అందుకొన్న అతడి చేతుల్ని వదలలేదు శంకరి. అతడి రెండు చేతుల్నీ ఎత్తి రెండు చెంపలకీ ఆనించుకొంది. "నీ ప్రేమలో ఇంత అలసటా ఉఫ్ న ఎగిరిపోయింది. ఇక రెట్టించిన శక్తితో పనిచేస్తాను మనం ఇద్దరం బ్రతకడం కోసమా ఇంతపని చేయడం అన్నావు! బ్రతకడం ఒకటే ముఖ్యంకాదు. మనుష్యులంగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే డబ్బు కావాలి. మనకు తాతలు, తండ్రులు సంపాదించిన డబ్బు లేదు కాబట్టి మన రెక్కలే మనకు డబ్బు సంపాదించి పెట్టాలి అయ్యో! ఈ చేతులు కందిపోతాయేమో అనుకుంటే ఎలా? నవ్విన నాపచేనే పండాలంటే మనిద్దరం కలసి శ్రమపడక తప్పదు. అచ్యుతా! శ్రమకు పట్టుదల తోడయితే ఈ ప్రపంచంలో అసాధ్యమన్నది లేదు!"
అచ్యుతం తన బలమంతా ఉపయోగించి పిండి పిసకసాగాడు.
"జానకమ్మ గారింట్లో పెళ్లి! ఆవిడ నాలుగుశేర్ల పిండిచ్చారు! అప్పడాలు రెండు రోజుల్లో చేసిమన్నారు. పెళ్లి ఫలహారాలు చేయడానికి కూడా పిలుస్తామన్నారు."
"చూడు! నువ్వు ఇంట్లో ఎంత పనైనా చెయ్యి! నేను వద్దనలేను! పనికోసం బయటికి మాత్రం వెళ్లకు! చివరికి ఎవరింట్లోనో పనిమనిషిగానో, వంటమనిషిగానో కావడం కోసమా మనం ఇలా వచ్చేసింది?ఇప్పటికే నేను సిగ్గలుతున్నాను నీ చేతిలా పని చేయిస్తున్నందుకు."
"ఇలా అభిమానపడితే మనం బాగుపడేదెలా?"
"రేపు ఇడ్లీలు ఇంకో రెండు వీధుల్లో ఎక్కువ తిరిగి అమ్ముకొస్తాను. నువ్వింత శ్రమపడ్డం మానెయ్యి!"
"నేను శ్రమపడడం మానేసేరోజు రావాలంటే నీ చేతిలోనే వుంది. అచ్యుతా! నువ్వునీ జడత్వం వదల్చుకో! అభిమానం తగ్గించుకో! నా తెలివికి నీ పట్టుదల జోడించడం నేర్చుకో!"
* * * *
పెరట్లో కూర్చొని జానకమ్మగారింట్లో తెచ్చుకున్న పుస్తకం దీక్షగా చదువుకొంటూంది శంకరి. హఠాత్తుగా ఏదో గుండెలమీద పడ్డట్టుగా, మెడ ప్రక్కన ఏదో జరజర ప్రాకినట్టుగా అయ్యి కెవ్వుమంది. విదిలించబోయింది. మెడ వెనుక అఛ్యుతం చేతులు దారాన్ని మడివేస్తున్నాయి.
"ఏమిటి? ఏం చేస్తున్నావు?" త్రుళ్లిపాటుతో చూచేసరికి గుండెలమీద మెరుస్తూ కనిపించింది. చేత్తో పట్టుకు చూసింది.
పచ్చటి దారంలో రెండు పచ్చటి మాంగల్యాలు! కంసాలి చేతులు నుండి అప్పుడే తుది మెరుగు దిద్దుకు వచ్చి నట్టుగా తళతళ మెరుస్తున్నాయి.
"ఎక్కడివి?" కంగారు విభ్రాంతిలోకి మారింది.
"ఎవరి మెడలోంచి ఎత్తుకు రాలేదులే!"
"తెలుస్తూనే వుందిలే. క్రొత్తగా చేయించావని! డబ్బెక్కడిది?"
"ఎవరి ఇనప్పెట్టెలోంచి ఎత్తుకురాలేదులే!"
"అబ్బా! ఇంత కోపమైతే ఎలా?"
"నా కష్టార్జిత లో కొంచెం మిగిల్చి చేయించిన వస్తువిది. నీకు చెప్పకుండా, నిన్నడకుండా నీ మెడలో కట్టానని కోపం వచ్చిందా?" తలొంచుకుని క్రిందికి చూస్తూ అడిగాడు అచ్యుతం.
"చెబితే తప్ప నువ్వేమీ చేయవు అనుకొన్న నా ఆలోచన తప్పు అని నిరూపించావు. నీకూ ఆలోచనలున్నా యన్నమాట! మంచి ఆలోచనలు!" శంకరి కళ్లలో ఆనందాశ్రువులు పొంగిపొతూంటే అచ్యుతం మెడచుట్టూ చేతులు వేసి అతడి పెదవుల మీద ముద్దు పెట్టుకుంది.
ఊహించని బహుమతి! దేనికీ సాటిరాని బహుమతి!
అచ్యుతం ముఖం అస్తమయ సూర్యుడిలా కందిపోయింది. సిగ్గుతో అక్కడ నుండి పారిపోయాడు.
భర్తపోయాక ఆరోజు మొదటిసారిగా తల్లో మల్లెమాల చెండు తురిమింది శంకరి.
* * * *
ఎలాగో అడ్రసు పట్టుకొని ఒకరోజు వచ్చిపడింది అచ్యుతం తల్లి. నానా యాగీ చేసింది. శంకరిని నానాతిట్లు తిట్టింది.
ఆమె ఎంత అరిచినా ఒక్కమాట మాట్లాడలేదు శంకరి.
"చేసిన నిర్వాకం చాలుగాని, ఇక ఇంటికి పద! ప్రాయశ్చితం చేసుకుని దేవుడి గుడిలో మంత్రాలు చదువుకొని బ్రతుకుదువుగాని!" అంటూ కొడుకు చెయ్యి పట్టుకొని లాక్కుపోవటం మొదలు పెట్టింది.
తల్లి చేతుల నుండి తన చేతులు లాగేసుకున్నాడు అచ్యుతం. "నేను రానమ్మా!"
"గుళ్ళో పెరుమాళ్లు సేవచేసి లక్షణంగా బ్రతకాల్సిన వాడివి! ఈ మొగుడు చచ్చిన ముండను తగుల్కొని నీ కెంత దుర్గతి పట్టిందిరా? వీధి వీధి తిరిగి ఇడ్లీ లమ్ముకొడానికి సిగ్గువేయడం లేదురా! అయ్యో! పరలోకాన వున్ననీ తండ్రి నీకు పట్టిన దుర్గతి చూసి ఎంత దుఃఖిస్తున్నారో కద!" శోకాన్ని తోడు చేసుకొని మాటలబాణాలు దూసుకువస్తున్నాయి. "నిన్ను లేవదీసుకు వచ్చి ఎంత ఛండాలపు పని చేయిస్తూందిరా నీచేత! నా కడుపు మండిపోతూందిరా! ఇక చాలు! పద ఇంటికి!" మళ్లీ కొడుకు చెయ్యిపట్టి లాగసాగింది.