అచ్యుతం తల్లి కనకం శోకాలు పెడుతూ వచ్చింది ఆచారి ఇంటికి.
"నాలుగు మంత్రాలు నేర్చుకుని నాకు జీలనాధారం అవుతాడని నీ దగ్గర వదిలి వెళ్లానయ్యా! నీ వెధవ చెల్లెలు ఇలా కొంపముంచుతుందని, వాడిని సర్వనాశనం చేస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు! వాడు చచ్చినా ఇంత బాధ పడకపోదును! మాకు సంపదలేకపోవచ్చును. కాని, మచ్చ లేని వంశం. వంశానికే కళంకం తెచ్చాడు ఆ వెధవ పీనుగ. అమ్మో! నోట్లో వేలుపెడితే కొరకలేనట్టుగా వుండేవాడు ఇంత పని చేశాడంటే నేను నమ్మలేకుండా వున్నాను! ఇదంతా నీ చెల్లెలు ప్రోత్సాహమే అయి వుంటుంది."
"......."నోట మాటలేక అవమానభారంతో తలొంచుకున్నాడు ఆచారి.
వెనుక నుండి అందుకొంది జయలక్ష్మి. "నిజంగా నీ కొడుకు అమాయకుడే, పిన్నీ! ఈ నెరజాణ ఏం మాయ చేసిందో! ఎలా వల్లోకి లాగిందో! మీ అచ్యుతం ఈ ఇంటికి వచ్చినప్పటినుండి ఆమె కళ్లన్నీ అతడిమీదే!అక్కడికీ నేను మందలిస్తూనే వున్నాను ఆమెను. అందుకే మబ్బుపట్టిన ఆకాశాన్నీ, మగడు చచ్చిన ముండనూ నమ్మొద్దన్నారు."
"పట్టుమని పది పైసలు సంపాదించుకోలేని కుంక వీడిని కట్టుకుని అదేం సాదిద్దామనుకుందో? ఎలా బ్రతుకుదామనుకొందో!"
"ఇడ్లీ ఇడ్లీ, సాంబార్ సాంబార్ అని వీధుల్లో కేకలేస్తూ బాగానే బతుకుతున్నారులెండి."
"అంటే వీధినబడి నా కొడుకు ఇడ్లీ అమ్ముతున్నాడా? అయ్యో! బిడ్డ ఏనాడైనా ఇంత పరువుమాలిన పనిచేశాడా? మా దగ్గర కాసులు లేకపోయినా ఎంత పరువుగా బ్రతికాం! చివరికి ఎలాంటి గతి పట్టిందమ్మా బిడ్డడికి! స్త్రీ బుద్ది ప్రళయాంతకం అని ఈ ముండ ఎంతపని చేసిందమ్మా! అభం శుభం తెలియని కుర్రాడిని లేవదీసుకువెళ్లి" మళ్లీ ఒక రాగంతీసింది కనకమ్మ. "ఇదంతా వింటూంటే అది తిన్నగా వీడితో కాపురం చేస్తుందనిపించడం లేదు! ఎంతమందిని మారుస్తుందో. మహాతల్లి. అటు ఇటు కాక నా బిడ్డ అన్యాయమై, ఆ అవమానం భరించలేక ఏ అఘాయిత్యానికి తలపడతాడో! వాడి మనస్సంత సున్నితం!"
"ఇక సున్నితమంతా వదులుతుంది లెండి, పిన్నిగారూ! వీపు దెబ్బ, చెంప దెబ్బా గోడ దెబ్బా తగులుతూంటే!"
"అయ్యో! నా బిడ్డకి ఎన్ని కష్టాలు వచ్చాయమ్మా! అలా శెట్టి అంగడికి వెళ్లి పప్పు, ఉప్పు తెమ్మంటేనే మహా బిడియపడిపోయేవాడు! వాళ్ల అడ్రసు తెలిస్తే రాసియ్యవయ్యా!"
"నాకు తెలియదత్తా!"
"మరి వాడు వీధుల్లో ఇడ్లీ లమ్ముకుంటున్నాడని చెబుతూందే నీ భార్య?"
"మొన్న నడిమింటి గోపాలం పట్నం వెళితే మలక్ పేటలోనో, ఎక్కడో అచ్యుతం ఇడ్లీలమ్ముతూ కనిపించాడట!" ఆ సంగతి వచ్చి చెప్పాడు ఎక్కడుంటావు, ఏమిటి అని అడుగుదామనేసరికి అచ్యుతం ముఖం తప్పించాడట!"
"వాడి అడ్రసు తెలియంగానే నాకు కబురుపెట్టునాయనా!వెళ్లి వెధవను ఈడ్చుకువస్తాను!"
"ఇహ వాళ్ల అడ్రసుతో మాకేంపని అండీ! మాకు అది చచ్చినదానితో సమానం! ఎక్కడున్నారో, ఎలా వున్నారో మాకు అక్కరలేదు" ఈసడింపుగా చెప్పింది జయలక్ష్మి.
* * * *
మిసపప్పడాలు ఒక్కొక్కటే వత్తి పేపరుమీద వేస్తున్నది శంకరి.
గుమ్మంలో చేతులు కట్టుకు నిలబడి చూస్తున్నాడు. అచ్యుతం.
రెండు గంటలుగా ఆమె ఏకాగ్రంగా అదేపని చేస్తూంది ఎంత అలసట చెందిందీ చెమటలు కారిపోతున్న ఆమె ముఖమే చెబుతూంది! నీళ్ళలో అప్పుడే ముంచి తీసిన గులాబీ పువ్వులా వుంది ఆమె ముఖం. చెమటకు ముంగురులు నుదుటికి అంటుకుపోయాయి. అంత అలసటలోనూ ముఖంలో అందం ఇనుమడించినట్టుగా వుంది. అయితే అచ్యుతం ఇందాకటినుంచి చూస్తున్నది ఇనుమడించిన ఆమె అందాన్ని కాదు, ఆమెముఖంలో వ్యక్తమౌతూన్న అలసటని చూస్తున్నాడు. అంత అలసటలోనూ ఆమె పని ఆపక పోవడం చూస్తున్నాడు.
నొప్పెడుతూన్న చేతుల్ని ఒకసారి ఝాడించి తిరిగి పిండి పిసగబోతూ గుమ్మంలో చేతులు కట్టుకొని తదేకంగా తననే చూస్తున్న అచ్యుతాన్ని చూసింది శంకరి. "అదేమిటి? ఎవరో బయటి మనిషిలా అక్కడే నిలబడిపోయావేం?" విస్మయంగా అడిగింది.
"ఇంతపని ఎందుకు పెట్టుకొంటున్నావు? ఉదయం బుట్టెడు మురుకులు పండి కాల్చావు! ఇప్పుడు అప్పడాలు! మనం యిద్దరం బ్రతకడంకోసం ఇంతపని చేయాలా?"
"మరి కాస్త వచ్చి సాయం చేయరాదూ"
అచ్యుతం దగ్గరికివచ్చి ఆమె చేతులలో వున్న పిండి ముద్ద తీసుకోబోతూ ఎర్రగా రక్తం చిమ్ముతున్నట్టుగా వున్న ఆమె చేతుల్ని చూశాడు. పిండిముద్దల్ని వదిలేసి ఆమె చేతుల్ని అందుకొన్నాడు. అతడి కళ్ళల్లో నీటితడి మెరిసింది. "ఈ సుఖంకోసమేనా నువ్వు ఇంట్లోంచి వచ్చేసింది?"