Previous Page Next Page 
పరిహారం పేజి 11

 
    "నీ కెవరో అన్నీ లేనిపోనివి చెప్పారు, దానికి నేనేం చేయను లలితా?"
    "ఇంకా రహస్యమేనా నా దగ్గర. ఇదేనా స్నేహమంటే? చెప్పు! ఎక్కడ మాట్లాడుకొనే వాళ్ళు మీరు? ఇంట్లోనేనా! సినిమాలకి వెళ్ళేవాళ్ళా? పార్కులకీ? నా దగ్గర చెప్పడానికేం? నే నెవరికీ చెప్పనుగా!"
    "ఒట్టు! నేనూ ఆయనా ప్రేమించుకోందే?" లలితను నమ్మించేసరికి చాలా శ్రమపడవలసి వచ్చింది.
    "కాని, లలితా? ఈ పుకారు ఎవరు లేవదీశారో గాని నిజమైతే ఎంత బాగుండేది!" ఒక నిట్టూర్పు విడిచింది.
    లలితకి యిద్దరు పిల్లలు, భర్త ఏదో ఆఫీసులో ఎల్.డి.సి. ఆమె ఇద్దరిపిల్లలుగాని, ఆమె భర్తగాని వీళ్ళస్నేహానికి అడ్డుకాలేదు. ఇద్దరికిమధ్య ఏ దాపరికాలూ వుండవు.
    "వసూకి నేనంటే అభిమానమే. కాని, అది దాని పరిధి దాటి యెప్పుడూ బయటికి రాలేదు. అతడు నన్ను మాస్టారమ్మాయిలా చూస్తాడు. మరోలా చూడలేడు. నాలో మాత్రం ఈ ఆరాధన చిన్నప్పటినుండి ప్రారంభమైంది. ఇంకెవరినీ ఆ దృష్టితో చూడలేను. ప్రియుడైనా భర్తయినా అతడే."
    "నీలోని పదహారు కళలు ఇప్పుడేగా బయటపడుతున్నది? వస్తాడులే నీదారికి."
    "తథాస్తు, దేవతలెవరైనా తథాస్తు అంటే బాగుండేది!"
    "తథాస్తూ? ..... మంచిమనసుతో యిస్తున్న దీవన. దేవతా వాక్కులా పనిచేస్తుంది చూడు!" పారిజాత భుజాలు పట్టుకొని నవ్వింది లలిత.  "కాని, పారూ! నీ మనూ హదయంలో చోటు సంపాదించుకోవడం మాత్రం అంత సులభమనుకోను. కోమలమ్మ మహా ఘటికురాలు. డబ్బు కాపీనం మనిషి! ఆడది యింత ఆస్తి సంపాదించినప్పుడే ఆవిడ యెటువంటిదో తెలిసి పోతుంది! కొడుకు బి.ఎ. లో వున్నప్పటి నుండి ఆమె చుట్టూ లక్షాధికార్ల సంబంధాలు తిరుగుతున్నాయి. కొడుకు చదువుపూర్తి అయ్యి ఉద్యోగం దొరికే దాకా చెయ్యనన్న మిషతో ఆ సంబంధాలన్నీ తిప్పి కొట్టింది."
    "ఆ సంగతులన్నీ నాకు తెలుసు."
    "తెలిసీ ఆ ప్రేమను యెందుకు పెరగనిచ్చావు?"
    "పెరగనివ్వడం. తరగనివ్వడం నాచేతిలో పనా?"
    "నీ మూలంగా లక్షల కట్నానికి నీళ్ళు వదులుకోదు కోమలమ్మ"
    "ఆయన ఇష్టపడితే....."
    "ఇష్టం వేరు. ఇష్టాన్ని ఆచరణలో పెట్టగలగటం
    వేరు తల్లి అంటే మనోహర్ కి చాలా భక్తీ ప్రేమా! ఆమె మనసు నొప్పించే పని చేయడు!"
    "చేయాలని కూడా నా ఉద్దేశ్యం కాదు. ఆమెను ఒప్పించలేడా మనూ?"
    "ముందు అతడి ఇష్టపడిన తరువాత కదా?"
    "తధాస్తు అన్నావు కదా?"
    నిన్నరాత్రి సంఘటన ఎలా జరిగిందో తెలుసుకవాలని మనోహర్ దగ్గరికి బయల్దేరిన పారిజాత అడుగులు ఎందుకో సంకోచంతో పడసాగాయి. ఏ వేళప్పుడు పడితే ఆ వేళప్పుడు ఆ ఇంటికి నిస్సంకోచంగానే వెళ్ళేది తను. ఈ పుకారుపుట్టాక ఆ యింటికి ఇదివరకటిలా ఎలా వెళుతుంది, మాట్లాడుతుంది? అందరూ తనకేసి చూస్తున్నట్టు, గుసగుస లాడుతున్నట్టుగా ఫీలయింది పారిజాత. వెళ్ళకుండా ఉండనూ లేకపోయింది.
    కుర్చీలో హుందాగా మహారాణి దర్పంతో కూర్చొని ప్రక్కనే స్టూల్ మీదవున్న వగల్ దాన్ లో ఉమ్మివేస్తూ ఎవరితోనో వ్యవహారానికి సంబంధించిన సంగతులు మాట్లాడుతున్న కోమలమ్మ పారిజాతను చూసికూడా చూడనట్టుగా తన గొడవలో వుండిపోయింది. పారిజాత కిటికీ దగ్గరా అక్కడా తచ్చాడసాగింది. ఆమె మనసుమాత్రం మనోహర్ గదిలోవుంది!
    మనిషిని పంపేసి కోమలమ్మ ఇటు తిరిగింది. "వంట చేశావా?"
    "ఆఁ"
    కొంచెం సేపు మౌనంగా వుండి "మనూకి దెబ్బలెలా తగిలాయత్తా?" అని అడిగింది.
    కోమలమ్మ కొంచెం కినుకగా  "నువ్వయితే సుబ్బరంగా చదువుమానేసి ఇంట్లో కూర్చొన్నావుగాని వాడికొచ్చాయి తిప్పలు!" అంది.
    పారిజాత ముఖం చిన్నబుచ్చుకొని,  "వాడితో తగువు పెట్టుకొమ్మని మనూకి నేను చెప్పానా అత్తయ్యా?" అంది.

 Previous Page Next Page