12
"నమస్కారమండీ-కూర్చోండి! అరే, మీ చేతిలో బిస్కెట్ల పొట్లంటా ఉంది. మా ఇంట్లో చిన్న పిల్లలు లేరని తెలుసు గదా?" అన్నాడు స్వామి.
"మీ కుక్క కోసం తెచ్చానండి!" అన్నాడు అప్పారావు. అతని భార్యా మీనాక్షి కలిసి లోపలకు వెళ్ళారు.
"మీరేమీ అనుకోనంటే ఒక్క మాట-మా ఇంట్లో కుక్క అన్ని కుక్కల్లాంటిది కాదు. అది మేము స్వయంగా కొన్న ఆహారం తప్ప భుజించదు" అన్నాడు స్వామి.
అప్పారావు నవ్వి- "దానికేముందండీ! జంతువుల్ని మచ్చిక చేసుకోవడంలో ఉంటుంది. ఆ విద్య నేను ఉగ్గుపాలతో నేర్చుకున్నాను" అన్నాడు.
స్వామి దెబ్బ తిన్నాడు. అతనికి మీనాక్షిపై అప్పారావు ప్రభావం గుర్తుకొచ్చింది. ఈ మనిషితో సూటిగా వ్యవహారానికి దిగడం మంచిదని అతనికి తోచింది- "ఇరుగు పొరుగున ఉంటూ కూడా మనం ముఖ పరిచయం దాటి ముందుకు వెళ్ళలేదు. ఈ రోజు ఆ అవకాశం వచ్చింది. మీరేదో నాతో మాట్లాడాలని అనుకుంటున్నారుట?".
"అవునండీ! మా మావయ్య కొడుకొకడున్నాడు. బికాం చదివాడు, అనారోగ్య కారణంగా ఫైనలియర్ పరీక్ష తప్పాడు. రెండేళ్ళ నించి ప్రయత్నిస్తూ కూడా అది ప్యాసుకాలేక పోతున్నాడు. వాళ్ళ నాన్న విసిగిపోయి వాణ్ణి స్టెనోగ్రఫీతో పెట్టాడు. ఆర్నెల్లలోనే అఖండుడనిపించుకున్నాడు. ఇప్పుడందులో చాలా ప్రజ్ఞ సంపాదించాడు. మీ ఆఫీసులో స్టెనోగ్రాఫరుద్యోగం ఖాళీ వచ్చిందని తెలిసింది. మీరు తలచుకుంటే మా వాడికి సాయం చేయగలరు. మీ కష్టం ఉంచుకోవడం జరుగదు. అంతా మీ ఆవిడ చెప్పే ఉంటారు మీకు?"
"అవును. అయిదు వేలివ్వాలని అనుకుంటున్నారుట గదా!"
"అవునండీ! ఉద్యోగాలు దొరకడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఈ ఉపకారం చేసిన వారిని మా శక్తి కొలదీ సత్కరించుకోవాలి గదా?" అన్నాడు అప్పారావు.
"కాని ఎందువల్లనో ఈ ఉద్యోగానికి చాలా పోటీగా ఉందండీ! డబ్బిస్తామని నా దగ్గరకు చాలామంది వచ్చారు. బేరాలు జోరుగా ఉన్నాయి" అన్నాడు స్వామి.
"ఎంతవరకూ ఉన్నాయండీ?" అన్నాడు అప్పారావు.
"ఎంతవరకూ ఉంటే యేంటండీ?" అన్నాడు అప్పారావు.
"భలేవారే! ఇది లంచమేంటండీ - మీరడిగిపుచ్చుకుంటే లంచమవుతుంది కానీ, అవతలివాడు సంతోషంతో ఇచ్చినప్పుడది బహుమానమే అవుతుంది" అన్నాడు అప్పారావు.
స్వామి ఆలోచిస్తూ- "తప్పులేదంటారా?" అన్నాడు.
"ముమ్మాటికీ లేదు" అన్నాడు అప్పారావు.
"అయితే తీసుకుంటాను. కాని మీ దగ్గరమాత్రం కాదు."
అప్పారావు తెల్లబోయి- "మీ రేటు చెప్పండి - సంతోషంగా యిచ్చుకుంటాను" అన్నాడు.
