Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 12


    మృదుల ఆశ్చర్యంగా. "ఇప్పుడు మీరు ప్రతీ మనిషినీ ఆవరించి వున్న కాంతి వలయం చూడగలరా?" అడిగింది.
    "చూడగలను. ప్రయత్నించి సాధన చేస్తే యెవరైనా చూడగలరేమో? సూర్యుడ్ని ఆవరించివున్న కాంతి వలయాన్ని మనం మామూలుగా చూడలేము. కాని గ్రహణ సమయంలో మసిపూసిన అద్దంలోంచి దాన్ని దర్శించగలం. ఇప్పుడు సైన్ టిస్టులు కొందరు ఎలక్ట్రిక్ బ్రైన్ వేవ్స్ ని అంచనా వేసి రికార్డు చేయగలుగుతున్నారు. నేను కేవలం కాంతివలయం మాత్రమే కాదు ఆయా శారీరక- మానసికావస్థలకు సంబంధించిన వర్ణాలను కూడా చూడగలను." 
    "వర్ణాలా?"
    "అవును. మన వాతావరణం సమస్తము యెన్నెన్నో వర్ణాల సముదాయం. ప్రచండమైన సూర్యకాంతిలో అవి లీనమై తెలుపు మాత్రమే తోస్తుంది. ప్రిజమ్ లోంచి చూసినప్పుడు తెల్లని సూర్యకాంతిలో రంగులన్నీ మనకి కనపడటం లేదూ!" సెన్సిటివ్ నెస్ పెంపొందించుకుంటే యీవర్ణాలు కనపడతాయి."
    ఆలోచించసాగింది మృదుల. ఇతడు చెప్పిన మత గురువులు- తంతులు యివి. ఒప్పుకోలేకపోవచ్చు- కాని థాట్ రీడింగ్. ఎలక్ట్రికల్ బ్రైన్ వేవ్స్, కానసన్ ట్రేషన్- యివన్నీ సైన్సు ఒప్పుకుంటోంది. అంతదాకా ఎందుకు యే శక్తులూ లేని మామూలు మనుష్యుల్లోనే నిశితమైన పరిశీలనా శక్తి వున్నవాళ్ళు ఎదుటి వ్యక్తులు ఏ హావభావాలతో మాట్లాడుతున్నా మనసులో ఏముందో కనిపెట్టగలరు. బహుశ నిరంతరమైన సాధనతో యితడు యీ రంగంలో మరికొంత ముందుకి వెళ్ళగలిగేడేమో? ఆర్థర్ హైలీ "స్ట్రాంగ్ మెడిసిన్" అనే నవలలో ఒక ప్రఖ్యాత కార్డియాలజిస్ట్ ఎదుటి వ్యక్తుల ముఖాలు దూరంనుంచి చూసి, వాళ్ళ హార్డు కండిషన్ ఎలావుందో చెప్పగలిగేవాడని రాసాడు. ఏ విషయమైనా కూలంకుషంగా పరిశోధించి తెలుసుకుని వాస్తవంగా వ్రాసే ప్రసిద్ధ రచయితల్లో అతడొకడు. వర్ణాల సంగతి అంతుపట్టకపోయినా లేమేసరీ వైద్య విధానాల్లో ట్రయినింగ్ పొందినవాడు కాబట్టి వ్యక్తుల శారీరక- మనసికావస్థలను గ్రహించగలడేమో.
    "ఇక్కడికొచ్చిన వాళ్ళంతా మీకు నమస్కారాలు చేసి అడిగినదేమిటి? మీరు వ్రాసిచ్చినదేమిటి?"
    "అది వారివారి వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయం. నేను బయటపెట్టను. వాళ్ళంతా ముసుగుల్లో వున్నా వాళ్ళ రూపురేఖలు నేను గ్రహించగలను. అవసరమైనప్పుడు- అది లోక కళ్యాణానికి ఉపయోగిస్తుందనుకున్నప్పుడు- అప్పుడు బయటపెడ్తాను."
    "నన్ను ఏ ముసుగూ లేకుండా రానిచ్చారే?"
