూసి తన డ్రాయరు అంటే - టేబిల్ ది - తెరిచాడు. అందులోంచి ఒక పుస్తకంతీసి "దీని బొమ్మలు చూడండి" అన్నాడు.

    శంభు పేజీలు తిప్పటం ప్రారంభించాడు. మొదటి పేజీలో అమ్మాయి వెనక్కి తిరిగి 'బ్రా' విప్పుతూంది.

    సిస్టాలిక్ ప్రెజర్ రెండొందలా పదినుంచి రెండొందలా నలభైకి.

    చీలిన చీరెలోంచి బయటకొచ్చిన కాలు.

    రెండొందలా నలభైనుంచి రెండొందలా అరవైకి పెరిగిన బి.పి.

    విప్పుతూన్న ముడి.

    రెండొందలా డెబ్భై.

    శంభు ఇంకో పేజీ తిప్పబోతూ వుంటే, డాక్టర్ మీటర్ చూస్తున్న వాడల్లా జుట్టు పీకేసుకోవటం మొదలు పెట్టాడు.

    "ఏమయిందేమయింది" అన్నాడు చంద్రం ఆతృతగా ఆయన్ని పట్టుకుంటూ.

    "సిస్టాలిక్ ప్రెజర్ పెరిగిపోతూంది. మూడొందలు....మూడొందలొచ్చేస్తూంది ఆపు....ఆ" అని ఆగిపోయాడు.

    ఈ లోపులో శంభు పేజీ తిప్పాడు.

    పూర్తి నగ్నంగా అమ్మాయి.

    టప్ మని చిన్న చప్పుడయ్యింది. స్పిగ్మోమోనో మీటర్ పైకప్పు బద్దలుకొట్టి పాదరసం జివ్వున పైకి చిమ్మింది.

    డాక్టర్ అవాక్కయిపోయాడు.

    శంభు తనంతట తానే రబ్బర్ కప్ విప్పుకున్నాడు.

    "ఏమిటి ట్రబుల్? డాక్టర్!" అడిగాడు చంద్రం.

    డాక్టర్ విషాదంగా తన చేతి గోళ్ళవైపు చూసుకున్నాడు. కొంచెంసేపు మౌనంగా వుండి "సైప్రైటిస్" అన్నాడు.

    "అంటే"

    "మూత్రపిండాల వ్యాధి".

    మిత్ర మొహం వాడిపోయింది.

    డాక్టర్ ఆగి "కాకపోతే ఇంకొకటి అయి వుండవచ్చు" అన్నాడు.

    చప్పున "ఏమిటి" అన్నాడు మిత్ర.

    "ఆత్రో సెలోరాసిస్"

    మరింత కుదించుకుపోయి "మరెలా" అన్నాడు మిత్ర.

    డాక్టర్ వినిపించుకోకుండానే - "అదీ కాకపోతే" అన్నాడు.

    "కాకపోతే"

    "ధైరో టాక్సికోసిస్"

    శంభు కుర్చీలోంచి లేచి- "మీ ఫీజు" అన్నాడు మరింకేమీ అడక్కుండా.

    మొహంలో ఏ భావమూ లేకుండా, "రెండు రూపాయల నలభై పైసలు ఫీజు. విరిగిపోయిన బి.పి. ఆపరేషన్ మూడువందలా యాభై రూపాయల అరవై పైసలు. మొత్తం మూడు వందలా యాభయ్ మూడు రూపాయలు" అన్నాడు.

    డబ్బు తీసి ఇచ్చి "వెళ్ళొస్తాం" అన్నాడు మిత్ర.

    "మంచిది".

    ఇద్దరూ బయటకొచ్చేక చంద్రం మళ్లీ లోపలికి వెళ్ళాడు. టేబిల్ మీద డబ్బు జేబులో పెట్టుకుంటూ "సాయంత్రం మందు కొట్టటానికి మీరు వచ్చేయండి డాక్టర్. అప్పుడు చెబ్దాం వాడికి. ఇడియట్. టేప్ రికార్డర్ పెట్టి నన్ను ఫూల్ ని చేస్తాడా.... నేను చెయ్యలేననుకున్నాడా" అని వెళ్ళిపోయేడు.


                               7


    "ఏమైంది మీ స్పందనాదేవి" అడిగేడు చంద్రం.

    "ఆరెస్బా హృదయం స్పందించి వెళ్లిపోయింది."