"నేను చెబితే అప్పుడది లంచం అవుతుంది. మీరు సంతోషంగా ఇచ్చేదే బహుమానమవుతుంది" అన్నాడు స్వామి.
అప్పారావు క్షణం ఆలోచించి - "పోనీ ఇంకో అయిదొందలు" అన్నాడు.
"అయిదు వేలకి ఎన్ని అయిదొందలు కలిపితే కారొచ్చును" అని నిట్టూర్చాడు స్వామి.
అప్పారావు నవ్వి-"మీ ఆవిడకు కారు కొనాలని మహా మోజుగా ఉన్నట్లు విన్నాను. అదేమంత కష్టంకాదండి- మీరు తల్చుకోవాలిగానీ" అన్నాడు.
"నేనెప్పుడో తల్చుకున్నాను. కాని ఇంతవరకూ పని జరగలేదు."
"మీ దగ్గర చాలా పరికరాలున్నాయి, శాస్త్రం ఉంది. వాటితో మా ఊరు వచ్చారంటే మీ ఆదాయం లక్ష దాటిపోతుంది. ఎందుకంటే బోరింగులు కావల్సినవాళ్ళు మా ఊళ్ళో పాతిక మందికి పైగా ఉన్నారు."
స్వామి ఆశ్చర్యపోయాడు. ఈ ఊహ అతనికి తట్టనేలేదు. భూమిలో ఎక్కడ, ఎంత లోతున నీరు ఉన్నదో అంచనా కట్టడానికి అతనిదగ్గర విదేశీ పరికరాలున్నాయి. బోరింగులు తీసే రిగ్గులున్నాయి. అయితే అతను బోరింగులు తీసే కంట్రాక్టర్ కాదు- ప్రభుత్వోద్యోగి. అతని పని బోరింగులు తీయడం కాదు- వేరే ముఖ్యమైనది ఏదో ఉంది. కాని అప్పారావు చెప్పిన ప్రకారం తాత్కాలికంగా తన బాధ్యతలను మరిచిపోతే లక్షలకు లక్షలు సంపాదించవచ్చు.
"మీకు ప్రభుత్వం చాలా గ్రాంట్లు ఇస్తుంది. ఆ గ్రాంట్స్ ఎలా ఖర్చు పెట్టేరన్న విషయంపై సరైన ఆడిట్ ఉండదు. మీరు సరేనంటే మీకు నేను చాలా ఉపాయాలు చెప్పగలను" అన్నాడు అప్పారావు. తన శక్తిని స్వామికి వివరించి చెప్పాలని అతను చాలా కుతూహల పడుతున్నట్లు అనిపిస్తోంది.
స్వామికి తల తిరిగిపోయింది. నిజంగానే డబ్బు సంపాదించాలనుకుంటే తనకు చాలా మార్గాలున్నాయి. వాటిని తను గుర్తించనైనా గుర్తించలేదు. అతను అప్పారావు వంక అదోలా చూసి __ "మీకు సంబంధించని విషయాలు కూడా మీకు బాగా తెలుస్తున్నాయి. అయితే ఈ ఉద్యోగ విషయంలో నాకు వచ్చిన హైయ్యెస్ట్ ఆఫర్ ఎందుకు తెలుసుకోలేకపోయారు?" అన్నాడు.
అప్పారావు కలవరంగా స్వామి వంక చూసి__"ఇన్ని మాటలెందుకు ఆ విషయం మీ నోటితో మీరే చెప్పండి?" అన్నాడు.
"పాతికవేలు" అన్నమాట స్వామి నోటివెంట వచ్చీ రావడంతోనే__"దారుణం!" అన్నమాట అప్రయత్నంగా అప్పారావు నోటి వెంట వెలువడింది.
"అవతలి వ్యక్తి సంతోషంగా నాకిస్తున్న బహుమానమది. అందులో దారుణమేముంది?"
"నేను నమ్మలేను. స్టెనోగ్రాఫర్ ఉద్యోగానికి పాతిక వేలా? మీరు నాతో వేళాకోళమాడుతున్నారు" అన్నాడు అప్పారావు.
"బాగుందండీ! అసలు మీరు నాకు లంచమిస్తానంటుంటే అదే వేళాకోళమనుకుంటున్నాను నేను" అన్నాడు స్వామి.