    "ముసుగు వేసుకోవాలని మాకే నియమంలేదు. మనలో మరో వింత ప్రవృత్తి, ఒకళ్ళేంచేస్తే అది అందరూ అనుసరిస్తారు. తామెవ్వరూ నాకు తెలియకూడదని కొందరు ముసుగులో వచ్చారు మొదట. అదిచూసి అందరూ ముసుగులు మొదలుపెట్టారు."
    "ఈ రహస్య ద్వారాలు యివన్నీ దేనికీ?"
    ఏకాంతంలో ప్రశాంతతకి భంగం కలగని పరిస్థితులలో తప్ప నేను నాజ్ఞాన నేత్రంతో చూడలేను. అందుకే యిదేర్పరచుకొన్నాము. ఇందులో పెద్ద రహస్యం లేదు. సిన్సియర్ గా వచ్చేవాళ్ళని లోపలికి రానిస్తాము. ఇప్పుడు మీరొచ్చినట్లే."
    "సిన్సియర్ గా వచ్చేరో, వేరే యేదేనా ఉద్దేశంతో వచ్చేరో మీకెలా తెలుస్తుంది?"
    "మొదట హాల్లో కలుసుకుని ఆ వ్యక్తిని అంచనా వేసుకున్నాకే మా కోడ్ వర్డు చెప్పి లోపలికి రానిస్తాము. ఇప్పుడు కొన్ని పాశ్చాత్య దేశాలలో "ట్రూత్ డిటెక్టర్స్" వచ్చాయి. ఒక వ్యక్తి నిజం చెప్తున్నాడో, అబద్ధం చెప్తున్నాడో అతనిలో కలిగే భావసంచల్నాన్ని బట్టి గ్రహించే మిషన్ అది. యంత్రాలతో నిమిత్తంలేకుండా కళ్ళల్లోకి చూసి ఆ బావ ప్రకంపనలని నేను పసిగట్టగలను. మిమ్మల్ని ఆవరించిన కాంతి వలయం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. నాబోటి మత గురువుల్ని, మతాచారుల్ని, తంతుల్ని మీరు లక్ష్య'పెట్టరని-వాటిలో మీకు నమ్మకం లేదని నాకు తెలుసు. కాని మీరు నిజాయితీ పరులని కూడా తెలుసు. నాలో నమ్మకం వున్నా లేకపోయినా నాకు ఫరవాలేదు. తమలో తమకి నమ్మకం వున్న వ్యక్తుల్ని నేను గౌరవిస్తాను."
    ఈ పొగడ్తకి కొద్దిగా సిగ్గు పడింది మృదుల.
    "ఆమధ్య నా దగ్గరికి ఒకావిడ వచ్చింది. మీద్వారా తన గర్భంలో వున్నది ఆడశిశువో, మగశిశువో తెలుసుకుంటానంది. మీరు చెప్పగలరా ఆ విషయం?" 
    "చెప్పలేను. అంతేకాదు. నా మానసిక శక్తుల్ని కన్ స్ట్రక్టివ్ గా వుపయోగిస్తానేకాని డిస్ట్ర'క్టివ్ గా వుపయోగించను."
    "మీకు నా అవసరం యేదేనా వుంటే చెప్పండి. తప్పక సహాయం చేస్తాను."
    "నాకు మీ జ్ఞాననేత్రం అఖ్కరలేదుగాని మరో విద్యకావాలి."
    "చెప్పండి ఏమిటా విద్య?"
    చెప్పింది మృదుల. మింగియార్ పెదవులమీద చిరునవ్వు లాస్యం చేసింది.
    "ఒక స్త్రీ నోట యీరకమైన అభ్యర్ధన నేనెప్పుడూ వినలేదు. ఐయాం వెరీ హేపీ. రేపటినించి రెగ్యులర్ గా రాగలరా?"
    "ష్యూర్. వస్తాను. కాని యీ విషయం ఎవరికీ తెలియనీయకూడదు."
