"పనా?"
"ఆ బ్రతకడానికి ఏదో ఒక పని చేసుకోవాలికదా? కూర్చొని తింటే నగలు ఎన్నాళ్లు వస్తాయ్?"
'పనీ పాట లేకుండా ఆమెసొమ్ము తింటున్నాడనే ఈ ఎత్తిపొడుపు!" అభిమానంతో అచ్యుతం ముఖం ఎర్రబడింది.
కోపంతో ముఖం, స్నానం గబగబా కానిచ్చాడు. ముఖానికి నామందిద్ది సంధ్యావందనానికి కూర్చోబోతున్నాడు.
"రేపటినుండి ఇంకా కొంచెం ముందగాలేచి సంధ్యావందనం చేసుకొందువుగాని ఇప్పుడు ఈ బుట్ట ఈ క్యాన్ పట్టుకొని అలా నాలుగువీధులు తిరిగేసిరా!" శంకరి ఇడ్లీ బుట్ట, సాంబారున్న క్యాన్ దగ్గరుంచింది.
'ఏమిటిది?" తెల్లబోయి చూశాడు అచ్యుతం.
"ఇది ఇడ్లీ, ఇది సాంబారు కనిపిస్తూనే వున్నాయి కదా? ఇవి తీసికెళ్లి అమ్మి రమ్మంటున్నాను!"
"ఛీ! ఛీ!" మరీ ఇంత పరువు తక్కువ పని నాచేత ఎలా చేయించాలనుకొంటున్నావు?"
"నువ్వో రాజకుమారుడివని ఇక్కడ ఎవరికీ తెలియదులే!" నువ్వు ఇడ్లీ అమ్మినా, కట్టెలమ్మినా ఎవరూ పట్టించుకోరు!"
"ఇక్కడెవరూ నన్ను గుర్తుపట్టేవాళ్లు లేరని నాచేత ఇంత హీనమైన పని చేయిస్తావా?"
అచ్యుతం కంఠంలో వినిపించిన ఉక్రోషానికి శంకరి స్నిగ్దంగా నవ్వింది. "దొంగతనం హీనమన్నారు. రంకుతనం హీనమన్నారు. కాని పొట్ట తిప్పలుకి ఏదో ఒకపని చేసుకోవడం హీనమనలేదెవరూ. ఉద్యోగాలు సంపాదించుకోడానికి నువ్వు కాని, నేను గాని డిగ్రీలు పాసవ్వలేదు! ఏదో ఒక పని చేసుకోకపోతే మనం బ్రతికేదెలాగ చెప్పు?"
అచ్యుతం ముఖం విసురుగా త్రిప్పుకొన్నాడు.
"ప్రపంచం దృష్టిలో మనం తప్పటడుగు వేసిన వాళ్లం. సమాజ విద్రోహులం. కుటుంబ గౌరవాన్ని కాదని సంఘ నియామకాన్ని కాదని వచ్చేసిన వాళ్లం. మనం బార్యా భర్తలమైనా మన సంబంధం అక్రమం, ధర్మశాస్త్రాల కళ్లజోడు పెట్టుకొన్న ఈ సంఘానికి రేప్రొద్దున మనం బ్రతకలేక అగచాట్లు పడ్డామనుకో! ఈ సమాజం ఏమంటుందో తెలుసా? చేసుకొన్న వాళ్లకి చేసుకొన్నంత అని! మనం ఎంత పతనం అయితే బాగుంటుందో అంతా కావాలని మెటికలు విరుస్తుంది!"
"........"
"చెప్పు! మనం ఈ లోకుల కోరిక తీరుద్దామా? అది కోరుకొన్నట్టుగా మనం పతనం అయిపోదామా? నవ్విన నాపచేనే పండిందని సమాధానం చెప్పొద్దా? మేం ఏం తప్పూ చేయలేదు! మాక్కూడా అందరిలా బ్రతికే హక్కుంది! అని చెప్పొద్దా?"
"ఇడ్లీలు అమ్ముకోవడం గొప్పగా బ్రతకడమా?"
"ఇవాళ వీధుల్లో ఇడ్లీలమ్మిన అచ్యుతమూర్తి రేపు కాలచక్రం లీలవల్ల స్టార్ హోటల్ ప్రొప్రైయిటర్ అయిపోవచ్చు. ఆ అంతస్తు ఎక్కాలంటే ఇప్పుడే మొదటి మెట్టు మీద అడుగు పెట్టక తప్పదు, అచ్యుతా!" శంకరి ఈసారి కొంచెం సీరియస్ గానే చెప్పింది.
తన పరువుమర్యాదలను చితిలోవేసి కాల్చడానికి బయల్దేరుతున్నట్టుగా ఓ భుజం మీద ఇడ్లీ బుట్ట, ఓచేత క్యాన్ పట్టుకొని మ్లానంగా, విషాదంగా కదిలాడు అచ్యుతం.
వీధిలో పాలవాళ్ల కేకలూ, కూరగాయల వాళ్ల కేకలూ ప్రారంభమయ్యాయి. మసక చీకట్లు వదిలిపోతుంటే మనిషి జీవన వ్యాపారం ప్రారంభమైంది.
నడుస్తున్నాడు అచ్యుతం.
ఇన్నాళ్ళ చిరాకు, ఇవాళ పరాకాష్టకు చేరుకొన్నట్టుగా అయ్యి అతడి హృదయం ఒక సుడిగుండంగా మారిపోయింది. సుడిగుండంలో తిరుగుతున్నది నీళ్లుకాదు. మరుగుతున్న అగ్ని అన్నట్లుగా అతడి కళ్లు రక్తారుణిమనుదాల్చాయి.
చదువుకోసమని అమ్మ వదిలి వెడితే శంకరి తన నిక్కడికి లాక్కువ్చచి ఎంత హీనస్థితికి దిగజార్చింది! వితంతు సహవాసం చేసినవాడికి, విద్యాదానం చేస్తున్న గురువుకు ద్రోహం చేసినవాడికి ఇడ్లీలమ్ముకు బ్రతకడం కాక ఇంత కంటే మంచి జరుగుతుందా? ఇప్పుడే ఏమైంది? ఇంతకింత ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప తన పాపం పరిహారం కాదు. తనని తను తిట్టుకొంటూ, శపించుకొంటూ రోడ్డుమీద ఏముందో కూడా చూచుకోకుండా నడవసాగాడు అచ్యుతం.
* * * *