"మీతో నేనెందుకు వేళాకోళమాడతానండీ?" అన్నాడు అప్పారావు.
"నా విషయంలో అంతేగదా మరి!" అన్నాడు స్వామి.
"పాతిక వేలడగడం చాలా అన్యాయం." గొణుగుతున్నట్లు అన్నాడు అప్పారావు.
"ఇందులో అన్యాయమేమీ లేదండీ! అవతలి వ్యక్తి నాకు సంతోషంగా ఇస్తున్న బహుమానం తీసుకుంటున్నాను__అంతే!" అన్నాడు స్వామి.
"మా విషయం మీరు కనిపెట్టాలి. ఆరు వేలకు మించి ఇచ్చుకోలేము" అన్నాడు అప్పారావు. ఇలా బేరమాడవలసి వస్తుందని అతననుకున్నట్లు లేదు.
"చూడండి__డబ్బంటూ తీసుకుని ఉద్యోగం ఇచ్చేటప్పుడు అయిదు వేలయితేనేం, పాతిక వేలయితేనేం? ఇందులో న్యాయాన్యాయాల ప్రసక్తి లేదు. ఎవరెక్కువ ఇస్తే వారిదే ఛాన్సు. మీరు పదివేలిస్తానన్నా లాభం లేదు. పాతిక వేల లోపులో బేరం లేదు. దాని విషయం మరిచిపోండి."
"మరిచి పోక చేసేదేముందిలెండి! మరో చోట ప్రయత్నించాలి" అన్నాడు అప్పారావు. అతని ముఖం ప్రసన్నంగా లేదు. కాసేపు అవీ ఇవీ కబుర్లు అన్యమనస్కంగా చెప్పి, వస్తానంటూ లేచాడు.
"రాజా!" అని పిలిచాడు స్వామి. పరుగెత్తుకుంటూ వచ్చింది రాజా.
"చూడండి-నా మాటల్లో మీకు నమ్మకం కుదిరినట్లు లేదు. ఇది ఇతరులు కొన్న బిస్కట్లు తినదు. కావాలంటే ఓ బిస్కట్ తినిపించి చూడండి" అన్నాడు స్వామి కవ్విస్తున్నట్లు.
అప్పారావుకు పట్టుదల వచ్చింది. అతను కుక్కకు ఓ బిస్కట్ తినిపించబోయాడు. అది బిస్కట్ అందుకోకుండా చటుక్కున వెనక్కు తిరిగిపోయింది. అప్పారావు రెండు మూడు సార్లు ప్రయత్నించి విఫలుడయ్యాడు.
"అందుకే చెప్పాను- ఈ బిస్కట్లు మీరు తీసుకుపొండి. మరే ఇంటి కుక్కకైనా పనికి వస్తాయి" అన్నాడు స్వామి. అప్పారావు ముఖం ఎర్రగా అయింది. కాని అతనేమీ అనలేదు.
అప్పారావు దంపతులు వెళ్ళిపోయాక, స్వామి భార్యతో-"ఈ రోజు నేను చాలా తెలివిగా వ్యవహరించాను మీనా!" అన్నాడు.
"ఏం చేశారేమిటి?" అంది కుతూహలంగా మీనాక్షి.
"మనదరిద్రమంతా ఒక్క దెబ్బతో తీరిపోవాలనుకున్నాను. ఉద్యోగానికి పాతిక వేలాడిగాను" అన్నాడు స్వామి.
"అమ్మ బాబోయ్! అంతివ్వగలరా?" అంది మీనాక్షి.
"ఇవ్వగలరనే అనుకుంటున్నాను. బహుశా ఈ ఉద్యోగంలో బాగా లంచాలు దొరుకుతాయనుకుంటాను. అందుకే వెంటనే అయిదు నుంచి ఆరుకి రేటు పెంచాడు అప్పారావు. ఇంకా పెంచుతాడని నా అనుమానం. నువ్వు మాత్రం వాళ్ళెప్పుడైనా ఈ విషయం కదిపితే పాతిక వేలకు తక్కువగా కొరుకుపడకు" అన్నాడు స్వామి.
మీనాక్షి సందేహంగా ఏదో అడగబోయింది కాని, ఏదో ఆశ ఆమె నోరు నొక్కేసింది.