    "నా దగ్గరనుంచి ఎవరి రహస్యాలూ బయటపడవు. మిగిలినవాళ్ళతో సంబంధంలేకుండా మీకు సెపరేట్ టైమ్ ఎరేంజ్ చేస్తాను"
    "థాంక్యూ"
                                                                                *    *    *
    భాగవతార్ అమెరికా వెళ్ళడంతో అమెరికన్ ఏండెటోకి ఇండియాలో యేపనీలేకుండా పోయింది. భాగవతార్ తననికూడా తీసుకెళతాడని చివరవరకూ అనుకున్నాడు. కాని భాగవతార్ ఆఖరి క్షణంలో ఏండెటో ప్రోగ్రాం కేన్సిల్ చేసేసి తనకొక్కడికే టిక్కెట్టు కొనిపించుకున్నాడు. ఏండెటోతో "నువ్వు నా కుడి భుజం లాంటివాడివి. నిన్ను తీసుకెళ్ళకుండా వెళుతున్నందుకు నాకు కష్టంగానే వుంది. కాని యిక్కడ నాకేవేనా ఆఫర్స్ వస్తే ఆ విషయాలు మేనేజ్ చేసే బాధ్యత నీమీద వుంచి వెళుతున్నాను ఎంత! ఒక్క నెల టూర్. త్వరలోనే వచ్చేస్తాను" అన్నాడు కన్నీళ్ళు తుడవడానికి. ఏండెటో లోలోపల రగిలిపోయినా పైకి ఏమీ అనలేదు. చిరునవ్వుతో "ఆల్ రైట్ సార్! దానిదేముంది? మరొక అవకాశం నేను వినియోగించుకుంటాను." అన్నాడు నిర్లక్ష్యంగా. "నీ మొహం అనుకున్నాడు భాగవతార్. పైకి ఒక చవట నవ్వు నవ్వేశాడు.
    భాగవతార్ వెళ్ళిపోయాక గాళ్ ఫ్రెండ్స్ తో తన ఎపార్ట్ మెంట్ లో డాన్స్ చేసుకుంటున్నాడు ఏండెటో. ఇండియాలో గాళ్ ఫ్రెండ్ ని సంపాదించుకోవడం అతనికంత కష్టం కాలేదు. అతని మృదంగ వాయిద్యాన్ని అభిమానించిన సంగీతాభిమానులు, అభిమానాన్ని అతనిమీదకు ప్రసరింపజేయడానికి ఎక్కువకాలం పట్టలేదు. అతడు ఒంటరిగా అపార్ట్ మెంట్ లో వుంటున్నాడని తెలియగానే ఒకరితో ఒకరు పోటీలుపడి అతని అపార్ట్ మెంట్ కి రావడం మొదలుపెట్టారు. ఏండెటోకి గాళ్ ఫ్రెండ్స్ ని సంపాదించుకోవడం సమస్య కాకపోగా వాళ్ళనొదిలించుకోవడం సమస్య అయికూర్చుంది.
    "హైదరాబాద్ మా అమెరికాను మించిపోయింది." అనుకున్నాడు చాలాసార్లు. కాలింగ్ బెల్ విని గాళ్ ఫ్రెండ్ ని లోపలి గదిలోకి పంపి తలుపు తెరిచాడు. మృదుల ఖంగారు - సంభ్రమము కలగలిపి "మీరా! రండి....రండి! కూర్చోండి. ఏం యిలా వచ్చారు?" అన్నాడు.
    "ఎందుకంత ఖంగారు? మీ గాళ్ ఫ్రెండ్ వుందా లోపల?" నవ్వుతూ అడిగింది.
    "అవును" నవ్వేసాడు ఏండెటో.
    "అయితే ఆ అమ్మాయిని పంపించేయండి. మీతో కొంచెం మాట్లాడాలి."
    "అలాగే, అలాగే."
    "ఏండెటో లోపలికెళ్ళి గారల్ ఫ్రెండ్ తో ఏదో చెప్పాడు. ఆ అమ్మాయి మూతి ముడుచుకుని మృదులవైపు చూడనుకూడా చూడకుండా వెళ్ళిపోయింది.
    "మీరో సాయం చెయ్యాలి నాకు" అడిగింది మృదుల.
    "చెప్పండి."
    చెప్పింది మృదుల.

 Previous Page Next Page