    ఇద్దరూ మేడమీద నిలబడి మాట్లాడుకుంటున్నారు.

    చంద్రం నవ్వి, "ఆరెస్బాకి హృదయం లేదు. అంతా మెకానికల్" అన్నాడు.

    "నాకు నిన్ను చూస్తుంటే ఈర్ష్యగా వుంది."

    చంద్రం ఆశ్చర్యంగా "ఎందుకు?" అన్నాడు.

    "ప్రతిదాన్నీ తేలిగ్గా తీసుకోవటం.... అంతా హాయిగా అనుభవించటం. ముఖ్యంగా ఆ నిర్లక్ష్యం."

    "నాకూ నిన్ను చూస్తే ఈర్ష్యగా వుంది."

    "ఎందుకు?"

    "సున్నితమైన హృదయం. చక్కటి అలవాట్లు....ముఖ్యంగా ఆ లాలిత్యం" నవ్వేడు.

    శంభు నవ్వలేదు. "నేనింక ఏ సైకియాట్రిస్ట్ దగ్గరికీ వెళ్ళనక్కర్లేదు. నాకున్న జబ్బు ఏమిటో అర్ధమయ్యింది."

    "ఏమిటి?"

    "నేను ప్రేమరాహిత్యం అనే వ్యాధితో బాధపడ్తున్నాను. దానికి మందు కూడా లేదు. ఎందుకంటే దీన్ని పోగొట్టుకోవటానికి కావల్సిన మాటలు కూడా నా దగ్గర లేవు. నాకెప్పుడయినా దేవుడు కనబడి నీకేం కావాలని అడిగితే, నేను ఏమడుగుతానో తెలుసా? ఉహు. మేడలు అడగను, మిద్దెలు అడగను, ధనధాన్యాలు అడగను. ప్రభూ! నా మనసు చుట్టూ ఈ మౌనం పొరలు పొరలుగా కోట కట్టింది. ఈ గోడల్ని పడగొట్టటానికి నాకు మాటలనే ఆయుధాన్ని ఇవ్వు. మాట్లాడాలి. ఎంత మాట్లాడినా తరగని మాటలు నాకు కావాలి. నా కేడుపొస్తోంది. అగ్నిపర్వతంలోంచి బైట కొచ్చినట్టు నా గుండెలోంచి ఏడుపు ఉబికి రావటానికి ప్రయత్నం చేస్తూంది. కొంచెం ఓదార్పు.... నాక్కొంచెం ఓదార్పు కావాలి...."

    పల్చటి మసక చీకట్లో అతడి కళ్ళల్లో సన్నటి నీటిపొర. విచలితుడయ్యేడు చంద్రం. చాలాసేపు నిశ్శబ్దం. మనిషికీ మనిషికీ మధ్య కమ్యూనికేషన్ గాప్ లా నిశ్శబ్ధమైన చీకటి.

    "క్రిందికి పోదామా" చంద్రం అడిగేడు.

    మిత్ర తన ఆలోచనల్లోంచి తేరుకొని "పద" అంటూ కదిలి, చప్పున ఆగిపోయేడు. రోడ్డు మీద తన ఇంటివైపే వస్తున్న కమల కనబడింది.

    "ఎవరు" అన్నాడు చంద్రం. శంభు చెప్పేడు.

    వాళ్ళుక్రిందికి వచ్చేసరికి కమల లోపలికి వచ్చింది. చంద్రాన్ని పరిచయం చేసేడు.

    "మీరీమధ్య సితారుతో మేడమీద కనబడటంలేదు."

    మిత్ర నవ్వి వూరుకొన్నాడు.

    ఈలోపులో బైట మోటర్ సైకిల్ శబ్దం వినిపించింది. మరుక్షణం విజిల్ వేసుకుంటూ ఆరెస్బా లోపలికి వచ్చేడు. అమ్మాయిని చూసి చప్పున ఆగిపోయేడు.

    మిత్ర పరిచయం చేసేడు.

    "నమస్తే" అందా అమ్మాయి.

    "కమలా" అన్నాడు ఆరెస్బా. "మూడక్షరాలు బాగోలేవు. 'మాలా' అని పిలుస్తాను. మీ కభ్యంతరం లేదుగా. ఎందుకంటే మీరు మల్లెల మాలలా వున్నారు."

    అత్యంత సౌందర్యంతో బాధపడ్తున్నట్టు ఆ అమ్మాయి మెలికలు తిరిగి నవ్వింది.

    చంద్రం ఏదో జ్ఞాపకం వచ్చిన వాడిలా హఠాత్తుగా లేచి "అరెరె" అన్నాడు.

    "ఏమైంది?"

    "నాతోరా చెబుతాను" అంటూ అల్మెరా దగ్గరికి వెళ్ళి ఏదో వస్తువు తీసి జేబులో పెట్టుకుంటూ "రా" అని మరి మాట్లాడనివకుండా శంభు చెయ్యి పట్టుకుని ఆరెస్బా వైపు తిరిగి "మీరు మాట్లాడుతూ వుండండి" అని మిత్రాణి తీసుకెళ్ళాడు.

    ఎందుకు అలా తీసుకొచ్చాడో చెప్పకుండా పార్కులో కూర్చోపెట్టి అరగంట కబుర్లు చెప్పి "పద ఇక పోదాం" అంటూ లేచాడు.

    ఇంక అడగదల్చుకోలేదు మిత్ర. వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించటం కోసమే అలా చేశాడని తెలుస్తూంది. కానీ వాళ్ళు బొత్తిగా అపరిచితులు కదా.

    పార్కు బయటకొస్తూంటే చంద్రం ఏదో చెప్పబోయాడు.

    "అరె" అంటూ ఆగాడు మిత్ర. చంద్రం కూడా అటు చూశాడు.

    ఒక జంట. అందులో చిత్రమేమీ లేకపోయేసరికి ప్రశ్నార్ధకంగా స్నేహితుడివైపు చూశాడు.

    "నేను ప్రతిరోజూ మేడమీద నుంచి ఈ పార్కులో చూస్తూ వుంటాను. ఈ నేరోకట్ కుర్రవాణ్ణి- ఒక అమ్మాయితో"

    "అయితే" అన్నాడు చంద్రం.

    "అయితే ఈ అమ్మాయి మాత్రం కాదు" బాధగా అన్నాడు.

    "మూణ్ణెల్లు ఒక అమ్మాయితో స్నేహం పేరిట.... మళ్లీ ఇప్పుడు ఈ అమ్మాయితో."

    "ఓమెన్ చూశావా?"

    "లేదు. ఏం?"

    "అందులోలా నువ్వీ పార్కుముందునుంచి ఇల్లు మార్చకపోతే బాగుపడవు. అంత సున్నితమైన భావాలున్న వాడివి ప్రేమించటానికి పనికిరావు". అని ఆగి "నే వెళ్ళొస్తా" అన్నాడు.

    "అదేమిటి ఇంటికి రావా?"

    "రాత్రయింది. పోతాను. బైదిబై నీ టేప్ ఆన్ చేసి వచ్చాను. విను. ఇద్దరు అపరిచితులు.... అంతకుముందు ఒకసారి కూడా మాట్లాడుకోనివాళ్ళు, ఏం మాట్లాడుకుంటారో! మంచి ఛాన్సు!" అని వెళ్ళిపోయాడు.

    మిత్ర నిశ్చేష్టుడై అలాగే నిలబడిపోయాడు కొంచెంసేపు.

    తరువాత కదిలి ఇంటివైపు నడిచాడు.

    ఇంటికెళ్ళేసరికి కమల లేదు. ఆరెస్బా వున్నాడు. మిత్రని చూడగానే "నీ కారు అర్జెంటుగా కావాలి" అన్నాడు. అతని మొహంలో కంగారు కనబడుతూంది.

    "ఎందుకు" అన్నాడు మిత్ర.

    "కావాలి. మళ్లీ అయిదు నిమిషాల్లో తెచ్చి ఇస్తాను" అని అతణ్ణి మాట్లాడనివ్వకుండా "కారు తాళాలేవి" అన్నాడు.

    అప్రయత్నంగా తాళాలిచ్చాడు శంభు. అవి తీసుకుని ఆరెస్బా గాలిలా దూసుకుపోయాడు. మరుక్షణం. కారు స్టార్టు చేసిన చప్పుడు. మిత్ర టేప్ వైపు చూశాడు.

    ఇంకా తిరుగుతూ వుంది.

    అతడి పెదవులు మీద అప్రయత్నంగా చిరునవ్వు వెలిసింది.

 Previous Page Next Page